రాణి వేలు నాచ్చియార్: బ్రిటిష్ వారిని ఓడించిన వీర వనిత కథ...

రాణి వేలు నాచ్చియార్

ఫొటో సోర్స్, TWITTER @VERTIGOWARRIOR

ఫొటో క్యాప్షన్, రాణి వేలు నాచ్చియార్
    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, జర్నలిస్ట్, పరిశోధకుడు

తమిళులు ఆరాధనగా 'వీరమంగై' అని పిలుచుకునే వేలు నాచ్చియార్ ఆంగ్లేయులకు ఎదురెళ్లిన తొలి భారతీయ రాణి. 18వ శతాబ్దంలో దక్షిణాన ఉన్న శివగంగై సంస్థానాన్ని పాలించిన రాణి వేలు నాచ్చియార్, టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ సాయంతో ఈస్టిండియా కంపెనీపై యుద్ధం చేసింది.

వీరమంగై అంటే వీర వనిత అని అర్థం. రాణి వేలు నాచ్చియార్ దిండిగల్ నగరంలో హైదర్ అలీని కలిసింది. ఇప్పుడు తమిళనాడులో ఉన్న ఈ నగరం అప్పట్లో మైసూర్ రాజ్యంలో భాగంగా ఉండేది. తాళాలు, బిర్యానీలకు ఇది ప్రసిద్ధి చెందింది.

మైసూర్ రాజ్యానికి సుల్తాన్ హైదర్ అలీ. ఈ రాజ్యం ఉత్తరాన కృష్ణా నది, తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉండేది.

వేలు నాచ్చియార్ భర్త ముత్తు వడుగనాథ్ పెరియవుడయ తేవర్ శివగంగై సంస్థానానికి రాజు. 1773లో ఈస్టిండియా కంపెనీ చేతిలో పెరియవుడయ తేవర్ ప్రాణాలు కోల్పోయాడు. శివగంగై సంస్థానం ఆంగ్లేయుల చేతికి చిక్కింది.

తన కుమార్తె వెళ్లచ్చితో పాటు అక్కడి నుంచి పారిపోయిన వేలు నాచ్చియార్ హైదర్ అలీ సహాయం కోరింది.

హైదర్ అలీ, వేలు నాచ్చియార్‌ల సమావేశం పరస్పర గౌరవం, మర్యాదలతో జరిగింది. తర్వాతి తరంలో టిప్పు సుల్తాన్ కూడా ఆ గౌరవాన్ని కొనసాగించాడు.

నాచ్చియార్‌కు హైదర్ అలీ అందించిన సహాయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఆ కథలోకి వెళ్లేముందు, వేలు నాచ్చియార్ ఎవరు? ఆమెకు ఎదురైన సవాళ్లేంటి తెలుసుకుందాం.

యుద్ధవిద్యల్లో ఆరితేరిన యువరాణి

వేలు నాచ్చియార్‌ తల్లిదండ్రులు రామనాథపురం (రామనాడు) రాజ్యానికి పాలకులు. ప్రస్తుతం ఈ ప్రాంతం తమిళనాడులో ఉంది.

వేలు నాచ్చియార్‌ వారికి ఏకైక కుమార్తె. 1730లో జన్మించింది. కూతురుకు చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ, విలువిద్య, కొడవలి విసరడం, సిలంబం (వెదురు కర్రలతో పోరాడడం) వంటి యుద్ధ కళలలో శిక్షణ అందించారు.

నాచ్చియార్‌కు ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ సహా అనేక భాషలపై పట్టు ఉంది. పదహారు సంవత్సరాల వయసులో నాచ్చియార్‌కు శివగంగై యువరాజు పెరియవుడయ తేవర్‌తో వివాహమైంది.

వీరిద్దరూ 1750 నుంచి 1772 వరకు అంటే రెండు దశాబ్దాలకు పైగా శివగంగైకి పాలకులుగా ఉన్నారు.

రాణి వేలు నాచ్చియార్

ఫొటో సోర్స్, PAN MCMILLAN

యుద్ధంలో భర్త మరణం.. హైదర్ అలీని కలవడం

1772వ సంవత్సరంలో ఆర్కాట్ నవాబు ఆంగ్లేయులతో కలిసి శివగంగైపై దండెత్తాడు. దాన్ని 'కలైయర్ కోయిల్ యుద్ధం' అంటారు. ఈ యుద్ధంలో నాచ్చియార్ భర్త పెరియవుడయ తేవర్ ప్రాణాలు కోల్పోయాడు.

దాడి సమయంలో రాణి వేలు నాచ్చియార్, ఆమె కుమార్తె సమీపంలోని ఆలయంలో ఉన్నారు. అందుకే ప్రాణాలతో బయటపడ్డారు.

పెరియవుడయ తేవర్‌కు నమ్మకస్తులైన మరుదు సోదరులు (వెల్లై మరుదు, చిన్న మరుదు), వారిని అక్కడ నుంచి తప్పించి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. నాచ్చియార్‌కు తన భర్త మృతదేహం కూడా దొరకలేదు.

18వ, 19వ శతాబ్దాల సైనిక చరిత్రలో నిపుణుడైన శుబేంద్ర ఈ యుద్ధం, అనంతర పరిణామాలపై రాస్తూ, రాణి నాచ్చియార్ నవాబు కళ్లుగప్పి తిరిగారని, ఆమెకు కొందరు మహిళా యోధులు సహాయంగా నిలిచారని వివరించారు.

ఈ బాటలో నాచ్చియార్‌కు సహాయం చేసిన ఉడైయాళ్ అనే యువతి నవాబు చేతికి చిక్కింది. నవాబు సైనికులు ఆమెను ఎన్ని చిత్రహింసలు పెట్టినా రాణి నాచ్చియార్‌ జాడ చెప్పలేదు. దాంతో, ఆమె తల నరికించాడు నవాబు.

వేలు నాచ్చియార్ కొన్నాళ్లు అడవులు, గ్రామాలు పట్టి తిరిగింది. శివగంగైని ఆంగ్లేయుల నుంచి తిరిగి దక్కించుకోవాలంటే తనకు సైన్యం, సహాయం అవసరమని ఆమె గ్రహించింది. ఆమెకు అండగా నిలబడిన మరుదు సోదరులు సైన్యాన్ని సమీకరించడం మొదలెట్టారు. కానీ, బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి అది సరిపోదు.

మైసూర్ సుల్తాన్ హైదర్ అలీకి ఆంగ్లేయులతో గానీ, ఆర్కాట్ నవాబుతో గానీ సత్సంబంధాలు లేవు. అందుకే రాణి వేలు నాచ్చియార్ ఆయన సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. మైసూర్‌కు ప్రమాదరకమైన ప్రయాణం చేసింది.

శివగంగైకి 100 కి.మీ దూరంలో ఉన్న దిండిగల్‌లో వేలు నాచ్చియార్ హైదర్ అలీని కలిసింది. హైదర్ అలీతో ఉర్దూలో మాట్లాడింది. ఆమె ధైర్యం, దృఢసంకల్పం హైదర్ అలీని ఆకట్టుకుంది.

నాచ్చియార్‌ను దిండిగల్ కోటలో ఉండమని ఆహ్వానించాడు హైదర్ అలీ. అక్కడ ఆమెను రాణిలానే గౌరవించారు. నాచ్చియార్‌తో స్నేహానికి చిహ్నంగా హైదర్ అలీ తన రాజభవనంలో ఆమె కోసం ఒక మందిరాన్ని కూడా నిర్మించాడు.

రాణి వేలు నాచ్చియార్ విగ్రహం ఉన్న శివగంగై కోట

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

ఫొటో క్యాప్షన్, రాణి వేలు నాచ్చియార్ విగ్రహం ఉన్న శివగంగై కోట

ఆంగ్లేయులపై విజయం

హైదర్ ఆలీ, నాచ్చియార్‌ స్నేహం పరస్పర అవసరాల నుంచి పుట్టిందని చరిత్రకారుడు ఆర్. మణికందన్ అంటారు.

నాచ్చియార్‌కు ఆంగ్లేయులపై దాడి చేసేందుకు సైన్య సహాయం కావాలి. దక్షిణ ప్రాంతంలో ఆంగ్లేయులు చొచ్చుకురాకుండా నిరోధించడానికి ఇదొక అవకాశంగా భావించారు హైదర్ అలీ. అందుకే రాణి నాచ్చియార్‌కు తోడుగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు.

నాచ్చియార్‌కు నెలకు 400 పౌండ్లు, ఆయుధాలతో పాటు సయ్యద్ కర్కీ నేతృత్వంలో 5,000 మంది సైనికులతో కూడిన పదాతిదళాన్ని, అశ్వికదళాన్ని పంపించాడు.

"ఈ సైన్యంతో రాణి నాచ్చియార్‌ శివగంగైలోని వివిధ ప్రాంతాలను జయించడం ప్రారంభించింది. 1781లో బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న తిరుచిరాపల్లి కోటకు కూడా చేరుకుంది" అని శుబేంద్ర రాశారు.

"హైదర్ అలీ పంపించిన సహాయం అక్కడి వరకే సరిపోయింది. కోట లోపలికి ప్రవేశించడానికి రాణి నాచ్చియార్‌ దగ్గర బలగం లేదు. మరికొంత సైన్యాన్ని సమీకరించుకుని యుద్ధానికి వెళ్లాలని రాణి నాచ్చియార్‌ నిర్ణయించుకుంది.

ఉడైయాళ్ త్యాగానికి గుర్తుగా నాచ్చియార్‌ ఆమె పేరు మీద ఒక మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ సైన్యానికి నాయకత్వం వహించిన కుయిలి అనే యోధురాలు కోట లోపలికి ప్రవేశించేందుకు ప్రణాళిక రచించింది."

రాణి నాచ్చియార్‌ గెలుపు కోసం కుయిలి ప్రాణత్యాగానికి సిద్ధపడింది.

"దసరా పండుగకు మరికొద్ది రోజులే ఉంది. దగ్గర్లో ఉన్న పల్లెల్లోని ఆడవాళ్ళందరూ గుడికి వస్తారు. మనం వాళ్ళతో కలసి లోపలికి వెళ్దాం. మన ఉడైయాళ్ సైన్యంలో ఒక చిన్న బృందాన్ని తీసుకుని నేను లోపలికి వెళతాను. మా వద్ద ఉన్న ఆయుధాలు ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా కోట లోపలికి ప్రవేశిస్తాం. తరువాత, మీ కోసం లోపలి నుంచి కోట ద్వారం తెరుస్తాం" అని కుయిలి తన ప్రణాళికను వివరించింది.

అది వినగానే రాణి నాచ్చియార్‌ ముఖం వికసించింది.

"నువ్వు ఎప్పుడూ ఏదో ఒక దారి కనిపెడతావు కుయిలి. దీంతో, ఉడైయాళ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది" అంటూ ప్రశంసించింది రాణి నాచ్చియార్‌.

విజయదశమి రోజు రాగానే చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలతో పాటు కుయిలి, ఆమె సహచరులు కోట లోపలికి వెళ్లి ప్రధాన మందిరానికి చేరుకున్నారు.

కుయిలి ఇచ్చిన పిలుపు అందుకున్న ఉడైయాళ్ మహిళా యోధులు బ్రిటిష్ సిపాయిలపై కత్తులు దూశారు. క్రమంగా కోట తలుపుల వద్దకు చేరుకున్నారు.

కుయిలి అక్కడ ఉన్న కాగడా తీసుకుని తనకు తాను నిప్పంటించుకుంది. పక్కనే ఉన్న ఆయుధాగారంలోకి దూసుకెళ్లింది. అక్కడ మందుగుండు సామాగ్రి ఉంది. ఒక్కసారిగా పెద్ద పేలుడు వినిపించింది. నిమిషాల వ్యవధిలోనే కోట ద్వారాలు తెరుచుకున్నాయి. ఇద్దరు ఉడైయాళ్ మహిళా యోధులు గుర్రాలెక్కి రాణి నాచ్చియార్‌ సైన్యం దాక్కున్న ప్రదేశానికి చేరుకున్నారు.

"రాణీ, తలుపులు తెరుచుకున్నాయి. బ్రిటిషర్ల మందుగుండు సామగ్రి ఉన్న గదులు పేల్చేశాం. దాడి చేయడానికి ఇదే సరైన సమయం" అని ఒక యోధురాలు నాచ్చియార్‌కు చెప్పింది.

"అలాగే. కానీ, నా బిడ్డ కుయిలి ఎక్కడ?" అని అడిగింది నాచియార్.

ఉడైయాళ్ మహిళా యోధులు తలలు వంచుకున్నారు. కుయిలి చేసిన ప్రాణత్యాగాన్ని నాచ్చియార్‌కు చెప్పారు.

ఈ వార్త విన్న రాణి నాచ్చియార్‌ నిశ్చేష్టురాలైంది. పక్కనే ఉన్న సయ్యద్ కర్కీ రాణి నాచ్చియార్‌ను అప్రమత్తం చేశాడు.

"ఆమె త్యాగాన్ని వృథా కానివ్వం. దాడి చేయవలసిన సమయం వచ్చింది. మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం" అని రాణి నాచ్చియార్‌తో చెప్పాడు.

వేలు నాచ్చియార్‌ ధైర్యం కూడదీసుకుని దాడికి ఆదేశించింది.

కోట లోపల కల్నల్ విలియమ్స్ ఫ్లాటన్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రికి కొరత ఏర్పడింది.

1781లో అగస్టులో వేలు నాచ్చియార్‌, హైదర్ అలీల ఉమ్మడి దళాలు కోట లోపలికి ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకున్నాయని రచయిత సురేశ్ కుమార్ రాశారు.

ఆ విధంగా, మొదటి స్వాతంత్ర్య సమరానికి 77 సంవత్సరాలకు ముందే రాణి వేలు నాచ్చియార్‌ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి జయించిన మొదటి భారతీయ రాణిగా కీర్తి గడించింది.

శివగంగైని తిరిగి సొంత చేసుకున్నాక, పదేళ్ల పాటు రాణి వేలు నాచ్చియార్‌ పాలన కొనసాగించింది. తదనంతరం రాజ్యాన్ని కుమార్తె వెళ్ళచ్చికి అప్పగించింది.

వేలు నాచ్చియార్ శత్రువుల బలహీనతలను ఒడిసిపట్టుకుని దెబ్బకొట్టడంలో సమర్ధురాలైన నాయకురాలని చరిత్రకారుడు ఆర్. మణికందన్ అంటారు. బ్రిటిష్ వారిని తిప్పికొట్టడానికి హైదర్ అలీ సహాయం కోరడమే అందుకు ఉదాహరణ.

యుద్ధంలో పరాక్రమం చూపించిన వీర వనిత రాణి నాచ్చియార్‌, ప్రజల పట్ల సానుభూతితో పాలన సాగించరన్న ఖ్యాతినీ గడించారు.

"ప్రజల పట్ల ప్రేమతో, న్యాయబద్ధంగా పరిపాలన సాగించారని" చరిత్రకారిణి వి. పద్మావతి అంటారు.

పీడితులైన దళితులకు ఆశ్రయం కల్పించారు రాణి నాచ్చియార్‌. ఆమెకు ప్రజల పట్ల ఉన్న సానుభూతి, ప్రేమకు ఇదొక ఉదాహరణ అని చరిత్రకారులు చెబుతారు.

రాణి వేలు నాచ్చియార్ స్టాంపు

ఫొటో సోర్స్, HISTORY LUST

ఫొటో క్యాప్షన్, రాణి వేలు నాచ్చియార్ స్టాంపు

యుద్ధానంతర పరిణామాలు

ఆంగ్లేయులపై విజయం తరువాత వేలు నాచ్చియార్ ఒక దశాబ్దం పాటు రాజ్యాన్ని పరిపాలించింది. కష్టకాలంలో తనకు తోడుగా నిలబడిన సహచరులకు రాజ్యంలో ప్రముఖ పదవులు ఇచ్చింది.

హైదర్ అలీ చేసిన సహాయానికి గుర్తుగా సార్గానిలో ఒక మసీదును నిర్మించింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రెండవ మైసూర్ యుద్ధంలో హైదర్ ఆలీకు సహాయంగా వేలు నాచ్చియార్ సైన్యాన్ని పంపించిందని జేహెచ్ రాయిస్ 'ది మైసూర్ స్టేట్ గెజిటీర్'లో రాశారు.

హైదర్ అలీ మరణానంతరం, అతని కుమారుడు టిప్పు సుల్తాన్‌తో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది రాణి నాచ్చియార్. టిప్పును సోదరుడిగా భావించి అభిమానించింది. బహుమతిగా ఒక సింహాన్ని పంపించింది కూడా.

వేలు నాచ్చియార్ సైన్యాన్ని బలోపేతం చేయడానికి టిప్పు సుల్తాన్ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పంపించాడని ముహిబ్బుల్ హసన్ రాశారు.

టిప్పు సుల్తాన్ పంపిన కత్తిని వేలు నాచ్చియార్ అనేక యుద్ధాలలో ఉపయోగించింది.

రాణి నాచ్చియార్ తదనంతరం ఆమె కుమర్తె వెళ్లచ్చి 1790 నుంచి 1793 వరకు రాజ్యాన్ని పాలించింది. వేలు నాచ్చియార్ 1796లో శివగంగైలో మరణించింది.

2008లో ఆమె జ్ఞాపకార్థం ఒక తపాలా స్టాంపును విడుదల చేశారు. 2014లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శివగంగైలో వీర మంగై వేలు నాచ్చియార్‌ స్మారక చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. రాణి నాచ్చియార్ ఆరు అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.

జయలలిత హయాంలోనే హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌ల సహాయానికి గుర్తుగా ఒక చిన్న మండపాన్ని నిర్మించారు. ఈ స్మారక చిహ్నం గత ఐదు సంవత్సరాలుగా దిండిగల్‌లో పర్యటక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)