కిటో: స్వలింగ సంపర్కులను ఆకర్షించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న నైజీరియా మాఫియా గ్యాంగ్‌లు

- రచయిత, ఇయాన్ వఫూలా, తమాసిన్ ఫోర్డ్
- హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ
స్వలింగ సంపర్కుడైన మొహమ్మద్‌కు(పేరు మార్చాం) నైజీరియాలో రహస్యంగా అలాంటి జీవితం గడపడం ప్రమాదకరంగా ఉంది.
ఎవరినైనా కలిసేటప్పుడు మొహమ్మద్ నిత్యం జాగ్రత్తగా ఉండేవారు. కానీ, ఓ కలయిక మాత్రం ఆయన జీవితాన్ని పూర్తిగా కుదిపేసింది.
ముగ్గురు పిల్లల తండ్రి అయిన మొహమ్మద్ ఇంటర్నెట్‌లో జమాల్‌ను కలిశారు. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్ చేసిన తరువాత ఒక రోజు జమాల్‌ను చూడాలని, కలవాలని నిర్ణయించుకున్నారు మొహమ్మద్. ఒక రోజు మధ్యాహ్నం జమాల్‌ను డౌన్‌టౌన్‌లో కలిసిన మొహమ్మద్ అక్కడి నుంచి ఆయన ఇంటికి కూడా వెళ్లారు.
కానీ, అది ఒక ఉచ్చు. జమాల్ పన్నిన ఉచ్చులో మొహమ్మద్ చిక్కుకున్నారు.
జమాల్ ఇంట్లో మొహమ్మద్ స్నానానికి వెళ్లారు. స్నానాల గదిలో ఆయన తన దుస్తులు విప్పగానే కొంతమంది ఒక్కసారిగా వచ్చి ఆయన్ను కొట్టారు. డబ్బు డిమాండ్ చేశారు.
జమాల్, ఆ గుంపులోని వ్యక్తులు మొహమ్మద్‌ను నగ్నంగా వీడియోలు తీశారు. తనను వదిలేయమని మొహమ్మద్ ఎంతగా వేడుకున్నా వారు వినలేదు.
‘నేను ఎంతగానో నమ్మిన మనిషి నన్ను ఇలా చేస్తాడని అస్సలు నమ్మలేకపోయాను’’ అన్నారు మొహమ్మద్.
తన నగ్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించగానే తన ప్రపంచం కుప్పకూలిందని మొహమ్మద్ అన్నారు.
పెళ్లయి పిల్లలు, కుటుంబం ఉన్న వ్యక్తిగా సమాజానికి తెలిసిన మొహమ్మద్ తన లైంగికతను అంతవరకు రహస్యంగా ఉంచారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నా కొడుకు నన్ను రక్షించాడు’
తనను ఎవరూ గుర్తించకుండా తల నిండుగా తెల్లని ముసుగు కప్పుకొని బీబీసీతో మాట్లాడారు మొహమ్మద్.
‘అది జరిగాక ఏడుస్తూనే ఉన్నాను. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను’ అన్నారు ఆయన.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన కొడుక్కి ఫోన్ చేయడం వల్ల తన ప్రాణాలు నిలిచాయంటూ అప్పుడు ఏమైందో చెప్పారు మొహమ్మద్.
‘‘నా పిల్లలకు ఫోన్ చేశాను. నాన్నంటే తనకు ఎంతో ఇష్టమని నా కొడుకు చెప్పాడు. తన తండ్రి హోమో సెక్సువల్ అయినా కూడా దాని వల్ల తనకు ఎలాంటి సమస్యా లేదని చెప్పాడు’ అన్నారు మొహమ్మద్.
‘నేను ఎందుకు చనిపోకూడదో కారణం చెప్పాడు నా కొడుకు’
అలా చెప్పినప్పుడు మొహమ్మద్ అంత వరకు తన తలపై కప్పుకొన్న ముసుగును తీసేసి ముఖాన్ని చేతులతో కప్పుకొంటూ ఏడవడం ప్రారంభించారు. జరిగిందంతా గుర్తు చేసుకోవడం ఆయనకు చాలా బాధగా ఉంది.
మొహమ్మద్‌లాంటి అనుభవం ఎదురైన వారు 15 నుంచి 20 మంది ప్రతి వారం తమను సంప్రదిస్తారని నైజీరియాలో ఎల్‌జీబీటీ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల బృందం ఒకటి చెప్పింది.
ఎల్‌జీబీటీ వ్యక్తులను ట్రాప్ చేసి ఇలా బ్లాక్ మెయిల్ చేయడాన్ని నైజీరియాలో ‘కిటో’ అంటారు.
21 మంది ‘కిటో’ బాధితులతో ‘బీబీసీ ఆఫ్రికా ఐ’ బృందం మాట్లాడింది.

‘నేను ఎవరినీ నమ్మను’
ఇమాన్యుయెల్ (పేరు మార్చాం) తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ‘బీబీసీ ఆఫ్రికా ఐ’కి వివరించారు. తన స్నేహితుడి సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందని తెలియక ఆ అకౌంట్‌తో చాట్ చేశారు ఇమాన్యుయెల్. చాటింగ్‌లో మాట్లాడుకున్న ప్రకారం ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడ అయిదుగురు సభ్యుల ముఠా ఒకటి ఇమాన్యుయెల్‌పై ఒక్కసారిగా దాడి చేసింది.
‘‘నన్ను వారు వీడియో తీశారు. ఆ తరువాత వారు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు. నేను ఎక్కడ చదువుకున్నాను? నా తల్లిదండ్రులెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? వంటివన్నీ అడిగారు. దాంతో నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికే అవన్నీ అడుగుతున్నట్లు అర్థమై వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ తప్పుడు సమాచారం ఇచ్చాను’ అన్నారు ఇమాన్యుయెల్.
అయితే, ఆ ముఠా ఇమాన్యుయెల్ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయలేదు. కానీ, ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి 5 లక్షల నైరాలు (సుమారు రూ. 89 వేలు) విత్ డ్రా చేయించేందుకు బలవంతం చేశారు. ఆయన లొంగకపోవడంతో ఇనుప ఆయుధాలతో హింసించారు.
తన బొటన వేలి కింద ఇంకా ఉన్న గాయాలను ఇమాన్యుయెల్ మాకు చూపించారు. చివరకు డబ్బు తీసుకుని పంచుకున్న తరువాత తనను వారు విడిచిపెట్టినట్లు ఇమాన్యుయెల్ చెప్పారు.
‘ఆ తరువాత మానసికంగా నేను గాయపడ్డాను. ఇక ఎవరినీ నమ్మను, అభద్రతాభావంతో ఉన్నాను’ అన్నారు ఇమాన్యుయెల్.
సేమ్ సెక్స్ మ్యారేజెస్‌పై నిషేధం, 14 ఏళ్ల జైలు శిక్ష
నైజీరియాలో సేమ్ సెక్స్ మ్యారేజ్‌లను నిషేధిస్తూ 2014లో చట్టం చేశారు. ఎవరైనా అలాంటి పెళ్లి చేసుకుంటే 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.
ఈ చట్టం ప్రకారం స్వలింగ జంటలు బహిరంగంగా తమ ప్రేమను వ్యక్తీకరించుకోవడం నేరం. ఆ నేరానికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. స్వలింగ సంపర్కుల క్లబ్, సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేయడం, నిర్వహించడం, గే బార్‌లు అన్నిటిపైనా నిషేధం విధించారు.
నైజీరియాలో ఈ చట్టానికి చాలామంది నుంచి మద్దతు లభించింది. ఆఫ్రికాలో స్వలింగ సంపర్కుల విషయంలో కఠినమైన చట్టాలున్న దేశాలలో నైజీరియా ఒకటి. నైజీరియాలోని 12 ఉత్తరాది రాష్ట్రాలలో ఇప్పటికే షరియ, ఇస్లామిక్ చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కానికి పాల్పడినట్లు తేలితే మరణశిక్ష విధించొచ్చు.
కాగా 2014లో దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన సేమ్ సెక్స్ మ్యారేజెస్ నిషేధ చట్టంతో ఎల్‌జీబీటీ సమాజంపై వేధింపులకు అధికారికంగా అవకాశమిచ్చినట్లయిందని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ అభిప్రాయపడింది. ఈ చట్టంతో అక్కడ స్వలింగ సంపర్కుల పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొంది.
ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి చెందినవారిపై వేధింపులు, దాడులు, దోపిడీలు సర్వసాధారణమయ్యాయని నైజీరియా మీడియాలో వచ్చిన కథనాలు చెప్తున్నాయి.
2014లో కొత్త చట్టం వచ్చినప్పటి నుంచి కిటో కేసులు భారీగా పెరిగాయని యాక్టివిస్ట్‌లు చెప్తున్నారు.

స్వలింగ సంపర్కురాలిగా బహిరంగంగా ప్రకటించుకున్న నైజీరీయాకు చెందిన చిత్ర నిర్మాత ‘య్యూడు ఇక్పే ఎటిమ్’ మాట్లాడుతూ... నైజీరియాలో స్వలింగ సంపర్కులను బ్లాక్ మెయిల్ చేయడం చాలా ఎక్కువైపోయిందని అన్నారు.
ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి చెందినవారిని కొట్టి చంపిన ఉదంతాలూ ఉన్నాయన్నారు.
దాడులకు గురైనా పోలీసులను ఆశ్రయించేందుకు బాధితులు భయపడతారని.. పోలీసులు కూడా దాడిచేస్తారన్న భయం, లేదంటే అరెస్ట్ చేస్తారన్న భయంతో అసలు పోలీసుల దగ్గరకు వెళ్లరని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, బ్లాక్‌మెయిలర్లను అడ్డుకునేందుకు అధికారులతో కలిసి కొందరు పనిచేస్తున్నారు.
నైజీరియన్ సెక్యూరిటీ అండ్ సివిల్ డిఫెన్స్ కార్ప్స్ అధికారి ఒకరిని ‘బీబీసీ ఆఫ్రికా ఐ’ సంప్రదించింది. ఎల్‌జీబీటీ వ్యక్తుల్లా ఆన్‌లైన్లో తోడు కోసం వెతికే కొందరు యాక్టివిస్ట్‌లతో కలిసి ఆయన పనిచేస్తారు.
బ్లాక్ మెయిలర్లను పట్టుకోవడం లక్ష్యంగా వీరు ఇలా పనిచేస్తారు.
‘బ్లాక్ మెయిల్ చేయడమనేది నేరం. ఈ దేశంలో చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అన్నారాయన.
బ్లాక్‌మెయిలర్ల ఫొటోలు, వివరాలతో బాధితులు యాక్టివిస్ట్‌లను సంప్రదిస్తారు. దాంతో బ్లాక్‌మెయిలర్లను పట్టుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే, బ్లాక్‌మెయిలర్లను గుర్తించిన తరువాత బాధితులతో కోర్టులో సాక్ష్యం చెప్పించడం సమస్య అవుతోందంటున్నారు ఈ అధికారి.
స్వలింగ సంపర్కం నేరం కావడం వల్ల బాధుతుల కోర్టుకు వచ్చేందుకు వెనుకాడుతారు. అయితే, కొందరు మాత్రం బ్లాక్‌మెయిలర్లను పట్టించేందుకు తమ లైంగికతను బయటపెట్టేందుకు కూడా భయపడడం లేదు.
బీబీసీ ఆఫ్రికా ఐ ఇంటర్వ్యూ చేసినవారిలో కొందరు తాము బ్లాక్‌మెయిల్‌కు గురైన విషయాన్ని, ఆ వీడియోలను ఆన్‌లైన్లో పోస్ట్ చేశారు. అలా చేయడం వల్ల వారిలో కొందరు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, మరికొందరు కుటుంబాలకు దూరమయ్యారు.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మొహమ్మద్ తన వీడియో ఇప్పటికీ ఆన్‌లైన్లో ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలోకి దళితులను రానివ్వరు.. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోరు
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














