వాకింగ్: రోజూ నడవడం వల్ల కలిగే 10 లాభాలు

నడక
    • రచయిత, కెర్రీ టొరెన్స్
    • హోదా, డైటీషియన్

నడక అనేది ఒక సహజ చర్య. ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఈ వ్యాయామం చేయవచ్చు.

కాళ్లలో ఏదైనా సమస్య ఉంటే, లేదా కాళ్లు బలహీనంగా ఉంటే దాన్ని వేరే కేసుగా పరిగణించాలి.

నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి. నడక వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కవ. నష్టాలు చాలా తక్కువ.

సాధారణం కంటే ఎక్కువ వేగంగా, ఎక్కువ దూరం నడవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

వాకింగ్ చేయడం వల్ల కలిగే 10 ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

గుండె జబ్బు

ఫొటో సోర్స్, Getty Images

1. గుండెకు మంచిది

నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

వేగంగా నడవడం వల్ల గుండెకు, శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది.

ఆంగ్జయిటీ లేదా డిప్రెషన్‌తో బాధపడేవారికి నడక మరింత మంచిది.

ఎముక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

2. ఎముకలు బలపడతాయి

నడవడం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా మారతాయి.

ఎముకలు పెళుసుగా మారడాన్ని నడకతో నివారించవచ్చు.

నడక

ఫొటో సోర్స్, Getty Images

3. కండరాలు పటిష్టం అవుతాయి

రోజూ నడిస్తే శరీరంలోని కండరాలు బలంగా మారతాయి. నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. శరీరానికి సరైన ఆకృతిని అందిస్తుంది. కండరాలను ఆరోగ్యంగా మార్చుతుంది.

4. కేలరీలు తగ్గుతాయి

బరువు తగ్గించుకోవడానికి నడక ఒక మంచి మార్గం. నడక వల్ల శక్తి ఖర్చు అవుతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు.

ఉదయం పూట వాకింగ్ చేస్తే, ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

వాకింగ్

ఫొటో సోర్స్, Reuters

5. ఇన్సులిన్ నియంత్రణ

నడక వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలింది. నడక వల్ల కొవ్వు పేరుకోదు. గుండె జబ్బులు, డయాబెటిస్, కాలేయ వ్యాధులకు కొవ్వు పేరుకుపోవడమే కారణం.

ఇన్సులిన్‌కు శరీరం స్పందించే తీరును కూడా నడక మెరుగుపరుస్తుంది.

6. ఆయుష్షును పెంచుతుంది

నడక, ఆయుష్షును పెంచుతుంది. నడక వల్ల 16-20 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే, మరణాన్ని అంత దూరంగా తరిమేయవచ్చు.

బీబీసీ

7. మానసిక ఒత్తిడి మాయం

నడక కేవలం శరీర దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

డిప్రెషన్ విషయంలో నడక అనేది ఒక యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుంది.

రోజూ వాకింగ్ చేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక స్థితి కూడా బాగుంటుంది.

8. విటమిన్ ‘డి’ని మెరుగుపరుస్తుంది

బహిరంగ ప్రదేశాల్లో నడవడం వల్ల శరీరంలో విటమిన్ ‘డి’ స్థాయిలు పెరుగుతాయి. శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

నడక

ఫొటో సోర్స్, Getty Images

9. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

ఆనకట్ట పక్కన నడవడం వల్ల ఐజీఏ అనే యాంటీబాడీలు మెరుగవుతాయి.

ఈ యాంటీబాడీల వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. లాలాజలం ఉత్పత్తిలో ఇవి ఉపయోగపడతాయి.

ముక్కు, అన్నవాహిక ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

10. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

చురుకైన నడక వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే, ఇది పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతుంది. నడక వల్ల జీర్ణశక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి.

నడక

ఫొటో సోర్స్, Getty Images

నడకకు ప్రత్యేక పరికరాలు అవసరమా?

నడిచేందుకు సౌకర్యవంతమైన బూట్లు ఉంటే సరిపోతుంది. అలాగే శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులు కూడా ధరించాలి.

ఒకవేళ ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకుంటే సరైన బూట్లు, దుస్తులు తప్పనిసరి. మంచి బూట్లు ధరించడం వల్ల నడుముపై ఒత్తిడి తగ్గుతుంది. మోకాళ్లు, చీలమండపై కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు.

ఎలా నడవాలి?

తొలుత నెమ్మదిగా నడకను మొదలుపెట్టి క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి. గంటకు 6.4 కి.మీ వేగంతో రోజూ 30 నిమిషాల పాటు నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏదైనా వాకింగ్ గ్రూపులో చేరితే రోజూ నడవాలనే ఉత్సాహం కూడా వస్తుంది.

ఏ సమయంలో నడవాలి?

ఒక్కసారి మీరు నడవాలని నిర్ణయించుకున్న తర్వాత అది మీ జీవితంలో భాగంగా మారుతుంది.

ఇటీవలి కొన్ని పరిశోధనల ప్రకారం, మహిళలైతే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య నడిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అన్నింటికంటే రోజంతా చురుగ్గా ఉండటానికి నడక మంచి మార్గం. నడక ఉత్సాహంగా ఉంచుతుంది.

వీడియో క్యాప్షన్, వాకింగ్: నడక వల్ల కలిగే 10 లాభాలు ఇవే...

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)