30 అడుగుల లోతు నీటిలో 74 రోజులుగా ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నారంటే...

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మాల్డలీన్ హాల్‌పర్ట్
- హోదా, బీబీసీ న్యూస్
నీటి అడుగున ఎక్కువ కాలం నివసించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు అమెరికాకు చెందిన ఒక పరిశోధకుడు.
ప్రొఫెసర్ జోసెఫ్ డిటూరీ, ఫ్లోరిడాలోని 30 అడుగుల లోతుగల సరస్సులో ఉన్న ‘‘జూలీస్ అండర్‌సీ లాడ్జ్’’లో 74 రోజులకు పైగా ఉన్నారు. ఆయన సుమారు 100 రోజులు ఉండాలని భావిస్తున్నారు.
సబ్‌మరైన్‌లో మాదిరిగా ప్రెజర్‌ను కంట్రోల్ చేసే వ్యవస్థ ఆ లాడ్జీలో ఉండదు.
‘‘రేపటి తరాలకు ప్రేరణగా నిలవాలన్నదే నా లక్ష్యం. సముద్రంలోని జీవజాలం మీద పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను ఇంటర్వ్యూలు చేయడం, తీవ్రమైన వాతావరణంలో మనిషి శరీరం ఎలా పని చేస్తుందో తెలుసుకోవాల్నది కూడా నా ఉద్దేశం’’ అని ప్రొఫెసర్ జోసెఫ్ అన్నారు.
నీటి అడుగున ఎక్కువసేపు ఉన్న రికార్డును 2014లో ఇద్దరు ప్రొఫెసర్లు సృష్టించారు.
ఈ ఏడాది మార్చి 1 నుంచి ‘‘జూలీస్ అండర్‌సీ లాడ్జ్’’లో జోసెఫ్ ఉంటున్నారు. ‘‘20,000 లీగ్స్ అండర్ ది సీ’’ అనే పుస్తకాన్ని రాసిన జూలీస్ వెర్నీ పేరు మీద దానికి ఆ పేరు పెట్టారు.
ఎక్కువ కాలం అధిక ప్రెజర్ పడితే శరీరం ఎలా స్పందిస్తుందో ‘‘ప్రాజెక్ట్ నెప్ట్యూన్ 100’’లో భాగంగా పరిశోధిస్తున్నారు ప్రొఫెసర్ జోసెఫ్. 55ఏళ్ల జోసెఫ్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశోధకులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కువ కాలం ఒంటరిగా ఉండటం వల్ల తలెత్తే మానసిక మార్పులను కూడా వారు గమనిస్తున్నారు.

అమెరికాలో నేవీలో 28ఏళ్లపాటు పని చేసిన జోసెఫ్, సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
ప్రస్తుతం నీటి అడుగున ఉన్నప్పటికీ ఆయన ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నట్లు సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ చెబుతోంది.
పొద్దున 5 గంటలకు లేచి ప్రొఫెసర్ జోసెఫ్ వ్యాయామం చేస్తారు. గుడ్లు, చేపలు వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారని చెబుతున్నారు. ఆహారం వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ ఒవెన్ కూడా ఉంది.
భూమి మీదకు రాగానే ఎండను అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారు. ‘‘నేను సూర్యుణ్ని చాలా మిస్ అవుతున్నాను’’ అని అసోసియేటెడ్ ప్రెస్‌తో జోసెఫ్ అన్నారు.
ఇవి కూడా చూడండి:
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలోకి దళితులను రానివ్వరు.. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోరు
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














