రూ.2,000 నోటు ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ప్రజలపై ప్రభావం ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనను అవినీతిపై 'సర్జికల్ స్ట్రైక్' అని భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తోంది.
అదే సమయంలో ఇది 'డీమానిటైజేషన్' కాదని 'నోట్ ఉపసంహరణ' అని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు. అయితే రూ.2000 నోటును ఉపసంహరించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో ఇంకా స్పష్టంగా తెలియరాలేదని నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్‌లో ఉన్న నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది.
2023 సెప్టెంబర్ 30 వరకు ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో ఈ నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.
అయితే ఒకసారి గరిష్టంగా రూ.20,000 అంటే రూ. 2000 నోట్లు పది మాత్రమే మార్చుకోవచ్చు. ఇలా రోజులో చాలాసార్లు మార్చుకోవచ్చు.
2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం కొత్త రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది.
2016 నవంబర్‌లో ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 24 (1) ప్రకారం ఈ 2 వేల రూపాయల కొత్త నోట్లను జారీ చేసింది. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన అవసరాలను తీర్చేందుకే రూ.2 వేల నోట్ల జారీచేశామని ఆర్‌బీఐ శుక్రవారం తన ప్రకటనలో పేర్కొంది.
ఇతర నోట్లు మార్కెట్‌లో తగినంత పరిమాణంలో వచ్చిన తర్వాత 2018-19 సంవత్సరంలో 2 వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశామని ఆర్‌బీఐ తెలిపింది.
అనంతరం 2000 రూపాయల నోట్లు మార్కట్లో క్రమంగా తగ్గిపోయాయి. 2017 మార్చికి ముందు వరకు ఆర్‌బీఐ 2 వేల రూపాయల నోట్లలో 89 శాతం విడుదల చేసింది.
ఇపుడు 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడం రిజర్వ్ బ్యాంక్ క్లీన్ నోట్ విధానంలో భాగమని తెలిపింది. మరోవైపు బ్యాంకులు కూడా రూ.2000 నోట్లను సర్క్యులేట్ చేయకుండా ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
'అవినీతిపై సర్జికల్ స్ట్రైక్'
రిజర్వ్ బ్యాంకు ప్రకటన తర్వాత బీజేపీ నేతలు స్పందిస్తూ.. ఇది అవినీతిపై సర్జికల్ స్ట్రైక్ అని అభివర్ణించారు.
బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఒక ప్రకటనలో “ఇది అవినీతిపై పోరాటంలో తీసుకున్న చర్య. అవినీతిపై ఇది సర్జికల్ స్ట్రైక్. నల్లధనం బయటకు రావాలి'' అని అన్నారు.
ఆజ్‌తక్ మీడియాతో జరిగిన సంభాషణలో సుశీల్ మోదీ మాట్లాడుతూ “2 వేల రూపాయలను టెర్రర్ ఫండింగ్, ఇతర అవినీతి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు.
అటువంటి పరిస్థితిలో ఈ నోటును పూర్తిగా రద్దు చేయాలనేదే ఉద్దేశం" అని తెలిపారు. అంతేకాకుండా మార్కెట్‌కు పెద్దనోట్లు సరికాదన్నారు.
గతంలో 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నప్పుడు నల్లధనాన్ని అరికట్టడానికే ఇలా చేస్తున్నారని వాదించారు. రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఇదే లాజిక్‌ను ఉపయోగిస్తున్నారు.
నల్లధనం నిజంగా బయటపడుతుందా?
నల్లధనం అరికట్టడానికే నోటు ఉపసంహరణ అనే అధికార బీజేపీ లాజిక్‌ను విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
జవహర్‌లాల్ యూనివర్శిటీ ప్రొఫెసర్, ఆర్థిక వ్యవహారాల నిపుణుడు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ “పెద్దనోట్ల రద్దు సమయంలో బీజేపీ స్పందనా ఇదే. నల్లధనాన్ని, అవినీతిని, ఉగ్రవాదాన్ని అది దెబ్బతీస్తుందని వాదించారు" అని తెలిపారు.
నోట్ల ఉపసంహరణ వల్ల నల్లధనం దెబ్బతింటుందన్న ప్రభుత్వ వాదనను అరుణ్‌కుమార్ తోసిపుచ్చారు.
‘‘అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే నల్లధనానికి, నల్ల సంపాదనకు తేడా ఉంది. నల్లధనాన్ని నిషేధించినా నల్ల సంపాదన కొనసాగుతుంది. నల్ల సంపాదన వల్ల నల్లధనం పెరుగుతుంది. నల్ల సంపాదన పొదుపు జరిగినపుడే అది నల్లధనంగా మారుతుంది'' అని అరుణ్‌కుమార్ అన్నారు.
నిర్ణయం వెనుక కారణం?
ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం 2 వేల రూపాయల నోట్లు క్రమంగా చెలామణిలో తగ్గిపోయాయి.
2018 మార్చి 31 నాటికి మార్కెట్‌లో రూ. 6.73 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఉన్నాయి. ఇది మొత్తం నోట్లలో 37.3 శాతం.
2023 మార్చి 31వరకు మార్కెట్‌లో రూ. 3.62 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. ఇది మొత్తం నోట్లలో 10.8 శాతం మాత్రమే.
అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ 2 వేల రూపాయల నోట్లను నల్లధనం రూపంలో దాచుకుంటున్నారని చెబుతున్నారు. దేశంలో రూ. లక్ష విలువైన రూ.2 వేల నోట్లను ఖర్చు కోసం ఇంట్లో ఉంచుకునే వారి సంఖ్యా పెద్దగా ఉండదు.అటువంటి పరిస్థితిలో ఇది ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు. దాని వెనుక ఉన్న ప్రయోజనం ఏంటి?'' అని ప్రశ్నించారు.
భారత్‌లోనూ నగదు లావాదేవీలు పెరుగుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో మార్కెట్‌లో దాదాపు రూ. 18 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండగా, అవి ఇప్పుడు రూ. 35 లక్షల కోట్లకు చేరాయి.
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నందున మార్కెట్‌లో నోట్లు కూడా పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ మెల్లగా రూ.2000 నోటును చెలామణి నుంచి తొలగిస్తోంది. గతంతో పోలిస్తే ఈ నోట్లు మార్కెట్‌లో తక్కువే ఉన్నాయి.
అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
డీమానిటైజేషన్ వంటి ప్రభావం ఉంటుందా?
2016 నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా ప్రకటన చేశారు.
సామాన్యులు నోట్ల మార్పిడి కోసం నెలల తరబడి బ్యాంకుల ముందు క్యూలు కట్టి ఇబ్బందులు పడ్డారు. డీమానిటైజేషన్ భారత ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కానీ, రూ. 2000 నోట్లను చెలామణి నుంచి తీసేయడం వల్ల కలిగే ప్రభావం డీమానిటైజేషన్ మాదిరి ఉండకపోవచ్చు.
"మార్కెట్ నుంచి 2000 రూపాయలను ఉపసంహరించుకోవడం వలన నోట్ల రద్దు సమయంలో జరిగినంత ప్రభావం ఉండదు" అని అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
నగదు అవసరాలు తీర్చుకోవడానికి చిన్న తరహా పరిశ్రమలు లేదా తమ పొదుపును ఈ నోట్లలో ఉంచే రైతులకు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. నోట్ల రద్దు సమయంలో బ్యాంకులపై భారం బాగా పెరిగి బ్యాంకు ఉద్యోగులు నెలల తరబడి అదనంగా పని చేయాల్సి వచ్చింది.
ఇపుడు 2,000 నోటు ఉపసంహరణ బ్యాంకుల పనిపై కూడా ప్రభావం చూపించొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది?
వందరోజుల్లో ప్రభుత్వం ఈ నోట్లన్నింటినీ వెనక్కి తీసుకుంటే.. ఈ కాలంలో అదనంగా 10 కోట్ల లావాదేవీలు జరుగుతాయని అరుణ్‌కుమార్ భావిస్తున్నారు. దీంతో బ్యాంకులపై భారం పెరిగి ప్రజలు బ్యాంకుల్లో అదనపు సమయం వెచ్చించేలా చేస్తుందని అరుణ్‌కుమార్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
2 వేల రూపాయల నోటును ఉపసంహరణ లేదా రద్దుపై గతంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. రద్దు చేయాలనే డిమాండ్ కూడా పెరిగింది. నోట్ల ఉపసంహరణ పెద్దగా జనాలను ప్రభావితం చేయకపోయినా నగదు విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రొఫెసర్ అరుణ్ కుమార్ స్పందిస్తూ “ఈ నోట్లను తీసివేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో నగదుపై విశ్వసనీయత కూడా తగ్గుతుంది. రూ. 2వేల నోట్లను తీసివేయగలిగితే 5 వందల నోటు కూడా తీసేస్తారా అనే ప్రశ్న ప్రజల మదిలో తలెత్తవచ్చు. చెల్లింపుల కోసం నగదు వినియోగిస్తారు. దీనికి అంతరాయం కలగవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. అసంఘటిత రంగం దెబ్బతింటోంది. అది మరింత దిగజారవచ్చు. లావాదేవీల కోసం నోట్లు వినియోగిస్తారు. నోట్లపై నమ్మకం లేకపోవడం వల్ల లావాదేవీలు కూడా తగ్గుతాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి
- బాస్మతికి ఆ సువాసన ఎలా వస్తుంది? ఇది పండించాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలి?
- జల్లికట్టు: గెలిస్తే బిడ్డను ఇచ్చి పెళ్లి కూడా చేస్తారు! ఈ క్రీడకు ఎందుకింత క్రేజ్?
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలోకి దళితులను రానివ్వరు.. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోరు
- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య: ‘పశువుల కాపరి’ నుంచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు.. ఒక సోషలిస్ట్ బీసీ నేత కథ
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














