ఐపీఎల్ 2023: ఫోర్ కొడితే రూ.50 వేలు, సిక్స్ కొడితే రూ.లక్ష.. హైదరాబాద్‌లో బెట్టింగ్ ఇలా జరుగుతోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్రికెట్ మ్యాచ్‌లో బంతి బౌండరీ దాటితే ఫోర్ అంటారు. ఫోర్ కొడితే జట్టుతోపాటు ఆటగాడి ఖాతాలో నాలుగు పరుగులు వచ్చి చేరతాయి. కానీ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లలో ఫోర్ పడిందంటే, కొందరి ఖాతాల్లోకి రూ.50 వేల వరకు వచ్చి పడుతున్నాయి.
మరో మ్యాచ్‌లో చివరి ఓవర్ చివరి బంతికి సిక్సర్. దీంతో ఆ జట్టుకు వచ్చేవి ఆరు పరుగులు. కానీ, కొందరి ఖాతాల్లో రూ.లక్ష వరకు వచ్చి పడుతున్నాయి.
స్టేడియంలో ఫోర్, సిక్స్ కొడితే ఎవరికో రూ.50 వేలు, రూ.లక్ష రావడమేమిటని అనుకుంటున్నారా?
ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డం పెట్టుకుని సాగిస్తున్న బెట్టింగ్ దందా ఇది.
క్రికెట్ ప్రియులను ఐపీఎల్ సీజన్ అలరిస్తోంది. స్టేడియంలో మ్యాచ్‌లు చూస్తూ ప్రేక్షకులు సందడి చేస్తున్నారు.
అదే సమయంలో మ్యాచ్‌లపై పందేలు కాసి కొందరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు.
హైదరాబాద్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు ఇటీవల వరుసగా అరెస్టు చేయడంతో దీనిపై చర్చ ఊపందుకొంది.

ఫొటో సోర్స్, Cyberabad Police
పెద్ద సంఖ్యలో బెట్టింగ్ యాప్స్
ఏటా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే బెట్టింగ్‌తో పెద్దయెత్తున డబ్బు చేతులు మారుతోంది.
బెట్టింగ్ అనేది ఏదో ఒక్క అంశానికే పరిమితం కాలేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
ఒక మ్యాచ్‌లో మొత్తం స్కోర్, ఇన్నింగ్స్ వికెట్లు, వ్యక్తిగత స్కోర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి ముఖ్యమైన ప్లేయర్లు ఎంత స్కోర్ చేస్తారు? ఎన్ని పరుగుల్లోపు అవుట్ అవుతారు? బౌలర్లు వేసే ఒక ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బంతికి ఎంత కొడతారు? మొత్తం మ్యాచ్‌లో ఎన్ని ఫోర్లు కొడతారు? ఎన్ని సిక్స్‌లు కొడతారు? పవర్ ప్లేలో ఎన్ని రన్స్ చేస్తారు? మ్యాచ్‌లో ఎన్ని వైడ్స్, నోబాల్స్ వేస్తారు? ఇలా ప్రతి విషయంలోనూ బెట్టింగ్ దందా నడుస్తోంది.
కేవలం మ్యాచ్ జరుగుతున్నప్పుడే కాకుండా ప్రారంభానికి ముందు నుంచే బెట్టింగులు మొదలవుతుంటాయి.
జట్టు తరఫున ఆడే చివరి 11 మంది ఎవరై ఉంటారనే విషయంపైనా పందేలు కాస్తున్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా కొన్ని గేమింగ్ యాప్‌లు సైతం పుట్టుకొచ్చాయి. వాటిల్లోనే నేరుగా బెట్టింగ్ సాగుతోంది.
బెట్టింగ్ తీరుపై క్రికెట్ విశ్లేషకుడు వెంకటేశ్ బీబీసీతో మాట్లాడారు.
‘‘కొన్ని యాప్స్‌ను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించారు. అయినా వేరొక రూపంలో అవి బెట్టింగ్ కాసే వారికి అందుబాటులోనే ఉంటున్నాయి. గేమింగ్ యాప్‌లతోపాటు బెట్టింగ్ యాప్స్ పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ఇవి బెట్టింగ్ కాసే వారికి సులువుగా అందుబాటులో ఉన్నాయి. సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక దృష్టి పెడితే వాటిని నియంత్రించగలరు. మ్యాచ్‌లో కొట్టే రన్స్ పైనే కాకుండా టాస్ వంటి విషయాలపైనా బెట్టింగ్ జరుగుతుంటుంది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అడ్డాగా మారుతున్న ఫాంహౌస్‌లు
బెట్టింగ్ రానురానూ స్వరూపం మార్చుకుంటోందని ఇటీవల వెలుగు చూస్తున్న కొన్ని ఉదంతాలు చెబుతున్నాయి.
గతంలో బార్లు, పబ్‌లు, వ్యక్తిగత ఇళ్లలో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించేవారు.
ఇప్పుడు హైదరాబాద్ శివారు ఫాంహౌస్‌లను అడ్డాగా చేసుకుని బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
ఇక్కడ దాదాపు 20 నుంచి 25 సాధారణ ఫోన్లు, నాలుగైదు టీవీలు, ల్యాప్ టాప్‌లు వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫాంహౌస్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి రూ.40 లక్షలు సీజ్ చేశారు. అకౌంట్‌లో ఉన్న రూ.30 లక్షలు ఫ్రీజ్ చేశారు.
‘‘నగర శివారుల్లోని ఫాంహౌస్‌లలో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంది. అందుకే కొన్ని రోజులపాటు ఫాంహౌస్‌లపై దృష్టి పెట్టాం. నగరంలో ఎక్కువగా నిఘా ఉంటుందని బెట్టింగ్ ముఠాలు ఫౌంహౌస్‌లను ఎంచుకుంటున్నాయి’’ అని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ అయిపోతే పట్టుకోవడం సాధ్యం కాదా?
బెట్టింగ్ నిర్వహణ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. మ్యాచ్ పూర్తవ్వగానే కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయని పోలీసులు చెబుతున్నారు.
ఐపీఎల్ 2023 ప్రారంభమైన వారం రోజులకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పేట బషీరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్ చేస్తున్న స్థావరంపై స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) పోలీసులు దాడులు చేశారు.
మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఈ ఆపరేషన్ కొనసాగింది.
దాడుల్లో రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అరెస్టు చేశారు.
ఈ విషయంపై మేడ్చల్ డీసీపీ సందీప్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘మ్యాచ్ అవ్వగానే డబ్బును అంతా ఆన్‌లైన్‌లోనే పంపిస్తారు. తర్వాత ఎక్కడా మనకు డబ్బు కనిపించదు. మ్యాచ్ పూర్తయ్యిందంటే డబ్బు పట్టుకోవడం కష్టమవుతుంది. అందుకే మ్యాచ్ జరుగుతున్నప్పుడే దాడి చేసి పట్టుకోగలిగాం’’ అని ఆయన చెప్పారు.
లెగ్ అంటే రూ.లక్ష
బెట్టింగ్‌లో పందెం కాసేందుకు కోడ్ భాషనే బుకీలు వాడుతుంటారు. ఆ పదాలతోనే మాట్లాడుకుంటారు. లావాదేవీలు సాగిస్తుంటారు. ఇక్కడ ఫింగర్ అంటే రూ.1000, బోన్ అంటే రూ.10 వేలు, లెగ్ అంటే లక్ష రూపాయలు.
గెలిచే జట్టు లేదా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టును ఫ్లయింగ్‌గా పిలుస్తారు. ఓడిన జట్టును ఈటింగ్ అంటారు.
అంతేకాదు, బెట్టింగ్‌పై అవగాహన కల్పించేందుకు కొన్ని యూట్యూబ్ చానళ్లు, టెలిగ్రామ్‌లో లింక్స్ ఉంటున్నాయి. మ్యాచ్ విజేతలను ముందుగా అంచనా వేయడంతోపాటు పందెం కాసే వారికి సలహాలు, సూచనలు కూడా వీటిలో అందిస్తున్నారు.
ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు
క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలపై నియంత్రణ ఉండటం లేదనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం.
ఇందుకు ప్రధానంగా దిల్లీ, ముంబయి, హైదరాబాద్, గోవా వంటి ప్రాంతాల నుంచి ప్రధాన బుకీలు బెట్టింగ్‌ను నియంత్రిస్తున్నారు. భారత దేశంతోపాటు మలేసియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల నుంచి బెట్టింగ్ ఆపరేషన్లు నడుస్తున్నాయి. ఇదంతా ఆన్‌లైన్‌లో జరుగుతుండటంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి బీబీసీతో మాట్లాడుతూ- ‘‘దిల్లీ, ముంబయి, హైదరాబాద్ కేంద్రంగా బుకీలు పనిచేస్తున్నారు. వీరికి సబ్ బుకీలు ఉంటున్నారు. పంటర్లు వీరికి సహకారం అందిస్తున్నారు. బుకీల వద్ద డబ్బు ఉంటోంది. పందెం కాయడం నుంచి గెలిచాక డబ్బు పంపడం వరకు అంతా ఆన్‌లైన్, గూగుల్ పే, ఫోన్ పేలో సాగిపోతుంటాయి. అందుకే వారిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది’’ అని చెప్పారు.
ఈజీ మనీ కోసం అలవాటు పడి..
బెట్టింగ్‌లోకి యువత ఎందుకు దిగుతున్నారు? అనేది ఇక్కడ కీలకం. ఇందుకు పోలీసులు చెప్పే సమాధానం ఒక్కటే- అదే ఈజీ మనీ.
సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్‌లోకి దిగుతున్నారు. తర్వాత ఇది వ్యసనంగా మారుతోంది.
గతంలో ప్రధాన నగరాలు, పట్టణాలకే పరిమితం కాగా, ఇప్పుడు ఇది గ్రామాలకు విస్తరించింది.
మే 18వ తేదీన బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని షాద్‌నగర్ సమీపంలోని నార్లగూడ తండాకు చెందిన 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు మండలం పాండవుల బస్తీకి చెందిన సాయి కిషన్ అనే మరో యువకుడు కూడా పది రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుండేవారు. బెట్టింగ్‌లో రూ.5 లక్షలు పొగొట్టుకోవడంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.
ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా, బెట్టింగ్ కార్యకలాపాలపై నియంత్రణ కొరవడుతోంది. కొందరు అప్పులు చేసి బెట్టింగ్‌లో పెడుతున్నారు. అక్కడ డబ్బు పోగొట్టుకుని వాటిని తీర్చే దారి లేక ఆందోళనకు గురవుతున్నారు.
మొదట సరదాగా మొదలుపెట్టినా, తర్వాత ఇది వ్యసనంగా మారుతోందని రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వాట్సాప్ మెసేజ్‌లను ఇక ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగంటే..
- బ్రిటన్ ప్యాలెస్‌లో ఇథియోపియా యువరాజు మృతదేహం, ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాజకుటుంబం, కారణమేంటి?
- అమ్మాయిల పీరియడ్స్ గురించి అబ్బాయిలూ తెలుసుకోవాలి, ఎందుకంటే...
- పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళాడేందుకు ఏడేళ్ళు ఎదురుచూసిన భారత ప్రేమికుడు
- కండోమ్ అడగడానికి మగాళ్ళు ఎందుకు సిగ్గుపడతారు, దీన్ని ఎవరు మార్చేశారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















