జీడిమెట్ల: ‘ఈ నీరు కింద పడితే నేల ఎర్రగా మారిపోతోంది’.. హైదరాబాద్ శివార్లలోని భూగర్భ జలాన్ని బీబీసీ టెస్ట్ చేయిస్తే బయటపడిన వాస్తవం ఇదీ

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘బోర్ల నుంచి వచ్చే నీరు తాగడానికే కాదు, రోజువారీ అవసరాలకు కూడా పనికి రాదు. ఇందులో టీడీఎస్ సహా కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నాయి.’’
జీడిమెట్ల ప్రాంతం నుంచి సేకరించిన భూగర్భ నీటి శాంపిళ్లకు ‘బీబీసీ’ పరీక్షలు చేయించగా తేలిన వాస్తవమిది.
‘‘ఇంట్లో బోరు ఉంది కానీ, అందులోంచి వచ్చే నీటిని వాడాలంటే మాకు భయం. వాటితో గిన్నెలు కడిగామంటే రోగాలు వస్తాయి. నీటి నుంచి ఒకపక్క డ్రైనేజీ వాసన.. మరోపక్క కెమికల్ వాసన వస్తుంటుంది’’అని బీబీబీతో మాట్లాడుతూ జీడిమెట్ల సమీపంలోని గంపలబస్తీకి చెందిన శకుంతల ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్ శివారులో అతిపెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన జీడిమెట్ల ప్రాంతంలో భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయి.
ఏళ్ల తరబడిగా కొన్ని కాలనీల్లోని బోర్ల నుంచి రంగు మారి, రసాయన వాసనలతో కూడిన నీరు వస్తున్నట్లు తేలింది.
ముఖ్యంగా పారిశ్రామికవాడకు దగ్గరగా ఉన్న కాలనీల్లో నివాసం ఉండటంతో భూగర్భ నీటి కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
‘‘ఈ సమస్య ఇప్పటిదీ కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. 20, 30 ఏళ్లుగా బాగా ఎక్కువైంది’’ అని గంపలబస్తీకి చెందిన తిరుపతిరెడ్డి బీబీసీకి చెప్పారు.

నాలుగు చోట్ల నుంచి శాంపిల్స్ సేకరణ
జీడిమెట్ల సహా పారిశ్రామిక వాడల్లో బోర్ల నుంచి కలుషిత జలాల సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉంది.
ఈ నీటిలో కలుషితాలు ఏ మేరకు ఉన్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
కలుషిత నీటి సమస్యపై అధ్యయనం చేసేందుకు బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించింది.
జీడిమెట్ల చుట్టుపక్కల ఉన్న సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రినగర్, గంపలబస్తీ, రామిరెడ్డినగర్, అపురూపకాలనీ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ ప్రాంతాల నుంచి నీటి శాంపిల్స్‌ను సేకరించింది.
వీటికి కూకట్‌పల్లిలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల్లో ఏం తేలిందంటే..
నీటి శాంపిల్స్ పరీక్షల్లో ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
వెంకటాద్రినగర్, గంపలబస్తీ నుంచి సేకరించిన నీరు రోజువారీ అవసరాలకు వినియోగించేందుకు పనికిరావని తేలింది.
ఇందులో కాలుష్య కారకాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
సుభాష్ నగర్ డివిజన్‌లోని వెంకటాద్రినగర్‌లో సేకరించిన శాంపిల్స్ ఫలితాలను పరిశీలిస్తే.. ఐఎస్ఐ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని రుజువైంది.
ఈ నీరు కనీసం ఇళ్లలో రోజూ వారీ అవసరాలకు పనికిరాదని నివేదిక స్పష్టం చేస్తోంది.
సాధారణ నీటిలో ఐటీడీఎస్(టోటల్ డిసాల్వడ్ సాలిడ్స్) 500 నుంచి 2000 మధ్య ఉండాల్సి ఉంది.
ఇక్కడి నీటిలో మాత్రం టీడీఎస్ 3200 లెవల్ వరకు ఉంది.
ఎలక్ట్రికల్ కండక్టివిటీ 2250 వరకే ఉండాల్సి ఉండగా, 5280 ఉంది.
కఠినత్వం 600కు మించి ఉండకూడదు. ఇందులో 1496 యూనిట్లు ఉన్నాయి.
ఐరన్, ఫ్లోరైడ్, నైట్రేట్ మెగ్నీషియం, కాల్షియం.. ఇలా అన్ని నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడి బోర్ల నుంచి వచ్చే నీటి పరిస్థితిపై వెంకటాద్రినగర్‌కు చెందిన కల్యాణి బీబీసీతో మాట్లాడారు.
‘‘మా ఇంట్లో ఉన్న పాత బోరు చెడిపోవడంతో ఆరు నెలల కిందట మరో బోరు వేశాం. మొదట్లో కాస్త బాగానే నీళ్లు వచ్చేవి. ఇప్పుడు రంగుమారి వస్తున్నాయి. ఏవైనా పాత్రలు కడుగుదామంటే ఎర్ర రంగులోకి మారుతున్నాయి. ఒకవేళ బకెట్ నిండి కింద పారితే.. అక్కడ నేలంతా ఎర్రగా అవుతోంది. ఈ నీటిని బాత్రూంలు కడగడానికే వాడుతుంటాం’’ అని చెప్పారు.
గంపలబస్తీలో సేకరించిన శాంపిల్స్ సైతం తాగునీరు, రోజువారీ వాడకానికి నీరు పనికిరాదని తేలింది.
ఇక్కడ తిరుపతిరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఓపెన్ బావి నుంచి బీబీసీ నీటి శాంపిల్స్ సేకరించింది.
బావిలో రసాయన వ్యర్థాలు కలుస్తుండటంతోపాటు మురుగుకాల్వ పక్కన ఉండటంతో ఆ ప్రభావం ఎక్కువగా ఉంది.

రాత్రిపూట ఘాటు వాసన
రోజూ రాత్రిళ్లు అయితే తీవ్రమైన రసాయన ఘాటు వాసనలతో తట్టుకోలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు.
ఇక్కడి నీటి శాంపిల్స్‌లో ఈ.కోలై బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు తేలింది.
ఈ నీరు రోజూ వారి అవసరాలకు వాడటానికి ఉపయోగపడదని టెస్టుల్లో తేలింది. అలా వినియోగిస్తే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నివేదికలో వచ్చింది. కేవలం మొక్కలు, ఇళ్లు శుభ్రం చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుందని నివేదికలో ఐహెచ్‌ఎస్ ల్యాబ్ పేర్కొంది.
ఈ బస్తీలోని పరిస్థితిపై శకుంతల అనే మహిళ బీబీసీతో మాట్లాడారు. ‘‘నీరు వాడుకునేందుుకు పనికిరాకుండా పోయింది. బోరు నుంచి వచ్చిన నీటిని పట్టుకుంటే దుర్వాసన వస్తుంది. వాటిని వాడితే చేతులు, కాళ్ల మీద బొబ్బలు వస్తుంటాయి. రాత్రి అయితే చాలు గాల్లోకి విషవాయువులు విడిచిపెడుతుంటారు. వాటిని పీల్చలేక ఊపిరి ఆడనట్లు అవుతుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రామిరెడ్డినగర్ నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ తీవ్రంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ఇది 2250 సైమన్స్ పర్ సెంటీమీటర్ గా ఉండాలి. అయితే, కాలనీలో ఇది ఏకంగా 2995గా ఉంది. టీడీఎస్ సైతం 1800 ఎంజీ పర్ లీటర్ గా ఉంది.
నీటి కఠినత్వం సూతం 520 ఎంజీ పర్ లీటర్‌గా ఉంది.
ఫ్లోరైడ్ కంటెంట్ కేవలం ఒక ఎంజీ పర్ లీటర్ ఉండాల్సి ఉంది. 1.72 ఎంజీ పర్ లీటర్ ఉంది.

ఎస్ఆర్‌నాయక్ నగర్ జీడిమెట్ల పారిశ్రామికవాడకు కాస్త దూరంగా ఉంది. దీనివల్ల ఇక్కడ సేకరించిన శాంపిల్స్‌లో కాలుష్య కారకాలు తక్కువగా ఉన్నట్లు తేలింది.
నీటి శాంపిల్స్ పరీక్షల ఫలితాలపై జేఎన్టీయూలోని వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఎంవీఎస్ఎస్ గిరిధర్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘భూగర్భ నీటిలో టీడీఎస్ సహజంగా ఉంటుంది. కానీ వెంకటాద్రినగర్, గంపలబస్త, రామిరెడ్డినగర్‌లో మరీ ఎక్కువగా ఉంది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు ఏ మాత్రం వాడకపోవడం మంచిది. ఎందుకంటే ఆర్వో వంటి పద్ధతులలో శుద్ధి చేసినా ప్రయోజనం తక్కువే’’ అని చెప్పారు.
‘‘ఫ్లోరైడ్, కాల్షియం, మాంగనీస్ కూడా ఎక్కువగా ఉంది. నీరు రంగు మారి కనిపిస్తున్నాయి. కఠినత్వం ఎక్కువగా ఉండటంతో ఇవి వినియోగించేందుకు వీలుండదు’’ అని గిరిధర్ బీబీసీకి చెప్పారు.
ఎక్కువ లోతుకు బోరు వేస్తే దుర్వాసన
కాలనీల్లో బోర్లు ౩౦౦ అడుగులకుపైగా లోతుకు వేస్తే ఆ నీటిలోంచి దుర్వాసన వస్తోందని సుభాష్ నగర్‌కు చెందిన రాజేందర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఈ కాలనీలకు పక్కనే ఫాక్స్ సాగర్ చెరువు ఉంది.
బోర్లు ౩౦౦ అడుగుల కంటే తక్కువ లోతులో వేస్తే పక్కనే ఉన్న చెరువు కారణంగా నీటి నాణ్యత కాస్త బాగానే ఉంటుందని స్థానికులు బీబీసీకి చెప్పారు.
‘‘పరిశ్రమలలో వచ్చే రసాయన వ్యర్థ నీటిని శుద్ధి చేయకుండా కొన్నిచోట్ల రివర్స్ బోరింగ్‌లో భూమిలోకి పంపిస్తుంటారు. 500 నుంచి 1000 అడుగుల లోతులోకి బోర్లు వేసి రసాయన వ్యర్థ జలాలు అందులోకి పంపుతున్నారు. అందుకే బోర్లు ఎక్కువ లోతులోకి వేస్తే రసాయనాలు కలిసి నీరు రంగు మారి రావడం కనిపిస్తోంది’’ అని రాజేందర్ రెడ్డి వివరించారు.

గొట్టాలు వేసి నేరుగా డ్రైనేజీలోకి…
రసాయన వ్యర్థ జలాలను నేరుగా భూమిలోకి లేదా డ్రైనేజీలోకి వదిలేందుకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు అంగీకరించవు.
కెమికల్, ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు కచ్చితంగా మురుగునీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేయాలి.
పరిశ్రమలలో విడుదలయ్యే నీటిని శుద్ధి చేశాకే బయటకు విడిచిపెట్టాలి. లేదంటే ప్రత్యేక వాహనాలలో శుద్ధి చేయించిన నీటిని దూరంగా తీసుకెళ్లి పారవేయాలి.
ఈ విషయాన్ని పరిశ్రమలు పట్టించుకోకుండా రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి లేదా డ్రైనేజీలోకి విడిచిపెడుతున్నాయి.
ఈ విషయంపై జీడిమెట్ల పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు పి.ప్రవీణ్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘కొన్ని పెద్ద కంపెనీలైతే బాధ్యత యుతంగా వ్యర్థాల శుద్ధి కేంద్రానికి తరలించి శుద్ధి చేయిస్తున్నాయి.
గాల్లోకి పొగ విడుదలయ్యే విషయంలో నిబంధనలు పాటిస్తున్నారు.కానీ, కొన్ని కంపెనీలు పాటించడం లేదు. ఈ విషయంలో మరికాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంది. దీనిపై పొల్యుషన్ కంట్రోల్ అధికారులు ద్రష్టి పెట్టాలి’’ అని చెప్పారు.

మినరల్ వాటర్‌కు బాగా డిమాండ్
కాలనీల్లో మినరల్ వాటర్ ప్లాంట్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. కిరాణ దుకాణాలతో సహా చాలాచోట్ల మినరల్ వాటర్ క్యాన్ల విక్రయాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి.
బీబీసీ ప్రతినిధి ఎస్ఆర్‌నాయక్ నగర్ వెళ్లినప్పుడు అక్కడ కాలనీ సంక్షేమ సంఘం తరఫున శుద్ధి చేసిన నీటిని విక్రయిస్తున్నారు.
దీన్ని కేవలం రూ.5కే అమ్ముతున్నట్లు సంక్షేమ సంఘం ప్రతినిధులు చెప్పారు.
నీటిని కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల కాలనీల నుంచి ప్రజలు వస్తున్నారు.
కొన్ని కాలనీలకు రోజూ విడిచి రోజూ, మరికొన్ని కాలనీలకు జలమండలి తరఫున మంజీరా నీటిని సరఫరా చేస్తున్నారు.
అయితే, కొన్ని చోట్ల బోరు నీరు, మంజీరా జలాలు ఒకే పైపులైనులో సరఫరా చేస్తున్నారు.
అలాగే బోర్ల నుంచి దుర్వాసనతో కూడిన నీరు వస్తుండటంతో స్థానికులు మంజీరా నీటినే వాడుక అవసరాలకు వినియోగించుకుంటున్నారు. శుద్ధి చేసిన నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు.
దీనివల్ల ప్రతి ఇంటికి రోజుకు రూ.40-50 అదనంగా నీటికే ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఎస్ఆర్ నాయక్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ బీబీసీకి చెప్పారు.
పరిశ్రమల తరలింపు సాధ్యమేనా..?
హైదరాబాద్ చుట్టుపక్కల కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలనే ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పట్నుంచి ఉంది.
కాలుష్య స్థాయిలను బట్టి పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ కేటగిరీలుగా విభజించింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సూచీ ప్రకారం.. ఇండెక్స్ స్కోర్ 60, ఆపైన ఉంటే ‘రెడ్’ కేటగిరీ పరిశ్రమగా గుర్తిస్తారు. 41 నుంచి 59 ఉంటే ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమగా గుర్తిస్తారు.
21 నుంచి 40 ఉంటే గ్రీన్ కేటగిరీ.. 20 లేదా అంతకంటే తక్కువ ఉంటే వైట్ కేటగిరీ పరిశ్రమగా గుర్తిస్తారు.
దీని ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల అవుటర్ రింగు రోడ్డు లోపల 1700 పరిశ్రమలను రెడ్ కేటగిరీలో ఉన్నట్లు 2008లోనే ప్రభుత్వం గుర్తించింది.
ఆ తర్వాత 2012 మార్చిలో ప్రభుత్వం పరిశ్రమల నిర్వాహకులు, సంఘాలతో సమావేశం నిర్వహించింది.
దాని ఆధారంగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలని నిర్ణయించారు.
దీనికి సంబంధించి 2013 మార్చి ఒకటిన అప్పటి ఉమ్మడి ఆంధప్రదేశ్లోని పరిశ్రమల శాఖ జీవో నం.20 జారీ చేసింది.
ఆ తర్వాత 2018 జనవరిలో జీవో నం.4ను తీసుకువచ్చింది. ఇందులో కొన్ని వెసులుబాట్లు కల్పించింది.
ఎలాంటి వ్యర్థాలు బయటకు వెళ్లకుండా పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదిలేలా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే అవుటర్ రింగు రోడ్డు వెలుపల ఇండస్ట్రీయల్ ప్రాంతాలు అభివ్రద్ధి జరిగే వరకు కొనసాగే వీలు కల్పించింది.
దీనివల్ల అప్పట్నుంచి పరిశ్రమల తరలింపు వ్యవహారం ఏళ్ల తరబడిగా ముందుకు సాగడం లేదు.
ఈ విషయంపై కాలుష్య నియంత్రణ మండలి విభాగం ఈఈ బి.రాజేందర్ బీబీసీతో మాట్లాడారు.
‘‘రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను అవుటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలనే ప్రతిపాదన ఉంది.
జీవో నం.4లో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రస్తుతం కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం లేదు. కేవలం పాతవి మాత్రమే కొనసాగుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.
పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంపై తమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి పెట్రోలింగ్ బ్రందం నిఘా పెడుతోందని చెప్పారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడం జరుగుతోందని చెప్పారు.
పరిశ్రమల నిర్వాహకులకు ఉన్న ఇబ్బందులేమిటి..?
అవుటర్ రింగు రోడ్డు అవతలికి వెళ్లడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.
దీనిపై జీడిమెట్ల పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు పి.ప్రవీణ్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలకు అవుటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలని నోటీసులు అందించారు.
కానీ మొత్తం ప్లాంటు తొలగించి మళ్లీ ఏర్పాటు చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని చెబుతున్నారు.
పాత ప్లాంటులోని మెటీరియల్ తుక్కుగా మార్చాల్సిందే. తగిన నష్ట పరిహారం ఇస్తే వెళ్లేందుకు పరిశ్రమల నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















