'భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తారా?'

ఫొటో సోర్స్, GOVERNMENT OF INDIA
భారత కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం ఈ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతిని అడగకపోవడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
హిందుత్వ సిద్ధాంతకర్త అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి రోజునే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ముహుర్తంగా ప్రభుత్వం ఎన్నుకోవడంపై కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి.
ప్రతిపక్ష పార్టీలు వీడీ సావర్కర్‌ను ఒక విభజన వాదిగా పరిగణిస్తుండగా, అధికార బీజేపీ ఆయనను ఒక హీరోగా చూస్తుంది.
ప్రారంభోత్సవ తేదీని మే 28గా ఎన్నుకోవడం అంటే భారతదేశ వ్యవస్థాపకులను అవమానించినట్లే అని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు.
మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన వ్యక్తి జయంతి రోజున కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ విమర్శించారు.
అయితే, ఈ నిర్ణయాన్ని బీజేపీ సమర్థించుకుంది. కొత్త పార్లమెంట్ అనేది భారత ప్రజలకు గర్వకారణమని బీజేపీ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, GOVERNMENT OF INDIA
2021 జనవరిలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
నాలుగు అంతస్తుల ఈ భవనాన్ని డిజైన్‌ను ‘హెచ్‌సీపీ డిజైన్’ సంస్థ రూపొందించగా, టాటా ప్రాజెక్ట్స్ సంస్థ దీన్ని నిర్మించింది.
ఇప్పుడున్న పార్లమెంట్ కంటే ఇందులో సీట్ల సంఖ్యను పెంచారు. కొత్త పార్లమెంట్ నిర్మాణానికి దాదాపు రూ. 970 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా.
ఇప్పుడున్న బ్రిటిష్ కాలం నాటి పార్లమెంట్ భవనం కూడా మనుగడలోనే ఉంటుంది.
కొత్త భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం గత వారంలో ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి, పార్లమెంట్‌కు అధిపతి అయిన ద్రౌపది ముర్మును ప్రభుత్వం పక్కన పెట్టడంపై పలు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.
ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
‘‘పార్లమెంట్ అనేది గణతంత్ర భారత సర్వోన్నత వ్యవస్థ. పార్లమెంట్‌కు రాజ్యాంగబద్ధంగా అధిపతి రాష్ట్రపతి. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, పౌరులకు రాష్ట్రపతి మాత్రమే ప్రతినిధి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా దీని గురించి ఒక ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, GOVERNMENT OF INDIA
‘‘కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ ఔచిత్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా ఉంటుంది’’ అని ట్వీట్‌లో ఖర్గే పేర్కొన్నారు.
కాంగ్రెస్ విమర్శలను బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కొట్టిపారేశారు.
శుభసమయాల్లో రాహుల్ గాంధీ అపశకునంలా అడ్డుతగులుతారని, చారిత్రక క్షణాలను ఆయన స్వాగతించలేరని ఆయన అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
2020లో జరిగిన పార్లమెంట్ శంకుస్థాపన కార్యక్రమానికి కరోనా మహమ్మారి కారణంగా పలు ప్రతిపక్ష పార్టీలు హాజరు కాలేదు.
ఇవి కూడా చదవండి:
- డైనోసార్స్: పెట్రోల్, డీజిల్‌లు ఈ జంతువుల వల్లే పుట్టుకొచ్చాయా?
- జర్మనీ: రూ.1,000 కోట్ల విలువైన సంపదను ఐదుగురు దొంగలు ఎలా కొట్టేశారంటే...
- 30 అడుగుల లోతు నీటిలో 74 రోజులుగా ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నారంటే...
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- టైటానిక్: సముద్ర గర్భంలోని ఈ భారీ నౌక 'డీప్ సీ మ్యాపింగ్'తో ఎంత స్పష్టంగా కనిపిస్తోందో చూడండి...
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














