డబ్బులు ఇస్తామన్నా పిల్లలను కనట్లేదు

జనాభా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మెరికో ఓయి
    • హోదా, బీబీసీ న్యూస్

ఆసియాలోని కొన్ని దేశాలను వేగంగా పడిపోతున్న జననాల రేటు ఆందోళనకు గురిచేస్తోంది. జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వాలు ఇక్కడ భారీగా ఖర్చు చేస్తున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా?

1990లలోనే ఎక్కువ మంది పిల్లలు కనేలా జనాభాను ప్రోత్సహించేందుకు జపాన్ కొత్త విధానాలను తీసుకొచ్చింది. ఇలాంటి విధానాలనే దక్షిణ కొరియా 2000లో తీసుకొచ్చింది.

గత 60 ఏళ్లలో తొలిసారిగా చైనా జనాభా కూడా తిరోగమన బాట పట్టింది. దీంతో జననాల రేటు పడిపోతున్న దేశాల సరసన చైనా కూడా చేరింది.

జనాభాను పెంచే విధానాలపై ఎంత మేర ఖర్చు చేస్తున్నారో కచ్చితంగా అంచనా వేయడం కాస్త కష్టమే. అయితే, దీనిపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ తాజాగా స్పందిస్తూ.. గత 16 ఏళ్లలో జనాభా రేటును పెంచేందుకు ప్రభుత్వం 200 బిలియన్ డాలర్లును (రూ. 1.64 లక్షల కోట్లు) ఖర్చుపెట్టినట్లు తెలిపారు.

అయినప్పటికీ దక్షిణ కొరియాలో జననాల రేటు పడిపోతూనే ఉంది. ఇక్కడ సగటున ఒక మహిళకు 0.78 మంది పిల్లలే జన్మిస్తున్నారు.

పొరుగునున్న జపాన్‌లో నిరుడు మొత్తం జననాలు 8 లక్షల కంటే తక్కువకు పడిపోయాయి. ఇక్కడ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీలో) రెండు శాతం కంటే ఎక్కువ అంటే 74.7 బిలియన్ డాలర్లు (రూ.61.54 వేల కోట్ల) పిల్లల జననాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌ను రెండింతలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రధాన మంత్రి ఫుమియో కిషిద చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు జననాల రేటు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఆసియాలో మాత్రం దీనికి భిన్నంగా జననాల రేటును పెంచేందుకు కృషిచేస్తున్న దేశాల సంఖ్య 1976తో పోలిస్తే ఇప్పుడు మూడింతలు పెరిగిందని ఐరాస తాజా నివేదిక వెల్లడించింది.

జనాభా

ఫొటో సోర్స్, Getty Images

జనాభాను ఎందుకు పెంచాలని చూస్తున్నారు?

ఈ దేశాల్లోని ప్రభుత్వాలు జనాభాను పెంచాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి?

సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే జనాభా ఎక్కువ ఉంటే పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా మరిన్ని ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయొచ్చు. సేవల పరిమాణం కూడా పెరుగుతుంది. మొత్తంగా దేశ ఆర్థిక వృద్ధికి ఇవన్నీ ఊతం ఇస్తాయి. జనాభా పెరిగితే ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయి. అదే సమయంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది.

చాలా ఆసియా దేశాల్లో సగటు వయసు పెరుగుతోంది. వీటిలో జపాన్ మొదటి వరుసలో ఉంది. ఇక్కడ 30 శాతం జనాభా వయసు 65 ఏళ్లకుపైనే ఉంది. మిగతా దేశాలు కూడా ఇదే బాటలో వెళ్తున్నాయి.

ఇక్కడ భారత్‌తో పోల్చిచూస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం అవుతాయి. భారత్‌లో నాలుగో వంతు జనాభా వయసు 10 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంది. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. మొత్తం జనాభాలో పనిచేసే వారి సంఖ్య తగ్గినప్పుడు, ఆ మిగతావారిని చూసుకోవడానికి కేటాయించాల్సిన వ్యయం, కార్మిక శక్తి కూడా పెరుగుతాయి.

‘‘నెగిటివ్ జనాభా వృద్ధి రేటు అనేది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ సగటు జనాభా వయసు కూడా పెరిగినప్పుడు, వృద్ధులను చూసుకోవడం, వారికి అవసరమైన ఆర్థిక సాయం అందించడం కష్టం అవుతుంది’’అని విక్టోరియా యూనివర్సిటీకి చెందిన షియుజియాన్ పెంగ్ అన్నారు.

జనాభా

ఫొటో సోర్స్, AFP

జననాల రేటును పెంచేందుకు ఆసియాలోని దేశాలు అనుసరిస్తున్న విధానాలు దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. పిల్లలను కనేవారికి బోనస్‌లు, పిల్లల చదువు కోసం ఉచిత లేదా సబ్సిడీ రుణాలు, పన్ను రాయితీలు, సెలవులు పెంచడం.. లాంటివి ఈ విధానాలను అనుసరిస్తున్నాయి.

అయితే, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్‌లలో ఈ విధానాలతో జననాల రేటుపై పెద్ద ప్రభావం పడుతున్నట్లు కనిపించడం లేదు. ఈ విధానాలు విఫలం అయ్యాయని తాజాగా జపాన్ ఆర్థిక శాఖ ప్రచురించిన ఒక అధ్యయనంలో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా చెప్పింది.

‘‘మహిళలు మరింత మంది పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ప్రవేశపెడుతున్న ఇలాంటి విధానాలు పెద్దగా ఫలితం చూపించడం లేదు’’అని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్‌కు చెందిన అలానా ఆర్మిటేజ్ చెప్పారు.

‘‘అసలు మహిళలు ఎందుకు పిల్లలను కనేందుకు ముందుకు రావడం లేదో మనం తెలుసుకోవాలి. ఒక్కోసారి కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితాల మధ్య సమతుల్యం పాటించేందుకు వారు చాలా కష్టపడాల్సి వస్తోంది’’అని అలానా చెప్పారు.

అయితే, స్కాండినేవియా దేశాల్లో జననాల రేటు పెంచేందుకు తీసుకొస్తున్న విధానాలు ఆసియాలో కంటే మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని పెంగ్ అన్నారు.

‘‘ఇక్కడ ప్రధాన కారణం ఏమిటంటే, ప్రభుత్వాలు అక్కడి ప్రజల కోసం మెరుగైన సంరక్షణ విధానాలు తీసుకొస్తున్నాయి. పైగా అక్కడ పిల్లలను పెంచడానికి కూడా అంత ఎక్కువ డబ్బులు ఖర్చు కావు. ఆసియా దేశాలతో పోల్చినప్పుడు అక్కడ జెండర్ ఈక్వాలిటీ కూడా మెరుగ్గా ఉంటుంది’’అని పెంగ్ వివరించారు.

వీడియో క్యాప్షన్, నచ్చినప్పుడు, నచ్చిన వ్యక్తి ద్వారా గర్భం దాల్చే అవకాశం మహిళలకు వస్తే ఏం జరుగుతుంది?

ఈ విధానాలపై పెరుగుతున్న వ్యయం కోసం ప్రభుత్వాలు ఎలా నిధులు సమకూరుస్తాయనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఉదాహరణకు జపాన్‌కు తీసుకోండి. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు జపాన్‌ రుణ భారం చాలా ఎక్కువ.

ప్రభుత్వం మరిన్ని బాండ్లను విక్రయించడం, అంటే అప్పును మరింత పెంచుకోవడం, సేల్స్ ట్యాక్స్‌ను పెంచడం, సామాజిక బీమా ప్రీమియాన్ని పెంచడం లాంటి అంశాలను ఇక్కడ పరిశీలిస్తున్నారు.

అయితే, మరిన్ని బాండ్లను జారీచేస్తే భవిష్యత్ తరాలపై మరింత రుణభారం పెరుగుతుంది. మిగతా వాటితో ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ఫలితంగా తక్కువ మంది పిల్లలను కనేందుకు వారు మొగ్గు చూపొచ్చు.

జననాల పెంచే ఈ విధానాలు పనిచేస్తాయో లేదో అనేది పక్కన పెడితే, వీటికి చాలా పెట్టుబడులు అవసరం అవుతాయని ఇన్‌సీడ్‌ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఆంటోనియో ఫటాస్ అన్నారు.

‘‘జననాల రేటు పెరగడం లేదు. మరి ప్రజలకు ఇచ్చే ప్రోత్సాహకాలను తగ్గిస్తే, అప్పుడు జననాల రేటు మరింత తగ్గిపోతుంది’’అని ఆయన అన్నారు.

మరోవైపు జనాభా నానాటికీ పడిపోవడంతో ఇతర విభాగాలపైనా ప్రభుత్వాలు పెట్టుబడులు పెంచుతున్నాయి.

‘‘ఉదాహరణకు చైనాను తీసుకోండి. కార్మిక శక్తి తగ్గిపోవడంతో వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించే టెక్నాలజీలు, ఆవిష్కరణలపై ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు’’అని పెంగ్ అన్నారు.

మరోవైపు జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో వలసల విధానాలను సడలించి విదేశాల నుంచి పనిచేసే యువ కార్మికులను ఆహ్వానించేందుకు కూడా శాసన సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

జననాల రేటు పెంచే విధానాలపై పెడుతున్న ఖర్చు ఫలితాలను ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ దేశాల్లోని ప్రభుత్వాలకు వేరే మార్గం కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)