ఆంధ్రప్రదేశ్: బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ ఉపయోగపడుతోందా?

బైజూస్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

డిజిటల్ విద్యలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచితంగా ట్యాబులు అందించింది.

ఏటా 8వ తరగతి పిల్లలకు వాటిని అందిస్తామని, తదుపరి మూడేళ్ల పాటు ట్యాబ్‌లో ఉన్న కంటెంట్ ఆధారంగా బోధన ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 2025 నాటికి 8, 9, 10 తరగతి పిల్లలందరి చేతుల్లో ట్యాబ్‌లు ఉంటాయి కాబట్టి పాఠశాల విద్య స్వరూపమే మారిపోతుందని చెప్పింది.

బైజూస్ ఉచితంగా అందించిన కంటెంట్ విలువ రూ. 778 కోట్లు ఉంటుందని జగన్ చెప్పారు. ఒక్కో ట్యాబ్‌ను రూ. 13,262 చొప్పున వెచ్చించి కొన్నట్టు తెలిపారు.

ఇంతకూ బైజూస్ కంటెంట్ విద్యార్థులకు ఏ మేరకు ఉపయోగపడుతోంది? ట్యాబ్‌ల పంపిణీ తర్వాత ప్రతీ స్కూల్లో టీవీలు ఏర్పాటు చేసి, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రయత్నాలు ఆశించిన రీతిలో ఫలితాలను ఇస్తున్నాయా, లేదా?

బైజూస్

ఫొటో సోర్స్, UGC

అమలు ఎలా ఉంది?

ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం- ప్రభుత్వం అందించే ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తారు. బైజూస్ కంటెంట్‌ను క్లాసులో బోధించాల్సి ఉంటుంది.

ట్యాబ్‌ల పంపిణీని 2022 డిసెంబర్ 21న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. 9,703 స్కూళ్లలో 4,59,564 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు అవి చేరాయి. సంబంధిత తరగతుల ఉపాధ్యాయులు 59,176 మందికి కూడా ఈ ట్యాబ్‌ల పంపిణీ జరిగింది.

గడిచిన నాలుగు నెలలుగా ఈ ట్యాబ్‌లు చేతికందినప్పటికీ బోధన అందుకు అనుగుణంగా సాగడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు.

బైజూస్

ఫొటో సోర్స్, UGC

"బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేసిన ట్యాబ్‌లు మా చేతికి అందాయి. వాటిలో 300 వీడియోలున్నాయి. 57 చాప్టర్లుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులున్నాయి. క్వశ్చన్ బ్యాంక్ , ఆన్సర్లు కూడా ఉన్నాయి. విద్యార్థులకు వాటి వినియోగం మీద అవగాహన లేకపోవడంతో ఆశించిన మేరకు ప్రయోజనం దక్కడం లేదు. ఇతర అవసరాలకు వాడకుండా వాటికి లాకులు వేసినట్టు చెప్పారు. కానీ కొందరు దానిని ప్రైవేటుగా తొలగించి ట్యాబ్‌లలో సొంత వీడియోలు, ఇతర సోషల్ యాప్స్ అప్ లోడ్ చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. కొన్ని ట్యాబ్‌లు రెండు నెలలకే పనిచేయడం మానేశాయి. దాంతో ఈ ట్యాబ్‌ల వల్ల ఉపయోగం ఆశించినంతగా లేదని మా అనుభవం" అంటూ ఏలూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఆర్.రఘు అన్నారు.

ప్రభుత్వం చాలా మంచి లక్ష్యాలతో ప్రారంభించినప్పటికీ అందుకు అనుగుణంగా సన్నాహాలు లేకపోవడం, విద్యార్థులు సిద్ధంకాకపోవడం వల్ల ట్యాబ్‌ల వల్ల అదనపు ప్రయోజనం ప్రస్తుతం లేదని, భవిష్యత్తులో వాటి ఉపయోగం ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

బైజూస్

ఫొటో సోర్స్, BYJU'S

ఏది చదవాలో తెలియడం లేదా?

ఎనిమిదో తరగతిలో ఉన్న పిరాట్ల జగదీశ్ నాలుగు నెలలుగా ట్యాబ్ వాడుతున్నాడు.

‘‘మాకు పుస్తకాల్లో ఉన్న సిలబస్ ఆధారంగా పరీక్షలు పెడుతున్నారు. వాటిని ఫాలో అయితే మార్కులు వస్తాయి. కానీ బైజూస్ కంటెంట్ కొంత భిన్నంగా ఉంది. స్కూల్లో టీచర్ చెబుతున్న దానికి భిన్నమైన కాన్సెప్ట్‌లు ఉంటున్నాయి. రెండింటిలో దేన్ని మేము చదవాలో తెలియడం లేదు. కొన్ని మ్యాథ్స్ వంటివి చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి ట్యాబ్‌లో ఉన్న కంటెంట్ ఉపయోగపడుతోంది. కానీ కొన్ని మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నాం" అని ఏలూరు మునిసిపల్ స్కూల్‌లో చదివే జగదీశ్ బీబీసీతో చెప్పాడు.

అంతకుముందు తనకు ట్యాబ్ వాడిన అనుభవం లేదని, ఇంట్లో తల్లిదండ్రులకు ఒకటే సెల్ ఫోన్ ఉందని, అప్పుడప్పుడూ అందులో యూట్యూబ్ వీడియోలు చూసేవాడినని చెప్పాడు.

ఇప్పుడు ట్యాబ్ ద్వారా ఖాళీగా ఉన్నప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ వంటివి చూసుకుంటున్నానని జగదీశ్ తెలిపాడు. తనకు కొంత ఉపయోగపడినప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు దానిని ఎలా వాడాలో తెలియక సతమతమవుతున్నారని కూడా అతడు చెప్పాడు.

బైజూస్

ఫొటో సోర్స్, HTTPS://BLOG.BYJUS.COM/

పర్యవేక్షణ అవసరం: మాజీ విద్యాధికారి

క్లాసు రూముల డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు కొంత మేలు చేసే అవకాశం ఉందని, కానీ దానికి తగిన పర్యవేక్షణ అవసరమని జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసి రిటైర్ అయిన పి రామ్మోహన్ బీబీసీతో చెప్పారు.

"మా కాలంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లల చేతుల్లో ట్యాబ్‌ల గురించి ఊహించలేదు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా లేనిది, ఇప్పుడు సాధారణ పల్లెల్లో సైతం విద్యార్థులకు ట్యాబ్ అందించారు. కానీ పర్యవేక్షణకు అవసరమైన సన్నద్ధత లేదు. ఉపాధ్యాయులకు కూడా వాటిని ఎలా వినియోగించాలన్న స్పష్టత లేదు. పుస్తకాల్లో ఉన్న సిలబస్ పూర్తి చేయడమే పెద్ద పని. అదనంగా ట్యాబ్‌లో ఉన్న విషయాలను బోధించాలంటే ఉపాధ్యాయులకు సమయం ఎక్కడిదీ, అసలే ఉపాధ్యాయుల కొరత కారణంగా రెండు, మూడు తరగతులను కలిపి బోధించే పరిస్థితి ఉంది. దాంతో ట్యాబ్‌లు చేతికందినా, ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువే " అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం విద్యార్థుల మీద చూపుతున్న శ్రద్ధ , అదనపు సిబ్బంది నియామకాల మీద కూడా పెడితే ఉపయోగం ఉంటుందని ఆయన చెప్పారు.

బైజూస్

విమర్శలు ఏమిటి?

చంద్రబాబు నాయుడి హయాంలోనే డిజిటల్ విద్యాబోధన కోసం అడుగులు వేశారని, జగన్ పాలనలో ఆడంబరాలకు పోయి అసలుకే ఎసరు తెచ్చే విధానం అమలు చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది.

"బైజూస్‌తో ఒప్పందం విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదు. ప్రస్తుతం అనేక ట్యాబులు పనిచేయడం లేదు. ఒక్కోటి మూడేళ్ల పాటు వినియోగించాల్సి ఉండగా, మొదటి మూడు నెలలకే మూలన పడుతున్నాయి. ఇప్పుడు బైజూస్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌ను అప్‌లోడ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఇంత ఖర్చు చేయడం వల్ల ఏం ప్రయోజనం నెరవేరింది" అని టీడీపీకి చెందిన మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: శుభకార్యానికి వచ్చిన ముఖ్యమంత్రి... చెట్లు కొట్టేసిన అధికారులు

మెరుగైన ఫలితాలపై దృష్టి: ప్రభుత్వం

బైజూస్ కంటెంట్ స్థానంలో ఎస్సీఈఆర్టీ సిలబస్ అప్ లోడ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారనే ప్రచారాన్ని ప్రభుత్వం తోసిపుచ్చుతోంది.

బైజూస్ కంటెంట్ కొనసాగుతుందని విద్యాశాఖ కమిషనర్ కే సురేష్ కుమార్ అంటున్నారు.

"కంటెంట్ మార్చేసే ఆలోచన చేస్తున్నారన్నది పూర్తిగా ఊహాజనితం. అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవు. బైజూస్ కంటెంట్ విద్యార్థులకు ఉపయోగపడుతోంది. మరింత మెరుగైన ఫలితాల సాధన మీద దృష్టి పెడుతున్నాం. అదనంగా అవసరం మేరకు మరిన్ని అంశాలు కలుపుతున్నాం " అని ఆయన బీబీసీతో చెప్పారు.

మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు మాత్రమే బైజూస్ కంటెంట్ అందిస్తోందని, మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు కూడా ఎన్‌సీఈఆర్‌టీ ద్వారా విద్యార్థులకు చేర్చే ప్రయత్నం చేస్తున్నట్టు సురేష్ కుమార్ చెప్పారు. ముఖ్యంగా లాంగ్వేజెస్‌తోపాటు బైజూస్ కవర్ చేయని అంశాలు జోడించి అందిస్తామన్నారు.

ట్యాబ్‌లు చెడిపోతే వెంటనే బాగుచేయించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఏప్రిల్ 10న విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఆదేశించారు. వాటి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే చక్కదిద్దేలా చర్యలుండాలన్నారు. ఇప్పటికే అలాంటి ప్రయత్నం జరుగుతోందని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

వీడియో క్యాప్షన్, అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)