పుణె: ‘కిడ్నీ ఇస్తే 15 లక్షలు ఇస్తామన్నారు, ఆపరేషన్ తరువాత డబ్బులివ్వకుండా ఉడాయించారు’

- రచయిత, రాహుల్ గైక్వాడ్
- హోదా, బీబీసీ మరాఠీ కోసం
'నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త 18 ఏళ్ల కిందట మరణించారు. నాకు ఇప్పుడు డబ్బు కావాలి. కిడ్నీ దానం చేయడానికి అంగీకరించాను'
కొల్హాపూర్‌లో నివసించే సారిక చదువుకోలేదు. కిడ్నీ ఇస్తే రూ. 15 లక్షలు ఇస్తామంటూ ఓ ఏజెంట్ సారిక సుతార్‌ను సంప్రదించాడు.
సారిక పెద్ద కుమారుడు వయసు 23 ఏళ్లు. ఆయనకు ఏమీ వినిపించదు. రెండో కుమారుడి వయసు 22 ఏళ్లు. చిన్నాచితకా పనులు చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు.
సారిక కొల్హాపూర్‌లోనే ఓ హోటల్‌లో పాత్రలు కడిగే పని చేస్తుంటారు.
మూత్రపిండాల మార్పిడి అవసరమైన ఓ వ్యక్తి కోసం కిడ్నీ ఇస్తే రూ. 15 లక్షలు ఇస్తామంటూ ఏజెంట్ ఒకరు సారికను సంప్రదించారు.
అందుకు సారిక, ఆమె తరఫువారు అంగీకరించడంతో శస్త్రచికిత్స చేసి ఆమె నుంచి కిడ్నీ తీసుకున్నారు.
అయితే, శస్త్రచికిత్స తరువాత ఏజెంట్ రూ. 4.5 లక్షలు మాత్రమే ఇవ్వడంతో ఆ మొత్తం తీసుకునేందుకు సారిక సోదరి నిరాకరించారు.
ముందుగా బేరం కుదుర్చుకున్న ప్రకారం రూ. 15 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ప్రస్తుతం ఆ ఏజెంట్ పరారీలో ఉండడంతో కిడ్నీ, డబ్బు రెండూ కోల్పోయామని సారిక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
పుణెలోని 'రుబీ హాల్ క్లినిక్'లో ఈ శస్త్రచికిత్స వ్యవహారమంతా జరిగింది.
సారిక ఈ వ్యవహారంపై కోరెగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై విచారణ చేయాలని కోరుతూ 'రుబీ హాల్ క్లినిక్' కూడా పోలీసులకు లేఖ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
లాక్‌డౌన్‌తో మొదలైన కష్టాలు
కోవిడ్ మొదటి లాక్‌డౌన్ నుంచి సారిక కష్టాలు పెరిగాయి. పనుల్లేక ఇంట్లో పూట గడవడం కష్టమైంది. పొరుగునే ఉండే ఓ మహిళతో సారిక తన కష్టాలు చెప్పుకోగా ఆర్థిక సాయం అందేలా చేస్తానని చెప్పిన ఆమె సారికను పుణె తీసుకెళ్లారు.
మూత్రపిండాల మార్పిడి చికిత్స అవసరమైన రోగి అమిత్ సాలూంఖె, ఏజెంట్ రవి కలిసి ఆమెను పుణెలోని ఓ హోటల్‌లో కలిశారు.
తాము ఫోన్ చేసినప్పుడు మళ్లీ రావాలని చెప్పి సారికను తిరిగి పంపించేశారు. ఏం పనిచేయాలో ఏమిటో ఆ వివరాలేమీ ఆ భేటీలో వారేమీ సారికతో చెప్పలేదు.
అక్కడికి ఆరు నెలలైన తరువాత సారికకు ఏజెంట్ రవి ఫోన్ చేసి పుణె రమ్మని చెప్పారు. అయితే, అప్పటికి సారిక తల్లికి కోవిడ్ సోకడంతో రాలేనని చెప్పారు. అనంతరం మరో రెండు నెలల తరువాత ఏజెంట్ మరోసారి సారికకు ఫోన్ చేయడంతో సారిక పుణె వెళ్లారు.
అక్కడ ఏజెంట్.. సారికను అమిత్ సాలూంఖె ఇంటికి తీసుకెళ్లారు. కిడ్నీ ఇస్తే రూ. 15 లక్షలు చెల్లిస్తామని, ఆసుపత్రి ఖర్చులన్నీ సాలుంఖె భరిస్తారని కూడా ఆమెకు చెప్పారు.
'నాకు డబ్బు అవసరం కావడంతో వాళ్ల ప్రతిపాదనకు అంగీకరించాను. అందుకు కావాల్సిన పత్రాలన్నీ ఏజెంట్ రవి సిద్ధం చేశాను. నేను అమిత్ సాలుంఖె భార్యనంటూ పత్రాలు సృష్టించారు' అని సారిక 'బీబీసీ మరాఠీ'తో చెప్పారు.
సాలుంఖె భార్యలా సంతకం చేయడం కూడా నాకు నేర్పించారు. ఆ తరువాత వారు చెప్పినచోటంతా సాలుంఖె భార్య పేరిట సంతకం చేశాను.

ఫొటో సోర్స్, Getty Images
‘నకిలీ పత్రాలు సృష్టించారు’
''నా పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. ఆపరేషన్ జరిగే సమయంలోనే కుటుంబసభ్యులకు డబ్బంతా చెల్లిస్తానని ఏజెంట్ చెప్పాడు. ఆ తరువాత నా సోదరి అక్కడికి చేరుకోవడానికి ముందే నన్ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అయితే, ఆపరేషన్ అయిన తరువాత ఏజెంట్ మాట మార్చారు. రూ. 4.5 లక్షల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కవ చెల్లించబోమని అన్నారు'' అని సారిక బీబీసీతో చెప్పారు.
''ముందు చెప్పినట్లుగా రూ. 15 లక్షలు కాకుండా రూ. 4.5 లక్షలే ఇస్తామనడంతో నా సోదరి అందుకు అంగీకరించలేదు. దాంతో, ఆయన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే నా సోదరి మిగతా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సారిక సోదరి కవిత కోలె కూడా 'బీబీసీ'తో మాట్లాడారు. ''మార్చ్ 24న ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తరువాత రూ. 4.5 లక్షలు చెల్లించడానికి వచ్చారు ఏజెంట్. సారికతో ఈ మొత్తానికే ఒప్పందం చేసుకున్నట్లు ఆయన చెప్పాడు. రూ. 15 లక్షలు ఇవ్వబోమని ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు'' అని కవిత కోలె చెప్పారు.
తమకు జరిగిన మోసంపై సారిక, కవితలు కోరెగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కిడ్నీ మార్పిడి, డబ్బు చెల్లింపులో మోసంపై తమకు సారిక, ఆమె సోదరి నుంచి ఫిర్యాదు అందిందని కోరెగావ్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వినాయక్ వేతాల్ చెప్పారు.
హాస్పిటల్ కమిటీ, ఆరోగ్య శాఖ సంయుక్త సంచాలకులకు ఈ వ్యవహారంపై సమాచారం అందించి వివరాలు కోరామని వినాయక్ చెప్పారు. వారి నుంచి నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామని అన్నారు.
సారిక ఫిర్యాదు చేసిన అనంతరం రూబీ హాల్ క్లినిక్ మార్చ్ 29న ఓ లేఖను కోరెగావ్ పోలీస్ స్టేషన్‌కు అందించింది.
'ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో తాను సాలుంఖె భార్యను కాదని సారిక చెప్పారు. అంతేకాదు సారిక సుతార్ పేరుతో ఉన్న తన ఆధార్ కార్డునూ ఆమె చూపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలి' అని రూబీ హాల్ క్లినిక్ తన లేఖలో కోరింది.
ఈ ఉదంతంపై రూబీ హాల్ క్లినిక్ లాయర్ మంజూష కులకర్ణి 'బీబీసీ'తో మాట్లాడారు. సారిక సమర్పించిన డాక్యుమెంట్లలో ఆమె పేరు సుజాత అమిత్ సాలుంఖె అని ఉందన్నారు. ఆ పత్రాలనే కమిటీకి పంపించారని ఆమె తెలిపారు.
''కమిటీ ఎదుట కూడా తాను అమిత్ సాలుంఖె భార్యనని చెప్పడంతో శస్త్రచికిత్సకు అనుమతులు లభించాయి. సర్జరీ తరువాత డిశ్చార్జ్ షీట్ మీద పేరు సారిక సుతార్ అని మార్చాలని ఆమె సోదరి పట్టుపట్టారు. దాంతో ఏదో తేడా జరిగిందని మాకు అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. అమిత్ సాలుంఖె, ఈ మహిళ మధ్య ఏం ఒప్పందం జరిగిందో మాకు తెలియదు'' అని మంజూష చెప్పారు.
అవయవదానం ఎవరు చేయొచ్చు?
అవయవ మార్పిడి చట్టం-1994 ప్రకారం ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే వారి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం, గుండె, పేగు, కళ్లు, చర్మం వంటివి కుటుంబ సభ్యులు దానం చేయొచ్చు.
అవయవ వ్యాపారం చేయడం కానీ, అవయవాలు విక్రయించడం కానీ భారతదేశంలో నేరం.
జీవించి ఉన్నవారైతే వారి సమీప బంధువులకు అవయవాలు దానమివ్వడానికి అవకాశం ఉంది.
రోగి తల్లి, తండ్రి, తోబుట్టువులు, పిల్లలు, భర్త/భార్య అయితే అవయవ దానం చేయొచ్చు.
ఇందుకోసం వారు అవయవ దానానికి ముందు బంధుత్వాన్ని నిరూపించాల్సి ఉంటుంది.
సమీప బంధువులెవరూ లేనప్పుడు ఇతరుల నుంచి అవయవం స్వీకరించాలంటే ప్రభుత్వం నియమించే కమిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- బ్రిడ్జ్‌ని దొంగలు ఎత్తుకుపోయారు
- 'అతడు' తప్పిపోయిన కుమారుడినంటూ 41 ఏళ్లు ఓ కుటుంబాన్ని మోసం చేశాడు, ఆస్తులన్నీ అమ్మేశాడు
- షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్న ఈయనకూ, కశ్మీర్‌కూ ఏంటి సంబంధం?
- తామర పురుగు: ఏపీ, తెలంగాణల్లో మిర్చి పంటకు పట్టిన ఈ తెగులు దేశంలో అనేక పంటలను నాశనం చేయబోతోందా?
- ఇంటర్నెట్లో సీక్రెట్ పేజీలు.... చేసిన తప్పులు, వ్యక్తిగత రహస్యాలు చెప్పుకునే కొత్త మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











