చక్కెర ఎంత తినాలి? షుగర్ ఫ్రీ పిల్స్ మంచివేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంటికి వచ్చిన అతిథులను టీ తాగుతారా, లేక కాఫీ తీసుకుంటారా అని అడగడం భారత్‌లో చాలా సాధారణం. అలాగే వెంటనే, చక్కెర ఎక్కువ వేయమంటారా, తక్కువ ఉండాలా అని కూడా అడుగుతారు.
ఈ మధ్య కాలంలో టీ, కాఫీలలో చక్కెరకు బదులుగా షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు వాడుతున్నామని కొందరు చెప్పడం మీరు వినే ఉంటారు.
చక్కెరకు బదులుగా షుగర్ ఫ్రీ లేదా కృత్తిమ తీపిపదార్థాలను (ఆర్టిఫిషియల్ స్పీటెనర్) వాడితే బరువు తగ్గొచ్చు, ఫిట్‌గా మారొచ్చు అని మీరు అనుకొంటున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి.
షుగర్ ఫ్రీ లేదా ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను వాడటం వల్ల బరువు తగ్గడం, ఫిట్‌గా మారడం జరుగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పింది?
నాన్ షుగర్ స్వీటెనర్లను (ఎన్‌ఎస్‌ఎస్) ఉపయోగించవద్దని డబ్ల్యూహెచ్‌వో కొత్త మార్గదర్శకాల్లో సూచించింది.
నాన్ షుగర్ స్వీటెనర్లు అంటే అందులో చక్కెర ఉండదు. కానీ, వాటి వల్ల పదార్థాలకు తియ్యదనం వస్తుంది.
కొన్ని రివ్యూల ప్రాతిపదికగా డబ్ల్యూహెచ్‌వో తాజా సూచన చేసింది.
బరువు తగ్గించడానికి లేదా కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి స్వీటెనర్లు ఉపయోగపడవని కొన్ని రివ్యూల్లో తేలింది. చక్కెరకు బదులుగా ఎన్‌ఎస్‌ఎస్‌లను వాడటం వల్ల పిల్లల్లో, పెద్దల్లో దీర్ఘకాలంలో బరువు తగ్గుదలకు ఉపయోగమేమీ ఉండదని కూడా వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
డబ్ల్యూహెచ్‌వో పోషకాహార, ఆహార భద్రత డైరెక్టర్ ఫ్రాన్సెస్కో బ్రాంకా ఈ అంశంపై మాట్లాడారు.
‘‘చక్కెర వాడకాన్ని తగ్గించడం కోసం ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలి. సహజ చక్కెరలను కలిగి ఉండే పండ్లు, పండ్ల రసాల వంటి వాటిని తీసుకోవాలి’’అని ఆయన చెప్పారు.
ఎన్‌ఎస్‌ఎస్‌లలో ఎలాంటి పోషకాలూ ఉండవని బ్రాంకో చెప్పారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఆహారంలో తీపిని తగ్గించుకునే పనిని త్వరగా మొదలుపెట్టాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
వేటిని కృత్రిమ తీపి పదార్థాలు అంటారు?
టూత్‌పేస్ట్, స్కిన్ క్రీమ్, మందుల్లో కూడా ఎన్‌ఎస్‌ఎస్‌లను వాడతారు. అయితే, వీటిని కూడా మనం ఉపయోగించకూడదా?
సెల్ఫ్ కేర్, పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తుల విషయంలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్లపై తమ సూచనలు వర్తించవని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
స్టీవియా, సుకర్లోజ్, అస్పార్టమ్, నీయాటేమ్, వంటి ఎన్‌ఎస్‌ఎస్‌లను సాధారణంగా ఉపయోగిస్తారు.
దిల్లీ సర్ గంగారామ్ ఆస్పత్రిలోని ఎండోక్రినాలజీ, మెటాబలిజం విభాగానికి చెందిన డాక్టర్ సురేంద్ర కుమార్ బీబీసీతో మాట్లాడారు.
ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను ఒకటి లేదా రెండు వారాలు ఉపయోగిస్తే పర్లేదని, అంతకుమించి వాడితే దుష్ప్రభావాలు కలుగుతాయని ఆయన చెప్పారు. తియ్యదనం కోసం స్టీవియా మొక్క ఆకులను నేరుగా వాడితే మంచిదేనన్నారు. స్టీవియా మొక్క ఆకులను ప్రాసెసింగ్ చేసి పిల్స్ రూపంలో తీసుకుంటే హానికరమని వివరించారు.
డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తులు స్టీవియా పిల్స్‌ను తీపి కోసం వాడతారు.
మధుమేహం రోగులు తియ్యదనం కోసం చక్కెరకు బదులుగా కృత్రిమ తీపిని కలిగించే పిల్స్‌ను తీసుకోవచ్చా అని అడగ్గా, ‘‘వాళ్లు ఏ రూపంలో కూడా ఎన్‌ఎస్‌ఎస్ పిల్స్‌ను తీసుకోకూడదు. రుచి కోసం వాటిని వాడాలనుకుంటే చాలా నియంత్రిత పరిమాణంలో వాడాలి’’ అని డాక్టర్ సురేంద్ర కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, JAAP ARRIENS/NURPHOTO VIA GETTY IMAGES)
ఎన్‌ఎస్‌ఎస్‌లు శరీరంలో ఎలా పనిచేస్తాయి?
చక్కెర కంటే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు 700 రెట్లు ఎక్కువ శక్తిమంతమైనవని డాక్టర్ సురేంద్ర అన్నారు.
మెదడులోని కొంత భాగంపై ఇవి ప్రభావం చూపిస్తాయి. జీవక్రియను కూడా ప్రభావితం చేస్తాయి.
దీని వల్ల ఎక్కువగా తినడం మొదలుపెడతామని, తద్వారా బరువు కూడా పెరుగుతామని, బరువు పెరగడం వల్ల వివిధ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి వ్యాధులు వస్తాయి?
దీర్ఘకాలం పాటు ఎన్‌ఎస్‌ఎస్‌లను తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్‌తోపాటు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. అంతేకాకుండా దీనివల్ల చనిపోయే ప్రభావం ఉందని హెచ్చరించింది.
ఎన్‌ఎస్‌ఎస్‌ల వాడకం వల్ల బరువు పెరుగుతారని, దానితో బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయని, ఇవన్నీ కలిసి గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం పెరుగుతుందని బీబీసీతో డాక్టర్ నీరూ గెరా చెప్పారు.
డిప్రెషన్, తలనొప్పి, డయాబెటిస్, గుండెజబ్బు, బ్రెయిన్ ఎటాక్ వచ్చే ప్రమాదంతో పాటు ఎక్కువ కాలం ఆర్టిఫిషియల్ స్వీటెనర్ల వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుందని డాక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు.
జనం షుగర్ ఫ్రీ అని భావించి ఐస్‌క్రీమ్, ఇతర ఆహార పదార్థాలు తినడం మొదలుపెడతారని, ఈ రూపంలో వారు కేలరీలు తీసుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ జీరో కేలరీ పదార్థాలు కావనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.
వేసవిలో కోలా వంటి శీతల పానీయాలను తాగుతారు. వాటిలో ఫాస్ఫరస్ ఉంటుంది. అది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
చక్కెర ఎంత తినాలి?
స్వీట్లు తినడం వల్ల మనకు సంతోషం కలుగుతుంది. దానితో ఒత్తిడి తగ్గుతుంది. కానీ, ఈ ప్రయోజనం కలిగే స్థాయిలోనే మనం స్వీట్లను తింటున్నామా, ఎక్కువగా తింటున్నామా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్లు అంటున్నారు.
చక్కెరను మితంగా తీసుకోవాలని, దానికి ప్రత్యామ్నాయంగా బ్రౌన్ షుగర్, మైపల్ సిరప్, తేనె, బెల్లం వంటివి వాడాలని సూచిస్తున్నారు.
‘‘ప్రతీ ఆహారంలో చక్కెరను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. టీ తాగే ముందు, నోటి మూలలో కాస్త చక్కెరను ఉంచుకొని తర్వాత చక్కెర వేయని టీని తాగాలి’’ అని వారు అంటున్నారు.
ఏదైనా తినే ముందు మీరు ఇలా చేస్తే, చక్కెరను నియంత్రిత పరిమాణంలో తీసుకోవడం సాధ్యం అవుతుంది. అలాగే నోటికి రుచి కూడా లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అలాగే బెల్లం తినేటప్పుడు దాన్ని ఒకేసారి నమలకుండా, నోటిలో ఉంచుకొని చప్పరించాలని సూచిస్తున్నారు.
తీపి వస్తువులు ఆనందాన్ని ఇస్తాయని, కానీ మోతాదుకు మించి తీసుకుంటే అది శరీరానికి విషంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














