ముక్కులో వేళ్లు ఎందుకు పెట్టుకుంటారు... ఈ అలవాటు మానేయడం కష్టమా?

రైనోటిలెక్సోమేనియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాసన్ గోల్డ్‌మన్
    • హోదా, బీబీసీ కోసం

మనలో చాలా మంది ఇది చేస్తారు. కానీ, దాన్ని ఒప్పుకోరు. ఒకవేళ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతే సిగ్గుపడతారు, ఇబ్బంది పడతారు.

అదే పని ఇతర వ్యక్తులు చేస్తే అసహ్యంతో ముఖం చిట్లించుకుంటారు.

ఇదంతా ముక్కులో వేలు పెట్టుకోవడం గురించిన ఉపోద్ఘాతం.

ముక్కులో వేళ్లు పెట్టుకోవడం చెడు అలవాటా? ఎందుకు అది చెడ్డ అలవాటు?

ముక్కులో ఇలా వేలు పెట్టుకోవడాన్ని రైనోటిలెక్సోమేనియా అంటారు.

అమెరికాలో దీనిపై 1995లో థాంప్సన్, జెఫర్సన్ అధ్యయనం చేశారు.

వారు 1000 మందిపై సర్వే చేశారు. ఈ 1000 మందికి సర్వే మెయిల్ పంపించారు. ఈ మెయిల్‌కు 254 మంది నుంచి స్పందన వచ్చింది. స్పందించిన వారిలో 91 శాతం మంది తమకు ఈ అలవాటు ఉందని ఒప్పుకున్నారు. ఇలా ఒప్పుకున్న వారిలో 1.2 శాతం మంది ప్రతీ గంటకోసారి ఇలా చేస్తామని వెల్లడించారు.

ఈ అలవాటు తమ దైనందిన జీవితాన్ని నాశనం చేస్తోందని ఇద్దరు వ్యక్తులు చెప్పారు.

ముక్కులో తరచుగా వేలు పెట్టుకోవడం వల్ల కుడి, ఎడమ వైపు నాసిక రంధ్రాలను విభజించే కణజాలం పాడైపోయిందని కొంతమంది వెల్లడించారు.

థాంప్సన్, జెఫర్సన్ చేసిన ఈ అధ్యయనం సమగ్రమైనది కాదు. 1000 మందికి మెయిల్ చేయగా ఈ సర్వేలో కేవలం 25 శాతం మాత్రమే పాల్గొన్నారు.

ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న వ్యక్తులకు ఈ సర్వేను పంపించి ఉంటే, వారి నుంచి ఇంకా మెరుగైన సమాధానాలు వచ్చి ఉండేవేమో.

ఇది వదిలేయాల్సిన అలవాటు. కానీ, చాలామందికి ఈ అలవాటు ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు.

రైనోటిలెక్సోమేనియా

ఫొటో సోర్స్, Getty Images

యువతలో ఎక్కువ

అయిదేళ్ల తర్వాత బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరోసైన్సెస్ పరిశోధకులు చిత్తరంజన్ ఆండ్రేడ్, బీఎస్ శ్రీహరి ఒక పరిశోధన చేశారు.

పెద్దవాళ్లలో కంటే యువత, యుక్తవయస్సులో ఉన్నవారికి ఈ అలవాటు ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలో వారు కనుగొన్నారు.

కాబట్టి ఈ వయస్సున్న వారిపై సర్వే చేసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చి ఉండేవి.

బెంగళూరులో ధనికులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారిపై మరో సర్వేను నిర్వహించారు.

మొత్తం 200 మంది టీనేజర్లపై ఈ సర్వే చేపట్టారు. వారిలో ఎక్కువమంది తమకు ఈ అలవాటు ఉందని చెప్పారు. రోజుకు నాలుగుసార్లు ఇలా చేస్తామని వెల్లడించారు.

7.6 శాతం టీనేజర్లు రోజుకు 20 సార్లు ఇలా చేస్తామని అంగీకరించారు. 20 శాతం మంది ఇదో పెద్ద సమస్య అని అంగీకరించారు. ముక్కులో దురద నుంచి ఉపశమనం పొందడానికి లేదా మలినాలను తొలిగించడానికి వేలును ఉపయోగిస్తామని వారిలో చాలామంది చెప్పారు. 12 శాతం మంది ఇలా చేయడం బాగుంటుందని అన్నారు.

వేలు మాత్రమే కాకుండా పెన్సిల్ లాంటివి కూడా పెట్టుకుంటామని తొమ్మిది మంది విద్యార్థులు తెలిపారు.

ఈ అలవాటుకు సామాజిక అంతరం లేదు. అలాగే లింగ భేదం కూడా లేదు. పిల్లల్లో ఇది సాధారణం. ఇదే కాకుండా గోళ్లు కొరకడం, జుట్టు లాక్కోవడం వంటి అలవాట్లు కూడా వారికి ఉంటాయి. అమ్మాయిలు ఈ అలవాటును అసహ్యించుకుంటారు.

రైనోటిలెక్సోమేనియా

ఫొటో సోర్స్, Getty Images

నష్టాలు

ముక్కులో వేలు పెట్టుకోవడం అనేది మరీ అంత ప్రమాదకరమైనదేం కాదు.

కానీ, కొన్ని సందర్భాల్లో ఈ అలవాటు తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. అలాంటి ఒక కేసు శ్రీహరి, చిత్తరంజన్‌ల దృష్టికి వచ్చింది.

ముక్కకు శస్త్రచికిత్స జరిగిన ఒక వ్యక్తికి ఈ అలవాటు ఉంది. పదే పదే ముక్కులో వేలు పెట్టుకోవడం కారణంగా ఆ గాయం ఎంతకీ మానకపోవడాన్ని వారు గమనించారు.

మరో కేసులో, ఒక 53 ఏళ్ల మహిళ ఎక్కువగా ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల కణజాలానికి రంధ్రాలు ఏర్పడ్డాయి.

29 ఏళ్ల మరో వ్యక్తికి ముక్కులోని వెంట్రుకలను లాగేసే అలవాటు ఉంది. తరచుగా ఈ పని చేయడం వల్ల ఆయన ముక్కు పుటలకు గాయాలు అయ్యాయి. గాయాలు మానడానికి క్రీమ్ రాయాల్సి వచ్చింది. ఆయనకు చికిత్స చేసిన డాక్టర్, ఇది ఓసీడీకి ఒక రూపం అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఉత్తర ఐర్లండ్‌లో అవయవదాన చట్టాల్లో మార్పుకి కృషి

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు

ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది ప్రమాదకరం కాదు.

అలా అని ఇది సురక్షితం అని కూడా చెప్పలేం. 2006లో డచ్ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ముక్కులో వేళ్లు పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్నవారు ఎక్కువగా ఎస్.ఆరియస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

ప్రజలు అసహ్యించుకునే ఈ చర్యను ఎందుకు కొందరు తరచుగా చేస్తుంటారని అని అడిగితే, దానికి స్పష్టమైన సమాధానం దొరకదు.

ముక్కులో వేలు పెట్టుకోవడాన్ని సోమరితనానికి ఒక సంకేతంగా కూడా చూస్తారు.

ఇప్పటికీ కొంతమంది పరిశోధకులు దీనికి కారణాలు వెదికే పనిలో ఉన్నారు.

వీడియో క్యాప్షన్, ప్రతిరోజూ మృత్యుబావిలో చావుని ముద్దాడే స్టంట్ మ్యాన్‌ల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)