ఐపీఎల్ 2023: సూర్యకుమార్ అదిరిపోయే ఇన్నింగ్స్... బెంగళూరుపై ముంబయి విజయం

ఫొటో సోర్స్, ANI
ఐపీఎల్ 2023లో భాగంగా మంగళవారం ముంబయిలోని వాంఖెడే స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, ఇషాన్ కిషన్ రాణించడంతో రోహిత్ సేన 16.3 ఓవర్లలోనే 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. సూర్య బెంగళూరు బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లు బాదాడు.
200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
వేగంగా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ 21 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్సర్లు) 42 పరుగులు సాధించాడు.
అయితే ఐదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన వనిందు హసరంగా ఇషాన్ కిషన్‌ను ఔట్ చేశాడు. ఇషాన్ ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 51 పరుగులు.
అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ (7 పరుగులు)ను కూడా హసరంగ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు.
రోహిత్, ఇషాన్‌లు ఔటైన తర్వాత సూర్యకుమార్ , నెహాల్ వధేరాలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
వీరిద్దరి ధాటికి 10 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 99 పరుగులకు చేరుకుంది.
వేగంగా బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అతనికిది నాలుగో హాఫ్ సెంచరీ.
సూర్యకుమార్ 35 బంతుల్లో (7 ఫోర్లు, 6 సిక్సర్లు) 83 పరుగులు చేసి ఔటయ్యాడు.
విజయ్‌కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. సూర్య ఔటయ్యే సమయానికి ముంబయి విజయానికి 8 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. దీంతో 17వ ఓవర్ మూడో బంతికి నెహాల్ వధెరా సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. వధేరా 34 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
మొదటి ఓవర్లోనే వెనుదిరిగిన కోహ్లీ
ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ముంబయి ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీస్, గ్లెన్ మాక్స్‌వెల్‌ల భీకర ఇన్నింగ్స్‌తో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరుకు శుభారంభం లభించలేదు. విరాట్ కోహ్లి (1) మొదటి ఓవర్‌లోనే జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
మూడో ఓవర్‌లో బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లోనే 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనుజ్ రావత్ ఔటయ్యాడు.

ఫొటో సోర్స్, ANI
డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌ల భారీ ఇన్నింగ్స్
మాక్స్‌వెల్, డుప్లెసీలు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. 10వ ఓవర్లోనే బెంగళూరు స్కోరు 100 పరుగులు దాటింది.
తొలుత మ్యాక్స్‌వెల్ 25 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం కెప్టెన్ డుప్లెసిస్ కూడా 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే 13వ ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ను బెహ్రెన్‌డార్ఫ్ ఔట్ చేశాడు. మ్యాక్స్‌వెల్ 33 బంతుల్లో 68 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
మ్యాక్సీ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహిపాల్ లోమ్రోర్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
15వ ఓవర్లో కెమెరూన్ గ్రీన్ డుప్లెసీస్‌ను పెవిలియన్ పంపాడు. డుప్లెసీస్ 41 బంతుల్లో 65 పరుగులు చేశాడు.
ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 30 పరుగులు) బ్యాట్ ఝళిపించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు సాధించింది. ముంబయి బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్ 3 వికెట్లు తీసుకున్నాడు.

ఫొటో సోర్స్, IPL/BCCI
టాప్ 4 లోకి చేరుకున్న ముంబయి
బెంగళూరుపై విజయంతో రోహిత్ సేన పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 11 మ్యాచ్‌లు ఆడిన ముంబయి జట్టు 6 విజయాలు, 5 పరాజయాలతో 12 పాయింట్లు సాధించింది. కాగా, ముంబయిపై ఓటమితో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ స్థానం సంక్లిష్టం చేసుకుంది. ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉంది.
ఇవి కూడా చదవండి
- జనగణమన: జాతీయగీతానికి మదనపల్లెకూ సంబంధం ఏమిటి?
- ఐశ్వర్య తాటికొండ: టెక్సస్ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ, ఆమె ఫ్రెండ్‌కూ బుల్లెట్ గాయాలు
- పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?
- కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మళ్లీ వస్తుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా? గ్రాఫిక్స్‌లో రాజకీయ ముఖచిత్రం
- తెలంగాణ: రబీ సాగును ముందుకు జరపాలని కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది రైతులకు ప్రయోజనకరమేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














