ఇమ్రాన్ ఖాన్‌: కోర్టు ఆవరణలో నన్ను చంపేందుకు ప్రయత్నించారు. దీనంతటికీ కారకుడు ఆయనే..

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, RAHAT DAR/EPA-EFE/REX/SHUTTERSTOCK

అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆయనతో బీబీసీ ప్రతినిధి కరోలిన్ డేవిస్ మాట్లాడారు.

కరోలిన్ డేవిస్: మీరు ఈ రోజు కోర్టుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది?

ఇమ్రాన్ ఖాన్: ఇక్కడ సర్కస్ జరుగుతోంది, కానీ నాకు అన్ని కేసుల్లో బెయిల్ వస్తుందని తెలుసు.

సుప్రీంకోర్టు చెప్పినట్లు నన్ను అక్రమంగా అరెస్టు చేసిన విధంగా, ఈసారి హైకోర్టు వెలుపల నన్ను మళ్లీ అక్రమంగా అరెస్టు చేస్తారనీ నాకు తెలుసు.

దాని తర్వాత ఏం జరుగుతుంది? నేను దానిని ఎలా నియంత్రించగలను?

ఇస్లామాబాద్ వచ్చే ముందు నాపై ఏదైనా వారెంట్ ఉంటే చూపించండి, లొంగిపోతాను. అయితే లాహోర్‌లో చేసినట్లు చేయకండి అని చెప్పాను.

నా ఇంటిపై దాడి చేశారు. వారు 24 గంటలు నా ఇంటిపై దాడి చేశారని మీకు తెలుసా?

వారు నన్ను పట్టుకుని జైలులో పెడితే, జరిగిన దానికి నేను ఎలా బాధ్యత వహిస్తాను? కోర్టుకు వచ్చిన తర్వాతే ఈ విషయం నాకు తెలిసింది.

మీకు అరెస్ట్ వారెంట్‌ని అందజేసి, మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెబితే, వెళతారా?

ఇమ్రాన్ ఖాన్: నేనేదైనా తప్పు చేసి ఉంటే, నేను చేసిన తప్పుకు అరెస్ట్ వారెంట్ తీసుకువస్తే, ఖచ్చితంగా వెళ్తాను.

చట్టాన్ని నమ్ముతాను. నాపై 150 కేసులు నమోదయ్యాయి. అనేక క్రిమినల్ కేసులు, తీవ్రవాదానికి సంబంధించి 40 కేసులు, దైవదూషణ కేసులు, దేశద్రోహం కేసులు ఉన్నాయి.

మిమ్మల్ని అరెస్టు చేసిన తర్వాత జరిగే దానికి మీరు బాధ్యత వహించలేరని మీరు చెప్పినప్పుడు, అది బెదిరింపుగా అనిపించలేదా?

ఇమ్రాన్ ఖాన్: గత ఏడాది కాలంగా జరిగిందంతా చరిత్రే.

5,000 మందిని అరెస్టు చేశారు, 5,000 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రతిరోజు ప్రజలను అరెస్టు చేస్తున్నారు.

నా ఇంటిపై, మా పార్టీ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టారు.

ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు.

మీరు కూడా విమర్శలు చేశారు. సైన్యంపై, ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజలు, మీ నిరసనకారులు, వీధుల్లోకి వస్తున్న మీ మద్దతుదారులు ఇలాంటి భాషనే వాడుతున్నారు కదా..

ఇమ్రాన్ ఖాన్: ఏ భాష? రెండుసార్లు ఎవరిపై హత్యాయత్నం జరిగింది?

దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తే పట్టించుకోవట్లేదు.

కరోలిన్ డేవిస్: రెండో దాడి ఎప్పుడు జరిగింది?

ఇమ్రాన్ ఖాన్: కోర్టు ఆవరణలో నన్ను చంపేందుకు ప్రయత్నించారు.

ఎలాగోలా నా ప్రాణాన్ని కాపాడుకున్నాను. వారు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ కోర్టు కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకుంది. అది ఒక ఉచ్చు.

నేను అక్కడికి వెళ్లి ఉంటే, ఖచ్చితంగా చంపేవారు.

ఇది నాపై జరిగిన రెండో దాడి. ఆ తర్వాత నా ఇంటిపై కూడా దాడి జరిగింది.

మా కార్యకర్తలను కూడా కిడ్నాప్ చేశారు.

మీరు వాడుతున్న భాష ప్రజలను రెచ్చగొట్టేలా లేదా?

ఇమ్రాన్ ఖాన్: వారు హైకోర్టులోకి ప్రవేశించిన విధానం, కిటికీలు పగలగొట్టడం, నన్ను కర్రతో కొట్టడం చూశాక, మీరేమనుకుంటున్నారు? నేను తప్పు చేస్తున్నానా?

నేను నా స్థానంలో ఉన్నాను. నా లాయర్ అక్కడ కూర్చొని ఉండగా నన్ను ఎత్తుకెళ్లారు.

ఆ చిత్రాలు బయటకు వచ్చినప్పుడు ఎలాంటి స్పందన వస్తుందని మీరనుకుంటున్నారు?

పాకిస్తాన్‌లో అతిపెద్ద పార్టీ అధినేతను వాళ్లు పట్టుకున్నారు. సైన్యం పట్టుకుంది. రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా?

ఇది తెలియడానికి మీరు మేధావి కావాలా? దీనికి ఒక వ్యక్తి మాత్రమే బాధ్యత వహిస్తారు. అది ఆర్మీ చీఫ్.

నేను అధికారంలోకి వస్తే డీ-నోటిఫై చేస్తానని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను అలా చేయను అని వారికి చెప్పడానికి ప్రయత్నం చేశాను.

ఏది జరిగినా నేరుగా ఆయన సూచనల మేరకే జరుగుతోంది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, SHAHZAIB AKBER/EPA-EFE/REX/SHUTTERSTOCK

మీరు కోర్టు నుంచి బయటికి వెళ్లేటప్పుడు అరెస్టయితే, మీ మద్దతుదారులకు మీరిచ్చే సందేశం ఏంటి?

ఇమ్రాన్ ఖాన్: 27 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. న్యాయం కోసం, చట్టబద్ధమైన పాలన కోసం పోరాడేదే నా పార్టీ.

నా మద్దతుదారులకు ప్రతిసారీ చెబుతున్నాను. వారు ఏది చేసినా రాజ్యాంగ పరిధిలో ఉండాలని, నిరసనలు చేసినప్పుడు శాంతియుత పద్ధతిలో చేయాలని చెబుతున్నాను.

మేం 126 రోజులు నిరసనలు చేశాం. అత్యంత శాంతియుత నిరసనలలో అది ఒకటి.

మేం ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదు. ఇప్పుడు కూడా నిరసన తెలియజేయాలని నేను వారిని కోరినప్పుడు, శాంతియుత మార్గం గురించే మాట్లాడతాను. ఇది నేను ఎప్పటినుంచో చెబుతున్న మాట.

నా వయస్సు 50 ఏళ్లు దాటిందని ప్రజలకు తెలుసు. నేను ప్రముఖ పాకిస్తానీని.

నేను పాకిస్తాన్‌లో అన్ని అవార్డులను గెలుచుకున్నాను. నేను ఇక్కడ అతిపెద్ద సామాజిక కార్యకర్తను, అతిపెద్ద పార్టీ అధినేతనూ నేనే.

నా పట్ల ఇలా ప్రవర్తించినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఎవరిది? ఇలా చేసిన వ్యక్తులది.

హింసాత్మక చర్యలకు పాల్పడొద్దని మీ మద్దతుదారులకు చెప్తారా?

ఇమ్రాన్ ఖాన్: నిన్న నేను సుప్రీంకోర్టు నుంచి ప్రజలకు ఒక సందేశం ఇచ్చాను.

ఇది నా దేశం, నా సైన్యం, నా భవనాలు, నా ప్రజలు.

దయచేసి ప్రశాంతంగా ఉండండి. దేశానికి హాని చేయకూడదనుకుంటున్నాం. ఇది నేను ఎప్పుడూ చెప్పేది.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)