హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తిమంతమైన మత్తుమందు ఫెంటనిల్... ఇది మెదడులో చేసే మాయ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెడేషియన్
- హోదా, బీబీసీ ముండో
నొప్పి తెలియనివ్వకుండా మత్తును కలిగించే సింథటిక్ ఓపియోయిడ్‌లలో ‘ఫెంటనిల్’ కూడా ఒకటి. ఇది మోర్ఫీన్ కంటే 100 రెట్లు, హెయిన్ కంటే 50 రెట్లు శక్తిమంతమైనది.
వైద్యపరమైన అవసరాలకు ‘ఫెంటనిల్’ను ఉపయోగించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదముద్ర కూడా వేసింది.
అయితే, వైద్యపరమైన అవసరాలకు కాకుండా కేవలం మత్తు కోసం ఈ డ్రగ్‌ను తీసుకుంటే ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు.
ఇలాంటి సింథటిక్ ఓపియోయిడ్‌లను మత్తు కోసం తీసుకున్నప్పుడు ‘ఓవర్ డోస్’ కావడంతో 2021లో అమెరికాలో 70,601 మంది మరణించినట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ (ఎన్ఐడీఏ) వెల్లడించింది. ఈ మరణాల్లో ఎక్కువ శాతం ఫెంటనిల్ వల్లే సంభవించాయి.
దీంతో ఓపియోయిడ్ల ప్రభావాలను నియంత్రించే డ్రగ్ ‘నలాక్సోన్’ను మందుల చీటీ లేకపోయినా విక్రయించేందుకు తాజాగా అమెరికా మార్పులు తీసుకొచ్చింది.
ఇంతకీ అసలు మెదడుపై ఫెంటనిల్ ఎలా ప్రభావం చూపిస్తుంది? ఇది ఎందుకంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Getty Images
ఫెంటనిల్ ఎలా పనిచేస్తుంది?
నొప్పి నుంచి ఉపశమనం కల్పించేందుకు 1959లో ఫెంటనిల్‌ను తయారుచేశారు. 1960ల్లో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. ట్యాబ్లెట్లు, ప్యాచ్‌లు, ఇంజెక్షన్లు తదితర రూపాల్లో ఇది అందుబాటులో ఉంటోంది.
సర్జరీలు లేదా తీవ్రమైన నొప్పికి కారణమయ్యే చికిత్సల సమయంలో నొప్పి తెలియకుండా ఈ డ్రగ్‌ను వైద్యులు ఇస్తుంటారు.
హెరాయిన్, మోర్ఫీన్ లాంటి ఇతర ఓపియోయిడ్ల తరహాలోనే మెదడులోని నొప్పి, భావోద్వేగాలను నియంత్రించే ఓపియోయిడ్ రిసెప్టర్లతో ఫెంటనిల్ చర్యలు జరుపుతుంది.
సాధారణంగా మన శరీరం ఉత్పత్తిచేసే రసాయనాలతో ఈ రిసెప్టర్లు చర్యలు జరుపుతాయి. ఏదైనా నచ్చిన ఆహారం లేదా పానీయాలను తీసుకున్నప్పుడు, సెక్స్ చేసినప్పుడు మనం మంచి అనుభూతిని పొందడానికి ఈ రిసెప్టర్లే కారణం.
మెదడులోకి ఎంత మొత్తంలో ఓపియోయిడ్లు వెళ్తున్నాయి? ఎంత వేగంగా చర్యలు జరుపుతున్నాయి? అనే అంశాలపై ఆ ఓపియోయిడ్ల ప్రభావం ఆధారపడి ఉంటుంది.
అయితే, ఫెంటనిల్ చాలా శక్తిమంతమైన డ్రగ్. స్వల్ప మొత్తంలో తీసుకున్నప్పటికీ ఇది వేగంగా చర్యలు జరుపుతుంది. వేగంగా ఇది మెదడుకు చేరుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మెదడులోకి వెళ్లిన తర్వాత...
ఒకసారి మెదడులోకి చేరిన తర్వాత, ఓపియోయిడ్ రిసెప్టర్లతో ఫెంటనిల్ చర్యలు జరుపుతుంది. ఫలితంగా డోపమైన్ విడుదల అవుతుంది. దీంతో నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది, యాంక్సైటీ (ఆందోళన) తగ్గించి ఒకరకమైన ప్రశాంతతను ఇస్తుంది. ఫలితంగా దీన్ని తీసుకున్న వారు ఒక ‘హై’లోకి వెళ్తారు.
‘‘ఇది కొకైన్‌లా పనిచేస్తుంది. మొదటిసారి దీన్ని తీసుకున్న వెంటనే ‘హై’లోకి వెళ్తారు. ఫలితంగా మళ్లీమళ్లీ ఆ అనుభూతిని పొందడానికి ఈ డ్రగ్‌ను తీసుకుంటుంటారు. అయితే, ప్రతిసారీ మొదటిసారి పొందిన అనుభూతి రాదు. దీంతో ఆ అనుభూతి కోసం క్రమంగా డోస్‌ను పెంచుకుంటూ పోతారు’’ అని కెనడా మేనిటోబా యూనివర్సిటీలోని హెల్త్ సైన్సెస్ ప్రొఫెసర్ డేనియేల్ సీటర్ చెప్పారు.
ఫెంటనిల్ ఇచ్చే అనుభూతే ఆ డ్రగ్‌కు బానిసయ్యేలా చేస్తుంది. అయితే, ఇదే డ్రగ్ ఒక్కోసారి ప్రాణాలుపోయే పరిస్థితికి కూడా కారణం అవుతుంది. ఒక్కోసారి దీని వల్ల శ్వాస స్తంభించిపోతుంది. ఫలితంగా ‘హైపాక్సియా’తో దీన్ని తీసుకునేవారు మరణిస్తుంటారు. అంటే శరీరంలోని కణజాలానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో మరణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్వాసకు ఏం అవుతుంది?
మెదడులోని శ్వాసను నియంత్రించే భాగాల్లోనూ ఓపియోయిడ్ రిసెప్టర్లు ఉంటాయి. ‘‘ఫెంటనిల్ తీసుకున్నప్పుడు ఇవి కూడా ప్రభావితం అవుతాయి. ఫలితంగా శ్వాస ప్రక్రియలు నెమ్మదిస్తాయి. మీరు స్పృహలో ఉన్నప్పుడే ఈ ప్రక్రియలు జరిగిపోతుంటాయి’’ అని డేనియేల్ చెప్పారు.
ఇదే విషయాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ అధ్యయనంలోనూ రుజువైంది.
‘‘స్పృహ కోల్పోవడానికి నాలుగు నిమిషాల ముందే శ్వాస తీసుకోవడం ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయంలో మత్తును కలిగించే ఇతర ఔషధాలు చూపే ప్రభావం కంటే 1700 రెట్లు శక్తిమంతంగా ఫెంటనిల్ పనిచేస్తుంది’’ అని ఆ అధ్యనంలో తేలింది.
‘‘ఫెంటినల్ చాలా ప్రాణాంతకమైనదని ఎందుకంటారో ఈ అధ్యయన ఫలితాలు చూస్తే తెలుస్తుంది’’అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఫ్యాట్రిక్ ఎల్ పర్డన్ చెప్పారు.
అయితే, వైద్యపరమైన అవసరాల కోసం ఈ డ్రగ్స్‌ను తీసుకున్నప్పుడు దీని ప్రభావం కాస్త తక్కువగా కనిపిస్తుంది. ‘‘ఎందుకంటే డ్రగ్స్ ఇచ్చిన తర్వాత కృత్రిమ శ్వాస అందిస్తారు’’అని డేనియేల్ చెప్పారు.
వైద్యుల పర్యవేక్షణలో లేకపోతే ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నప్పటికీ ఫెంటనిల్ ప్రమాదకరమని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది.
మరోవైపు మత్తు కోసం ఫెంటనిల్‌ను తీసుకునేవారు, తాము ఎంత మొత్తంలో తీసుకుంటాన్నామో గమనించలేరని డేనియేల్ వివరించారు.
‘‘ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మార్కెట్‌లో ఈ డ్రగ్‌ను ఇతర రసాయనాలతో కలిపేస్తుంటారు. దీంతో ఇది ఎలా పనిచేస్తుందో చెప్పడం చాలా కష్టం. దానిలో ఏం కలిపారనే దానిపై దాని ప్రభావాలు ఆధారపడి ఉంటాయి’’అని డేనియేల్ చెప్పారు.
‘‘కొన్నిసార్లు ఇతర డ్రగ్స్‌తో కలిపి దీన్ని విక్రయిస్తుంటారు. ఫలితంగా డోపమైన్ మరింత వేగంగా విడుదల అవుతుంది. దీంతో శ్వాసలో కూడా వెంటనే మార్పులు కనిపించొచ్చు’’అని డేనియేల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















