పాకిస్తాన్ అస్తవ్యస్తంగా మారితే భారత్ ఆందోళన చెందాలా వద్దా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"పాకిస్తాన్ అన్ని విధాలుగా విఫలమైపోతే, అది మమ్మల్ని చుట్టుకోకుండా చూసుకోవాలి."
వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ థింక్ ట్యాంక్‌లో దక్షిణాసియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మాన్‌తో ఒక భారత నిప్పుణుడు చెప్పిన మాటలవి. చాలాకాలం క్రితం కుగెల్‌మాన్ భారత్ వచ్చినప్పుడు జరిగిన సంభాషణను ఆయన ఇప్పటికీ మరచిపోలేదు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో అట్టుడికిపోతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో దేశం నలుమూలలా హింస చెలరేగింది. ఇప్పటికే ఆ దేశం ద్రవ్యోల్బణం, పడిపోతున్న వృద్ధిరేటుతో ఆర్థికంగా సతమతమవుతోంది. రాజకీయ అస్థిరత దాన్ని మరింత కుంగదీస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చారిత్రకంగా అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అలాంటి ఆర్మీతో గొడవపెట్టుకున్నారు ఇమ్రాన్ ఖాన్. ప్రత్యర్థులు తనపై హత్యాప్రయత్నాలు చేశారని ఆరోపించారు కూడా.
ఇలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితులు పక్క దేశంలో కొనసాగుతున్నప్పుడు, భారతదేశం ఆందోళన చెందాలా, వద్దా అన్నది ప్రశ్న?
"పొరుగు దేశంలో తీవ్రమైన రాజకీయ అస్థిరత, ఒత్తిడి ఉన్నప్పుడు, పెద్ద ఎత్తున అశాంతి నెలకొని ఉన్నప్పుడు, ముఖ్యంగా అక్కడ ఆర్మీతో ఇతరులకు సమన్వయం లోపించినప్పుడు, మీరు (భారత్) ఆందోళన చెందాల్సిందే" అంటున్నారు కుగెల్‌మాన్.
"పాకిస్తాన్‌లోని గందరగోళం భారత్‌లోకి చొచ్చుకొస్తుందని కాదు. కానీ, ఈ గందగోళంతో కీలకమైన అంశాలపై పాకిస్తాన్ దృష్టి సారించకపోతే, అది భారత్‌కు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఉదాహరణకు భారత్‌పై కన్నేసి ఉంచిన తీవ్రవాదులు విజృంభించే అవకాశం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Empics
చారిత్రకంగా వస్తున్న శతృత్వం
1947లో విభజన తరువాత భారత్, పాకిస్తాన్ మూడుసార్లు యుద్ధం చేశాయి. వాటిలో రెండు కశ్మీర్ కోసం చేసిన యుద్ధాలు.
2019లో కశ్మీర్‌లో భారత సైనికులపై తీవ్రవాద దాడి తరువాత, భారత్ పాకిస్తాన్ భూభాగంపై దాడులు చేసింది.
ఈ దాడుల తరువాత, ఇరు దేశాలు అణు యుద్ధానికి "దగ్గరగా" వచ్చాయని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇటీవల రాసిన తన బయోగ్రఫీలో పేర్కొన్నారు.
కానీ, 2021లో సరిహద్దుల వద్ద కొత్త సంధి ఒప్పందాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
ఈ నేపథ్యంలో భారత్ ఆందోళన సమంజసమా, కాదా?
చరిత్ర కొన్ని ఆధారాలను అందిస్తోంది. వాటితో కొంత అవగాహన రావచ్చు.
1971లో పాకిస్తాన్‌లో ఏర్పడిన అల్లకల్లోలం ఉపఖండంలో నెత్తురు పారించింది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.
2008లో పర్వేజ్ ముషారఫ్ సైనిక పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ఓ కొలిక్కి వచ్చింది. ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు. ఇది జరిగిన కొన్ని నెలల తరువాత, పాకిస్తాన్ మిలిటెంట్లు ముంబైపై దాడి చేశారు.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభం కూడా భారత్‌కు ఆందోళన కలిగించేదేనని హుస్సేన్ హక్కానీ అన్నారు. ఆయన మాజీ పాకిస్తాన్ రాయబారి, వాషింగ్టన్ డీసీలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో, అబుదాబిలోని అన్వర్ గర్గాష్ డిప్లొమాటిక్ అకాడమీలో స్కాలర్.
"పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొని ఉన్నప్పుడే రాజకీయ గందరగోళం కూడా ఏర్పడింది. ఆ దేశం లోపలి నుంచి, బయటి నుంచి కూడా చాలా బలహీనంగా కనిపిస్తోంది" అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
'ఈ సమయంలో భారత్‌తో పోరు పెట్టుకోవాలనుకోదు'
అయితే కుగెల్‌మాన్ లాంటి నిపుణులు రెండు రకాల విపరీతాలను తోసిపుచ్చారు.
మొదటిది, అంతర్గత సయోధ్య కోసం భారత్ సహాయం కోరడం. దీనిపై "భారత్‌కు ఎలాంటి ఆసక్తి ఉండకపోవచ్చు".
రెండు, సరిహద్దుల వెంబడి భారత్‌పై దృష్టి పెట్టే తీవ్రవాదులను ప్రోత్సహించడం. "ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తీవ్రవాదం పాకిస్తాన్ జాబితాలో కడపటిది అవుతుంది. ఈ సమయంలో భారత్‌తో పోరు పెట్టుకోవాలనుకోదు" అని కుగెల్‌మాన్ అన్నారు.
ఈ రెండూ విపరీతాలు. కానీ, ఈ రెండింటి మధ్య ఏదైనా జరగవచ్చు. దాని గురించి భారత్‌కు ఆందోళన ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
ఒకటి, "అంతర్గత పరిస్థితులతో సతమతమవుతూ, సరిహద్దుల్లో పొంచి ఉన్న ప్రమాదాలపై దృష్టి పెట్టకపోవచ్చు" అని కుగెల్‌మాన్ అభిప్రాయపడ్డారు.
ఎస్ఓఏఎస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో రాజకీయాలు, అంతర్జాతీయ అధ్యయనాలను బోధిస్తున్న అవినాష్ పలివాల్ కూడా పై అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.
పాకిస్తాన్‌లో జంట సంక్షోభాలు సరిహద్దులో కాల్పుల విరమణను దెబ్బతీయవచ్చని ఆయన అన్నారు.
"సంక్షోభాలతో పరధ్యానంలో పడి లేదా కశ్మీర్‌పై దృష్టి పెట్టడం ద్వారా ఆర్మీ నియంత్రణపై పట్టు సాధించవచ్చని భావించో, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో కార్యకలాపాలను పురికొల్పవచ్చు. వనరుల పరిమితి ఉన్నప్పటికీ, ఇది జరగవచ్చు. ఎందుకంటే, పాకిస్తాన్‌లో కాల్పుల విరమణకు హామీ ఇచ్చినవారే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు" అని పలివాల్ అన్నారు.
"అయితే, కాల్పుల విరమణ ఒప్పందం భంగం కావడం భారత్‌కు పెద్ద ముప్పు కాదు. కానీ, మరోపక్క చైనాతో సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పుడు ఈ పక్క పాకిస్తాన్‌తో ఘర్షణలు దేశానికి భారం కావచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
పాకిస్తాన్ పరిస్థితి చూసి భారత్ సంతోషిస్తోందా?
కాగా, పాకిస్తాన్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తీవ్రంగా పరిగణించడం భారత్ మానుకోవాలని మరి కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పక్క దేశంలో సంక్షోభం గురించి పెద్దగా ఆందోళన చెందక్కర్లేదని అంటున్నారు.
అయితే, పాకిస్తాన్‌కు పట్టిన గతి గురించి సంబరపడే ట్రెండ్ కూడా భారత్‌లో కొంత కనిపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 10 రెట్లు పెద్దదని, వాళ్ల ఆర్థిక వ్యవస్థ మహారాష్ట్ర కన్నా చిన్నదని అంటారు.
ఇలాంటి స్పందన "ఊహించదగ్గదే" అని కుగెల్‌మాన్ అన్నారు.
"శతృదేశాలు అని పేరుపడ్డ వాటిలో ఇలాంటి స్పందనలు సాధారణమే. సరిహద్దులో ఘర్షణలు, యుద్ధాలు జరిగిన నేపథ్యంలో, పక్కదేశానికి కీడు జరిగితే సంతోషించే ట్రెండ్ ఉంటుంది. ముఖ్యంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకునే తీవ్రవాదులను ఏళ్లతరబడి పాకిస్తాన్ ఆర్మీ ప్రోత్సహిస్తుందని తెలిసినప్పుడు, ఆ ఆర్మీకే కష్టాలు ఎదురైతే ఓ రకమైన సంతోషం ఉండవచ్చు" అని ఆయన అన్నారు.
"భారత్ ఓ పక్క సంతోషిస్తూ, మరోపక్క పాకిస్తాన్ నుంచి ప్రమాదాలు రావచ్చని ఆందోళన చెందుతుంటే.. అది కూడా ప్రమాదమే" అన్నారు కుగెల్‌మాన్.
"అణ్వాయుధాలు ఉన్న పొరుగు దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడం భారత్‌కు అంత మంచిది కాదు" అని హక్కానీ అన్నారు.
అయితే, "పాకిస్తాన్ పతనమైపోతుందన్న ఆందోళన అవసరం లేదని, ఎప్పటిలాగే అవకతవకలతో బండి నడిపిస్తుందని" శరత్ సబర్వాల్ వంటి నిపుణులు భావిస్తున్నారు. శరత్ సబర్వాల్ గతంలో పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా వ్యవహరించారు.
"పాకిస్తాన్ కేసు మతపరమైన, రాజకీయ సైద్ధాంతిక విపరీతాలకు ఒక మంచి ఉదాహరణ. అలాగే, ఈ భేదాభిప్రాయలను పక్కనపెట్టి జాతీయవాదానికి కట్టుబడి ఉండాలన్న సంకేతాన్నీ ఇస్తుంది" అని పలివాల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, EPA
ఇప్పుడు భారత్ ఏం చేయాలి?
"ఏమీ చేయకుండా, ఇప్పుడు ఎలా ఉందో అలాగే సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ పాటిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడం మేలు" అని పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేసిన టీసీఏ రాఘవన్ అన్నారు.
భారత్ "వెయిట్ అండ్ వాచ్" విధానాన్ని అనుసరిస్తూనే, సరిహద్దులపై ఓ కన్నేసి ఉంచుతోందని హక్కానీ విశ్వసిస్తున్నారు.
అయితే, 'భారత్ సిద్ధంగా లేదు' అన్న మాట రాకూడదు. అది కీలకం.
"భారత్ రక్షణ విషయంలో అశ్రద్ధ వహించకుండా, జాగ్రత్తగా ఉండాలి" అని కుగెల్‌మాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
- ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














