శరత్ బాబు: అరుదైన పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన క్యారెక్టర్ యాక్టర్

శరత్ బాబు

ఫొటో సోర్స్, ugc

సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం కన్నుమూశారు.

ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఏఐజీ హస్పిటల్ వర్గాలు ధ్రువీకరించాయి.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, శరత్ బాబు అనారోగ్యంతో గత నెలలో తొలుత బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

అక్కడ ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

శరీరంలోని పలు అవయవాలు పని చేయడం మానేయడంతో ఆయన మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

శరత్ బాబు

ఫొటో సోర్స్, youtube

ఫొటో క్యాప్షన్, సంసారం ఒక చదరంగం సినిమాలో శరత్ బాబు

ఆముదాలవలసలో జననం

శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.

ఆయన 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో జన్మించారు. 1973లో రామ రాజ్యం సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు.

1974లో సహనటి రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. అయితే, వ్యక్తిగత కారణాల రీత్యా వీరు విడాకులు తీసుకున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా సహాయనటుడిగా అనేక పాత్రలు పోషించారు.

తెలుగులోనే కాకుండా తమిళ సినీ పరిశ్రమలో కూడా ఆయన అనేక పాత్రల్లో నటించారు.

సీనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఆయన స్క్రీన్‌ను పంచుకున్నారు.

50 ఏళ్ల సినీ కెరీర్‌లో మొత్తం 250కి పైగా సినిమాల్లో ఆయన నటించారు.

మళ్లీ పెళ్లి ట్రైలర్ గ్రాబ్

ఫొటో సోర్స్, Youtube

ఫొటో క్యాప్షన్, శరత్ బాబు చివరిగా ‘మళ్లీ పెళ్లి’ అనే తెలుగు సినిమాలో నటించారు

ఎన్నో హిట్ సినిమాలు

తెలుగులో ఆయన నటించిన మరోచరిత్ర, పంతులమ్మ, గుప్పెడు మనసు, శృంగార రాముడు, ఇది కథ కాదు, సంసారం ఒక చదరంగం, సాగర సంగమం, స్వాతి ముత్యం, సితార, అన్వేషణ, సీతాకోకచిలుక, క్రిమినల్, అన్నయ్య, హలో బ్రదర్, మగధీర, సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

మరో చరిత్ర, గుప్పెడు మనసు, సితార చిత్రాలను చూసిన తరానికి శరత్‌బాబు ఎంత సునిశిత నటుడో గుర్తుండిపోతుంది. సితారలో వేదనను, సీతాకోక చిలుక చిత్రంలో అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రదర్శించిన నటన ప్రశంసలకు నోచుకుంది.

శరత్ బాబు

ఫొటో సోర్స్, Sitara

అందమైన విలన్‌గానూ ప్రేక్షకులను భయపెట్టిన ప్రతిభ శరత్ బాబు సొంతం. ఏ పాత్రను అభినయించినా ఆ పాత్రతోనే గుర్తుండిపోయేలా నటించడం శరత్ బాబు స్పెషాలిటీ.

సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌తో కూడా ఆయన ప్రేక్షకులకు చేరువయ్యారు.

మలయాళం, కన్నడ భాష సినిమాల్లో కూడా ఆయన నటించారు.

ఆయన నటనకుగానూ మొత్తం 8 నంది అవార్డులు అందుకున్నారు.

ఆయన చివరగా తెలుగు సినిమా మళ్లీ పెళ్లిలో నటించారు.

ఆయన మృతిపై సినీ సహచరులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

చిరంజీవి సంతాపం:

వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణవార్త కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

"అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శరత్ బాబుతో నాకు ఎంతో అనుబంధం వుంది." అని చిరంజీవి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

చెన్నైలో అంత్యక్రియలు

శరత్ బాబు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమవారం రాత్రి 7.30 గంటల వరకు ఫిలిమ్ చాంబర్లో ఉంచుతారు.

ఆ తర్వాత అంబులెన్స్ ద్వారా చెన్నైకి తీసుకెళ్తారు

రేపు ఉదయం చెన్నైలో అంత్యక్రియలు.

వీడియో క్యాప్షన్, సీనియర్ నటుడు శరత్‌బాబు ఇక లేరు

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)