సముద్రాలను శుభ్రం చేస్తున్న నత్త గుల్లలు

వీడియో క్యాప్షన్, సముద్ర తీరాల్లో పెరిగిపోతున్న నాచును కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తల కొత్త అన్వేషణ...

ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని నీటిని శుభ్రం చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని కనుక్కున్నారు. అందులో బాగంగానే నత్తగుల్లల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. సముద్రతీరాల్లో పెరిగిపోతున్న నాచును కట్టడి చేయండలో నత్తగుల్లలతో పాటు, సముద్ర పురుగులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చని యూనివర్సిటీ పరిశోధకులు నమ్ముతున్నారు. బ్రిటన్ నుంచి బీబీసీ ప్రతినిధి జాన్ కట్‌హిల్ కథనం.

ఇంగ్లాండ్‌లోని హాంబల్‌లో ఉన్న ఈ వంతెనలో ఓ రహస్యం దాగుంది. ఈ చెక్క బల్లల మధ్య సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ జరుగుతోంది.

''ఇది నత్త గుల్లల బోను. గతేడాది మే నుంచి ఇవి ఇందులో ఉంటున్నాయి. ఇంగ్లాండ్ దక్షిణ తీరాన్ని శుభ్రం చేసే ప్రాజెక్ట్‌లో ఇవి కూడా ఓ భాగం. వ్యవసాయం, మురికినీటి ద్వారా విడుదలవుతున్న అధిక పోషకాల ద్వారా ఇక్కడ నాచు సమస్య మరింత ఎక్కువ అవుతోంది'' అని పోర్ట్స్‌మత్ యూనివర్సిటీకి చెందిన జో మోరాల్ తెలిపారు.

''ఇవి నాచు మేటలను ఏర్పరుస్తాయి. కానీ అలలు తిరిగి వెళ్లినప్పుడు ఇక్కడున్న బురదకు నాచు అంటుకుపోతుంది. దాదాపు శీతాకాలపు పక్షులన్నీ ఇక్కడ మనుగడ సాగిస్తాయి. కాబట్టి ఇవి ఆహారం పొందాలంటే బురదలోకి వెళ్లి నాచులాంటి అవరోధాలు దాటాల్సి ఉంటుంది. పేరుకుపోయిన నాచు కారణంగా ఇక్కడి బురదలో ఆక్సిజన్ స్థాయిలు కూడా క్షీణిస్తున్నాయి'' అని నాచురల్ ఇంగ్లాండ్‌ సంస్థకు చెందిన అలిసన్ పోట్స్ అన్నారు.

కాబట్టీ, ఈ కాస్తమొత్తంలో నత్త గుల్లలు మార్పును తీసుకొస్తాయా?

ఈ ప్రశ్నకు పోర్ట్స్‌మత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గోర్డెన్ వాట్సన్ సమాధానం ఇస్తూ.. ''అవి ఓ వాక్యూమ్ క్లీనర్‌లా పనిచేస్తాయనేందుకు మంచి సారూప్యత ఉంది. ఇందులో అవి తినగలిగే కొన్ని పదార్థాలను స్వీకరించడం ద్వారా శుభ్రం చేస్తాయి. వాటితో పాటు నాచు కణజాలంలో విస్తరించిన పోషకాలను వాటి చర్మంపై కణాలతో స్వీకరించడం ద్వారా అవి వృద్ధి చెందేందుకు ఉపయోగించుకుంటాయి. ఈ నత్త గుల్లలు నీటిని శుభ్రం చేసేందుకు ఎలా ఉపయోగపడుతున్నాయో మనం చూడొచ్చు'' అని వివరించారు.

ఈ సమస్య పరిష్కారం కోసం బ్రిటన్, ఫ్రాన్స్ వ్యాప్తంగా ఉన్న మరో ఏడు సంస్థలతో కలిసి పోర్ట్స్‌మత్, బోర్న్‌మత్ యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. సముద్రపు మొక్కల ద్వారా పోషకాల స్థాయిలను తగ్గించడం, పురుగులకు నాచును ఆహారంగా పెట్టడం వంటి ఇతర ప్రత్యామ్నాయాలవైపు కూడా ఆలోచిస్తున్నారు.

''సమస్యను సహజమార్గాల్లో పరిష్కరించగలిగే మార్గాలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. ప్రకృతిని గతంలో మాదిరిగా సమతుల్యంగా ఉంచేందుకు వీలున్న మార్గాలను అవగాహన చేసుకోవడంలో మన సమయాన్ని వినియోగించడం చాలా ముఖ్యం'' అని అలిసన్ అభిప్రాయపడ్డారు.

ఇంగ్లాండ్ తీర ప్రాంతాలకు వచ్చే నీటిని కట్టడి చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించచ్చు. ఈలోగా ప్రకృతే తనను తాను బాగుచేసుకునే మార్గాన్ని అందిపుచ్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)