సెంగోల్: పార్లమెంట్ కొత్త భవనంలో మోదీ ఆవిష్కరించనున్న ఈ బంగారు రాజదండం చరిత్ర ఏమిటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇక్బాల్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించనున్నారు. కొత్త భవనంలో చారిత్రక రాజదండాన్ని (సెంగోల్) ఆవిష్కరిస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం మీడియాకు తెలిపారు.
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 14న తమిళ పూజారుల నుంచి ఈ రాజదండాన్ని అందుకున్నారని అమిత్ షా చెప్పారు.
బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి అధికార బదిలీకి సూచనగా నెహ్రూ ఈ రాజదండాన్ని అందుకున్నారని అమిత్ షా చెప్పారు.
అనంతరం నెహ్రూ దీన్ని ఒక మ్యూజియంలో ఉంచగా అప్పటి నుంచి అది అక్కడే ఉందని అమిత్ షా చెప్పారు.
కాగా, ఈ సెంగోల్ చరిత్రకు సంబంధించిన ఏడు నిమిషాల నిడివిగల ఒక వీడియో కూడా ప్రదర్శించారు.

ఫొటో సోర్స్, ANI
చోళ సామ్రాజ్యంతో సంబంధం
అమిత్ షా ఈ సెంగోల్ గురించి మరింత సమాచారం ఇస్తూ, సెంగోల్ తమిళ భాషా పదమని చెప్పారు.
ఇది చోళ సామ్రాజ్యానికి చెందినదని, దీనిపై నంది బొమ్మ కూడా ఉందని వివరించారు.
భారతదేశానికి అధికారం బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు అందుకు ఆచరించాల్సిన విధివిధానాలపై అప్పటి బ్రిటిష్ పాలకులు చర్చించుకున్నారని.. అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్‌కు భారతీయ సంప్రదాయం తెలియదు కాబట్టి ఆయన నెహ్రూను సంప్రదించగా.. నెహ్రూ సి.రాజగోపాలాచారిని సంప్రదించారని అమిత్ షా చెప్పారు.
‘రాజగోపాలాచారి అనేక గ్రంథాలను అధ్యయనం చేసి సెంగోల్ ప్రక్రియ ఉందని తెలుసుకున్నారు. అధికార బదిలీకి ఆ విధానాన్నే అనుసరించాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే ఈ ఆధ్యాత్మిక విధానంలో భారతదేశ ప్రజలకు పాలన బదిలీ అయింది. సెంగోల్ అంటే ధర్మం అని తమిళంలో అర్థం. ఇది పవిత్రమైనది. దీనిపై నంది ఆసీనమై ఉంటుంది. చోళుల కాలం నుంచి.. ఎనిమిదో శతాబ్దం నుంచి ఉన్న ఆచారం ఇది’’ అన్నారు అమిత్ షా.
‘ఈ సెంగోల్ గురించి ప్రధాని మోదీకి తెలియగానే దాన్ని దేశ ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. దీనికి పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం రోజును ఎంచుకున్నారు. సెంగోల్‌ను ఉంచడానికి పార్లమెంట్ భవనాన్ని మించిన స్థలం వేరేది లేదని, అందుకే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎంచుకున్నారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని జాతికి అంకితం చేసే రోజున ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని అథీనం మఠానికి వెళ్లి అక్కడి నుంచి సెంగోల్ స్వీకరిస్తారు. లోక్‌సభ స్పీకర్ కుర్చీ పక్కన దీన్ని ప్రతిష్ఠిస్తారు’ అని అమిత్ షా చెప్పారు.
‘‘చోళుల చరిత్రతో ముడిపెట్టడం సరికాదు’’
అయితే, ఈ రాజదండానికి చోళుల చరిత్రతో ముడిపెట్టడం సరికాదని, దీన్ని నిరూపించే ఆధారాలేవీలేవని బీబీసీ తమిళ్ ఎడిటర్ తంగవేల్ అప్పాచీ చెప్పారు.
‘‘జవహర్‌లాల్ నెహ్రూకు అప్పట్లో ఈ దండాన్ని అందజేసిన మాట వాస్తవమే. దీనికి సాక్ష్యంగా ఫోటోలు ఉన్నాయి. కానీ రాజాజీ, మౌంట్‌బాటన్‌ల మధ్య వాదనలను ధ్రువీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. దీని గురించి రాజాజీ ఆత్మకథలో కానీ, మౌంట్‌బాటన్ బాటన్ పేపర్లలో కానీ ఏమీ లేదు’’ అని ఆయన చెప్పారు.
‘‘1279లో చివరి చోళ రాజు రాజేంద్ర-3 మరణంతో చోళ సామ్రాజ్యం ముగిసింది. ఈ రాజదండాన్ని నెహ్రూకు అందించిన తిరువడుతురై మఠం15వ శతాబ్దంలో మాత్రమే ఆవిర్భవించింది. ఈ రాజదండానికి చోళులతో సంబంధం లేదు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER/OM BIRLA
ప్రతిపక్ష పార్టీల బహిష్కరణ
కాగా పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సహా 19 పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కాకుండా ప్రధాని మోదీ తాను ఈ కొత్త భవనాన్ని ప్రారంభించడం తీవ్రమైన అవమానమే కాకుండా ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి’ అని ఈ 19 పార్టీలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.
బీఎస్పీ, బీజేడీ, టీడీపీ, వైసీపీ, అన్నాడీఎంకే, పీడీపీ, బీఆర్ఎస్‌లు ఈ 19 పార్టీలలో లేవు.
ఆంధ్రప్రదేశ్‌లోని పాలక పార్టీ వైసీపీ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నిర్ణయించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది.
కాగా రాష్ట్రపతి ముర్ము లేకుండానే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం ఆ అత్యున్నత పదవిని అవమానించడమేనని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














