మానవ శరీరంలో ప్రకృతి చేసిన 'డిజైనింగ్ తప్పులు'

మానవ శరీరాకృతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మార్షియల్ ఎస్కుడెరో
    • హోదా, ది కాన్వర్జేషన్

రెండు శాస్త్రీయ పరిశోధనలు మానవుల ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చివేశాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటారు. ఒకటి, భూమి విశ్వానికి కేంద్రం కాదు అన్నది. రెండవది, భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అయినా, మనిషి పుట్టుక కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే జరిగిందన్నది.

మానవులు లేకుండానే ఈ విశ్వం ఉనికిలో ఉంది. మనమే ఆలస్యంగా కళ్లు తెరిచాం.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మానవ శరీరాకృతి "రూపకల్పన" సరిగ్గా జరగలేదు. ప్రకృతి చేసిన డిజైన్‌లోనే చాలా లోపాలున్నాయి.

పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థకు జరిగిన అన్యాయం

మన శరీర నిర్మాణం ఎంత పేలవంగా జరిగిందో చెప్పడానికి మంచి ఉదాహరణ పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ. అంత సున్నితమైన అవయవం అలా బయటకు కనిపించేలా ఉండడం తెలివైన నిర్మాణంగా తోచదు. గుండె, ఊపిరితిత్తుల్లా చర్మం లోపల భద్రంగా ఉంటే బాగుండేది.

సమస్య ఏమిటంటే, పురుషుల్లో వీర్యకణాలు మానవ శరీర ఉష్ణోగ్రత (98.6ºF) వద్ద సరిగ్గా అభివృద్ధి చెందవు. ఆ ఉష్ణోగ్రతను కొంచెం తగ్గించుకునే పరిష్కారాలు మనకు తెలుసు.

శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించుకోలేని జీవులు అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్.. కప్ప, చేప వంటి వాటిలో పురుష పునరుత్పత్తి అవయవాలు సురక్షితంగా ఉంటాయి.

మానవుల్లా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించగలిగే జంతువులు అంటే వార్మ్ బ్లడెడ్ యానిమల్స్.. ఏనుగులు, పక్షులు వంటి వాటిలో కూడా పురుషాంగం భద్రంగా ఉంటుంది. పునరుత్పతి వ్యవస్థకు హాని కలిగించేలా ఉండదు.

మనుషులకే ఈ లోపం.

వెన్నెముక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మానవులకు నడుం నొప్పి రావడం ఖాయం

మనుషులకే నడుం నొప్పి వస్తుంది, ఎందుకు?

మన శరీరాకృతి ఎంత మోటుగా ఉంటుందో చెప్పడానికి వెన్నెముక నిస్సందేహంగా మరొక ఉదాహరణ. వెన్ను నొప్పి లేదా నడుం నొప్పి లేని, రాని మనిషి కనబడడు. మానవ శరీర నిర్మాణం ఎంత లోపభూయిష్టమైనదో తెలుసుకోవడానికి అదే సాక్ష్యం.

నాలుగు కాళ్లతో నడిచే క్షీరదాలలో వెన్నుపూసలు అడ్డంగా ఉంటాయి. వెన్నెముక వంపు తిరిగి శరీరంలో మిగతా భాగాలకు ఊతమిస్తుంది.

కానీ మనుషులు రెండు కాళ్లపై నడుస్తారు కాబట్టి, వెన్నెముక నిటారుగా ఉంటుంది. వెన్నుపూసలు ఒకదానిపై ఒకటి ఉంటాయి.

దీని వల్ల వెన్నెముక కింది భాగంపై ఎక్కువ భారం పడుతుంది. అక్కడ ఉన్న వెన్నుపూసలు శరీరానికి వివిధ రకాలుగా శక్తిని అందించాల్సి ఉంటుంది. అందుకే మానవులకు నడుం నొప్పి రావడం ఖాయం. ఇది ప్రకృతి నియమం లాంటిది.

కళ్లల్లో గుడ్డి మచ్చ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కళ్లల్లో గుడ్డి మచ్చ

కళ్ళల్లో గుడ్డి మచ్చ

ఏ మాత్రం తెలివి లేని నిర్మాణానికి ఇంకో ఉదాహరణ, కళ్లల్లో ఉండే గుడ్డి మచ్చ (బ్లైండ్ స్పాట్).

కళ్ళల్లో ఉండే రెటీనా ఫోటోరిసెప్టర్లతో కప్పి ఉంటుంది. ఇవి కాంతి సమాచారాన్ని సేకరిస్తాయి. దాన్ని దృష్టికి సంబంధించిన నరాలు మెదడుకు చేరవేస్తాయి.

అయితే, దృష్టి నరం రెటీనాను దాటుకుంటే వెళ్లే మార్గంలో ఫోటోరిసెప్టర్లు ఉండవు. అంటే అక్కడ కాంతిని గుర్తుపట్టే సాధనం లేదు. ఆ బిందువు దగ్గర మనం గుడ్డివాళ్లం. దాన్నే బ్లైండ్ స్పాట్ అంటారు.

మనలాంటి కళ్ళ నిర్మాణం ఉన్న మిగతా జీవులలో ఇది జరగదు. వాటికి గుడ్డి మచ్చ ఉండదు.

ఉదాహరణకు ఆక్టోపస్ కళ్ళల్లో దృష్టి నరాలు రెటీనా వెనుక ఉంటాయి. కాబట్టి, మెదడుకు వెళ్లే దారిలో రెటీనాకు అడ్డంపడి వెళ్లక్కర్లేదు. అందుకే వాటికి బ్లైండ్ స్పాట్ ఉండదు.

మానవుల్లో అసహజ మరణాలకు గొంతు దగ్గర ఉక్కిరిబిక్కిరి కావడం ఒక కారణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మానవుల్లో అసహజ మరణాలకు గొంతు దగ్గర ఉక్కిరిబిక్కిరి కావడం ఒక కారణం

గొంతు.. పొలమారడం, ఉక్కిరిబిక్కిరి కావడం

మరొక చెత్త డిజైన్ గొంతు. గొంతుకు ఏదైనా అడ్డం పడినా, గొంతు నులిమినా పూర్తి ఆరోగ్యంతో ఉన్నవాళ్లు కూడా ప్రాణాలు వదిలేస్తారు.

అన్నం తింటున్నప్పుడు పొలమారితే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. ఊపిరి ఆడనట్టే అనిపిస్తుంది.

మానవుల్లో తొలినాళ్లల్లో అసహజ మరణాలకు కారణమైన వాటిల్లో గొంతు దగ్గర ఉక్కిరిబిక్కిరి కావడం ఒకటి.

కిందటి ఏడాది స్పెయిన్‌లో కారు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య కన్నా గొంతు పట్టేసి ఊపిరి ఆడక చనిపోయినవారి సంఖ్య రెండు రెట్లు ఎక్కువగా నమోదైంది.

మానవ శరీరంలోకి ఆహారాన్ని, గాలిని మోసుకెళ్లే గొట్టాలు కొన్ని పాయింట్ల వద్ద చాలా ప్రమాదకర స్థితిలో కలుస్తాయి. వాటిలో గొంతు లేదా అన్నవాహిక ప్రధానమైనది.

గొంతు ద్వారా వెళ్లే ఆహారం, నీరు అన్నవాహిక గుండా ప్రయాణిస్తాయి. గాలి శ్వాసనాళాల ద్వారా ప్రవహిస్తుంది. కానీ, ఎప్పుడైనా పొరపాటున ఆహారం శ్వాసనాళాల్లోకి వెళితే, గాలిప్రవాహానికి అడ్డం పడుతుంది. ఊపిరి ఆడక చనిపోవచ్చు.

మనం అన్ని ఆహార పదార్థాలను వేగంగా తినలేం. ద్రాక్షపళ్లు గబగబా నోట్లో వేసుకున్నామంటే గొంతుకు అడ్డం పడతాయి. మన శరీరం నిర్మాణం బాగా జరగలేదు అనడానికి ఇది మరో సాక్ష్యం.

విటమిన్ సి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విటమిన్ సి

మాగెల్లన్ సాహసయాత్ర, విటమిన్ సి

సుమారు 500 ఏళ్ల క్రితం మాగెల్లన్, ఎల్కానో సహా 250 మంది నావికులు భూమిని చుట్టి వచ్చేందుకు బయలుదేరారు. వారిలో 18 మంది మాత్రమే ఆ పని చేయగలిగారు.

సముద్రయానంలో ఎదురయే పెద్ద సమస్య స్కర్వీ అనే వ్యాధి. చాలా కాలం తాజా ఆహారం తీసుకోకుండా ఉంటే వచ్చే వ్యాధి. ఇది సి విటమిన్ లోపం వల్ల వస్తుంది.

శరీరానికి తగినంత సి విటమిన్ అందకపోతే కొలాజెన్ అనే ప్రొటీన్ సంయోగం కుంటుపడుతుంది. శరీరంలో చాలా కణజాలాలకు ఈ ప్రొటీన్ అవసరం.

మానవ శరీరంలో సి విటమిన్ సంయోగ మార్గం అసంపూర్తిగా ఉంది. అందుకే మనం సి విటమిన్‌ను ఉత్పత్తిచేయలేం. బయట నుంచి తీసుకోవాలి. తాజా కూరలు, పళ్లల్లో విటమిన్ సి ఉంటుంది.

పిల్లి లాంటి జంతువులకు ఈ సమస్య లేదు. వాటి శరీరంలో సి విటమిన్ తయారవుతుంది. వాటికి స్కర్వీ లాంటి వ్యాధి రానే రాదు.

పరిణామ క్రమం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరిణామ క్రమంలో తెలివైన నిర్మాణం జరగలేదు

పరిణామ క్రమంలో తెలివైన నిర్మాణం జరగలేదు

పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మానవ శరీరంలో ఇంకా ఎన్నో అవకరాలు ఉన్నాయి. జనన వాహిక, పాదాల్లో సరిగా వంగని ఎముకలు, రక్తం గడ్డ కట్టడం, నర్స్‌మెయిడ్ మోచేయి, మానవ జన్యువు.. ఇలా ఎన్నో ఉన్నాయి.

పరిణామ క్రమంలో మన శరీరం సరిగా డిజైన్ అవ్వలేదనడానికి ఎన్నో రుజువులు చూపించవచ్చు.

హోమోసేపియన్లలో అప్పటికి ఉనికిలో ఉన్న మిగతా జీవులలో ఎలాంటి శక్తులు పనిచేసాయో అవే ఉండేవి. ప్రకృతి సహజమైన ఎంపిక, జన్యు ప్రవాహం, హైబ్రిడైజేషన్ మొదలైనవి.

ఒక పద్ధతికి కట్టుబడి పరిణామక్రమం జరగలేదు. అలా కాకుండా మరోలా జరిగి ఉండవచ్చు. కానీ, అందులో మను పాత్ర ఏమీ లేదు. మిగతా జీవుల్లాగే గాలివాటంగా అభివృద్ధి చెందాం.

మార్షియల్ ఎస్కుడెరో స్పెయిన్‌లోని సెవిల్లె యూనివర్సిటీలో ప్లాంట్ బయాలజీ, ఎకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ కథనం మొదట ది కాన్వర్జేషన్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది. క్రియేటివ్ కామన్ లైన్సెస్ కింద ఇక్కడ మళ్లీ ప్రచురిస్తున్నాం.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)