శుభ్‌మన్ గిల్: సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ‌ల తరువాత క్రికెట్ కింగ్ ఇతడేనా?

శుభ్‌మన్ గిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శుభ్‌మన్ గిల్
    • రచయిత, సురేశ్ మేనన్
    • హోదా, స్పోర్ట్స్ రచయిత

క్రికెట్‌లో ఒక రారాజు కోసం వెతుక్కుంటూ ఉంటారు అభిమానులు. సచిన్ తెందూల్కర్ ఫీల్డ్‌లో ఉన్నన్నాళ్లు క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో వెలిగాడు.

దశాబ్దం కిందట సచిన్ తెందూల్కర్ రిటైర్ అయినప్పుడు విరాట్ కోహ్లీకి కిరీటం కట్టబెట్టారు.

సచిన్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఔటయి పెవిలియన్ వైపు వెళుతుంటే, అటు నుంచి నడుచుకుంటూ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. మొదటి బంతినే బౌండరీకి తరలించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గుసగుసలు మొదయ్యాయి. సచిన్ వారసుడొచ్చాడు అంటూ మురిసిపోయారు.

అక్కడి నుంచి కోహ్లీ యుగం మొదలైంది.

అలాంటిదే గతవారం ఐపీఎల్‌లో జరిగింది. గుజరాత్ టైటన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ రెండో సెంచరీ చేసి, కోహ్లీకి సమానంగా నిలిచినప్పుడు.. క్రికెట్ సామ్రాజ్యానికి తదుపరి రాజు సిద్ధమయ్యాడని జయజయధ్వానాలు పలికారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సొంత జట్టు రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ, కొత్త చక్రవర్తికి జైకొట్టారు అభిమానులు.

కోహ్లీకి వారసుడు గిల్ అని చాలాకాలంగా నోళ్లల్లో నానుతున్న మాటే. మొన్నటి సెంచరీతో దాన్ని సుస్థిరం చేశాడు శుభ్‌మన్ గిల్.

చాలాసార్లు కిరీటాల బదిలీలు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ, ఇది కళ్ల ముందే జరిగింది. ఇటు అభిమానులు, అటు విమర్శకులు కూడా 'కాబోయే రారాజు ఇతడే' అని అనుకోకుండా ఉండలేకపోయారు.

మరి కొద్ది రోజుల్లో శుభ్‌మన్‌కు 24 ఏళ్లు వస్తాయి. కోహ్లీ కంటే రెండేళ్ల చిన్న వయసులోనే రారాజు పదవికి అర్హత సంపాదించాడు.

క్రీడల్లో అద్భుతాలు ఎంత మజానిస్తాయో, అనివార్యాలు కూడా అంతే సరదాగా ఉంటాయి.

శుభ్‌మన్ గిల్

ఫొటో సోర్స్, Getty Images

కొంతమంది ప్లేయర్లు పిన్నవయసులోనే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తారు. శుభ్‌మన్‌కు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఓ అండర్ 16 టోర్నమెంటులో 351 పరుగులు చేశాడు. విజయ్ మర్చంట్ టోర్నమెంటులో డబుల్ సెంచరీ చేసి పరుగుల వరద పారించాడు.

2018లో అండర్ 19 వరల్డ్ కప్ జట్టుకు శుభ్‌మన్‌ను వైస్ కెప్టెన్‌ను చేయడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే పంజాబ్ జట్టులో రంజి ట్రోఫీలోకి వచ్చేశాడు. ఫైనల్స్‌లో పాకిస్తాన్ మీద 102 కొట్టి నాటవుట్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ దక్కించుకున్నాడు.

2023లో శుభ్‌మన్ బ్యాటింగ్ గ్రాఫ్ పై పైకి పోతూనే ఉంది. అంతర్జాతీయ వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన అతిపిన్నవయస్కుడు, అంతర్జాతీయ టీ20లో సెంచరీ, ఇప్పుడు ఐపీఎల్‌లో రెండు సెంచరీలు.. శుభ్‌మన్ బ్యాట్‌కు అడ్డు ఆపు లేదు.

భారత క్రికెటర్లు అన్ని ఫార్మాట్లల్లో మెరుగ్గా రాణించాలని అభిమానులు కోరుకుంటారు.

శుభ్‌మన్ గిల్ 20 ఏళ్ళ వయసులోనే బ్రిస్బేన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజెల్‌వుడ్, నాథన్ లియాన్‌ల బంతులను చెడుగుడు ఆడాడు. ఆ మ్యాచ్‌లో 91 పరుగులు తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

టైమింగ్, ఫీల్డర్ల పొజిషన్ అంచనా వేస్తూ, వారి మధ్య నుంచి బంతిని బౌండరీలకు తరలించే సామర్థ్యం శుభ్‌మన్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.

అన్ని ఫార్మాట్లల్లోనూ పరుగుల వరద పారించిన ఆత్మవిశ్వాసం శుభ్‌మన్‌లో కనిపిస్తూ ఉంటుంది. తనేంటో, తనకేం కావాలో, తన స్థానమేమిటో అతడికి తెలుసు. వచ్చే పదేళ్లల్లో భారత జట్టులో పలు మార్పులు చోటుచేసుకోవచ్చు. అలాంటప్పుడు శుభ్‌మన్ జట్టులో అదే విశ్వాసంతో నిలబడడం అవసరం కూడా.

శుభ్‌మన్ బ్యాటింగ్ చూస్తే ఒకప్పటి దిలీప్ వెంగ్‌సర్కార్ గుర్తొస్తుంటాడు. అయితే, చాలామంది భారత బ్యాట్స్‌మన్‌లా మణికట్టు బలంతో లేదా అల్లరిగా బ్యాటింగ్ చేయడు. గత కాలపు గొప్ప గొప్ప క్రికెటర్లలాగ బ్యాక్‌ఫుట్ బ్యాటర్. పుల్ల్ షాట్స్, ఊహించని రీతిలో ఆఫ్ సైడ్ స్ట్రోక్స్ కొడతాడు.

అదీ, సునాయాసంగా కొడుతున్నట్టు ఉంటుంది. అతడి బ్యాటింగ్‌లో శక్తి సామర్థ్యాలు, సౌందర్యాల మేళవింపు కనిపిస్తుంది. పుల్ షాట్స్ అంటే శుభ్‌మన్‌కు ఇష్టం. వికెట్‌కు రెండు వైపులా అద్భుతమైన కవర్ డ్రైవ్ కొట్టగలడు. పుల్ షాట్స్ కూడా రకరకాలుగా కొడతాడు. స్క్వేర్ లెగ్‌కు కుడి వైపు, మిడ్ ఆన్‌కు ఎడమవైపు ఇలా ఎటైనా కొట్టగలడు.

శుభ్‌మన్ గిల్

ఫొటో సోర్స్, Getty Images

వీటన్నింటినీ మించి, క్రీజులో ప్రశాంతంగా ఉంటూ, బ్యాట్‌తో మాత్రమే మాట్లాడుతూ, మ్యాచ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకోగలడు. అందుకే, చాలాసార్లు బౌలర్ కూడా ప్రేక్షకుడిలాగే నిలబడి చూడాల్సి వస్తుంది.

శుభ్‌మన్ ఇప్పుడే ఇలా ఉన్నాడంటే, కెరీర్ పీక్‌కు చేరుకునేసరికి ఎలా ఉంటాడో ఊహించలేం. అతడికి బంతులు వేసే బౌలర్ల కోసం ప్రార్థనలు చేయడం తప్ప చేయగలిగిందేం లేదు.

గాయాలు, పరుగులు తక్కువ చేయడం వలన జట్టుకు దూరమైన పరిస్థితుల నుంచి అతడు పాఠాలు నేర్చుకున్నాడు. గట్టిగా, బలంగా ఉన్నప్పుడే చేయగలిగినన్ని పరుగులు చేయాలి. అది ఎలాగూ అతడికి ఇష్టమైన పనే.

వైట్ బాల్ క్రికెట్ శుభ్‌మన్‌కు వినూత్నంగా బ్యాటింగ్ చేయడం నేర్పించింది. కానీ, టెస్టుల్లో కాస్త వెనబడి ఉన్నాడు. 15 టెస్టుల్లో అతడి సగటు 35కు కిందనే. నిజానికి, శుభ్‌మన్ లాంటి ఆటగాళ్లకు ఇది చాలా తక్కువ స్కోరు.

వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరగబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అతడికి సత్తా నిరూపించుకునే అవకాశం వస్తుంది. టెస్టుల్లో కూడా సచిన్, కోహ్లీలకు దీటుగా నిలబడగలడేమో చూడాలి. అది అతడికి, అతడి అభిమానులకు కూడా ముఖ్యం.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)