విక్టోరియా: 9 మంది పిల్లల తల్లి అయిన ఈ రాణిపై 7 హత్యాయత్నాలు జరిగాయి, అయినా ఎలా బయటపడ్డారంటే....

క్వీన్ విక్టోరియా

ఫొటో సోర్స్, Alamy

అది 1850 జూన్ 27వ తేదీ. క్వీన్ విక్టోరియా మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన రోజు అది. ఆరోజు సాయంత్రం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె బయటకు వచ్చారు.

అనారోగ్యంతో ఉన్న తన అంకుల్‌ను చూసేందుకు పికాడిలీలో ఉన్న ఆయన ఇంటికి ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె బయల్దేరారు.

ఆమెను చూసేందుకు బయట వేలాది మంది లండన్ ప్రజలు గుమిగూడారు.

వారిలో చాలామంది రాణి విక్టోరియాను చూడాలనే కుతూహలంతో ఉండగా, ఒక్క వ్యక్తి మాత్రం మరో ఉద్దేశంతో అక్కడ నిల్చున్నారు.

రాచపరివారం ముందుకు కదలగానే, జనాలను ముందుకు తోసుకుంటూ వచ్చిన రాబర్ట్ పేట్ అనే వ్యక్తి రాణి ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ వాహనం (క్యారేజ్) వైపు పరిగెత్తారు.

వాహనంలో ఉన్న రాణి తలపై లోహపు కడ్డీతో కొట్టారు. ఈ ఘటనతో అక్కడున్న జనాలంతా భయాందోళనకు గురయ్యారు.

ఈ గందరగోళం మధ్య లేచి నిల్చున్న విక్టోరియా, తన టోపీని సరిచేసుకొని తనకు గాయం కాలేదని నెమ్మదిగా చెప్పారు.

క్వీన్ విక్టోరియా

ఫొటో సోర్స్, Getty Images

సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఆమెపై దాడి జరగడం ఇది అయిదోసారి. 1837లో ఆమె రాణిగా గద్దెను ఎక్కారు.

అప్పట్లో ఆమె ప్రశాంత మనస్తత్వం గురించి మీడియా తరచుగా చెబుతుండేది.

ది మార్నింగ్ పోస్ట్ నివేదించిన దాని ప్రకారం, ప్రమాదం జరిగిన తర్వాత బకింగ్‌హమ్ ప్యాలెస్‌కు తిరిగి వెళ్తుండగా, దారిలో తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలందరికీ ఆమె అభివాదం చేశారు.

ఆమెలోని ధైర్యం, తెగువ, ప్రశాంత మనస్తత్వం గురించి మీడియాలో కథనాలు రాగా, విక్టోరియాలోని ఉద్వేగ కోణం గురించి ఆమె వ్యక్తిగత జర్నల్స్ తెలపుతున్నాయి.

తనపై జరిగిన దాడి ఘటనను బకింగ్‌హమ్ ప్యాలెస్ భద్రత కోణంలో చూస్తే అదొక భయంకరమైన కలలా అనిపించిందని ఆమె రాశారు.

ఆ ఘటనతో ఏర్పడిన భయం, గందరగోళం కోపానికి దారి తీశాయని... అది అత్యంత అవమానకర, పిరికి చర్యగా అనిపించిందని ఆమె రాసుకొచ్చారు.

ఆ ఘటనలో విక్టోరియా ఒక్కరే కాదు ప్రిన్స్ ఆల్బర్ట్ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.

క్వీన్ విక్టోరియా

ఫొటో సోర్స్, LONDON STEREOSCOPIC COMPANY

అప్పట్లో హోం సెక్రటరీగా ఉన్న సర్ జార్జ్ గ్రే చాలా బాధతో, కన్నీళ్లతో బకింగ్‌హమ్ ప్యాలెస్‌కు చేరుకున్నారు.

దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా విక్టోరియా అదే షాక్‌లో ఉన్నారు. ఏమీ తినలేకపోయారు.

అయినప్పటికీ, ఆమె ఒపెరాకు వెళ్లారు. అక్కడ ఆనందంగా జనాలంతా తమ టోపీలను గాలిలోకి ఎగరేస్తూ, ‘‘గాడ్ సేవ్ ద క్వీన్’’ అంటూ సంగీతవాయిద్యాలను వాయించారు.

రాణిపై దాడి ఘటన అందరిలో ఉద్వేగాలను రేకెత్తించింది. ‘‘మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి ఒకసారి ప్రమాదం బారిన పడటం కూడా మంచిదే’’ అని విక్టోరియా చమత్కరించారు.

దాడి జరుగుతుందనే కారణంతో దాక్కొని ఉండకూడదనే ఆమె సంకల్పం చిన్నతనంలోనే రాణి విక్టోరియాను ప్రత్యేకంగా నిలిపింది.

1842లో రాణి విక్టోరియా కాన్‌స్టిట్యూషన్ హిల్‌కు వెళ్తుండగా జాన్ ఫ్రాన్సిస్ అనే ఒక టీనేజీ బాలుడు ఆమె క్యారేజ్‌పై పిస్టల్‌ను గురి పెట్టాడు.

ఆల్బర్ట్ అతనిని గుర్తించాడు. కానీ, ఫ్రాన్సిస్ కాల్పులు జరపకుండా అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు.

క్వీన్ విక్టోరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్వీన్ విక్టోరియా తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చారు

క్వీన్‌ను ఇంట్లోనే ఉండాలని ప్రధానమంత్రి రాబర్ట్ పీల్ అభ్యర్థించారు. కానీ, ఈ అభ్యర్థనను రాణి నిరాకరించారు. మరోవైపు ఆయన నియమించిన కొత్త పోలీసు బృందం దాడికి యత్నించిన వ్యక్తిని పట్టుకునే పనిలో ఉంది.

మరుసటి రోజు సాయంత్రం, ఓపెన్ టాప్ క్యారేజ్‌లో ఆల్బర్ట్ రాడ్‌తో కలిసి రాణి బయటకు వచ్చారు. ఆమె క్యారేజ్‌ను గార్డులు చుట్టుముట్టారు. అయినప్పటికీ, ఆమె బయటకు కనిపిస్తున్నారు.

సరిగ్గా అప్పుడే ఫ్రాన్సిస్ మరోసారి దాడికి ప్రయత్నించాడు. ఈసారి ఆయన పిస్టల్‌ను కాల్చాడు. వెంటనే ఆయనను పోలీసులు చుట్టుముట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆమె ఎలాంటి గాయాల్లేకుండా బయటపడ్డారు. కానీ, దీనికి భిన్నంగా కూడా జరిగి ఉండేది.

ఫ్రాన్సిస్ దాడి తర్వాత కూడా రాణి వెంటనే తన రాజవిధులను నిర్వర్తించడం మొదలుపెట్టారు. ఎలాంటి బెదురు కనిపించకుండా బహిరంగ కార్యక్రమాలకు హాజరయ్యారు కూడా. రాణి చూపించిన ధైర్యం, తెగువను పాత్రికేయులు ప్రశంసించారు.

క్వీన్ విక్టోరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్‌లోని నేషనల్ పోట్రెయిట్ గ్యాలరీలో క్వీన్ విక్టోరియా పేయింటింగ్

సింహం లాంటి గుండెనిబ్బరాన్ని కలిగిన రాణి అని, లింగం పరంగా ఆమె ఒక రాణి అయినప్పటికీ, ధైర్యంలో ఆమె రాజు అని అప్పట్లో ఆమెపై ప్రశంసలు వచ్చాయి.

బహిరంగంగా ఈ తెగువను ప్రదర్శించడం క్వీన్ విక్టోరియాకు చాలా ముఖ్యం.

కానీ, ఇలాంటి భయం కలిగించే అనుభవాలను మర్చిపోవడం చాలా కష్టం.

1840లలోనే విక్టోరియాపై నలుగురు వేర్వేరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 1850లో రాబర్ట్ పేట్ దాడి చేసే సమయానికి జనాలంటే ఆమెలో ఒక రకమైన ఆందోళన మొదలైంది.

‘‘నా క్యారేజ్‌కు దగ్గరగా ప్రజలు వచ్చినప్పుడు వారు నామీద దాడి చేస్తారనే దానికి మించి ఎక్కువ ఆలోచనలు వచ్చేవి’’ అని విక్టోరియా తన జర్నల్‌లో రాశారు.

హంతకులు తనపై దాడి చేసినప్పుడు కాకుండా, తాను ప్రేమించే వ్యక్తులు మరణించినప్పుడు ఆమెలో అత్యంత బాధాకరమైన ఉద్వేగాలు బయటకు వచ్చేవి.

క్వీన్ విక్టోరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలో క్వీన్ విక్టోరియా విగ్రహం

రాబర్ట్ పేట్ దాడి జరిగిన కొన్ని రోజులకే తన స్నేహితుడు, ఆల్బర్ట్ మిత్రుడు అయిన రాబర్ట్ పీల్ తన గుర్రంపై నుంచి పడిపోయి చనిపోయారు.

ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె అంకుల్ కూడా మరణించారు. ఈ మరణాల వల్ల ఏర్పడిన భయం, విషాదం, దు:ఖం నుంచి బయటపడగలిగానని ఆమె జర్నల్‌లో రాశారు.

అయితే, 1861లో ఆల్బర్ట్ మరణించినప్పుడు ఆమె విషాదంలో మునిగిపోయారు. ఆల్బర్ట్ మరణం ఆమెను పూర్తిగా కలచివేసింది. దీని తర్వాత ఆమె ప్రజా జీవితం నుంచి దూరంగా ఉన్నారు. తీవ్ర డిప్రెషన్‌లో మునిగిపోయారు. ఈ బాధ తనను చిత్రవధ చేస్తోందని ఆమె రాసుకొచ్చారు.

తర్వాత ఆమె మరో 40 ఏళ్లు బతికారు. కానీ, ఈ దు:ఖం నుంచి ఆమె ఎప్పుడూ కోలుకోలేదు. ఆమె అప్పుడప్పుడు బహిరంగ ప్రదేశాల్లో కనిపించేందుకు బయటకు వచ్చేవారు. ఇలా బయటకు వచ్చిన రెండు సార్లు కూడా ఆమెపై హత్యాయత్నాలు జరిగాయి. కానీ, ఆమె యవ్వనంలో ఉన్నప్పటి ధైర్యాన్ని ప్రదర్శించలేకపోయారు.

చనిపోవడానికి ముందు ఏడాది ఆమె వైకల్యం, నొప్పులు, నిరాశలో జీవించినట్లు ఆమె జర్నల్స్ ద్వారా తెలుస్తుంది.

తన జీవిత కాలంలో ఏడు హత్యాయత్నాల నుంచి విక్టోరియా బయటపడ్డారు. తొమ్మిది మంది పిల్లలకు ఆమె జన్మనిచ్చారు. ఆమె బహిరంగంగా కనబరిచిన ధైర్యం, తెగువ, స్వీయ నియంత్రణ వంటి అంశాలు ఆమెకు చెందిన సగం కథను మాత్రమే చెబుతాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)