ఐపీఎల్ 2023: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డు, 12వ సారి ప్లే ఆఫ్స్‌కి ధోనీ సేన

ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 77 పరుగుల భారీ తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు 12వ సారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది.
ఐపీఎల్ 2023లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య దిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్డేడియంలో మ్యాచ్ జరిగింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ధోనీ సేన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు దిల్లీ క్యాపిటల్స్ ముందు 224 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన దిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ తప్ప మరే ఇతర బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో పరాజయం తప్పలేదు.
వార్నర్ 58 బంతుల్లో 86 పరుగులు చేయడంతో దిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సూపర్ కింగ్స్ జట్టు 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దీపక్ చాహర్ మూడు, మతిష పతిరన, మహిష్ తీక్షణలు తలో రెండు వికెట్లు తీశారు.
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఆ జట్టుకు నెట్‌రన్ రేట్ కూడా మెరుగైంది.
చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్‌రేట్ ఇప్పుడు 0.652 అయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్
ఐపీఎల్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఓపెనర్లు డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ దిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.
పవర్ ప్లేలో వీరిద్దరూ 8.66 సగటుతో 52 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో గైక్వాడ్ 37 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
10 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. 12వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో గైక్వాడ్ వరుసగా మూడు సిక్సర్లు సాధించాడు.
14వ ఓవర్ తొలి బంతికి డెవాన్ కాన్వే సిక్సర్ బాది అర్ధసెంచరీ (33 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.
అయితే, తర్వాతి ఓవర్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను చేతన్ సకారియా అవుట్ చేశాడు. గైక్వాడ్ 50 బంతుల్లో (7 సిక్సర్లు, 3 ఫోర్లు) 79 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
గైక్వాడ్, కాన్వే జోడీ తొలి వికెట్‌కు 87 బంతుల్లో 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

ఫొటో సోర్స్, Getty Images
దూబే, జడేజా కూడా బ్యాట్ ఝలిపించడంతో..
అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే సైతం దిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
దూబే కేవలం 9 బంతుల్లో 244.44 స్ట్రైక్ రేట్‌తో 22 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు ఉన్నాయి. 18వ ఓవర్లో దూబే రెండు సిక్సర్లు కొట్టి చివరి బంతికి అవుటయ్యాడు.
దూబే, కాన్వే ఇరువురు కేవలం 22 బంతుల్లోనే రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు.
ఆ తర్వాతి ఓవర్‌లోనే డెవాన్ కాన్వే కూడా ఔటయ్యాడు. కాన్వే 52 బంతుల్లో (3 సిక్సర్లు, 11 ఫోర్లు) 87 పరుగులు చేశాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా అదే ఓవర్ చివరి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. తర్వాతి ఓవర్‌లోనూ జడేజా ఫోర్ సాధించాడు.
ఈ ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి చివరి బంతికి మాత్రమే ఆడే అవకాశం లభించింది.
జడేజా 7 బంతుల్లో 20 పరుగులు చేయగా, ధోనీ 4 బంతుల్లో 5 పరుగులు చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 11 బంతుల్లో అజేయంగా 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ బ్యాట్స్‌మన్లను చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. దిల్లీ జట్టు కేవలం 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఫొటో సోర్స్, ANI
ప్లే ఆఫ్స్‌కి చేరిన గుజరాత్, చెన్నై
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 29వ మ్యాచ్ ఇది.
దిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌కి ఇది 19వ విజయం. దిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన ఎనిమిదో మ్యాచ్ ఇది.
కాగా, ఈ విజయంతో చెన్నై జట్టు 17 పాయింట్లతో ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
ఇప్పటికే హార్థిక్ పాండ్యా నేతృత్వంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తును సాధించి, అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ప్లే ఆఫ్స్‌లో మిగిలిన రెండు స్థానాల కోసం లక్నో, రాజస్థాన్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా జట్లు పోటీలో ఉన్నాయి.
పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మంగళవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్ 1లో తలపడనున్నాయి.
మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు బుధవారం జరిగే ఎలిమినేటర్ పోరులో పోటీపడతాయి.
క్వాలిఫయర్ 2 మ్యాచ్ మే 26న , ఫైనల్ మే 28న అహ్మదాబాద్‌లో జరుగుతాయి.
ఇవి కూడా చదవండి
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
- ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?
- సిక్కిం రాజు కోటను 30 నిమిషాల్లో భారత సైన్యం ఎలా స్వాధీనం చేసుకుంది, విలీనంలో ఇందిరాగాంధీ పాత్ర ఏంటి?
- ఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














