దిల్లీ కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో ఏముంది, కేజ్రీవాల్ కేంద్రంపై ఎందుకు మండిపడుతున్నారు?

కేజ్రీవాల్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రేరణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి, దానిని తారుమారు చేయాలనే యోచన చేసింది. సుప్రీంకోర్టుకు సెలవులు ఇచ్చిన వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి, మే 11న కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిప్పికొట్టింది" అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మీడియా సమావేశంలో ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని కేజ్రీవాల్ అన్నారు.

“సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని విన్నాం. ఆర్డినెన్స్ తీసుకొచ్చాక, ఈ పిటిషన్‌ వేయడం వెనుక అర్థమేమిటి? ఆర్డినెన్స్‌ను కేంద్రం వెనక్కి తీసుకుంటేనే, ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది" అని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు.

రాజ్‌నాథ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో ఏముంది?

మే 19 శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, అధికారుల బదిలీ, పోస్టింగ్‌లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే హక్కు మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కే వెళుతుంది.

అంతకుముందు మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్) పరిధిలోకి వచ్చే అధికార యంత్రాంగంపై దిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. చట్టాలు చేసే అధికారం కూడా దిల్లీ అసెంబ్లీకి ఉంటుందని తెలిపింది.

దీనిని తారుమారు చేసేందుకే కేంద్రం ఆర్డినెస్ తీసుకొచ్చిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన 'నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (సవరణ) ఆర్డినెన్స్, 2023 కింద, దిల్లీలో పనిచేస్తున్న ' డానిక్స్’ (DANICS) కేడర్‌లోని 'గ్రూప్-ఎ' అధికారుల సేవలు, బదిలీలు, వారిపై క్రమశిక్షణా చర్యల కోసం 'నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ'ని ఏర్పాటు చేస్తారు.

DANICS అంటే దిల్లీ, అండమాన్-నికోబార్, లక్షద్వీప్, డామన్, డయ్యూ, దాద్రా, నగర్ హవేలీ సివిల్ సర్వీసెస్.

అన్ని 'గ్రూప్ ఏ', డానిక్స్ అధికారుల బదిలీ, నియామకాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే హక్కు అథారిటీకి ఉంటుంది. కానీ, తుది నిర్ణయం తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుంది.

ఈ అథారిటీలో ఎవరెవరు ఉంటారు?

అధికారంలో ముగ్గురు సభ్యులు ఉంటారు.

  • దిల్లీ ముఖ్యమంత్రి
  • దిల్లీ ప్రధాన కార్యదర్శి
  • దిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోం శాఖ

ఈ అథారిటీకి ముఖ్యమంత్రిని చైర్మన్‌గా నియమించారు.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడానికి కారణం ఏం చెప్పింది?

దేశ రాజధాని దిల్లీపై "దేశమంతటికీ హక్కు ఉంటుందని", ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ " పరిపాలన గౌరవాన్ని దెబ్బతీశారని" కేంద్రం పేర్కొంది.

“ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, సుప్రీంకోర్టు వంటి అనేక అధికారిక సంస్థలు దిల్లీలో ఉన్నాయి. పలు దేశాల రాయబార కార్యాలయాలు దిల్లీలో ఉన్నాయి. వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు దిల్లీలో నివసిస్తున్నారు. పరిపాలనలో తప్పిదం జరిగితే అది దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది" అని కేంద్రం పేర్కొంది.

రాజధానిలో ఏ నిర్ణయం తీసుకున్నా స్థానిక ప్రజలనే కాక, దేశంలో అందరి పౌరులపైనా ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

అయితే, పలువు న్యాయ నిపుణులు ఈ ఆర్డినెస్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు.

"దిల్లీని ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చలేం. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి నాయకులను ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల బదిలీ, నియామకాలకు సంబంధించిన అన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెస్ ఒక రాజకీయ వ్యూహం" అని హిమాచల్ ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చంచల్ కుమార్ అభిప్రాయపడ్డారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

అరవింద్ కేజ్రీవాల్ vs లెఫ్టినంట్ గవర్నర్ కేసు ఏమిటి?

దిల్లీలో ప్రభుత్వ యంత్రాంగంపై అధికారం కేంద్రానికే ఉంటుందని 2015లో హోం శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

దాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

దీనిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. 2019 ఫిబ్రవరిలో, జస్టిస్ ఏకే సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై భిన్నాభిప్రాయలతో తీర్పును వెలువరించింది.

దిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో డైరెక్టర్ స్థాయి నియామకాలు చేపట్టవచ్చని జస్టిస్ సిక్రీ తన నిర్ణయంలో పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వానికి అన్ని రకాల కార్యనిర్వాహక అధికారాలు లేవని, అధికారుల బదిలీ-పోస్టింగ్ హక్కు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉండాలని జస్టిస్ అశోక్ భూషణ్ పేర్కొన్నారు.

దాంతో, 2022లో ఈ కేసును అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించారు.

అనంతరం, అధికార పరిధి విషయంపై దిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నడుస్తున్న కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.

ఎట్టకేలకు, మే 11న ఈ కేసులో ధర్మాసనం తీర్పును వెలువరించింది.

నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్) పరిధిలోకి వచ్చే అధికార యంత్రాంగంపై దిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టాలు చేసే అధికారం కూడా దిల్లీ అసెంబ్లీకి ఉంటుందని తెలిపింది. అయితే శాంతిభద్రతలు, భూములకు సంబంధించిన వ్యవహారాలను ఈ అధికార పరిధి నుంచి మినహాయించింది.

"ప్రభుత్వానికి నియంత్రణాధికారం లేదని అధికారులు భావిస్తే, అది వారి బాధ్యతలను బలహీనపరుస్తుంది. ప్రభుత్వంపైనా ప్రభావం చూపుతుంది. అధికారులు మంత్రులకు నివేదించడం మానేసి, వారి సూచనలను పట్టించుకోకపోతే సమాజం పట్ల బాధ్యతను ప్రభావితం చేస్తుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహ న్యాయమూర్తులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)