మనకు ఏయే జబ్బులు వస్తాయో ఈ బాడీ స్కాన్లు ముందే చెప్పేస్తాయి, ఎలాగంటే..

యూకే బయోబ్యాంక్
ఫొటో క్యాప్షన్, యూకే బయోబ్యాంక్ అధ్యయనంలో భాగంగా కంటి స్కాన్ చేయించుకుంటున్న బీబీసీ మెడికల్ ఎడిటర్ ఫెర్గుస్ వాల్ష్
    • రచయిత, ఫెర్గుస్ వాల్ష్
    • హోదా, బీబీసీ మెడికల్ ఎడిటర్

మనుషులకు రోగాలు ఎందుకు వస్తాయో తెలుసుకునేందుకు, రోగాలు రాకుండా నివారణ పద్ధతులను కనుగొనేందుకు మానవ శరీరాల స్కానింగ్ ప్రాజెక్ట్ (హ్యూమన్ ఇమేజింగ్ ప్రాజెక్ట్) ప్రారంభమైంది.

భారీ స్థాయిలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ యూకేకి చెందిన సుమారు 60 వేల మంది వాలంటీర్ల మెదళ్లు, శరీరాలపై అధ్యయనం చేయనుంది.

వయస్సు పైబడుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులు, అవయవాల పనితీరును పరిశీలించడం ద్వారా డిమెన్షియా, వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలను ఈ అధ్యయనం అంచనా వేయనుంది.

గుండె జబ్బులకు కారణమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి జన్యు పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఈ అధ్యయనమే కారణం.

తొమ్మిదేళ్ల కిందట మొదట స్కానింగ్ చేసిన వలంటీర్‌ని నేను. మరిన్ని పరీక్షల కోసం మళ్లీ వచ్చాను.

నా మెదడు, గుండె, కళ్లు, ఎముకల సాంద్రతను రెండోసారి విశ్లేషించనున్నారు.

యూకే బయోబ్యాంకులో నాలాగే చాలా మంది వలంటీర్లు ఉన్నారు. సుమారు 90కి పైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఆరోగ్య సంబంధిత అధ్యయనాల కోసం ఈ డేటాను వినియోగిస్తున్నారు.

ఈ యూకే బయోబ్యాంకు అనేది ఒక భారీ బయోమెడికల్ డేటాబేస్. ఈ బ్యాంకులో దాదాపు యూకేకి చెందిన దాదాపు ఐదు లక్షల మంది ఆరోగ్య, జన్యుపరమైన విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం భద్రపరిచి ఉంది. ఆరోగ్యపరమైన పరిశోధనలకు ఇది ఒక వనరు లాంటిది.

ఇందులో వేర్వేరు వయసుల్లో అత్యంత క్షుణ్ణంగా తీసిన రెండు ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులు, వేల మందిలో ఎముకల సాంద్రత ఎలా ఉందో తెలిపే ఫోటోలు ఉంటాయి.

మనుషుల్లో వచ్చే డిమెన్షియా, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రమాదాలను గుర్తించి, వాటిని నివారించేందుకు అవసరమైన కొత్త మార్గాలను కనుగొనేందుకు ఇది సహాయపడుతుంది.

యూకే బయోబ్యాంక్
ఫొటో క్యాప్షన్, డిమెన్షియా వంటి వ్యాధులను గుర్తించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది.

''వయసు పెరుగుతున్న కొద్దీ అవయవాల్లో వచ్చే మార్పులను గుర్తించడం ద్వారా, వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపే స్పష్టమైన జన్యుగుర్తులను అర్థం చేసుకునే అవకాశం పరిశోధకులకు ఉంటుంది. వ్యాధి లక్షణాలు బయటపడి, దాని నిర్ధరణ జరగడానికి కొన్ని సంవత్సరాల ముందే వాటిని తెలుసుకునే అవకాశం ఉండొచ్చు.'' అని ప్రధాన శాస్త్రవేత ప్రొఫెసర్ నవోమి ఎలెన్ బీబీసీకి చెప్పారు.

ఈ అధ్యయనంలో చాలా విలువైన విషయాలను కూడా పరిశోధకులు గుర్తించారు.

చికిత్సకు ఎవరి శరీరం బాగా స్పందిస్తుంది, ఎందుకు కొందరి శరీరాలు అత్యంత ప్రమాదకర వ్యాధుల నుంచి కూడా త్వరగా కోలుకుంటాయనే విషయాలు కూడా ఈ అధ్యయనంలో గుర్తించినట్లు ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన యూకే డిమెన్షియా రీసెర్చ్ హెడ్, యూకే బయోబ్యాంక్ కోసం పనిచేస్తున్న ఇమేజింగ్ వర్కింగ్ గ్రూప్ సభ్యుడు ప్రొఫెసర్ పాల్ మాథ్యూస్ చెప్పారు.

ఏంటీ బయోబ్యాంక్?

దేశంలో ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర అధ్యయనం కోసం 2006లో యూకే బయోబ్యాంకును ప్రారంభించారు.

నాలాగే లక్షల మందిని ఇందులో భాగస్వాములను చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం, జీవనశైలి గురించి అడిగి తెలుసుకున్నారు. జన్యునమూనాలు సేకరించారు. వాటిని సురక్షితంగా భద్రపరిచి, దశాబ్దాలుగా వాటిపై అధ్యయనం చేస్తున్నారు.

అందులో పాల్గొన్నవారందరి వద్ద వారి జన్యు వివరాలు ఉన్నాయి. వారి డీఎన్‌ఏ‌కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా భద్రపరిచి ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఇమేజింగ్ (స్కానింగ్ తీసి భద్రపరచడం) ప్రక్రియ 2014లో ప్రారంభమైంది. అందులో మెదడు, శరీరానికి సంబంధించిన వివరణాత్మక స్కానింగ్ రిపోర్టులు ఉంటాయి.

సేకరించిన డేటా భద్రపరిచి ఉంటుంది. అందులో పాల్గొన్న వలంటీర్లకు కూడా ఈ సమాచారం గురించి చెప్పరు. అందువల్ల అందులో ఏముందో నమూనాలు ఇచ్చిన వారికి కూడా తెలియదు.

''ఇదొక పరోపకారం. రక్తదానం లాంటిది. సాటి మనిషి కోసం చేసే సాయం.'' అని 67 ఏళ్ల మరియన్ కీలింగ్ ఈ ప్రక్రియను వివరించారు.

''ఇది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది. మీరు ఎంతకాలం ఆరోగ్యంగా ఉండగలిగితే అంత మంచిది.'' అని మరో వలంటీర్, 81 ఏళ్ల మేరీ విల్సన్ అభిప్రాయపడ్డారు.

యూకే బయోబ్యాంక్
ఫొటో క్యాప్షన్, అధ్యయనం కోసం వాలంటీర్ల అవయవాల స్కానింగ్ రిపోర్టులను భద్రపరుస్తారు.

ఇతర బయోమెడికల్ డేటాబేసెస్ ఉన్నప్పటికీ అవి చాలా చిన్నవి. యూకే బయోబ్యాంకు తరహాలో ఎక్కువ కాలం అవి పనిచేయడం లేదు.

ఇది ఇప్పటికే ఔషధాల గురించి తెలియజేయడంలో సహాయం చేస్తోంది.

ఇప్పటి వరకూ 7 వేలకి పైగా అధ్యయన పత్రాలు ప్రచురితమయ్యాయి. అందులో మూడో వంతు గతేడాది ప్రచురించారు. కాలక్రమేణా ఈ అధ్యయనాల శాస్త్రీయ విలువ పెరగడాన్ని ఇది తెలియజేస్తోంది.

యూకే బయోబ్యాంకులోని జన్యు వివరాల ఆధారంగా, పుట్టుకతోనే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నవారిని గుర్తించేందుకు 2018లో జన్యుపరీక్షను పరిశోధకులు కనుగొన్నారు.

''మీ జీనోమ్‌లోని జన్యువులలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. వాటన్నింటినీ ఒకచోట కలిపినప్పుడు కొందరిలో గుండె జబ్బులు, వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఉంటుంది. కానీ, అవి ఉన్నట్లు మనకు ముందుగా తెలియదు.'' అని ప్రొఫెసర్ ఎలెన్ చెప్పారు.

మన జన్యువులు, వాటిపై పర్యావరణ ప్రభావం, అందువల్ల రోగాల బారిన పడే ముప్పును మరింత బాగా అర్థం చేసుకునే అవకాశాలను భారీగా సేకరించిన ఈ స్కానింగ్ రిపోర్టులు పెంచుతాయని ఇంపీరియల్ కాలేజీ లండన్‌లో ప్రజారోగ్య విభాగానికి చెందిన ఎపిడిమాలజిస్ట్, ప్రొఫెసర్ పాల్ ఇలియాట్ తెలిపారు.

''ప్రజల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండడం, దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యాన్ని పెంచుతుంది. పరిశోధనలకు ప్రభుత్వాలు నిధులు సమకూరిస్తే కలిగే ప్రయోజనాలకు ఇదొక ప్రముఖ ఉదాహరణ'' అని ఆయన అన్నారు.

ఇలాంటి అధ్యయనాలకు యూకే బయోబ్యాంకు ఇప్పుడు అంతర్జాతీయంగా గోల్డ్ స్టాండర్డ్‌గా మారిందని ఆయన చెప్పారు.

యూకేకి చెందిన బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ అండ్ డిమెన్షియాస్ ప్లాట్‌ఫామ్ అయిన వెల్‌కమ్ ట్రస్ట్‌ పరిధిలోని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఈ ప్రాజెక్ట్‌కి నిధులు సమకూరుస్తోంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)