మహిళా రెజ్లర్లు: '#MeToo' నిరసనతో ఒలింపిక్ కలలు చెదిరిపోతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయా మతీన్
- హోదా, బీబీసీ న్యూస్
వినేశ్ ఫోగాట్‌కు 2023 అన్ని విధాలుగానూ కీలకమైనది.
వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా గేమ్స్‌కు మూడు నెలలు మాత్రమే మిగిలివుంది. నిజానికి ఇప్పుడు ఆమె కఠోరమైన శిక్షణలో తలమునకలై ఉండాలి. ఆ శిక్షణను ‘‘అల్టిమేట్ లెవల్’’ ట్రైనింగ్‌గా ఆమె చెప్పారు. శరీరంలోని భాగాలన్నీ ఆ శిక్షణలో పాల్గొంటాయని, ప్రతి ఎముకకూ ఏం చేయాలో అప్పుడు తెలుస్తుందని ఆమె అన్నారు.
రెండు వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచిన ఆమె ప్రస్తుతం మూడోసారి కూడా పతకం తెచ్చే అవకాశముంది.
అయితే, నేడు ట్రైనింగ్ క్యాంప్‌లో మానసికంగా, శారీరకంగా శిక్షణ తీసుకునేందుకు బదులుగా.. దిల్లీలోని మురికి శిబిరింలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ సరైన నిద్ర కూడా లేకుండా ఆమె గడుపుతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ప్రముఖ రెజ్లర్లలో వినేశ్ కూడా ఒకరు. ఆయన తన పదవికి రాజీనామా చేయడంతోపాటు వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని దిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా రెజ్లర్లు నిరసన తెలియజేస్తున్నారు.
ఈ ఆరోపణలపై ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌ను దిల్లీ పోలీసులు ప్రశ్నించారు. అయితే, ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే రెజ్లర్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మే 23తో దిల్లీలో రెజ్లర్ల నిరసన మొదలై నెల రోజులు గడుస్తోంది. రెజ్లర్ల పతకం సాధించే అవకాశాలకు ఈ నిరసన గండి కొడుతోంది. దీని వల్ల రెజ్లర్లు తీవ్ర ఆందోళన, వేదనను చవిచూస్తున్నారు.
వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు పతకాలు తెచ్చే అవకాశాలకూ ఈ నిరసన తూట్లు పొడుస్తోంది. 2008 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు ఏడు పతకాలు వచ్చాయి.
2020 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన రెజ్లర్ బజ్‌రంగ్ పునియా మాట్లాడుతూ.. ‘‘మేం పతకాలు సాధించాలని దేశం మొత్తం మాపై ఆశలు పెట్టుకుంటోంది. మేం కూడా పతకాలు సాధించాలనే కలలు కంటున్నాం. కానీ, ఇప్పుడు చూడండి. మేం 30 రోజులుగా ఇక్కడే నిరసన చేపట్టాల్సి వస్తోంది’’ అని అన్నారు.
ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాలంటే ‘‘క్వాలిఫికేషన్ ఈవెంట్లు’’లో పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. రెజ్లింగ్ విషయానికి వస్తే, సెప్టెంబరులో జరగబోతున్న వరల్డ్ చాంపియన్‌షిప్.. క్వాలిఫికేషన్ ఈవెంట్లలో ఒకటి. ఇది ఒలింపిక్స్‌కు ద్వారం లాంటిదని ‘‘ఎంటర్ ద దంగల్: ట్రావెల్ థ్రూ ఇండియాస్ రెజ్లింగ్ ల్యాండ్‌స్కేప్’’ పుస్తక రచయిత రుద్రనీల్ సేన్‌గుప్తా చెప్పారు.
‘‘వరల్డ్ చాంపియన్‌షిప్ లేదా నేషనల్ గేమ్స్ లాంటివి ఇక్కడ చాలా ముఖ్యం. ఇవి క్వాలిఫైయింగ్ ఈవెంట్లు మాత్రమే కాదు. ప్లేయర్ల కెరియర్‌లో ఇలాంటి ఈవెంట్లకు చాలా ప్రాధాన్యముంటుంది’’అని ఆయన వివరించారు.
నిరసనలు చేపడుతున్న చోటే శిక్షణ కొనసాగిస్తున్నామని రెజ్లర్లు చెబుతున్నారు. అయితే, ఈ శిక్షణ సరిపోదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘‘రెజ్లింగ్‌కు కఠోరమైన శారీరక శిక్షణ అవసరం. అత్యుత్తమ స్థాయిలో ప్రతిభ కనబరచాలంటే మీరు నిత్యం సన్నద్ధం అవుతూనే ఉండాలి’’అని సేన్‌గుప్తా చెప్పారు.
‘‘సరైన శిక్షణ తీసుకోకపోతే తొలి 30 సెకన్లలోనే రెజ్లర్ ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ అతడికి ఎంత నైపుణ్యమున్నా శిక్షణ లేకపోతే ఫలితాలు కనిపించవు’’అని ఆయన అన్నారు.
ఆసియా ర్యాంకింగ్ సిరీస్ సహా కొన్ని ప్రధాన టోర్నమెంట్లను ఇప్పటికే తాము కోల్పోయామని బజ్‌రంగ్ పునియా చెప్పారు. ‘‘వ్యక్తిగత అజెండాలో మేం నిరసన చేపడుతున్నాం అంటున్నారు. కానీ, పోటీల్లో పాల్గొనలేకపోవడం అనేది, ఒక ప్లేయర్ జీవితంలో అతిపెద్ద ఓటమి’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANSHUL VERMA/BBC
సాధారణంగా రెజ్లర్ల శిక్షణ ఉదయం నాలుగు లేదా ఐదు గంటలకు మొదలవుతుంది. మొదట వార్మ్-అప్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. ఆ తర్వాత రోజుకో రకమైన శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.
కొన్ని రోజులు బరువులు ఎత్తుతారు. మరికొన్ని రోజులు శారీరక దృఢత్వాన్ని పటిష్ఠం చేసుకొనేందుకు ఇతర వ్యాయామాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ట్రయల్స్ మ్యాచ్‌లు ఆడతారు. మరికొన్నిసార్లు వ్యూహాలకు పదునుపెడుతుంటారు.
‘‘ఆ రోజుల్లో జీవితాన్ని శిక్షణకే అంకితం చేస్తాం. మిగతా ఏ పనులూ చేయం. శిక్షణ, నిద్ర, ఆహారం తీసుకోవడం, మళ్లీ ఇవే పనులను పునరావృతం చేస్తాం’’ అని ఫోగాట్ చెప్పారు.
ఏదైనా పోటీలకు ప్రత్యేక శిక్షణకు ముందు కొన్ని నెలలపాటు ప్రత్యర్థుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకొని నిలబడేలా తమ శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటారు. దీన్ని ‘‘ఎ టైమ్ ఆఫ్ ఫోకస్డ్ ఇంటెన్సిటీ’’గా సేన్‌గుప్తా చెప్పారు. ఈ సమయంలో క్రమశిక్షణపైనే అథ్లెట్లు దృష్టిసారించాల్సి ఉంటుది. శరీరంలోని ప్రతి భాగమూ దృఢంగా మారాలి. శారీరక బలం నుంచి మానసిక శక్తి వరకూ అన్నింటిలోనూ రాటుదేలాలి. ఇక్కడ ప్రతి కదలికల, సంకేతాలు, ఊపిరిని కూడా గమనిస్తుంటారు.
ఆ తర్వాత కొన్ని నెలలు రెజ్లర్ల శరీరం అత్యత్తుమ స్థాయిలో ప్రదర్శించేందుకు సిద్ధం అవుతుంది. రెప్పపాటు సమయంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో స్పందించేలా శరీరాన్ని తీర్చిద్దుకునేందుకు అవసరమయ్యే శక్తినే ‘‘ఎక్స్‌ప్లోసివ్ పవర్’’గా పిలుస్తారని సేన్‌గుప్తా చెప్పారు. పోటీకి చివరి నెలలో శరీరానికి విశ్రాంతి అవసరం.
గాయాల నుంచి కోలుకోవడానికి ఈ విశ్రాంతి చాలా అవసరమని బజ్‌రంగ్ పునియా చెప్పారు.
ఆసియా గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్ రెండూ సెప్టెంబరులోనే జరగబోతున్నాయి. అందుకే ఈ వారంలోనే నిరసనలను నిలిపివేసి పూర్తిస్థాయి శిక్షణకు రెజ్లర్లు వెళ్తేనే అత్యుత్తమ ఫలితాలు రావచ్చని సేన్‌గుప్తా అన్నారు.
‘‘అయితే, ఒక్కోసారి మూడు నెలలనూ శిక్షణ కోసం కేటాయించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే భయం దిల్లీలో నిరసన చేపడుతున్న రెజ్లర్లను కూడా వెంటాడుతోంది.
వందల మంది పోలీసులు, మద్దతుదారుల సమక్షంలో టార్పాలిన్ షీట్‌లో వేసిన శిబిరాల్లో వీరు నిరసన తెలియజేస్తున్నారు.
రోజంతా రెజ్లర్ల అందుబాటులో ఉంటున్నారు. ప్రముఖులను కలవడం, ఇంటర్వ్యూల్లో మాట్లాడటం లాంటివి చేస్తున్నారు. అయితే, సాయంత్రం కాగానే చాలా మంది మద్దతుదారులు నిద్రపోవడానికి వెళ్తున్నారు. అప్పుడే రెజ్లర్లు శిక్షణ మొదలుపెడుతున్నారు.
అలసట ఒకవైపు, నుదుటపై కారుతున్న చెమటలు మరోవైపు.. ఇలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే గంట లేదా రెండు గంటలపాటు వీరు శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ సమయంలో అంకితభావంతో పనిచేస్తున్నామని, కానీ కొన్నిసార్లు నిరుత్సాహం కూడా ఆవరిస్తోందని వారు చెప్పారు.
ఇక్కడ తీసుకునే శిక్షణకు స్పోర్ట్స్ సెంటర్లో తీసుకునే సమగ్ర శిక్షణకు చాలా తేడా ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ చాలా మంది అడ్డువస్తుంటారు. ‘‘ఈ శిక్షణ సరిపోదని మాకు తెలుసు. కానీ, మేం వంద శాతం కృషి చేస్తున్నాం’’అని ఫోగాట్ చెప్పారు.
వీరి చుట్టుపక్కల పరిసరాలు కూడా సరిగ్గా లేకపోవడంతో ఏకాగ్రతతో శిక్షణలో పాలుపంచుకోవడం కష్టం అవుతోంది.
‘‘ట్రైనింగ్ క్యాంప్‌లో కూడా చాలా కష్టంగా ఉంటోంది. కొన్నిసార్లు ఇలాంటివి తప్పదు’’అని సాక్షి మలిక్ చెప్పారు. ‘‘సరైన ఆహారం, నిద్ర, విశ్రాంతి లేకుండా ఇక్కడ జీవించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులు వస్తాయని మేం ఎప్పుడూ అనుకోలేదు’’అని ఆమె చెప్పారు.
ఓడిపోవడం కాదు, అత్యుత్తమ స్థాయిలో ప్రతిభ కనబరచకపోవడమే అసలైన ఓటమి అని బజ్‌రంగ్ పునియా చెప్పారు.
‘‘సరైన శిక్షణ తీసుకోలేనప్పుడు, అత్యుత్తమ స్థాయిలో ప్రతిభ ఎలా చూపగలం?’’అని ఆయన ప్రశ్నించారు.
అయితే, ఇక్కడి రెజ్లర్లు సరైన శిక్షణ తీసుకోకపోవడంతో పతకాలపై భారత్ అవకాశాలు పూర్తిగా తగ్గిపోకపోవచ్చని, ఎందుకంటే ఇప్పటికీ మన దగ్గర మంచి ప్రతిభ చూపించే రెజ్లర్లు చాలా మంది ఉన్నారని సేన్‌గుప్తా అన్నారు.
‘‘కానీ, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ నిరసన న్యాయం కోసం జరుగుతోంది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణల విషయంలోనూ తగిన ప్రక్రియలను ఎందుకు అధికారులు అనుసరించడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు.
ఇక్కడి రెజ్లర్లు కూడా తమ స్థానాలను వేరొకరు భర్తీ చేయొచ్చనే వాదనకు అంగీకరిస్తున్నారు. అయితే, తమ డిమాండ్లు నెరవేరేవరకూ వెనక్కి తగ్గేదిలేదని వారు చెబుతున్నారు.
‘‘ఇలా మాట్లాడటం మా పనికాదు. శిక్షణ తీసుకోవడం, ఆడటం, పతకాలు గెలవడమే మాకు తెలుసు. కానీ, ఇప్పుడు మాట్లాడటం మా బాధ్యత. మేం దీన్ని పూర్తిగా నెరవేరుస్తాం’’అని సాక్షి మలిక్ అన్నారు.
ఫోగాట్ ఇప్పటికీ పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘మేం అత్యుత్తమ స్థాయిలో ప్రతిభ చూపేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు, మమ్మల్ని పోటీలో పాల్గొనకుండా అడ్డుకుంటే బతికున్న శవాల్లా అనిపిస్తుంది’’అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వాట్సాప్ మెసేజ్‌లను ఇక ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగంటే..
- బ్రిటన్ ప్యాలెస్‌లో ఇథియోపియా యువరాజు మృతదేహం, ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాజకుటుంబం, కారణమేంటి?
- అమ్మాయిల పీరియడ్స్ గురించి అబ్బాయిలూ తెలుసుకోవాలి, ఎందుకంటే...
- పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళాడేందుకు ఏడేళ్ళు ఎదురుచూసిన భారత ప్రేమికుడు
- కండోమ్ అడగడానికి మగాళ్ళు ఎందుకు సిగ్గుపడతారు, దీన్ని ఎవరు మార్చేశారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















