రక్తదానం: టాటూ వేసుకుంటే రక్తం ఇవ్వకూడదా? ఎవరు రక్తం ఇవ్వవచ్చు, ఎవరు ఇవ్వకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
రక్త దానం ఆవశ్యకతను గుర్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
రక్తదానం గురించి తెలుసుకునే ముందు రక్తం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన రక్తంలో ముఖ్యంగా మూడు రకాల రక్త కణాలు ఉంటాయి.
ఎర్ర రక్త కణాలు: శరీరం అంతా ఆక్సీజన్ సరఫరా చేస్తాయి.
తెల్ల రక్త కణాలు: మన శరీరాన్ని అనారోగ్యాల నుంచి కాపాడతాయి.
ప్లేట్‌లెట్లు: రక్తస్రావం జరగకుండా ఆపడానికి ఉపయోగపడతాయి.
అలాగే రక్తంలో ముఖ్యమైన మరో పదార్థం ప్లాస్మా. రక్తకణాలు అన్నీ ఉండే ద్రవపదార్థం ఇది. ఇందులో రక్తం గడ్డకట్టకుండా ఉండే ప్రోటీన్లు ఉంటాయి.
ఒక యూనిట్ రక్తం అంటే 350 మి.లీ. ఒక యూనిట్ రక్తం ఎక్కించడం వల్ల దాదాపు 1.2 గ్రాముల హీమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తస్రావాన్ని బట్టి, లేక రక్తహీనతను బట్టి కొన్ని సందర్భాలలో 4-5 లేదా ఇంకా ఎక్కువ యూనిట్ల రక్తం ఎక్కించే అవసరం కలగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
రక్తం ఎవరు ఇవ్వవచ్చు? ఎవరు ఇవ్వకూడదు?
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వయో వృద్ధులు తప్ప మిగిలినవారంతా రక్తం దానం చేయవచ్చు. ఎవరెవరు రక్తం ఇవ్వగలరో చూద్దాం.
- 18-65 సంవత్సరాల వయస్సు ఉన్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయొచ్చు.
- హీమోగ్లోబిన్ శాతం 12.5 గ్రా కన్నా ఎక్కువ ఉన్నవారు
- రక్తం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు అంటే, హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులు లేనివారు రక్తం ఇవ్వడానికి అర్హులు.
- బీపీ (100-140/60-90), గుండె వేగం (60-100) సాధారణంగా ఉన్నవారు.
- గుండె సంబంధిత లేక క్యాన్సర్ వంటి ఇతర తీవ్ర అనారోగ్యాలు లేని వారు ఇవ్వొచ్చు.
- ధూమపానం చేసే వారు కూడా రక్తదానం చేయవచ్చు.
- దీర్ఘ కాలిక జబ్బులకు మందులు వాడుతున్న వారు వైద్యుల సలహా మేరకు రక్తదానం చేయాలి. వారు వాడుతున్న మందుల ప్రకారం రక్తదానానికి అర్హులా, కాదా అనే విషయాన్ని వైద్యులు నిర్ధరిస్తారు.
- థైరాయిడ్ ఉన్నవాళ్ళు మందులు వాడుతూ, థైరాయిడ్ అదుపులో ఉంటే రక్తదానం చేయవచ్చు.
- సురక్షితమైన సూదితో పచ్చబొట్టు (టాటూ) వేసుకున్న వారు రక్తదానం చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ, అసురక్షితంగా వేయించుకున్నట్టు అనుమానం ఉంటే, ఒక ఆరు నెలల వరకు రక్తదానం జోలికి పోకూడదు.
ఎవరు రక్తదానం చేయకూడదు?
- లైంగిక సంక్రమణ వ్యాధులు (STDs) అన్నీ రక్తమార్పిడి వల్ల వ్యాప్తి చెందుతాయి. కాబట్టి సిఫిలిస్, గొనోరియా వంటి వ్యాధులు ఉన్న వారు రక్తదానం చేయకూడదు.
- స్వయం ప్రతి రక్షక వ్యాధులు (autoimmune diseases) లేదా రక్తకణాల తయారీలో లోపాలు (hemoglobinopathies) ఉన్నవారు, ఏ రకమైన క్యాన్సర్ ఉన్నా వారు ఎప్పటికీ రక్తం ఇవ్వకూడదు.
- మధుమేహానికి మందులు వాడుతున్నవారు, ఇతర ఏ సమస్య లేకపోతే రక్తదానం చేయవచ్చు. కానీ, ఇన్సులిన్ తీసుకుంటున్న వారు రక్తదానం చేయకూడదు.
- టీకాలు తీసుకున్న వారైతే ఆ టీకాను బట్టి కొన్ని రోజులు రక్తదానం చేయకూడదు.
- అంటే డిఫ్తీరియా, పెట్రుసిస్, టెటనస్, పోలియో ఇంజెక్షన్, హెచ్‌పీవీ టీకాలు తీసుకుంటే రెండు వారాల తర్వాత రక్తదానం చేయవచ్చు.
- మంప్స్, మీజిల్స్, రుబెల్లా, ఓరల్ పోలియో, ఎల్లో ఫీవర్, జేఈ, హెపటైటిస్ టీకా తీసుకున్నవారు నాలుగు వారాల తర్వాత రక్తదానం చేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
రక్తం ఎవరికి అవసరం?
ప్రతీ సంవత్సరం మన దేశంలో సుమారు నాలుగు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతుండగా, దాదాపు లక్షన్నర మరణాలు రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయి. అందులో ఎన్నో మరణాలు అధిక రక్తస్రావంతో, సమయానికి రక్తం అందక జరిగేవే.
కాన్పు సమయంలో రక్తహీనత వల్ల లేదా అధిక రక్తస్రావం కావడంతో ఎందరో గర్భవతులు చనిపోతున్నారు. గర్భవతులకు రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది.
రక్తకణాలు అధికంగా నాశనమయ్యే తలసేమియా వ్యాధి గ్రస్తులకు జీవితాంతం తరుచూ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది.
రక్తం గడ్డ కట్టే వ్యవస్థలో లోపాలు ఉన్న వారికి అంటే హీమోఫిలియా వంటి సమస్యలు ఉన్న వారికి రక్తస్రావం జరిగినపుడు రక్తం ఎక్కించాలి.
క్యాన్సర్ వంటి వ్యాధులు లేదా మలేరియా వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి కూడా రక్తం తగ్గిపోతూ ఉంటుంది.
పేగులకు సంబంధించిన సమస్యల వల్ల, మూత్ర పిండాల సమస్యల వల్ల, ఇంకా అనేక సమస్యలతో రక్తం తక్కువైన వారికి దానిని ఎక్కించే అవసరం కలగవచ్చు.
మన దేశంలో రక్తహీనత పురుషులలో 25 శాతం, మహిళల్లో 57 శాతం, పిల్లల్లో 67 శాతం, గర్భవతులలో 52 శాతంగా నమోదు అయింది.
హీమోగ్లోబిన్ 7 కన్నా తక్కువ ఉంటే ఎర్ర రక్తకణాలు ఎక్కించే అవసరం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని రోజులకు ఒకసారి రక్త దానం చేయవచ్చు?
ఎర్ర రక్త కణాలను +2°C - +6°C మధ్యలో, ప్లేట్లేట్లను +20°C, ప్లాస్మా−18°C కి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాలి.
సరైన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయకపోతే రక్త కణాలు మరణించే లేక రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంది.
- ఆరోగ్యవంతులైన పురుషులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చు.
- ఆరోగ్యవంతులైన మహిళలు ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.
- ప్లేట్‌లెట్లు ప్రతీ వారం చొప్పున సంవత్సరానికి 24 సార్లు దానం చేయవచ్చు.
(రచయిత వైద్యురాలు, ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం)
- డైనోసార్స్: పెట్రోల్, డీజిల్లు ఈ జంతువుల వల్లే పుట్టుకొచ్చాయా?
- జర్మనీ: రూ.1,000 కోట్ల విలువైన సంపదను ఐదుగురు దొంగలు ఎలా కొట్టేశారంటే...
- 30 అడుగుల లోతు నీటిలో 74 రోజులుగా ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నారంటే...
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- టైటానిక్: సముద్ర గర్భంలోని ఈ భారీ నౌక 'డీప్ సీ మ్యాపింగ్'తో ఎంత స్పష్టంగా కనిపిస్తోందో చూడండి...
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














