కోవిడ్-19‌కి సంబంధించిన ఈ ఫేక్ న్యూస్ ప్రపంచాన్ని ఎలా భయపెట్టిందంటే

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాకబ్ కుష్నర్, కాంగ్ చున్ చెంగ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

అది 2020 ఏప్రిల్.. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్-19 మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. అప్పుడే ఓ లైవ్ టీవీ చానెల్‌తో ఇద్దరు ఫ్రెంచ్ డాక్టర్లు మాట్లాడారు. కోవిడ్-19పై క్షయ టీకా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఆఫ్రికన్లపై శాస్త్రవేత్తలు ఆ టీకా పరీక్షించాలని వారు సూచించారు.

‘‘అక్కడ చాలా మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. సరైన చికిత్స విధానాలు కూడా అందుబాటులో లేవు. నేను చెప్పేది కాస్త అతిగా మీకు అనిపించొచ్చు. కానీ, ఆఫ్రికాలో ట్రయల్స్ ఎందుకు చేపట్టకూడదు’’అని పారిస్‌లోని కోచిన్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ చీఫ్ జీన్ పాల్ మీరా అన్నారు.

‘‘ఇది ఎయిడ్స్ అధ్యయనం లాంటిదే. వాటిని మనం ఎక్కువగా వ్యభిచారం జరిగే ప్రాంతాల్లో నిర్వహిస్తాం. ఎందుకంటే అక్కడ ఉండేవారికి ఎయిడ్స్ ముప్పు ఎక్కువ. తమను తాము రక్షించుకునేందుకు వారు చర్యలు కూడా తీసుకోరు’’అని మీరా చెప్పారు.

ఫ్రెంచ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్ కెమెలీ లాట్ కూడా మీరా మాటలతో ఏకీభవించారు. ‘‘మీరు చెప్పింది నిజమే. మేం ఆఫ్రికాలో మరొక అధ్యయనం నిర్వహించే ఆలోచనలో ఉన్నాం’’అని ఆయన చెప్పారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. ఆ ఇద్దరు డాక్టర్లూ జాత్యహంకారులు (రేసిస్టులు) అంటూ చాలా వ్యతిరేకత వచ్చింది. ‘‘మేమేమీ ల్యాబ్‌లో ఎలుకలం కాదు’’అని ఆఫ్రికా నుంచి చాలామంది కామెంట్లలో నొక్కిచెప్పారు. మరోవైపు ఆ ఇద్దరి డాక్టర్ల వ్యాఖ్యలను ఆఫ్రికాలోని ప్రముఖులు ఖండించారు. ఐవరీ ఫుట్‌బాల్ స్టార్ డీడీర్ డ్రోగ్బా, కామెరూన్ ఫుట్‌బాల్ స్టార్ శామ్యూల్ ఎటోలు కూడా నిరసన వ్యక్తంచేసిన వారిలో ఉన్నారు.

ప్రస్తుతం పారిస్ కోర్టులో ఆ డాక్టర్లపై మొరాకో లాయర్స్ క్లబ్ కేసు కూడా నమోదు చేసింది. ఆ డాక్టర్ల వ్యాఖ్యల వల్ల ప్రాణాలు కాపాడే కోవిడ్-19 వ్యాక్సీన్లను ఆఫ్రికన్లు తీసుకోవడానికి వెనకాడుతున్నారని సంస్థ చెబుతోంది. అయితే, ఆఫ్రికాలో వ్యాక్సీన్లు తీసుకొనేందుకు వెనుకాడటానికి చాలా కారణాలు ఉన్నాయి. చట్టవ్యతిరకంగా ఇక్కడ క్లినికల్ టెస్టులు నిర్వహించడంతోపాటు ఫేక్ న్యూస్ వేగంగా వ్యాపించడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.

2021లో ఆఫ్రికన్ సీడీసీ నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న 15 ఆఫ్రికా దేశాల్లో జీవిస్తున్న 45 శాతం మంది ఆఫ్రికన్లను క్లినికల్ ట్రయల్స్‌లో గినియా పిగ్స్ తరహాలో ఉపయోగించినట్లు నమ్ముతున్నామని వివరించారు. మరో 42 శాతం మంది ఆఫ్రికాలోని పేదలను ప్రలోభపెట్టి ఈ ట్రయల్స్‌లో పాల్గొనేలా చేస్తున్నారన్న ఫేక్ వార్తలను నిజంగా భావించినట్లు వెల్లడించారు. మరో 33 శాతం ఆ ట్రయల్స్ వల్ల ఆఫ్రికాలో పిల్లలు కూడా మరణించినట్లు తెలిపారు.

ఆఫ్రికా నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం కావడంతో, మీరా క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా మాటలకు గాయపడిన వారికి నేను క్షమాపణలు చెబుతున్నా’’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, లాట్ కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. మరోవైపు ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన పనిచేస్తున్న సంస్థ వెనకేసుకుని కూడా వచ్చింది.

‘‘కోవిడ్-19 వ్యాక్సీన్లు తీసుకోవద్దని ఆఫ్రికన్లు లేదా ఇతరులకు నేను ఎప్పుడూ చెప్పలేదు’’అని బీబీసీతో లాట్ అన్నారు. మరోవైపు కోవిడ్-19పై క్షయ టీకా పనిచేస్తుందో లేదో చూసేందుకు పశ్చిమ దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ జరిగాయని ఆయన చెప్పారు. ‘‘ఆఫ్రికన్లు ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటే వారికి కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను’’అని ఆయన వివరించారు. మీరా మాత్రం మాట్లాడేందుకు నిరాకరించారు.

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్‌ వేసుకోకపోతే..

జనవరి 2023నాటికి కూడా కొత్త వేరియంట్లు, వేవ్‌లు వస్తూనే ఉండటంలో కోవిడ్-19 మహమ్మారిని ‘‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’’గానే చూస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, వ్యాక్సీన్ తీసుకునేందుకు వెనకాడుతున్న ఆఫ్రికా లాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ మహమ్మారి మనతో మరిన్ని రోజులు ఉంటుందని, ఎందుకంటే వ్యాక్సీన్లు తీసుకోని వారి వల్ల కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఎక్కువని వివరించింది.

‘‘మీరు వ్యాక్సీన్ తీసుకోకపోతే, మీ శరీరం వైరస్‌ను గుర్తుపట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఫలితంగా వైరస్‌కు మీరు చాలా సమయం ఇస్తున్నట్లు అవుతుంది’’అని మొరాకోలోని అయ్యాడ్ యూనివర్సిటీలో ఇంటర్నల్ మెడిసిన్‌ ప్రొఫెసర్ రాచిడ్ అట్ అడిడ్ చెప్పారు. ‘‘వ్యాక్సీన్లు తీసుకోనివారి శరీరంలో వైరస్ వేగంగా తమలాంటి మరిన్ని వైరస్‌లు ఉత్పత్తి చేసుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ వీటిపై దాడిచేసేందుకు కాస్త సమయం పడుతుంది’’అని రాచిడ్ అన్నారు.

వ్యాక్సీన్లు తీసుకోకపోవడం అనే సమస్య చాలా దేశాల్లో కనిపిస్తోంది. ఎందుకు వ్యాక్సీన్లు తీసుకోవడంలేదనే సమస్యకు సంక్లిష్టమైన సమాధానాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఫ్రాన్స్‌ను తీసుకోండి. వ్యాక్సీన్లు తీసుకోని ప్రజలు ఎక్కువ శాతంలోనున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడి ప్రజలకు ప్రజారోగ్య సంస్థలపై నమ్మకం తక్కువ. మరోవైపు దుష్ప్రభావాలపై తప్పుడు వార్తలు, గతంలో వ్యాక్సీన్ కార్యక్రమాల్లో చోటుచేసుకున్న కుంభకోణాలతో ప్రజలు మరింత వెనకాడుతున్నారు.

ఇక ఆఫ్రికా విషయానికి వస్తే, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ప్రముఖులు, జర్నలిస్టులు కూడా కోవిడ్-19 కుట్ర సిద్ధాంతాలు, అసత్య వార్తలను ప్రచారం చేశారు. టాంజానియాలో మాజీ అధ్యక్షుడు జాన్ మగుఫులి మొదట్లో అసలు కోవిడ్-19కు భయపడాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. కోవిడ్-19 ఆంక్షలు పాటించేందుకు నిరాకరించారు. కేసుల సంఖ్యనూ బయటకు చెప్పలేదు. ఆఫ్రికాలో సొత్తును దోచుకునేందుకు కొన్ని విదేశా శక్తులు పన్నుతున్న కుట్రగా దీన్ని ఆయన అభివర్ణించారు. అయితే, చాలా మంది మగుఫులి మాటలను నమ్మారు. అయితే, మార్చి 2021లో అదే కోవిడ్-19తో ఆయన చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

పశ్చిమ దేశాల తరహాలోనే ఆఫ్రికాలోనూ కోవిడ్-19పై ఫేక్ న్యూస్ విస్తృతంగా వ్యాపించింది. కరోనావైరస్ 5జీ టెక్నాలజీ వల్ల వచ్చిందని దక్షిణాఫ్రికాలో చాలా మంది భావిస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ వాదన ఒక బెల్జియం డాక్టర్ నుంచి మొదలైంది. ఈ ఫేక్ న్యూస్ వల్లే బ్రిటన్‌లో కొన్ని మొబైల్ ఫోన్ స్టోర్‌లపై దాడులు కూడా జరిగాయి.

ఇథియోపియా రాజధాని అడిస్అబాబాలో టీవీ చానెల్స్, రేడియో నుంచి వార్తలు వినేవారితో పోలిస్తే సోషల్ మీడియా నుంచి వార్తలు వినేవారిలో వ్యాక్సీన్ తీసుకోవడానికి వెనకాడే ముప్పు రెండు రెట్లు ఎక్కువని మరో అధ్యయనంలో తేలింది.

కెన్యాలో సగం కంటే ఎక్కువ మందే సోషల్ మీడియా ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇక్కడ టీవీ, రేడియో చానెల్స్ కూడా తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి. తమ అధ్యయనంలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది కోవిడ్-19పై అసత్య వార్తలను నమ్మినట్లు తెలిపారు.

ప్రొఫెసర్ ఫతీహా ఎల్ హిలాలీ

ఫొటో సోర్స్, Kang-Chun Cheng

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ ఫతీహా ఎల్ హిలాలీ

మొరాకోలో ఒక మహిళకు వ్యాక్సీన్‌ వల్ల అరుదైన ఇన్ఫెక్షన్ సోకినట్లు ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత, ప్రజల్లో భయం మరింత పెరిగిందని దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని కసాబ్లాన్సా రీజినల్ డైరెక్టర్ ముస్తాఫా అమిరీక్ చెప్పారు. ‘‘తప్పుడు ర్తలు యూట్యూబ్‌లో బాగా వైరల్ అయ్యేవి. మాకు కనిపిస్తున్న ఈ వీడియోల్లో ఎక్కువ శాతం అమెరికా, యూరప్‌లలోని ప్రజాస్వామ్య దేశాల నుంచి వచ్చినవే ఉన్నాయి’’అని ఆయన అన్నారు.

‘‘తప్పుడు వార్తలు, సందేహాలు, గందరగోళం.. ఇవన్నీ పశ్చిమ దేశాల నుంచే ఇక్కడకు వస్తున్నాయి’’అమిరీక్ అన్నారు.

అయితే, ఇక్కడ తప్పుడు వార్తలు స్వైర విహారం చేస్తున్నట్లు ఆఫ్రికన్లకు తెలుసు కూడా. ఆఫ్రికా సీడీసీ సర్వేలోని 42 శాతం మంది, మొరాకోలో అయితే 75 శాతం మంది, తాము కోవిడ్-19కు సంబంధించి చాలా తప్పుడు సమాచారాన్ని చూడాల్సి వస్తోందని అంగీకరించారు. అయితే, అసలు ఏది తప్పుడు వార్తో, ఏది నిజమైనదే గుర్తించడమే ఇక్కడ ప్రధాన సమస్య.

మార్చి 2020లో మొరాకోలో తొలి కోవిడ్-19 కేసులు బయటపడ్డ కొన్ని వారాల్లోనే ఫేక్ న్యూస్ వ్యాపింప జేస్తున్నారని ఆరోపణలపై డజన్ల మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలా అరెస్టైన వారిలో 48 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. అసలు కోవిడ్-19 లాంటిదేమీలేదని ఆమె యూట్యూబ్‌లో ఒక వీడియో చేశారు.

ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని, వ్యాక్సీన్లు తీసుకోవాలని తరచూ వీడియోలు చేసేవారిలో వెస్టెర్న్ సహారాలోని మెడిసిన్ అండ్ ఫార్మసీ ఆఫ్ లాయూన్‌లో ప్రొఫెసర్ ఫతీహా ఎల్ హిలాలీ ఒకరు. ఆమె స్నేహితురాలు ఇలా వ్యాక్సీన్ వేసుకోకపోడంతో, కోవిడ్-19 సోకి మరణించారు. 2021లో రోజూ తనకు ఫేక్ న్యూస్‌కు సంబంధించి 30 నుంచి 50 వీడియోలను చాలా మంది ఫార్వార్డ్ చేసేవారిని, అందులో 99 శాతం వీడియోలు విదేశాల నుంచి వచ్చినవేనని ఆమె చెప్పారు.

కోవిడ్

ఫొటో సోర్స్, Getty Images

వలసవాదం కూడా..

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు వ్యాక్సీన్లు తీసుకోవడానికి వెనుకాడటానికి పశ్చిమ దేశాలు ఇక్కడ అనైతికంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టడమూ ఒక కారణం. అందుకే ఇప్పటికీ చాలా మంది పశ్చిమ దేశాల వైద్య సంస్థలను నమ్మరు.

‘‘పశ్చిమ దేశాలపై అవిశ్వాసం అనేది ఆఫ్రికాకు కొత్తేమీ కాదు. దీనికి ఆఫ్రికాలో పశ్చిమ దేశాల వైద్య సంస్థల అనైతిక చరిత్ర కూడా కారణం’’అని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో వ్యాఖ్యానించింది. ‘‘తమను గినియా పిగ్స్ తరహాలో క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగిస్తారని ఆఫ్రికన్లు ఆందోళన చెందడానికి కారణం కూడా అదే. శతాబ్దాలపాటు పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు ఇక్కడ అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలోనూ ఇలాంటివి కొన్ని జరిగాయి’’అని ఆ నివేదికలో వివరించారు.

ఉదాహరణకు 1990ల్లో నైజీరియాలో 11 మంది చిన్నారులు వినికిడి, చూపు కోల్పోవడం, మెదడు దెబ్బ తినడం లాంటి సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ వీరిపై కొత్త యాంటీబయోటిక్స్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడమేనని వార్తలు వచ్చాయి. అయితే, ఆ చిన్నారులు నాడీ వ్యాధితో మరణించారని, దీనికి ఆ ఔషధంతో ఎలాంటి సంబంధమూలేదని ఫైజర్ చెబుతూ వచ్చింది. అయితే, 2011లో కోర్టుకు వెలుపల నాలుగు కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆ కేసును సంస్థ పరిష్కరించుకొంది.

1994లో జింబాంబ్వేలో 17,000 మంది మహిళలపై అమెరికా, బ్రిటన్‌లకు చెందిన పరిశోధకులు హెచ్ఐవీ మందులను ప్రయోగించారు. ఎయిడ్స్ వీరి పిల్లలకు ఎయిడ్స్ సోకకుండా అడ్డుకోవచ్చో లేదో తెలుసుకునేందుకు ఆ ట్రయల్స్ చేపట్టారు. అయితే, ఆ ట్రయల్స్ అనైతికమని తర్వాత వారు అంగీకరించారు. ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో సగం మందికి ప్లాసెబో ఇచ్చారు. అంటే వీరికి ఎలాంటి ఔషధమూ ఇవ్వలేనట్లే. అంటే వీరికి జన్మించిన పిల్లలకు తల్లి నుంచి వైరస్ సోకే అవకాశం చాలా ఎక్కువ, అమెరికాలో అయితే, ఇలా ప్లాసిబో ఇవ్వరని మూడేళ్ల తర్వాత నిర్వహించన దర్యాప్తులో తేలింది.

ఆఫ్రికాలో పశ్చిమ దేశాల ప్రయోగాల వల్లే ఆ ఇద్దరు ఫ్రెంచ్ వైద్యుల మాటలపై మొరాకోలో అంత వ్యతిరేకత వ్యక్తమైందని మొరాకో లాయర్స్ క్లబ్ హెడ్ మురాద్ ఎలాజోటీ అన్నారు. 1956 వరకు మొరాకో ఫ్రెంచి పాలనలో ఉండేది. అరబిక్, బార్బెర్‌తోపాటు ఫ్రెంచ్ కూడా ఇక్కడ ఉపయోగిస్తారు. ఇక్కడ ఫ్రెంచ్ వార్తా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అంటే ఇక్కడ వీడియోలకు అనువాదం కూడా అవసరం లేదు. అంటే లక్షల మంది మొరాకన్లు ఫ్రెంచ్‌లోని జాత్యహంకార వార్తలను నేరుగా అర్థం చేసుకోగలరు.

‘‘ఆ ఇద్దరు డాక్టర్ల మాటలు విన్నప్పుడు, మొదట ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే వీటిని వైద్యులే చేశారు’’అని మురాద్ అన్నారు. ‘‘అందుకే చాలా మంది వ్యాక్సీన్లు తీసుకోవడానికి వెనకాడుతున్నారు’’అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఈ 11 ఏళ్ళ అమ్మాయి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది...

వైద్యుల వ్యాఖ్యలతో..

‘‘ఆ వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారంటే. అవి చేసిన వ్యక్తులు శాస్త్రవేత్తలు. వారు పనిచేస్తున్న సంస్థలు ఫ్రాన్స్‌లో చాలా పెద్దవి’’అని మురాద్ చెప్పారు.

ఆ వీడియో తన సొంత కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసిందని మురాద్ అన్నారు. ‘‘మా అమ్మ కూడా యాంటీ-వ్యాక్సీన్ వ్యక్తే. ఆ వీడియోను ఆమె కూడా చూశారు. దీంతో ఆమె చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆఫ్రికన్లపైనే ఇలాంటి ప్రయోగాలు చేపడతారని, ఇక్కడ మంచి ఫలితాలు వస్తేనే, యూరోపియన్ల ప్రయోగిస్తారని ఆమె బలంగా నమ్ముతారు’’అని మురాద్ చెప్పారు.

అయితే, కోవిడ్-19 వ్యాక్సీన్లు తీసుకోవాలని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు మొరాకో ప్రభుత్వం భారీగా ప్రచారాలు చేపడుతోంది.

‘‘మొదట్లో చాలా మంది వ్యాక్సీన్లను వ్యతిరేకించేవారు. అయితే, మీ ఆఫీసులో ఒక వ్యక్తి రెండు డోసుల వ్యాక్సీన్ వేసుకున్నా ఆయనకేమీ కాకపోతే, మీరు కూడా ప్రయత్నిద్దాం అనుకుంటారు కదా. అలా నెమ్మదిగా పరిస్థితి మారుతోంది’’అని అడిడి వివరించారు.

అలా మొత్తానికి మురాద్ తల్లి కూడా వ్యాక్సీన్ తీసుకున్నారు. ‘‘మొదట్లో అయితే, ఫ్రాన్స్ కంటే మొరాకోలో వ్యాక్సీన్ శాతం ఎక్కువగా ఉండేది. కానీ, నేడు ఇక్కడ వ్యాక్సీన్ స్థాయిల కంటే యూరోపియన్ దేశాలు చాలా ముందున్నాయి’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, వ్యర్థాల సమస్యను మహమ్మారి మరింత పెంచిందంటున్న ఓ అధ్యయనం

‘‘ఆఫ్రికాలో రెండు డోసులు తీసుకున్న వారు 70 శాతానికి పెరగాలంటే చాలా కృషి చేయాల్సి ఉంటుంది’’అని డబ్ల్యూహెచ్‌వోలో వ్యాక్సీన్ ఇంట్రడక్షన్ మెడికల్ ఆఫీసర్ ఫినోవా అటుహెబ్వే చెప్పారు. ‘‘వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఫేక్ న్యూస్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది’’అని ఆయన అన్నారు.

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం ఇప్పటితో ముగిసిపోదు. ఆ డాక్టర్లపై కేసు కూడా అంతే. దీన్ని మొరాకో లాయర్స్ క్లబ్, కౌన్సిల్ ఆఫ్ బ్లాక్ అసోసియేషన్, ఫ్రెండ్ జేవిస్ యూనియన్ ఫర్ పీస్ కలిసి సంయుక్తంగా ఫైల్ చేశాయి. అయితే, లాట్‌పై వేసిన కేసును న్యాయమూర్తి కొట్టివేశారు. కానీ, మీరాపై కేసు నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబరు 15న దాన్ని విచారించబోతున్నారు.

ఒకవేళ కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, 45,000 యూరోలు (రూ.40 లక్షల) వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష కూడా విధించే అవకాశముంది. అయితే, ఇలాంటి కేసుల్లో గరిష్ఠ జరిమానా లేదా శిక్షలు వేయడం అరుదు.

‘‘మేం మీరాను జైలుకు పంపించాలని అనుకోవడం లేదు. లేదా గరిష్ఠ జరిమానా విధించాలని అనుకోవట్లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కావు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని మేం ఆయనతోపాటు ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటున్నాం’’అని అడిడి చెప్పారు.

‘‘మేం ఆఫ్రికా జనాభాను గౌరవిస్తామని, సమానంగా చూస్తామని వారు చెప్పాలి. ఆఫ్రికన్లు ల్యాబ్‌లో ఎలుకలు కాదు’’అని మురాద్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)