ఎలక్ట్రోథెరపీ: నొప్పిని తగ్గించేందుకు 'చేపల విద్యుత్'ను గ్రీకులు, రోమన్లు ఎలా వాడేవారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అల్బెర్టో రొమేరో బ్లాంకో
- హోదా, బీబీసీ ముండో
కొన్ని వ్యాధులు, గాయాలకు చికిత్సలో భాగంగా విద్యుత్‌ను ఉపయోగిస్తుంటారు. దీన్నే ఎలక్ట్రోథెరపీ అంటారు.
తీవ్రమైన నొప్పులు, కుంగుబాటు (డిప్రెషన్), కొన్ని మెదడు గాయాలు, కండరాల సమస్యల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు.
ఇటీవల కాలంలో దీని ప్రాధాన్యాన్ని వైద్య పరిశోధకులు, శాస్త్రవేత్తలు గుర్తించడం మొదలుపెట్టారు. దీని సాయంతో మరిన్ని కొత్త చికిత్సా విధానాలు కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే, పురాతన కాలంలోనే గ్రీకులు, రోమన్లు చికిత్సా విధానాల్లో విద్యుత్‌ను ఉపయోగించారని మీకు తెలుసా?
మరి, విద్యుత్ ఉత్పత్తికి, నియంత్రణకు వారి దగ్గర ఏమైనా పరికరాలు ఉండేవా? లేదు. కానీ, ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే విద్యుత్‌ను ఉపయోగించుకునేవారు. అదే చేపల్లో కనిపించే విద్యుత్. ఔను, చేపల్లోనే.

ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్టు, గ్రీసు, రోమ్‌లలో..
కొన్ని చేపలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. ఇలా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థాన్ని ‘బయోఎలక్ట్రోజెనిసిస్’గా పిలుస్తారు. ఇతర చేపలకు సంకేతాలు పంపేందుకు, వేటాడటానికి, ఎవరైనా దాడి చేసినప్పుడు లేదా దారి వెతుక్కోవడానికి విద్యుత్‌ను ఈ చేపలు ఉపయోగిస్తుంటాయి.
విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కొన్ని చేపలు ప్రముఖ ప్రాచీన నాగరికతలు విలసిల్లిన ప్రాంతంలోనూ కనిపిస్తాయి. ఆఫ్రికా తీరంలో కనిపించే ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్, మధ్యదరా సముద్రంలోని టార్పిడో రేస్‌లను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈజిప్షియన్లు, గ్రీకులు, రోమన్లకు ఈ విద్యుత్ చేపలతో పరిచయముందని మనకు తెలుసు. ఎందుకంటే ఈజిప్టు కట్టడాలు, గ్రీకు సిరామిక్స్, రోమన్ చిత్రపటాల్లో ఇవి మనకు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేసేవారు?
ఈ చేపలు మన చర్మాన్ని తాకినప్పుడు తిమ్మిరి ఎక్కినట్లుగా అనిపిస్తుంది. బహుశా అందుకే హిప్పోక్రేట్స్ రచన ‘‘ఆన్ డైట్ ఇన్ అక్యూట్ డిసీజెస్’’లో ఈ చేపల గురించి కూడా ప్రస్తావించారు. వీటి కోసం ‘నార్కే’ అనే పదాన్ని ఆయన ఉపయోగించారు.
జంతువుల గురించి ప్రస్తావించిన ప్రాచీన రచనల్లో ఇది కూడా ఒకటి. అయితే, ఆ పుస్తకంలో నార్కే చేప అసాధారణ లక్షణాల గురించి ప్రస్తావించినప్పటికీ, దీనితో శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏ చికిత్సా విధానాల్లో వీటిని ఉపయోగించొచ్చు లాంటి అంశాలను రాయలేదు.
ప్లేటో (క్రీ.పూ. 427 - 347) కూడా తన రచన ‘మెనో’లో ఈ చేపలను తాకినప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలిపారు. సోక్రటీస్‌తో మాట్లాడినప్పుడు కలిగే ‘మెదడు స్తంభించిపోవడం’ తరహా అనుభూతిని ఈ చేప కలిగిస్తుందన్నారు.
అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) కూడా ‘‘టార్పిడో రేస్’’ గురించి తన రచనల్లో ప్రస్తావించారు. ఇతర చేపలను వేటాడం, సంకేతాలు పంపడంలో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా వివరించారు. ఈ చేపలు సముద్రంలోని అడుగు భాగంలో మట్టి కింద దాగుంటాయని, అటు వచ్చే చేపలు, ఇతర జీవులను తమ విద్యుత్ శక్తితో స్తంభింపజేస్తాయని వివరించారు.
అరిస్టాటిల్ శిష్యుడు థియోఫ్రాస్టస్ (క్రీ.పూ. 371-287) కూడా ఈ టార్పిడో రేస్ విడుదల చేసే విద్యుత్ తరంగాలు నీటిని ఆసరాగా చేసుకొని చాలా దూరం ప్రయాణిస్తాయని హెచ్చరించారు. అంటే విద్యుత్ వాహక పదార్థాల గురించి కూడా ఆయన తన రచనల్లో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
విపరీతమైన సెక్స్ కోరికలకు చేపలతో కళ్లెం
ఈ చేపల అద్భుత శక్తి గురించి మరికొన్ని ప్రాచీన రచనల్లోనూ ప్రస్తావించారు. సిసిరో (క్రీ.పూ. 160 - 43), ఓపియానో డే అనాజర్బా లాంటి మేధావుల రచనలు దీనిలో ఉంటాయి. ఆ చేపల్లో ఈ విద్యుత్ శక్తి ఎలా జనిస్తుందో రెండో శతాబ్దంలో ఓపియానో వివరించారు.
ఆ తర్వాత ప్లీనీ ద ఎల్డర్ (క్రీ.శ. 23- 79) తన ‘‘నేచురల్ హిస్టరీ’’ పుస్తకంలో ఈ చేపల విద్యుత్‌తో కొన్ని చికిత్సా విధానాలను ప్రస్తావించారు. ప్రసవ సమయంలో గర్భాశయ ముఖద్వారాన్ని కాస్త వదులుగా చేయడం, విపరీతమైన సెక్స్ కోరికలను తగ్గించడం లాంటి అవసరాలకు ఈ చేపలను ఉపయోగించొచ్చని చెప్పారు.
ఈ విద్యుత్ గురించి తెలిసినప్పటికీ క్రీ.శ. 46వ సంవత్సరం వరకూ దీన్ని వైద్య చికిత్సల్లో ఉపయోగించినట్లు పెద్దగా ఆధారాలు లేవు.
క్రీ.శ. 46లో తొలిసారిగా రోమన్ చక్రవర్తి క్లాడియస్ ఆస్థానంలోని స్క్రిబోనియస్ లార్గోగా పిలిచే ఓ వైద్యుడు ఎడతెగని తీవ్రమైన నొప్పులను టార్పిడో రేస్‌తో తగ్గించొచ్చని ప్రతిపాదించారు.
‘‘డీ కంపోజిసే మెడికారమ్ లిబర్’’అనే పుస్తకంలో ఈ ఎలక్ట్రోథెరపీ గురించి ప్రస్తావించారు.
తీవ్రమైన కాలి నొప్పితో బాధపడే టిబేరియస్ చక్రవర్తి ఆ నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందారో ఆ పుస్తకంలో వివరించారు. ఒక రోజు ఆయన బీచ్‌లో నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒక టార్పిడో రేపై కాలు వేశారు. దీంతో ఒక్కసారిగా ఆయన కాలికి తిమ్మిరి ఎక్కింది. ఆ తిమ్మిరే నొప్పి నుంచి కూడా ఆయనకు ఉపశమనం కల్పించింది.
నొప్పులతో బాధపడే శరీర భాగాలపై టార్పిడే రేస్‌ను పెట్టినప్పుడు ఆ నొప్పులు తగ్గుతాయని ఆ తర్వాతే స్క్రిబోనియస్ ప్రతిపాదించి ఉండొచ్చు.
తలనొప్పి నుంచి ఉపశమనం
అలానే తలనొప్పి నుంచి కూడా ఉపశమనం పొందాలంటే నుదుటిపై ఆ టోర్పిడే రేస్‌ను పెట్టాలని ఆయన సూచించారు.
స్క్రిబోనియస్ రచనల్లో చికిత్సా విధానాలను ఆ తర్వాత కాలంలోనూ కొందరు అనుసరించారు.
వైద్యుడైన డయోస్కోరైడ్స్ (59- 90) మలద్వార ఇన్ఫెక్షన్లకు ఈ విధానాన్ని సూచించారు.
ఆ తర్వాత గాలెన్ (క్రీ.శ. 129-201) కూడా ఈ చేపలతో కొన్ని ప్రయోగాలు చేశారు. మొదట్లో ఆయనకు సానుకూల ఫలితాలు రాలేదు. బహుశా ఆయన చనిపోయిన చేపలను ఉపయోగించడమే దీనికి కారణం కావచ్చు.
మొత్తానికి ఎడతెగని నొప్పుల నుంచి విద్యుత్ శక్తితో ఉపశమనం పొందొచ్చనే ఆలోచనను అందించిన వీరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే శతాబ్దాల నుంచి ఎందరో సమస్యలకు వీరు పరిష్కారం చూపారు.
(రచయిత స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అల్కాలాలో పరిశోధకులు)
ఇవి కూడా చదవండి:
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? కచ్చితత్వం ఎంత?
- మహిళా రెజ్లర్లు: ప్రభుత్వ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని సవాల్ చేస్తున్న ఈ నిరసన ఏం చెబుతోంది?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ బరిలోకి దిగాలనే ఆయన ఆశలకు లైంగిక వేధింపుల కేసు తీర్పు గండి కొడుతుందా?
- హంతకులు పుడతారా, తయారవుతారా? ఒక మనిషి మరో మనిషిని ఎందుకు చంపుతారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














