ఐపీఎల్ 2023: పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ధోనీ సేన ఎలా ఓడించింది?

ఫొటో సోర్స్, ANI
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్‌లో 15 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) గెలుపొందింది.
దీంతో, మహేంద్ర సింగ్ ధోనీ సేన ఫైనల్‌లో చోటు దక్కించుకుంది.
సీఎస్‌కే ఫైనల్ చేరడం ఇది పదోసారి. ఈ జట్టు ఇప్పటివరకు ఫైనల్‌లో నాలుగుసార్లు విజయం సాధించి, ట్రోఫీ అందుకుంది.
ఐపీఎల్ 2023 ఫైనల్ మే 28 ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.
బుధవారం రాత్రి చెన్నైలో జరిగే ఎలిమినేటర్, మే 26 శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫైయర్ 2 ఫలితాలను బట్టి ఫైనల్‌లో చెన్నైతో తలపడే జట్టు ఏదనేది తెలుస్తుంది.

ఫొటో సోర్స్, BCCI
మెరిసిన జడేజా
తొలి క్వాలిఫయర్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్‌కు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ప్రారంభం నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఓపెనర్ వృద్ధిమాన్ సాహా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇద్దరూ కూడా పవర్ ప్లేలోనే తిరుగుముఖం పట్టారు.
అద్భుత ఫామ్‌లో ఉన్న గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ఒంటరి పోరాటం చేశాడు.
7.3 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 50 పరుగులను పూర్తి చేసింది. అయితే 11వ ఓవర్‌లో రవీంద్ర జడేజా గుజరాత్ టైటాన్స్‌కు మూడో షాకిచ్చాడు. ఆయన వేసిన బాల్‌కు దసున్ శానక ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో జడేజా అసాధారణంగా బౌలింగ్ చేశాడు.
ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ కూడా ఔటయ్యాడు.
ఇలా గుజరాత్ టైటాన్స్ వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. ‘‘మిడిల్ ఓవర్లలో మేం వికెట్లను కోల్పోయాం, అందుకే ఓడిపోయాం’’ అని మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
జడేజా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును కనబర్చాడు. నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
జడేజా, తీక్షణల అద్భుతమైన ఫీల్డింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది.
మిడిల్ ఓవర్లలో గుజరాత్ ఆరుగురు బ్యాటర్లను సీఎస్‌కే బౌలర్లు ఔట్ చేశారు.
గుజరాత్ టైటాన్స్‌లో శుభ్‌మన్ గిల్‌దే అత్యధిక స్కోరు. గిల్ 42 పరుగులు చేశాడు.
రషీద్ ఖాన్ కేవలం 16 బాల్స్‌లో 30 పరుగులు చేశాడు. అయినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ చతికిలపడింది.
మొత్తం 20 ఓవర్లలో గుజరాత్ 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.
60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
అదరగొట్టిన సీఎస్‌కే ఓపెనర్లు
రుతురాజ్ గైక్వాడ్ 44 బాల్స్‌లో 60 పరుగులు చేశాడు.
రెండో ఓపెనర్ డేవాన్ కాన్వే 34 బాల్స్‌లో 40 పరుగులు చేశాడు.
పవర్ ప్లే తొలి ఆరు ఓవర్లలో, సీఎస్‌కే టీమ్ 49 పరుగులు చేసింది.
10 ఓవర్లలో సీఎస్‌కే స్కోరు 85కి చేరింది. 18.2 ఓవర్లకు ఇది 150 పరుగులకు చేరుకుంది.
రవీంద్ర జడేజా 16 బాల్స్‌లో 22 పరుగులు చేశాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క రన్ తీశాడు.
నేడు లఖ్‌నవూ, ముంబయి మధ్య ఎలిమినేటర్
బుధవారం రాత్రి అహ్మదాబాద్‌లో లఖ్‌నవూ సూపర్ జైంట్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ జరుగనుంది.
ఎలిమినేటర్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీపడుతుంది.
క్వాలిఫైయర్ 2లో విజయం సాధించే జట్టు, ఆదివారం ఫైనల్‌లో చెన్నైతో తలపడుతుంది.
ఇవి కూడా చదవండి:
- 'భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తారా?'
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- జీ20 సదస్సు: కశ్మీర్లో ఆర్టికల్-370 రద్దు తర్వాత ఈ నాలుగేళ్ళలో ఏం మారింది?
- మానవ శరీరంలో ప్రకృతి చేసిన 'డిజైనింగ్ తప్పులు'
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














