మాంటెవీడియో మారు: 1000 మందితో టైటానిక్ కన్నా లోతులో మునిగిన నౌక, 80 ఏళ్ల తర్వాత ఎలా దొరికిందంటే....

మాంటెవీడియో మారు

ఫొటో సోర్స్, SILENTWORLD FOUNDATION

ఫొటో క్యాప్షన్, 80 సంవత్సరాలకు పైగా మాంటెవీడియో మారు శిథిలాలు ఎక్కడున్నాయో తెలియలేదు
    • రచయిత, లారెన్స్ పీటర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు వెయ్యి మంది ఆస్ట్రేలియా పౌరులు, సైనికులతో వెళుతున్న జపాన్ నౌక ఫిలిప్పీన్స్ సముద్రంలో మునిగిపోయింది.

ఒక 100 మంది తప్ప అందులో ఉన్న వారంతా చనిపోయారు. ఆ నౌక శిథిలాలను సముద్రాన్వేషకులు కనుగొన్నారు. ఈ నౌకపేరు మాంటెవీడియో మారు.

ఆస్ట్రేలియాకు సంబంధించి ఇది అత్యంత ఘోరమైన ఘటన. పాపువా న్యూ గినియా నుంచి ఖైదీలను తీసుకొస్తున్న నౌక అది. ఆ విషయం తెలియక అమెరికా జలాంతర్గామి నౌకపై దాడి చేసింది.

1942 జూలైలో మాంటెవీడియో మారు నౌక సముద్రంలో మునిగిపోయింది.

979 మంది ఆస్ట్రేలియన్లు, 33 నార్వే నావికులు, 20 మంది జపాన్ గార్డులు, సిబ్బంది చనిపోయారని అంచనా.

ఈ జపాన్ నౌక శిథిలాలను కనుగొనేందుకు ఆస్ట్రేలియాకు చెందిన సముద్రపు పురావస్తు బృందం 'సైలెంట్‌వరల్డ్ ఫౌండేషన్' సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందుకు డచ్ డీప్-సీ సర్వే సంస్థ 'ఫుగ్రో' సహాయం చేసింది.

నౌక శిథిలాలను 4,000 మీ (13,123 అడుగులు) కంటే ఎక్కువ లోతులో ఒక అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (ఏయూవీ) గుర్తించింది. టైటానిక్ శిథిలాలు దొరికిన దాని కంటే లోతు ఇది.

సెర్చ్ టీమ్‌లోని టెక్నికల్ స్పెషలిస్ట్ కెప్టెన్ రోజర్ టర్నర్ బీబీసీతో మాట్లాడుతూ, "ఇది ఇప్పుడు యుద్ధ సమాధి. దీనికి తగిన గౌరవం ఇవ్వాలి" అన్నారు.

నౌక శిథిలాలకు 45 మీటర్ల సమీపం వరకు ఏయూవీ వెళ్లగలిగిందని చెప్పారు.

"నౌకను చూసినప్పుడు చాలా భావోద్వేగాలు కలిగాయి. ముఖ్యంగా, ఖైదీలను బంధించిన గదులను చూసినప్పుడు." అన్నారాయన.

నౌక శిథిలాలు చెదరకుండా చూసుకుంటామని, మానవ అవశేషాలు, కళాఖండాలను తొలగించమని సైలెంట్‌వరల్డ్ తెలిపింది.

మాంటెవీడియో మారు

ఫొటో సోర్స్, SILENTWORLD FOUNDATION

‘‘ఎట్టకేలకు మాంటెవీడియో మారులో ప్రాణాలు పోగొట్టుకున్న వారి సమాధి బయటపడింది. ఇది వారి ఆత్మీయులకు, వారసులకు కొంత ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నాం" అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ అన్నారు.

యూఎసెస్ స్టర్జన్ టార్పెడోలతో దాడి చేసి మాంటెవీడియో మారును ముంచేసింది. యూఎసెస్ స్టర్జన్ అనేది అణుశక్తి నిండిన యుద్ధ నౌక. టార్పెడో అనేది అండర్ వాటర్ మిసైల్.

మాంటెవీడియో మారు ఆరు నిమిషాల్లో నిటారుగా నీళ్లల్లోకి మునిగిందని, 11 నిమిషాల్లో అలల క్రింద అదృశ్యమయిందని కెప్టెన్ టర్నర్ వివరించారు.

కేవలం మూడు లైఫ్‌బోట్‌లను దించారు. జపాన్‌కు చెందిన 102 మంది గార్డులు, సిబ్బంది వాటిల్లోకెక్కి ఫిలిప్పీన్స్ చేరుకోగలిగారు.

"దశాబ్దాల కిందట సముద్రంలో దారుణమైన విపత్తులో చిక్కుకున్న వారి గురించి సమాచారం కోసం వారి ఆత్మీయులు సంవత్సరాల తరబడి ఎదురుచూశారు. ఈ నౌక శిథిలాలు వారి వెతుకులాటకు ఒక ముగింపునిస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు సైలెంట్‌వరల్డ్ డైరెక్టర్ జాన్ ముల్లెన్.

సైలెంట్‌వరల్డ్ అంచనా ప్రకారం, 14 దేశాల నుంచి మొత్తం 1,089 మంది బాధితులు ఈ నౌకలో చిక్కుకున్నారు. వారందరి వారసులను కనుగొనడం సాధ్యం కాలేదు.

కానీ, వారసులు ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్‌లో తమ పేరు నమోదు చేసుకుంటే, దర్యాప్తుపై వివరాలు, స్మారకాల గురించి సమాచారం పొందవచ్చని చెప్పింది.

సెర్చ్ టీం

ఫొటో సోర్స్, SILENTWORLD FOUNDATION

ఫొటో క్యాప్షన్, సెర్చ్ టీం

మాంటెవీడియో మారు కోసం అన్వేషణ ఏప్రిల్ 6న దక్షిణ చైనా సముద్రంలో, ఫిలిప్పీన్స్‌లోని లుజోన్‌కు వాయువ్య దిశలో ప్రారంభమైంది. 12 రోజుల తరువాత నౌక అవశేషాలు దొరికాయి.

తరువాత, సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, నౌకాదళ మాజీ అధికారులు, ఇతర నిపుణులు అందించిన విశ్లేషణలను ఉపయోగించి శిథిలాలను ధృవీకరించడానికి చాలా రోజులు పట్టింది.

నౌక డ్రాయింగులతో, దొరికిన శిథిలాలు సరిపోలాయని తేల్చుకున్న తరువాత ఈ వార్తను బయటపెట్టారు.

"చాలా సంవత్సరాలు పరిశోధన చేశాం. బాధితుల వారసులు వేలల్లో ఉన్నారు. వారిలో ఇద్దరు జీవితమంతా ఈ పరిశోధనలోనే గడిపారు. ఈరోజు నౌక శిథిలాలు కనుగొనడం మా బృందానికి పెద్ద విజయం. మాకు సంతోషంగా ఉంది" అని కెప్టెన్ టర్నర్ అన్నారు.

"1942లో జపనీస్ స్వాధీనం చేసుకున్న పాపువా న్యూ గినియాలోని రబౌల్ నివాసితులకు మాంటెవీడియో మారు విపత్తు ఇప్పటికీ ఒక పీడ కల. ఈ నౌక దొరకడం ఎంత ముఖ్యమో వాళ్లు చెప్పారు." అని అన్నారు.

అయితే, జరిగిన విపత్తు, పోయిన ప్రాణాలు గుర్తొచ్చి, నౌక శిథిలాలు దొరికాయన్న ఉత్సాహం ఆవిరైందని, పరిశోధక బృందం చాలా విచారించిందని జాన్ ముల్లెన్ అన్నారు.

"1,000 మంది సమాధిని చూస్తున్నాం. వియత్నాం యుద్ధంలో మరణించిన ఆస్ట్రేలియన్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఈ విపత్తులో మరణించారు. వారి వారసులకు ఇది చాలా ముఖ్యం" అని ఏబీసీ న్యూస్‌తో ఆయన అన్నారు.

"నౌక మునిగినప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న వారి వారసులు ఇద్దరు మా బృందంలో ఉన్నారు. నౌక కనిపించగానే వారెంత ఆనందించారో, అంత బాధపడ్డారు. అనేక భావోద్వేగాలు నిండిన క్షణం అది" అన్నారు జాన్ ముల్లెన్.

ఇవి కూడా చదవండి: