ఆంధ్రప్రదేశ్: అమరావతిలో పేదలకు ఇళ్లపై అభ్యంతరం ఏమిటి, అధికార పార్టీ దూకుడు ఎందుకు?

జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో పేదలకు పట్టాల పంపిణీ చేసేందుకు అంతా సిద్దమయ్యింది. దాదాపుగా 50 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ సెంటు స్థలం చొప్పున ఇంటి స్థలం అందించబోతున్నారు.

ఇంటి స్థలం కేటాయించడంతో పాటుగా ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.

ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన నిధుల మంజూరు పత్రాలు కూడా పట్టాలతో పాటే పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

అయితే ప్రభుత్వ తీరుని అమరావతి పరిరక్షణ సమితి తీవ్రంగా తప్పుబడుతోంది. కోర్టుల ద్వారా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించింది. అయితే, ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానాల్లో నిర్ణయాలు వెలువడడంతో విపక్ష నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మురికివాడలు నిర్మిస్తారా? అంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రశ్నిస్తోంది. అమరావతిని నాశనం చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి ఎత్తులు వేస్తోందని విమర్శిస్తోంది.

రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు రాజధానిలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ జనసేన ఆరోపిస్తోంది. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం మీద జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ కూడా విమర్శించింది.

పేదలకు నిర్మించిన టిడ్కో ఇళ్లను నాలుగేళ్లుగా పంపిణీ చేయకుండా ఇప్పుడు పట్టాల పంపిణీ పేరుతో హంగామా చేస్తున్నారంటూ సీపీఎం విమర్శిస్తోంది.

టిడ్కో ఇళ్ల వద్ద ఆందోళన కూడా చేపట్టింది. ఈ విమర్శలను తోసిపుచ్చుతూ పేదలకు సొంత ఇంటి కల నెరవేరుస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని పాలక వైఎస్సార్సీపీ మండిపడుతోంది.

దాంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ చుట్టూ సాగుతున్నాయి. ఇంతకీ వివాదానికి కారణమేంటి?

అమరావతి

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN

అమరావతిలో అన్నీ వివాదాలే...

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీకి రెండేళ్ల క్రితమే జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసినట్టు ప్రకటించింది. దశల వారీగా వారికి ఇళ్ల నిర్మాణం చేస్తున్నట్టు తెలిపింది.

ఇప్పటికే పలు చోట్ల జగనన్న కాలనీల పేరుతో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కానీ అత్యధికంగా పట్టాలు అందుకున్న పేదల ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలుకాలేదు. అధికారిక లెక్కల ప్రకారమే 2023 నాటికి 15లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా, ప్రస్తుతానికి అందులో సగం మాత్రమే పునాది దశ దాటినట్టు ఏపీ హౌసింగ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాల పంపిణీ మీద పెద్దగా అభ్యంతరాలు లేవు. కొన్ని చోట్ల అనువుగా లేని భూములు పంపిణీ చేశారంటూ ఆందోళన వ్యక్తమయ్యింది. భూసేకరణలో పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

రాజమహేంద్రవరంలోని ఆవ భూముల కొనుగోలుపై కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అమరావతి భూములను పేదలకు పంచడం మీద మాత్రం అభ్యంతరాలు మొదటి నుంచి ఉన్నాయి.

రెండేళ్ల క్రితమే అమరావతిలో రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడం మీద వివాదం రాజుకుంది. కోర్టు నుంచి కూడా అభ్యంతరాలు రావడంతో చివరకు ప్రభుత్వం వెనకడుగు వేసింది.

అమరావతి

చట్టాన్ని సవరించి...

కోర్టులో తమ వాదన వీగిపోవడంతో ప్రభుత్వం తొలుత వెనక్కి తగ్గినా ఆ తర్వాత రూటు మార్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసింది.

గతంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నివాసాలకు అనుగుణంగా చట్ట సవరణ చేసింది. సీఆర్డీయే చట్టం ప్రకారం మొత్తం భూమిలో నిర్దేశిత ప్రాంతాన్ని నివాస స్థలాలకు కేటాయించవచ్చనే విషయాన్ని ఆధారంగా చేసుకుని సవరించిన మార్పులతో ఇళ్ల స్థలాల పంపిణీకి ఆటంకాలు తొలగించుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన రెండేళ్లకు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అది కూడా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా కీలకమైన సచివాలయం వంటి భవనాలకు సమీపంలోనే కొత్తగా పేదల కాలనీల నిర్మాణానికి పూనుకుంది.

దీని మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ కోర్టుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. తుది తీర్పునకు లోబడి, పరిధి మేరకు పట్టాల పంపిణీకి అడ్డంకులు లేకుండా పోయాయి.

న్యాయస్థానాల నుంచి అడ్డంకులు కూడా తొలగిపోవడంతో ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. మొత్తం 47,017 ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదించింది.

షీర్ వాల్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. 51,392 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయబోతున్నట్టు ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా లే-అవుట్లు సిద్ధం చేసింది. కృష్ణాయపాలెం, నవులూరు, మందడం సహా వివిధ గ్రామాల్లో వాటిని రెడీ చేశారు. ఆయా లేఅవుట్ల అభివృద్ధికి రూ.50 కోట్లను సీఆర్డీయే తరుపున కేటాయించారు. తుప్పలు తొలగించి, లెవెలింగ్ పనులన్నీ దాదాపు పూర్తవుతున్నాయి.

అమరావతి

ఫొటో సోర్స్, RAVISANKAR LINGUTLA

ఒక్క పని కూడా జరగలేదు...

అమరావతి ప్రణాళికలో భాగంగా భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. నివాస, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా వాటిని కేటాయించాల్సి ఉంది.

కానీ గడిచిన నాలుగేళ్లుగా అలాంటి ప్రయత్నాలు జరగలేదు. అమరావతి అభివృద్ధి ప్రణాళికని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. మూడు రాజధానుల పేరుతో జరిగిన వ్యవహారం కారణంగా అమరావతిలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. చివరకు కరకట్టరోడ్డు అభివృద్ధి చేస్తున్నట్టు శాసనసభలో సీఎం చేసిన ప్రకటన కూడా ఆచరణ రూపం దాల్చలేదు. సీఎం ప్రయాణించే రోడ్డు కూడా అంతంతమాత్రంగానే మిగిలిపోయింది.

90 శాతం పూర్తయిన ఎమ్మెల్యేల క్వార్టర్స్, దాదాపు పూర్తికావచ్చని సివిల్స్ అధికారుల నివాసాలు కూడా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగలేదు. ప్రతీ నెలా ఎమ్మెల్యేలకు ఇంటి అద్దె నిమిత్తం రూ. 50వేల చొప్పున గడిచిన 9 ఏళ్లుగా అందిస్తూనే ఉన్నారు.

ఆ నిధులను వినియోగించి అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే ఎమ్మెల్యేల ఇంటి అద్దె భత్యం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే వసతి కల్పించేందుకు మార్గం ఏర్పడేది. అయినా దానిని కూడా విస్మరించారు.

అలాంటి సమయంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద అనుమానాలు పెరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. ముఖ్యంగా విజయవాడ నగరానికి చెందిన వివిధ డివిజన్ల నుంచి పేదలకు కృష్ణా నదికి ఆవల ఉన్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఏమేరకు ఉపయోగమనే ప్రశ్నలు వస్తున్నాయి.

గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను కూడా రాజధాని ప్రాంతానికి తరలించే విషయంలో హడావుడి సందేహాలను రెట్టింపు చేస్తోంది.

అమరావతి

ఫొటో సోర్స్, AP CRDA

పూర్తయిన ఇళ్లు వదిలేసి...

రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాల కోసం చంద్రబాబు హయంలోనే టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. దాదాపుగా 5వేల మందికి ఇళ్ల నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేసి అప్పగించడంలో గత ప్రభుత్వం విఫలమయ్యింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ముహూర్తాలు పెట్టినా నేటికీ వాటిని పేదలకు అందించలేదు.

"పూర్తికావచ్చిన ఇళ్లని పేదలకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారు. ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంటున్నారు. విజయవాడలో నివాసం ఉండే పేదలు 15 కిలోమీటర్ల దూరంలో స్థలం ఇస్తే ఇళ్లు కట్టుకుంటారా. ఇల్లు కట్టుకున్నా వారు రోజూ పనుల కోసం మళ్లీ విజయవాడ వెళ్లి రావాలంటే ఎంత భారం అవుతుంది. విజయవాడ నగర శివార్లలో ఇళ్లు నిర్మించినప్పుడే కొందరు ఆసక్తి చూపలేదు. అలాంటిది ఎన్టీఆర్ జిల్లా వాసులకు గుంటూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణం అంటుంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ లక్ష్యాలకు, పైకి చెబుతున్న మాటలకు పొంతన కనిపించడం లేదు" అని పట్టణ పేదల సంక్షేమ సంఘం ప్రతినిధి సీహెచ్ బాబూరావు అన్నారు.

అమరావతి విషయంలో అశ్రద్ధ చూపుతూ, హఠాత్తుగా రాజధానిలో పేదలు ఉండొద్దా అనే వాదన చేయడం విడ్డూరంగా ఉందని ఆయన బీబీసీతో అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టిడ్కో ఇళ్ల పంపిణీకి నాలుగేళ్ల సమయం తీసుకోవడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, ‘ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని’ - ఏపీ మంత్రి మేకపాటి

మురికివాడల నిర్మాణమా

అమరావతిలో ల్యాండ్ ఫూలింగ్‌లో భాగంగా రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు వివిధ ఒప్పందాలు జరిగాయి. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూములను అందుకు విరుద్ధంగా వాడడం మీదనే రైతుల అభ్యంతరాలకు కారణం అంటూ అమరావతి జేఏసీ నేత ఎన్. రామారావు అన్నారు.

"పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ డెవలపర్‌గా ఒప్పందం చేసుకుని ఆ భూములను డెవలప్ చేయకుండానే, తన వాటాగా వచ్చిన దానిని ఇష్టారాజ్యంగా వినియోగించుకుంటామని అంటోంది. మరి భూములిచ్చిన వారి పరిస్థితి ఏంటి? గ్రామసభల్లో ఏకగ్రీవంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాం. అయినా దానిని పరిగణలోకి తీసుకోలేదు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సాగుతున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన వారికి అన్యాయం చేసి వేరెవరికో న్యాయం చేస్తున్నామని అనడం సమంజమేనా’’ అని ఆయన ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతంలో వేల మందిని ఒకేచోట చేర్చి, కాలనీల నిర్మాణం చేపట్టడం అంటే మురికివాడల అభివృద్ధికి పూనుకున్నట్టుగా ఉందని రామారావు బీబీసీతో అన్నారు. ప్రభుత్వం తొలుత రాజధాని అభివృద్ధి చేస్తే అవసరమైన రీతిలో పేదలు, ఇతరులు తరలివచ్చే అవకాశం ఉంటుందని, కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోందని అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, అమరావతి: మూడు రాజధానుల ప్రకటన, రైతుల ఆందోళనకు ఏడాది

రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయా..

అమరావతిలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం కోర్టు తుదితీర్పునకు లోబడి ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే పేదలకు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత దానిని తిరిగి తీసుకోవడం సాధ్యమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అదే సమయంలో ప్రభుత్వం ఆడంబరంగా ఇతర ప్రాంతాల వారిని ఇళ్ల స్థలాల పేరుతో అమరావతి ప్రాంత వాసులుగా మార్చడం వెనుక రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

"ప్రభుత్వం దాదాపు 50వేల మందికి పట్టాలిస్తే కుటుంబానికి 3 ఓట్ల లెక్క చూసినా 1.5 లక్షల ఓట్లు కొత్తగా రాజధాని పరిధిలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో చేరుతాయి. అందులో మంగళగిరి, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ సమీకరణాలను మార్చుకునే యత్నమే. అందుకే ఇంత హడావిడి చేస్తున్నారు. పేదలపై ప్రేమ కన్నా రాజధాని మీద కక్ష ఎక్కువగా కనిపిస్తోంది"అని తాడేపల్లికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎం వెంకటేశ్వ రావు అభిప్రాయపడ్డారు.

29 గ్రామాల పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం మీద ఎవరూ అభ్యంతరం పెట్టలేరని, కానీ ఇతర ప్రాంతాల నుంచి పేదలను తరలించే యత్నమే ప్రభుత్వ తీరు మీద సందేహాలకు మూలమని ఆయన బీబీసీతో అన్నారు.

ప్రభుత్వం మాత్రం ఈ వాదనలన్నీ తోసిపుచ్చుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో పలువురు ప్రతినిధుల బృందం ఇళ్ల స్థలాల పంపిణీకి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

పేదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని విపక్షాలు చేస్తున్న యత్నాలను ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారని, సెంటు స్థలం శవం పూడ్చడానికే అంటూ చేస్తున్న వ్యాఖ్యలకు జనమే సమాధానం చెబుతారంటూ వ్యాఖ్యానించారు.

ఇవి కూాడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)