అదానీ-హిండెన్‌బర్గ్: సెబీపై సుప్రీంకోర్టు కమిటీ ఏం చెప్పింది?

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ

అదానీ గ్రూపు షేర్ల ధరలను నియంత్రించడంలో ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)’ విఫలమైందని ఇప్పుడే చెప్పలేమని సుప్రీం కోర్టు ప్యానెల్ రిపోర్టు వెల్లడించింది.

అదానీ గ్రూపులో అవకతవకలు జరగడంతోపాటు ఆ గ్రూపు కంపెనీ షేర్ల ధరను ‘మానిప్యులేట్’ చేశారని జనవరి 24న విడుదల చేసిన రిపోర్టులో అమెరికాకు చెందిన రీసర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

ఆ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ ఆరోపణల మీద విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ మే 6న సమర్పించిన 178 పేజీల నివేదికను శుక్రవారం విడుదల చేశారు.

తమ ప్రాథమిక విచారణలో సెబీ తరపున ఎటువంటి ‘‘లోపాలు కనిపించలేదు’’ అని నివేదికలో కమిటీ రాసింది.

సెబీ బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలు పాటించిందా?

సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్(రెగ్యులేషన్) రూల్స్-1957 ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన కంపెనీలో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలి. అయితే అదానీ గ్రూప్ కంపెనీల్లో పబ్లిక్ వాటా ఎంత ఉందో చెప్పాలి అంటే ముందుగా ఫారిన్ ఫోర్టిపోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) మీద స్పష్టత రావాలని సప్రే ప్యానెల్ తెలిపింది.

‘‘12 ఎఫ్‌పీఐలు సహా మొత్తం 13 విదేశీ సంస్థలకు అదానీ గ్రూప్ ప్రమోటర్లతో సంబంధాలు ఉన్నట్లుగా సెబీ అనుమానిస్తోంది. అందువల్ల స్టాక్ మార్కెట్‌లో నమోదైన అదానీ గ్రూపు కంపెనీల్లో ఈ సంస్థలకున్న షేర్లు పబ్లిక్ వాటా కిందకు రావని భావిస్తోంది. ఒకవేళ ఆ 13 సంస్థల వాటాలు పబ్లిక్ షేర్ హోల్డింగ్ కిందకు రాకపోతే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్(రెగ్యులేషన్) రూల్స్‌ను అదానీ గ్రూపు ఉల్లంఘించినట్లు అవుతుంది. ప్రస్తుతం ఈ సంస్థలన్నీ తమ పెట్టుబడితో అంతిమ లబ్ధి పొందే యజమానుల వివరాలను సెబీకి సమర్పించాయి’’ అని తన నివేదికలో ప్యానెల్ చెప్పింది.

హిండెన్‌బర్గ్

ఫొటో సోర్స్, Getty Images

షేర్ల ధరల్లో అవకతవకలు జరిగాయా?

షేర్ల ధరల్లో అవకతవకల గురించి ఇంకా విచారణ జరుగుతోందని కాబట్టి ఇప్పుడే ఏ నిర్ణయానికీ రాలేమని రిపోర్టు తెలిపినట్లు లైవ్ లా వెల్లడించింది.

‘‘షేర్ల ధరలు లేదా షేర్ల క్వాంటిటీ అకస్మాత్తుగా పెరిగితే ఆటోమేటిక్‌గా గుర్తించి, హెచ్చరించే సాంకేతిక వ్యవస్థ సెబీ వద్ద ఉంది. అదానీ కంపెనీల షేర్లకు సంబంధించి అటువంటి 849 హెచ్చరికలు వచ్చాయి. స్టాక్ ఎక్స్చేంజీల వద్ద నుంచి తీసుకున్న రిపోర్టులను పరిశీలించిన సెబీకి, ఆర్టిఫిషియల్ ట్రేడింగ్ జరిగినట్లుగా కనిపించలేదు.

హిండెన్‌బర్గ్‌ రిపోర్టు విడుదల కావడానికి ముందే కొన్ని సంస్థలు, అదానీ గ్రూపు షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకొని ఉన్నాయి. రిపోర్డు విడుదలైన తరువాత షేర్ల ధరలు పడిపోయినప్పుడు ఆ పొజిషన్లను అమ్మి లాభాలు చేసుకున్నాయి.

వీటి మీద సెబీ ఇంకా విచారణ చేస్తోంది కాబట్టి దీని మీద కమిటీ ఇప్పుడే ఏమీ చెప్పలేదు’’ అని రిపోర్టు పేర్కొంది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీల మధ్య స్నేహం ఉందని, అందువల్లే అదానీ గ్రూప్ మీద విచారణ చేపట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ఏం జరిగింది?

అదానీ గ్రూపులో అవకతకలు జరిగాయని జనవరి 24న హిండెన్‌బర్గ్ రిపోర్టును విడుదల చేసింది. అందులో 88 ప్రశ్నలకు సమాధానాలను అడిగింది.

విదేశాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడం, షేర్ల ధరల్లో అవకతవకలు, ప్రమోటర్ల మీద కేసులు వంటి ఆరోపణలను హిండెన్‌బర్గ్ చేసింది.

నాడు హిండెన్‌బర్గ్ నివేదిక మీద రాజకీయ దుమారం రేగింది. పార్లమెంటులోనూ బయటా ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలకు దిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీల మధ్య స్నేహం వల్లే అదానీ గ్రూప్ మీద విచారణ చేపట్టడం లేదని ఆరోపించాయి.

అప్పట్లో అదానీ గ్రూప్ షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. వాటిలో పెట్టుబడులు పెట్టిన వారు నష్టపోయారు.

హిండెన్‌బర్గ్ రిపోర్టును ఖండించిన అదానీ గ్రూప్... తమ కంపెనీల్లో ఎటువంటి మోసాలూ జరగలేదని, తాము చట్టాల ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపింది. హిండెన్‌బర్గ్ మీద కేసు వేస్తామని కూడా చెప్పింది.

ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ ఆరోపణల మీద సుప్రీంకోర్టు విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

అదానీ షేర్ల ధరల మీద విచారణ కొనసాగిస్తున్న సెబీ, తుది నివేదికను ఇచ్చేందుకు మరికొంత కాలం గడువు అడగడంతో ఆగస్టు 14 వరకు సుప్రీం కోర్టు సమయం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)