పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసలైతే జరిగేది ఇదే

ఫొటో సోర్స్, DISHANT_S
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీ పిల్లలకు చిన్న వయసులోనే చేతికి ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ఇవ్వాలని అనుకుంటున్నారా? డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, జ్ఞానం పెరగడానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారా? అయితే, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు.
అమెరికాకు చెందిన ‘‘సెపియన్ ల్యాబ్స్’’ ఈ విషయాన్ని చెబుతోంది.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మెదడుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనే అంశంపై 2016 నుంచి ఈ సంస్థ పరిశోధన చేస్తోంది.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో చాలా మంది పిల్లలు ఆన్‌లైన్‌లో చదువుకోవడం మొదలుపెట్టారు. దీంతో గరిష్ఠంగా ఎంతసేపు పిల్లలు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై గడపొచ్చనే అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.
దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, దుష్ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలపైనా చాలా మంది నిపుణులు మాట్లాడారు.

ఫొటో సోర్స్, DISHANT_S
భారత్ సహా 40 దేశాల్లో అధ్యయనం
సెపియన్ ల్యాబ్స్ తాజా నివేదిక ప్రకారం, పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లు ఇస్తే, యుక్త వయసుకు వచ్చేసరికి వారి మెదడుపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
జనవరి నుంచి ఏప్రిల్ మధ్య 40 దేశాలకు చెందిన 2,76,969 మంది యువత నుంచి అభిప్రాయాలను సేకరించిన అనంతరం తాజా రిపోర్టును సిద్ధంచేశారు. ఈ 40 దేశాల్లో భారత్ కూడా ఉంది.
ఆరేళ్ల వయసులోనే చేతికి స్మార్ట్‌ఫోన్ వచ్చిన బాలికలు యుక్త వయసుకు వచ్చేసరికి వారిలో 74 శాతం మందికి మానసిక సమస్యలు వచ్చాయని నివేదికలోరాశారు. ఈ అమ్మాయిలకు మానసిక ఆరోగ్య ఎంసీక్యూ పరీక్షల్లో చాలా తక్కువ స్కోర్ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ పదేళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్ చేతికి వచ్చిన అమ్మాయిల్లోనూ 61 శాతం మందికి తక్కువ లేదా బాగా తక్కువ స్కోర్ వచ్చింది. 15 ఏళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్ చేతికి వచ్చిన వారి పరిస్థితి కూడా ఇలానే కనిపిస్తోంది.
అయితే, 18 ఏళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్ తీసుకున్న అమ్మాయిల్లో తక్కువ స్కోర్ సాధించినవారు 42 శాతం మంది మాత్రమే ఉన్నారు.
అబ్బాయిల విషయానికి వస్తే, ఆరేళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించిన వారిలో 42 శాతం మందికి స్కోర్ తక్కువగా వచ్చింది.
అయితే, ఈ రిపోర్టును సిద్ధం చేసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించారో తెలియాల్సి ఉందని, అప్పుడే దీని గురించి లోతుగా అర్థం చేసుకోగలమని దిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రిలో పనిచేసిన మానసిక నిపుణుడు డాక్టర్ పంకజ్ కుమార్ వర్మ చెప్పారు.
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో యుక్త వయసు కాస్త త్వరగా మొదలవుతుందని, ఫలితంగా వారు శారీరకంగా, మానసికంగా చాలా మార్పులను ఎదుర్కొంటారని, అందుకే వారిలో ఎక్కువ మందికి స్కోర్ తక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లు చేతికి వచ్చిన వారిలో ఆత్మహత్య ఆలోచనలు, విపరీతమైన కోపం, హ్యాలూసినేషన్ (చిత్త భ్రాంతి) ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని ఆ నివేదికలో హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కొత్తవారు వస్తే గట్టిగా అరిచేది’
ఇలాంటి ఇబ్బందులు తమ కుటుంబంలో ఎదురయ్యాయని ఛవి (పేరు మార్చాం) చెప్పారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇంట్లో పనులతో ఛవీ తీరిక లేకుండా గడుపుతుంటారు. పిల్లలను తన పనికి అడ్డు రాకుండా ఉండేందుకు వారి చేతికి ఆమె స్మార్ట్‌ఫోన్లు ఇచ్చేవారు.
ముఖ్యంగా 22 నెలల ఆమె చిన్న కూతురు ఎక్కువగా యూట్యూబ్‌లో కార్టూన్లు చూసేది. తన పెద్ద కుమార్తె స్కూలు నుంచి ఇంటికి వచ్చేవరకు చిన్న కుమార్తె ఫోన్‌లోనే ఆడుకునేది.
అయితే, పిల్లలకు ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ చాలా సమస్యలు తీసుకువస్తుందని ఛవీ ఎప్పుడూ అనుకోలేదు. తన వయసు పిల్లల్లా ఆమె రెండో కుమార్తె మాట్లాడేదికాదు. దీంతో ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె యాంక్సైటీతో బాధపడుతున్నట్లు సైకాలజిస్టు డా. పూజ శివం చెప్పారు.
‘‘ఏడెనిమిది గంటలు ఆమె స్టార్ట్‌ఫోన్ పైనే గడిపేది. దీంతో ఆమె మానసిక ఆరోగ్యం ప్రభావితమైంది’’ అని పూజ తెలిపారు.
‘‘ప్రతి చిన్న విషయానికీ ఆమె భయపడటం మొదలైంది. ఇంటికి ఎవరైనా కొత్తవారు వస్తే తను గట్టిగా అరిచేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. చాలా మొండిగా ఉండేది. దీంతో వెంటనే పాపకు కౌన్సెలింగ్ మొదలుపెట్టాం’’ అని ఆమె చెప్పారు.

మెదడుకు ఏమవుతుంది?
నిత్యం మన మెదడుకు వేల కొద్దీ సంకేతాలు చేరుతుంటాయి. స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు వీడియోతోపాటు ఆడియో సంకేతాలు కూడా మెదడుకు చేరుతుంటాయి. అవి ఆ వ్యక్తిని ఆకర్షించేలా పనిచేస్తాయి. అంటే ఒక అయస్కాంతంలా స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది.
మరి అలాంటప్పుడు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు ఆకర్షితులైతే ఏం జరుగుతుంది? దీనికి రెజువెనేట్ మైండ్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ పంకజ్ కుమార్ వర్మ సమాధానమిచ్చారు.
‘‘కరోనావైరస్ వ్యాప్తి సమయంలో పిల్లలు అతిగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడంతో వారిలో చిన్న విషయానికే కోపం ప్రదర్శించడం, గట్టిగా అరవడం, ఆందోళన, కుంగుబాటు లాంటి లక్షణాలు కనిపించాయి’’ అని ఆయన చెప్పారు.
‘‘పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తాము మంచి అంశాలు చూస్తున్నామో లేదా చెడు అంశాలు చూస్తున్నామో వారికి తెలియదు. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. వీడియో చూస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తే, వారిలో డోపమైన్‌గా పిలిచే రసాయనం విడుదల అవుతుంది. ఫలితంగా వారిలో సంతోషం స్థాయులు పెరుగుతాయి’’ అని ఆయన వివరించారు.
‘‘ఇలానే పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలై పోతుంటారు. మరోవైపు చదువుకోవడం, ఆడుకోవడం, స్నేహితులతో కలవడం లాంటివి కూడా స్మార్ట్‌ఫోన్ వల్ల తగ్గిపోతుంటాయి. అంటే వారొక కృత్రిమ ప్రపంచంలో జీవిస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
‘‘స్మార్ట్‌ఫోన్ వల్ల వారి మెదడును భయం, గందరగోళం, యాంక్సైటీ లాంటివి చుట్టుముడతాయి. దీర్ఘకాలంలో వారి జీవితాన్నే ఇవి ప్రభావితం చేస్తాయి’’ అని ఆయన చెప్పారు.
ఇప్పుడు ఏం చేయాలి?
నిరుడు సోషల్ మీడియా కంపెనీలకు పిల్లల విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ - ‘‘మన దేశంలో వాట్సాప్‌కు 53 కోట్ల మంది వినియోగదారులున్నారు. యూట్యూబ్‌ను 44.8 కోట్ల మంది వాడుతున్నారు. ఫేస్‌బుక్‌ను 41 కోట్ల మంది, ట్విటర్‌ను 17.5 లక్షల మంది వాడుతున్నారు’’ అని చెప్పారు.
2025 నాటికి భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు పెరిగే అవకాశముందని అంచనాలున్నట్లు ఆయన వివరించారు.
టెక్నాలజీ అనేది రెండంచుల పదునైన కత్తి లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు విస్తృత సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంతోపాటు చాలా ప్రతికూల ప్రభావాలను కూడా ఇది చూపిస్తోంది. ఇలాంటి సమయంలో మనం సమతూకం పాటించడం చాలా ముఖ్యం.
నిపుణుల సూచనలివీ
- చిన్న పిల్లలను స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉంచండి.
- పిల్లలకు స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్లు ఎప్పుడు ఇవ్వాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
- స్మార్ట్‌ఫోన్ కోసం పిల్లలు పట్టుబడుతుంటే, వారితో మాట్లాడి, పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించండి.
- తోటి పిల్లలతో మాట్లాడటానికి స్మార్ట్‌ఫోన్ కావాలని అడిగితే ఇంట్లో ల్యాండ్‌లైన్ ఏర్పాటు చేయండి. లేదంటే కేవలం ఫోన్ మాట్లాడేందుకు లేదా మెసేజ్‌లు పంపుకొనేందుకు అవసరమైన ఫోన్‌నే వారికి ఇవ్వండి.
- ఒకవేళ చదువుకోవడానికి మొబైల్ తప్పనిసరి అయితే, స్క్రీన్ టైమ్‌ను నియంత్రించండి.
- స్కూలులో ఇచ్చే అసైన్‌మెంట్ల కోసం స్మార్ట్‌ఫోన్ చేతికి ఇచ్చేకంటే ఇంట్లో ఒక ప్రింటర్ కొనిపెట్టండి. పిల్లలపై స్మార్ట్‌ఫోన్లు చూపే ప్రభావాల కంటే దీని ఖర్చు తక్కువే ఉంటుంది.
పిల్లలకు ఎంత తక్కువగా స్మార్ట్‌ఫోన్ ఇస్తే, వారి మెదడుకు ఇది అంత మంచిదని తాజా నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు.. ఊళ్లోకి దళితులను రానివ్వరు
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















