మదర్స్ డే: ‘నా బిడ్డను చంపేయమని ఒత్తిడి చేశారు. భర్త విడాకులిచ్చాడు..’

భార్గవి, ఆమె కూతురు

‘‘నేను రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాను. నా బిడ్డను (యుథనేసియాకు) చంపేయాలని వాళ్లు నన్ను ఒత్తిడి చేశారు. ఏడవడంలోనే నా జీవితం ముగిసిపోతుందేమోనని భయపడ్డాను.’’

విడాకుల బాధ, బిడ్డ గురించి ఇతరులు ఇచ్చిన దారుణమైన సలహాలు నేను కుంగిపోయేలా చేశాయి. ఆ సమయంలో నాకు దన్నుగా నిలిచింది నాలోని విశ్వాసమే.

అదే నాకు కాస్త వెలుగునిచ్చింది. ఆ చిన్న ఆశే నాకు జీవించడానికి ప్రేరణనిచ్చింది. ఆ ఆశ ఒక్కటే ఈరోజు నాకు పూర్తి మద్దతుగా ఉంది’’ అన్నారు భార్గవి.

భార్గవి స్వస్థలం చెన్నై. ఆన్‌లైన్‌లో నగలు అమ్మే వ్యాపారవేత్త. ఒంటరి తల్లిగా తన ప్రయాణం గురించి 2023లో బీబీసీతో పంచుకున్నారు.

భార్గవికి 15 ఏళ్ల కూతురు ఉంది.పేరు లామియా. ప్రేమగా లడ్డు అని పిలుచుకుంటారు.

లడ్డు పుట్టుకతోనే మాట్లాడే శక్తి, వినికిడి శక్తి కోల్పోయింది. కడుపులో ఉన్నప్పుడు తల చుట్టూ నీళ్లు చేరడంతో పుట్టినప్పుడు ఆమె తల పెద్దగా ఉండేది.

చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న లడ్డుకు యుథనేసియా చేయాలని బంధువులు పట్టుబట్టారు. అయితే బిడ్డ యుథనేసియాకు భార్గవి ససేమిరా అన్నారు.

''ఈ బిడ్డను చూసుకునే బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు. పాప బాగోగులు చూసుకోవడం నా కర్తవ్యం, ఇప్పుడు ఆ పాపే ప్రపంచం అన్నట్లు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నా'' అని భార్గవి అంటున్నారు .

భార్గవి, ఆమె కూతురు

స్కాన్ చేయించలేదు.. అందుకే సమస్య తెలియలేదు

‘‘నేను హోటల్ మేనేజ్‌మెంట్ చేశాను. 2007లో 28 ఏళ్ల వయసులో నాకు పెళ్లి అయింది. 2009లో నాకు లడ్డు పుట్టింది.

నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఐదో నెలలో స్కాన్ చేయించలేదు. అందుకే ఆమె తలలో నీటి సమస్య గురించి మాకు తెలియలేదు'' అని భార్గవి అన్నారు.

పాప పుట్టినప్పుడు ఆమె తల చాలా పెద్దది. కాబట్టి వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయమని సలహా ఇచ్చారు. అప్పుడు మాత్రమే ఆమె తలలో అటువంటి లోపం ఉందని తెలిసింది.

పాప పుట్టిన 15 నిమిషాల వరకు ఏడవలేదు. శబ్దం చేయలేదు. ఆ తర్వాత వైద్యులు పాపను పరీక్షించి మరిన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు.

తల్లి, కూతురు

'నేను అలా చేసి ఉండకూడదు'

'నా బిడ్డ ఎక్కువ కాలం బతకదని చెప్పారు. ఒక తల్లిగా వాళ్ల మాటలు నాకు ప్రసవ వేదన కంటే ఎక్కువ బాధను కలిగించాయి' అని చెబుతుండగా భార్గవి కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఒక మహిళ తన వైవాహిక జీవితంలో సమస్య ఎదుర్కొంటే ఆమె భర్త, భర్త కుటుంబం వారి వైపు ఉండాలి.

అయితే భార్గవికి ఆడపిల్ల పుట్టిందని తెలియడంతో ఇంట్లో భర్త గొడవ మొదలైంది.

ఆమెతో పాటు ఉన్న కొందరు స్నేహితులు, బంధువులు ఈ చిన్నారికి యుథనేసియా చేయాలని పట్టుబట్టారు.

కానీ భార్గవి అందుకు అంగీకరించలేదు. కొన్ని చేదు అనుభవాల తర్వాత ఆమె వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది.

‘‘లామియా ఇలా పుట్టడంతో నా వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది. ఇన్ని కష్టాలతో ఈ లోకంలో బతకాలా అనుకునేదాన్ని.

ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి చాలా హ్యాపీగా గడపాలనుకున్నా. కానీ అలా జరగలేదు. నేను మాత్రమే బాధను అనుభవించానని అనుకున్నా.

ఇక నేనెందుకు బతకాలి అనుకుని రెండు సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను. కానీ నన్ను రక్షించారు. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఒక జోక్ అనిపిస్తుంది.

నేను అలా చేసి ఉండకూడదు. అయితే ఈరోజు ఓ క్లారిటీ వచ్చింది. నా బిడ్డను పూర్తిగా నేనే చూసుకుంటాను’’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు భార్గవి.

బాలిక వయసు 14 ఏళ్లయినా మానసికంగా మాత్రం ఏడాదిన్నర పాపే.

భార్గవి పాపను చూసుకోవాలి కాబట్టి పూర్తి సమయం పని చేయలేదు. ఆమె ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆభరణాలను విక్రయించే బిజినెస్ చేస్తున్నారు.

పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు లడ్డు దగ్గర ఎవరో ఒకరు ఉండాలి.

పాప రోజూ 3 గంటల పాటు స్పెషల్ స్కూల్ క్లాసులకు హాజరవుతోంది. అక్కడ పిల్లలకు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి వివిధ రకాల చికిత్సలు అందిస్తారు.

రోజూ 2 గంటలే నిద్ర

‘‘లడ్డు వయసు 14 ఏళ్లు, కానీ మానసిక ఎదుగుదలలో మాత్రం ఇంకా ఏడాదిన్నర వయసున్న బిడ్డే.

పాప గత సంవత్సరమే యుక్తవయస్సుకు చేరుకుంది. నా బిడ్డకు సమయానికి తినిపించడం, స్నానం చేయించడం, స్కూల్‌కి తీసుకెళ్లడం, కథలు చెప్పడం ఇలా అన్నీ నేనే చూసుకుంటాను.

ఆమె 3 రోజులకు ఒకసారి మాత్రమే సరిగా నిద్రపోతుంది. కొన్ని రోజులు ఆమె 2 గంటల కంటే తక్కువ నిద్రపోతుంది. నేను ఆమెతో పాటే మెలకువగా ఉంటాను" అని భార్గవి చెప్పారు.

తన తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారని చెబుతూ.. ‘అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లు నాకు అండగా ఉన్నారు. నేను నిరాశలో మునిగినప్పుడు నాలో విశ్వాసం నింపేవారు.

అలాగే నా ఫ్యామిలీ ఫ్రెండ్ సంగీత సుందరంను కూడా కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాను.

ఎందుకంటే జీవితంలో పట్టు సాధించేందుకు, నా సమస్యలను దృఢ సంకల్పంతో అధిగమించేందుకు, నా జీవిత ప్రయాణంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సంగీత సుందరం సహకరించారు. వాళ్లు లేకుంటే నేను ఇంత దూరం ప్రయాణించి ఆత్మవిశ్వాసంతో ఉండే దాన్ని కాదు" అన్నారు భార్గవి.

వీడియో క్యాప్షన్, సింగిల్ మదర్: ‘నా బిడ్డను చంపేయమని ఒత్తిడి చేశారు’

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)