టైటానిక్: సముద్ర గర్భంలోని ఈ భారీ నౌక 'డీప్ సీ మ్యాపింగ్'తో ఎంత స్పష్టంగా కనిపిస్తోందో చూడండి...

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
- రచయిత, రెబెక్కా మొరెల్లీ, అలిషన్ ఫ్రాన్సిస్
- హోదా, బీబీసీ న్యూస్ క్లైమెట్ అండ్ సైన్స్
టైటానిక్ ఓడ మునిగిపోయిన వందేళ్ళ తరువాత దాన్ని మరింత స్పష్టంగా చూసే అవకాశం లభించింది. ఈ శతాబ్ద కాలంలో మునుపెన్నడూ టైటానిక్ శిథిలాలను ఇంత దగ్గరగా చూడడం సాధ్యం కాలేదు.
‘‘డీప్ సీ మ్యాపింగ్’’ సాంకేతికతను ఉపయోగించి అట్లాంటిక్ సముద్రంలో 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ పడవను తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ స్కాన్ చేశారు.
ఈ డిజిటల్ స్కాన్ వల్ల పడవ మొత్తాన్ని త్రీడీలో చూడొచ్చు. అంతేకాకుండా పడవ చుట్టు పక్కల నీరు లేనట్లుగా కనబడుతుంది.

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
1912లో మునిగిపోయినప్పుడు టైటానిక్ పడవకు సరిగ్గా ఏం జరిగిందో ఈ సాంకేతికత ద్వారా తెలుస్తుందని కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
తొలిసారిగా సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్తుండగా మంచుకొండను టైటానిక్ ఓడ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో పడవ సముద్రంలో మునిగిపోవడంతో 1,500 మందికి పైగా మరణించారు.
‘‘ఆ పడవ ప్రమాదానికి సంబంధించి ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వాటికి సమాధానాలు అవసరం’’ అని బీబీసీ న్యూస్‌తో టైటానిక్ విశ్లేషకుడు పార్క్స్ స్టీఫెన్సన్ అన్నారు.

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
టైటానిక్ ప్రమాదాన్ని ఊహాగానాల ప్రాతిపదికన కాకుండా సాక్ష్యాధారిత పరిశోధన వైపు నడిపించే ప్రధాన దశల్లో ఈ మోడల్ ఒకటి అని స్టీఫెన్సన్ చెప్పారు.
1985లో టైటానిక్ శిథిలాలను కనుగొన్నారు. అప్పటినుంచి టైటానిక్‌పై విస్తృత పరిశోధనలు జరిగాయి.
టైటానిక్ ఒక భారీ ఓడ. సముద్రపు అట్టడుగున ఉంది. కాబట్టి కెమెరాలు, సముద్రపు లోతులో ఉండే చీకటిలో కేవలం టైటానిక్ ఓడ శిథిలాల ఫొటోలను మాత్రమే తీయగలవు. కానీ, దాని పూర్తి కథను వివరించలేవు.
కానీ, స్కానింగ్ అనే కొత్త సాంకేతిక శిథిలాలను పూర్తిగా పరిశీలిస్తుంది. టైటానిక్ పూర్తి రూపాన్ని చూపిస్తోంది.
టైటానిక్ రెండు ముక్కలుగా విడిపోయింది. దాని ముందుభాగం, వెనుక భాగం మధ్య 800 మీటర్లు దూరం ఉంది.

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
‘‘మెగెలాన్ లిమిటెడ్’’ అనే డీప్-సీ మ్యాపింగ్ కంపెనీ, టైటానిక్‌పై డాక్యుమెంటరీ రూపొందిస్తున్న ‘‘అట్లాంటిక్ ప్రొడక్షన్స్’’ సంస్థలు 2022లో వేసవిలో ఈ డిజిటల్ స్కానింగ్ కార్యక్రమాన్ని చేపట్టాయి.
టైటానిక్ శిథిలాల పొడవు, వెడల్పులపై సర్వే చేయడానికి వారు 200 గంటలకు పైగా శ్రమించారు.
సముద్రపు ఉపరితలంలో ఒక ప్రత్యేక బోటులో కూర్చోని సాంతికేత ద్వారా టైటానిక్ ఓడను ప్రతీ కోణంలో చూస్తూ 7 లక్షలకు పైగా ఫొటోలు తీశారు. త్రీడీలో కచ్చితమైన ఓడను పునర్నిర్మించారు.
తాను ఇప్పటివరకు చేపట్టిన అండర్ వాటర్ స్కానింగ్ ప్రాజెక్టులో ఇదే అతిపెద్దది అని మెగెలాన్ సంస్థకు చెందిన గెర్హార్డ్ సీఫెర్ట్ అన్నారు. ఈ అన్వేషణ కార్యక్రమం ప్రణాళికకు గెర్హార్డ్ నాయకత్వం వహించారు.

ఫొటో సోర్స్, TLANTIC PRODUCTIONS/MAGELLAN
‘‘అది దాదాపు 4000 మీటర్ల లోతులో ఉంది. అక్కడికి చేరుకోవడం ఒక పెద్ద సవాలు. అది ఉన్న ప్రాంతంలో సముద్ర ప్రవాహాలు కూడా ఉంటాయి. ఓడ శిథిలాలను తాకేందుకు మాకు అనుమతి లేదు.
ప్రతీ చదరపు సెంటీమీటర్ ప్రాంతాన్ని మ్యాప్ చేయడం మరో పెద్ద సవాలు. ఓడ చుట్టూ ఉన్న శిథిలాల క్షేత్రాలు, బురదను కూడా మ్యాప్ చేయడం అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ, వాటిని వదిలేయకూడదు. ఓడ ముందు భాగం, వెనుకభాగం మధ్య పూరించడానికి ఈ శిథిలాల క్షేత్రాలు, బురదను కూడా మ్యాప్ చేయాల్సి ఉంటుంది’’ అని గెర్హార్డ్ వివరించారు.
ఓడ పరిస్థితితో పాటు అందులోని సీరియల్ నంబర్లు వంటి వాటిని కూడా స్కానింగ్‌లో చూడొచ్చు.

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
పడవ మునిగిపోయి 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా సముద్రంలో తుప్పు పట్టిపోయిన దాని ముందు భాగాన్ని సులభంగానే గుర్తు పట్టవచ్చు.
శిథిలాల క్షేత్రం చుట్టూ వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. పడవకు సంబంధించిన మెటల్ పరికరాలు, షాంపేన్ బాటిళ్లు, డజన్ల కొద్దీ బూట్లు అక్కడ కనిపిస్తున్నాయి.
టైటానిక్ గురించి చాలా ఏళ్ల పాటు పార్క్స్ స్టీఫెన్సన్ అధ్యయనం చేశారు.
మొదటిసారి స్కాన్‌లను చూసినప్పుడు తన తల తిరిగిపోయిందని పార్క్స్ అన్నారు.

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
‘‘మీరు మునుపెన్నడూ చూడని విధంగా ఇందులో శిథిలాలను చూడొచ్చు. శిథిలాలను సంపూర్ణంగా, ఒక దృష్టి కోణంలో చూడవచ్చు. స్కానింగ్‌లో మీరు శిథిలాల అసలు స్థితిని గమనించవచ్చు’’ అని ఆయన చెప్పారు.
ఈ స్కాన్‌లను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే, 1912లో పడవ మునిగిపోయిన రాత్రి టైటానిక్‌కు ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.
‘‘మంచుకొండను టైటానిక్ ఎలా ఢీకొన్నదో మనకు అర్థం కాదు. సినిమాల్లో చూపించినట్లుగా టైటానిక్ స్టార్‌బోర్డ్ వైపు నుంచి మంచుకొండను ఢీకొట్టిందో లేదో కూడా తెలియదు. అది మంచుకొండపై పడిపోయి ఉండొచ్చు’’ అని ఆయన వివరించారు.
ఓడ వెనుకభాగాన్ని అధ్యయనం చేయడం ద్వారా సముద్రపు తలంలో పడవ ఎలా ఆగిందో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
శిథిలాలపై సముద్ర ప్రభావం పడుతోంది. అందులోని సూక్ష్మజీవులు శిథిలాలను తినేస్తున్నాయి. ఓడ భాగాలు విడిపోతున్నాయి. టైటానిక్ ఓడ విపత్తును పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమయం మించిపోతుందనే విషయాన్ని చరిత్రకారులు గుర్తించారు.
కానీ, ఈ స్కానింగ్ ప్రక్రియ శిథిలాల స్థితిగతుల్ని బంధించి ఉంచుతుంది. ప్రతీ చిన్న అంశంపై నిపుణులు పరిశోధించడానికి వీలు కల్పిస్తుంది. టైటానిక్ రహస్యాలు రాబోయే కాలంలో బయటపడతాయనే ఆశను ఈ ప్రక్రియ కల్పిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- చార్ధామ్: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?
- ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? దాని పుట్టుకకు మొదటి ప్రపంచయుద్ధం ఎలా కారణమైంది?
- ‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















