స్టార్‌బక్స్: ట్రాన్స్‌జెండర్స్ మీద తీసిన ఈ యాడ్ ఎందుకు చర్చకు దారి తీసింది?

కాఫీ తాగుతున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, Starbuck India

    • రచయిత, షెరిలాన్ మొలన్
    • హోదా, బీబీసీ న్యూస్

స్టార్‌బక్స్ ఇండియా ఇటీవల తీసిన ఒక యాడ్, సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ పరిస్థితి మీద మరొకసారి చర్చను లేవనెత్తింది.

జెండర్ మార్చుకుని అమ్మాయిగా మారిన కొడుకుతో ఒక తండ్రి కొంత కాలంగా మాట్లాడకుండా ఉంటారు. కొద్ది సంవత్సరాల తరువాత ఒక కాఫీ షాపులో కలిసినప్పుడు ఆమెను తండ్రి కూతురుగా గుర్తించి, మళ్లీ మాటలు కలుపుతారు.

అబ్బాయిగా ఉన్నప్పుడు తన పేరు ‘అర్పిత్’. జెండర్ మార్చుకుని అమ్మాయిగా మారిన తరువాత ఆ పేరు ‘అర్పిత’గా మారుతుంది. ‘‘ఇప్పటికీ నువ్వు నా బిడ్డవే. కాకపోతే నీ పేరులో అదనంగా ఒక అక్షరం వచ్చి చేరింది’’ అని ఆ తండ్రి అనడంతో #ItStartsWithYourName అనే హ్యాష్‌టాగ్‌తో యాడ్ ముగుస్తుంది.

ట్రాన్స్‌జెండర్స్ విషయంలో మార్పుకు తొలి అడుగు ఇంట్లోనే పడాలి అనే సందేశాన్ని ఆ యాడ్ ఇస్తోంది.

సోషల్ మీడియాలో ఆ యాడ్‌ను చాలా మంది మెచ్చుకున్నారు.

‘‘జెండర్ మార్చుకున్న బిడ్డను తల్లిదండ్రులు అక్కున చేర్చుకుని ప్రేమను పంచడం చాలా బాగుంది’’ అని ఒకరు అంటే, ‘‘ట్రాన్స్‌ఫోబియాను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది’’ అని మరొక యూజర్ కామెంట్ చేశారు.

ఇదే సమయంలో ‘‘భారత సంస్కృతికి విరుద్ధం’’గా ఉందంటూ ఆ యాడ్‌ను విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు.

ట్రాన్స్‌జెండర్ కూతురితో తండ్రి

ఫొటో సోర్స్, BHIMA JEWELLERY

ఫొటో క్యాప్షన్, కొడుకు జెండర్ మార్చుకుని అమ్మాయిగా మారేందుకు కుటుంబం సహకరించినట్లు భీమ జువెలర్స్ యాడ్‌లో చూపించారు.
గ్లోరియస్ లూనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రాన్స్‌జెండర్ మోడల్ గ్లోరియస్ లూనా

భారత్‌లోని ట్రాన్స్‌జెండర్ సమస్యల చుట్టూ వ్యాపార ప్రకటనలు రావడం ఇదే తొలిసారి కాదు.

కేరళకు చెందిన భీమ జ్యుయెలర్స్ 2021లో విడుదల చేసిన యాడ్ కూడా సమాజంలో చర్చకు దారి తీసింది. తమ కొడుకు అమ్మాయిగా మారే ప్రతి మలుపులో తల్లిదండ్రులు తోడుగా ఉండటాన్ని ఆ యాడ్‌లో చూపించారు.

ట్రాన్స్‌జెండర్ మోడల్ మీరా ఆ యాడ్‌లో నటించారు. ‘‘నాతో నేను మరింత సౌకర్యంగా ఉండటానికి ఆ యాడ్‌లో నటించడం తోడ్పడింది’’ అని బీబీసీతో మీరా అన్నారు.

భారత్‌లో సుమారు 20 లక్షల మంది ట్రాన్స్‌జెండర్ జనాభా ఉంటారని అంచనా. ఇతరులతో పాటు వారికి సమానహక్కులను సుప్రీంకోర్టు కల్పించినా సమాజంలో వారిని చిన్నచూపు చూడటం మాత్రం ఆగలేదు.

జెండర్ మార్చుకునే పిల్లలను చాలా వరకు తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. అందువల్ల బతకడానికి వారు అడ్డుక్కోవడం, వ్యభిచారంలోకి దిగడం, డ్యాన్సులు చేయడం వంటివి చేయాల్సి వస్తోంది.

అయితే పరిస్థితులు మెల్లగా మారుతున్నాయని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటికీ చెందిన వారు చెబుతున్నారు. సినిమాలు, యాడ్స్, ఫ్యాషన్ షోలు వంటి వాటిలో తమకు అవకాశాలు కొంతమేరకు దొరుకుతున్నాయని, తద్వారా తమ ప్రాతినిధ్యం పెరుగుతోందని అంటున్నారు.

ఇటీవల ముగిసిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తొలిసారి ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళలతోపాటు ఒక నాన్-బైనరీ వ్యక్తికి మోడల్స్‌గా అవకాశం ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్ మహిళా డిజైనర్ సాయ్‌షా శిందే దుస్తులను కూడా అందులో ప్రదర్శించారు.

ప్రముఖ ఫ్యాషన్ మేగజైన్స్ కూడా ట్రాన్స్‌జెండర్ మోడల్స్‌కు మంచి అవకాశాలు ఇస్తున్నాయి. ఇది తమకు ఎంతో ఆనందం కలిగిస్తోందని ముంబయికి చెందిన ట్రాన్స్‌జెండర్ మహిళా మోడల్ రయ్యాన్ మంకీ(32) అన్నారు.

‘‘ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటికీ చెందిన వారు స్టార్‌బక్స్ యాడ్స్ లేదా ఫ్యాషన్ మేగజైన్స్ కవర్ ఫొటోలలో కనిపించడం చాలా పెద్ద విషయం. సాధారణంగా అవన్నీ పెద్దపెద్ద సెలబ్రిటీలకు ప్రాధాన్యమిచ్చే ఖరీదైన ప్లాట్‌ఫామ్స్. ఇటువంటి ప్లాట్‌ఫామ్స్ మీద ట్రాన్స్‌జెండర్స్‌కు అవకాశాలు ఇవ్వడంతోపాటు వారిని చూపిస్తున్న తీరును బట్టి మార్పు వస్తోందని భావించొచ్చు’’ అని బీబీసీతో ఆమె అన్నారు.

ట్రాన్స్‌జెండర్ మోడల్

ఫొటో సోర్స్, ALOK X PAPA DON'T PREACH

ట్రాన్స్‌జెండర్ మోడల్

ఫొటో సోర్స్, SAISHA SHINDE

ఫొటో క్యాప్షన్, సాయ్‌షా శిందే డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శిస్తున్న మోడల్

గత కొద్ది సంవతర్సాలతో పోలిస్తే ఈ ట్రెండ్ ఇప్పుడు పెరుగుతోందని దుర్గ అనే మరొక మోడల్ అన్నారు.

‘‘అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండాలనే ధోరణి అంతర్జాతీయంగా కనిపిస్తోంది. రిలవెంట్‌గా ఉండేందుకు ఆ ట్రెండ్‌ను బ్రాండ్స్ కూడా అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది’’ అని దివ్య అన్నారు.

అయితే ప్రైడ్ మంత్ వంటి సందర్భాల్లో మాత్రమే ట్రాన్స్‌జెండర్ మోడళ్లకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని, మిగతా సమయంలో మరచిపోతున్నాయని సాయ్‌షా శిందే అన్నారు.

‘‘ఫ్యాషన్‌కు జెండర్ లేదు. ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కంపెనీలు రోజూవారీ యాడ్స్‌లో వారినీ భాగం చేయడంతోపాటు అది నార్మల్ అయ్యేలా చూడాలి’’ అని ఆమె సూచించారు.

ట్రాన్స్‌జెండర్స్ విషయంలో సమాజంలో పూర్తిగా మార్పు రాలేదని ‘‘పాపా డోంట్ ప్రీచ్’’ ఫౌండర్ శుభికా శర్మ అన్నారు.

ట్రాన్స్ మోడల్స్‌కు సంబంధించిన ప్రకటనలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రతిసారీ కంపెనీలు వేల మంది ఫాలోవర్లను కోల్పోతున్నాయని ఆమె తెలిపారు. ఇది వ్యాపారం మీద ప్రభావం చూపిస్తోందని, అందువల్ల ఆర్థికంగా సమస్యల్లో ఉన్న ఫ్యాషన్ ఇండస్ట్రీ ప్రతిసారీ ట్రాన్స్‌జెండర్లకు అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాదని ఆమె అన్నారు.

ఇవి కూడా చూడండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)