పబ్లిక్‌లో సన్నిహితంగా ఉండడం, ముద్దు పెట్టుకోవడం నేరమా, చట్టాలు ఎలా నిర్ణయిస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ కోసం
సౌకర్యవంతమైన ప్రయాణానికి దిల్లీ మెట్రో పెట్టింది పేరు. 5 నుంచి 6 నిమిషాలకో ట్రైను ఉంటుంది. రోడ్లపై ట్రాఫిక్ బారిన పడకుండా, విశాలమైన్ ఏసీ బోగీలో సుఖంగా ప్రయాణం చేయవచ్చు.
అలాంటి మెట్రో ఈమధ్య ప్రేమికులకు అనువైన ప్రదేశంగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. మెట్రో రైళ్లలో, స్టేషన్లలో యువతీయువకులు ముద్దు పెట్టుకోవడం, సన్నిహితంగా మెలగడం వంటివి ఎక్కువవుతున్నాయని అంటున్నారు.
గత వారం, ఒక అమ్మాయి, అబ్బాయి మెట్రోలో ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిచుట్టూ వివాదాలు అల్లుకున్నాయి.
వీడియోలో అమ్మాయి, అబ్బాయి ఒళ్లో పడుకుని ఉంది. మాట్లాడుతూ పెదాలపై ముద్దు పెట్టాడు ఆ అబ్బాయి.
ఈ వీడియో బయటకు వచ్చిన తరువాత దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ, "ఇలాంటి అభ్యంతరకరమైన ప్రవర్తన కనిపిస్తే, వెంటనే ప్రయాణికులు దగ్గర్లో ఉన్న మెట్రో సిబ్బందికి ఫిర్యాదు చేయాలని" కోరింది.
ఇలాంటి వాటిపై నిఘా పెట్టడానికి సిబ్బందిని పెంచుతామని కూడా డీఎంఆర్‌సీ తెలిపింది.
ఆ వీడియో, దానిపై వచ్చిన విమర్శల నేపథ్యంలో, దేశంలో మోరల్ పోలీసింగ్, బహిరంగంగా ప్రేమ తెలియజేయడంపై ఉన్న ఆంక్షల చూట్టూ వాడివేడి చర్చలు ప్రారంభమయ్యాయి.
"అభ్యంతరకరమైన ప్రవర్తన" అన్నది కాస్త ఇబ్బంది పెట్టే పద ప్రయోగమే.
ఉదాహరణకు, డీఎంఆర్‌సీ ఇచ్చిన ప్రకటనకు వచ్చిన స్పందనలు చూస్తే, అబ్బాయి భుజంపై అమ్మాయి తల వాల్చడం కూడా తప్పేనన్నట్టు ఉన్నాయి.
అలాగని, ట్రైన్‌లో కూర్చుని హస్తప్రయోగం చేసుకోవడం సభ్యత అని ఎవరూ అనుకోరు. గత నెలలో అలాంటి ఘటన కూడా జరిగింది. ఒక వ్యక్తి మెట్రోలో అదే పనిచేశాడు. దిల్లీ మహిళా కమీషన్ గట్టిగా మందలించింది కూడా.
అలాగే ఓ యువతి బికినీ వేసుకుని మెట్రోరైలులో ప్రవేశించడం కూడా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మెట్రో రైళ్లలో ఇలాంటి ప్రవర్తనపై చర్చను మరింత పెంచింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఇలాంటి సందర్భాలలో దీనికి గీత ఎక్కడ గీయాలన్నది ప్రశ్న. బహిరంగ ప్రదేశాల్లో హస్తప్రయోగం తప్పేనని అందరూ అంగీకరించినప్పటికీ, ప్రేమ కనబరచడం, సన్నిహితంగా మెలగడం కూడా తప్పేనా అన్నది కొందరి సందేహం.
2018లో కోల్‌కతాలో ఒక జంట పబ్లిక్‌లో కౌగలించుకున్నారని, చుట్టూ ఉన్న జనం వాళ్లను చితగ్గొట్టారు. దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తింది. జనం "మోరల్ పోలీసింగ్ ఆపాలి" అంటూ నినాదాలు చేశారు.
2019లో దిల్లీ మెట్రో స్టేషన్‌లో ఒక జంట "శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలడం" సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో పోర్న్ సైట్‌లోకి వెళ్లిపోయింది.
బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం అనే చర్యకు భారతదేశంలో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. గమ్మత్తేమిటంటే, ప్రపంచానికి కామసూత్ర అందించిన దేశంలో తెరపై ముద్దు సీను కనిపిస్తే ముఖం చిట్లిస్తారు.
1981లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ భారతదేశంలోని ఒక సినిమా షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. హిందీ నటి పద్మిని కొల్హాపురి ఆయన మెడలో పూలమాల వేసి, బుగ్గపై ముద్దు పెట్టి ఆహ్వానించారు.
దాంతో, ఆమె చాలా ఫేమస్ అయిపోయారు. "ప్రిన్స్ చార్లెస్‌ను ముద్దుపెట్టుకున్న యువతి" అంటూ వార్తల్లో ఆమె పేరు హోరెత్తిపోయింది. ఇది జరిగిన కొన్నేళ్ల తరువాత, ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముద్దు పెట్టడం "ఏమంత పెద్ద విషయం కాదని" అన్నారు.
కానీ, అది పెద్ద విషయం అయ్యుండేది. ఎందుకంటే, 2007లో హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేరే ఒక ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెంపపై ముద్దు పెట్టినప్పుడు పెద్ద వివాదమైంది. రిచర్డ్ గేరే భారతీయ సంస్కృతిని అవమానించారని విమర్శలు వచ్చాయి.
ఎయిడ్స్‌పై అవగాహన నేపథ్యంలో ముద్దు పెట్టుకోవడం సురక్షితమేనని చెప్పడమే తన ఉద్దేశమని గేరే అన్నారు. కానీ, ఇది బహిరంగ ప్రదేశంలో "అవమానపరిచే చర్య" కింద శిల్పాశెట్టి మీద కేసు నమోదైంది.
చివరకు 2022లో ఆమెపై కేసు క్లియర్ అయింది. గేరే చేసిన పనికి "ఆమె బాధితురాలు" అని కోర్టు తీర్పు చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ముద్దుపెట్టుకోవడం, దగ్గరగా మసలడం, కొన్ని శృంగారపరమైన దృశ్యాలు సాధారణం అవుతున్నాయి.
వందల కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రైవసీ అనేది అరుదైన విషయమే. అధిక జనాభా కుటుంబాలుగా నివసిస్తారు. చాలామందికి "చాటు" దొరకడం కష్టమే.
అందుకే పార్కుల్లో పొదల చాటున లేదా బస్‌స్టాండుల్లో, పురాతన కట్టడాల లోపలి గదుల్లో జంటలు చేరి ముద్దుముచ్చట్లాడుకోవడం తరచూ కనిపించే విషయమే.
పోనీ, హోటెల్‌లో రూం తీసుకోవచ్చంటే, చాలాచోట్ల మ్యారేజ్ సర్టిఫికెట్ అడుగుతారు. విచిత్రం ఏమిటంటే, స్వలింగ సంపర్కులు హొటల్‌లో గది బుక్ చేసుకోవాలంటే, ఇలాంటి సమస్యలు ఉండవు. భిన్నలింగ జంటలకే ఈ ఇబ్బంది. ఆడ, మగ చేతులు పట్టుకుని నడిస్తే చాలు అనుమానంగా చూస్తారు.
భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 294 ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన చర్యలు, పాటలు, మోటు జానపద గేయాలతో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే శిక్ష తప్పదు.
అయితే, అసభ్యం, అభ్యంతరకరం ఇలాంటి పదాలకు ఇచ్చే నిర్వచనాల్లోనే అసలు సమస్య ఉంది.
ప్రఖ్యాత ఉర్దూ రచయిత సదత్ హసన్ మంటోపై ఆరుసార్లు "అసభ్యకరం" అభియోగం కింద కేసులు నమోదయ్యాయి. చిత్రంగా బ్రిటిష్ పాలనలో, స్వతంత్ర భారతదేశంలో కూడా ఆయనపై అభియోగాలు మోపారు.
2017లో ప్రముఖ మోడల్ మిలింద్ సోమన్ తన 55వ పుట్టినరోజున బీచ్‌లో నగ్నంగా పరిగెత్తినందుకు ఆయనపై సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు.
సెలబ్రిటీల వార్తలు జనాన్ని ఆకర్షిస్తాయి కానీ, సాధారణ ప్రజలకు ఇది ఇబ్బందికరమే. ఏది సభ్యత, ఏది అసభ్యత తేల్చుకోవడం కష్టమే. ఇది వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకమని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి.
ఐఐటీ మద్రాసులో మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తూ "సెలబ్రేటింగ్ లవ్" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యువతీయువకులు బహిరంగంగా ఒకరినొకరు కౌగలించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు.
పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవడం అసభ్యం కాదని చాలాసార్లు కోర్టులు తీర్పులిచ్చాయి.
2008లో పెళ్లైన ఒక జంట కేసును వాదించిన ఒక లాయర్, "అది నైతిక పతనాన్ని ప్రోత్సహిస్తే లేదా జనానికి ఆగ్రహం తెప్పిస్తే మాత్రమే అసభ్యం" అని అన్నారు.
కానీ, చట్టపరంగా దీనికి గీత గీయడం కూడా కష్టమే.
న్యాయవాది సౌరభ్ కిర్పాల్ 'సెక్స్ అండ్ ది సుప్రీం కోర్టు' పుస్తకంలో చెప్పినట్టుగా, "సమాజం చట్టాన్ని రూపొందిస్తుంది. చట్టం మళ్లీ సమాజాన్ని రూపొందిస్తుంది. చట్టాన్ని మార్చడంలో ఉన్న సమస్య ఏమిటంటే.. సమాజానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులే కొత్త చట్టాన్నీ రూపొందిస్తారు."
దిల్లీ మెట్రో విషయానికి వస్తే, బహిరంగంగా ప్రేమ కనబరచడం మరొకరికి అసభ్యంగా కనిపించవచ్చు. కానీ, నిజంగా అది అసభ్యమా, కాదా అన్నది ఎవరు నిర్ణయిస్తారు? ఇదీ అసలు సమస్య.
(సందీప్ రాయ్ కోల్‌కతాకు చెందిన రచయిత.)
ఇవి కూడా చదవండి:
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
- ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?
- సిక్కిం రాజు కోటను 30 నిమిషాల్లో భారత సైన్యం ఎలా స్వాధీనం చేసుకుంది, విలీనంలో ఇందిరాగాంధీ పాత్ర ఏంటి?
- ఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














