రైళ్ళలో స్లీపర్ క్లాస్ బోగీలు కనిపించకుండా పోతున్నాయా... ఎస్1-ఎస్12 ఇక గత చరిత్రేనా?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ట్రైన్ నంబర్ 17015.
భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్.
మొత్తం 22 బోగీలుండే ఈ రైలులో థర్డ్ ఏసీ బోగీలు 10, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీ ఒకటి చొప్పున ఉన్నాయి. అంటే, మొత్తం ఏసీ బోగీలు 15 కాగా, స్లీపర్ బోగీలు కేవలం మూడు మాత్రమే. జనరల్ రెండు బోగీలు, వికలాంగులు, మహిళలకు కలిపి మరో బోగీ ఉంది. మరోటి జనరేటర్, లగేజ్ కోసం వాడుతున్నారు.
గతంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో 12 స్లీపర్ క్లాస్ బోగీలుండేవి. ఇప్పుడు వాటిని 3కి కుదించేశారు. రిజర్వ్ చేయించుకునే అవకాశం ఉన్న స్లీపర్ క్లాసులో ప్రస్తుతం మూడు బోగీలే మిగిలాయి.
రిజర్వేషన్ చేయించుకోవడం సాధ్యపడని వారు, అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చిన వారు, జనరల్ టికెట్‌తో ప్రయాణించేందుకు మూడు బోగీల్లోనే అనుమతి ఉంది.
మరో రైలు సంగతి చూద్దాం.
ట్రైన్ నంబర్ 18045, షాలీమర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్.
సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఈ రైలులో ప్రస్తుతం స్లీపర్ క్లాస్ బోగీలు 7 మాత్రమే ఉన్నాయి. రైలులో 11 ఏసీ బోగీలున్నాయి. జనరల్ బోగీ ఒక్కటంటే ఒక్కటే. వికలాంగులు, మహిళలకు కలిపి మరో బోగీ ఉంది. సరుకుల రవాణా కోసం ఆర్ఎంఎస్‌కు ఒక బోగీ కేటాయించారు.
ఏడాది క్రితం వరకూ ఈ రైలులో 12 స్లీపర్ క్లాసులు, 6 ఏసీ బోగీలుండేవి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. థర్డ్ ఏసీ బోగీల సంఖ్య 4 నుంచి 6కి పెరిగింది. టూటైర్ ఏసీ బోగీలు రెండు ఉన్నాయి. అదనంగా మరో 3 ఏసీ బోగీలు చేరాయి.
ఎక్కువ శాతం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అంతే
ఇక విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య నడిచే, ఎప్పుడూ రద్దీగా ఉండే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోనూ స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యను కుదించేశారు. ఈ రైలులో గతంలో 12 స్లీపర్ క్లాస్ బోగీలుండగా, ఇప్పుడు 8కి తగ్గించేశారు.
విశాఖపట్నం - కడప మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో గతంలో పదికి పైగా స్లీపర్ క్లాస్ బోగీలుండేవి. ప్రస్తుతం 7 బోగీలకు పరిమితం చేశారు.
ఇలా, ఎక్కువ శాతం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీల కుదింపు ప్రక్రియ కొనసాగుతోంది.

వేగంగా స్లీపర్ బోగీల కుదింపు
రెండేళ్లుగా రైల్వే శాఖలో భారీ మార్పులు జరిగాయి. ముఖ్యంగా కరోనావైరస్ మహమ్మారి అనంతరం భారతీయ రైల్వే నిర్ణయాలతో రైళ్లలో పెద్ద మార్పులే వచ్చాయి.
ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చేశారు. అవే స్టేషన్లు, దాదాపుగా అదే టైమింగ్‌తో నడుపుతున్నా ఛార్జీలు మాత్రం పెరిగాయి. చివరకు మెమూ ట్రైన్లకు కూడా ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు.
అదే సమయంలో, దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే అనేక రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీల కుదింపు వేగంగా జరుగుతోంది. స్లీపర్ బోగీలను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. స్లీపర్ స్థానంలో ఏసీ బోగీల సంఖ్యను పెంచుతున్నారు.
విశాఖ, గోదావరి, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల తరహాలో, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలకు కోత పడుతోంది. ఫలితంగా సీటు లేదా బెర్త్ రిజర్వేషన్ దొరక్క ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఎంత ముందుగా ప్రయాణం కోసం రిజర్వు చేయించుకోవాలని ఆశించినా సెలవులు, పండుగల సందర్భాల్లో టికెట్లు దొరకట్లేదు. ఫలితంగా జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించేవారు నిల్చోవడానికి కూడా ఖాళీ దొరక్క స్లీపర్ క్లాసు బోగీల్లో ఎక్కేస్తున్నారు. ఇది రిజర్వేషన్ లేని వారితో పాటు, రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు కూడా ఇబ్బందిగా మారుతోంది.
జనరల్ బోగీలతో సమానంగా ఇప్పుడు రిజర్వుడు స్లీపర్ క్లాస్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు , వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేసవిలో దూర ప్రయాణాలకు వెళ్లేవారి సమస్య ఇంకా తీవ్రంగా ఉంది.

బాత్రూమ్‌లో కూడా ఖాళీ లేదు!
పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ వాసి టీనా ముఖర్జీ. మే 29న హౌరా నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్లో హైదరాబాద్ బయలుదేరారు. ఆమెతో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కలిపి, మూడు స్లీపర్ క్లాస్ బెర్తులు రిజర్వ్ చేయించుకున్నారు.
కానీ, బయలుదేరినప్పటి నుంచే తమ బోగీలో రిజర్వేషన్ ఉందో, లేదో తెలియని అనేక మంది వచ్చి కూర్చున్నారని ఆమె వాపోయారు.
"జనరల్ బోగీని మించి నిండిపోయింది. కాలు తీసి కాలు పెట్టడానికి లేదు. బాత్రూమ్‌కు వెళ్లడానికి కూడా దారి లేదు. అందరినీ తప్పించుకుని వెళ్లినా అందులో ఖాళీ లేదు. బాత్రూమ్‌లో కూడా కూర్చుని ఉన్నారు.'' అని ఆమె చెప్పారు.
''విశాఖపట్నం వచ్చిన తర్వాత బాత్రూమ్ కొంత ఖాళీ అయ్యింది. ఒకరోజంతా చాలా అవస్థలు పడ్డాం. గాలి లేదు. ఒక్కో బోగీలో 100 వరకూ బెర్తులుంటే 250 మంది ఎక్కారు. ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి" అని టీనా బెనర్జీ తన అనుభవాన్ని బీబీసీకి తెలిపారు.
తనతో పాటు తన భర్త, మరో వ్యక్తి కూడా ఆ ప్రయాణంలో నరకం చూశామని, రైల్వే టీటీలకు తెలియజేసినా లెక్కచేయలేదని ఆమె చెప్పారు.
గతంలో ఇంత సమస్య లేదని, ఇటీవల ఈ సమస్య పెరుగుతోందని టీనా అభిప్రాయపడ్డారు.

స్పెషల్ రైలు పేరుతో బాదుడు
దూర ప్రయాణాలకు రోడ్డు మార్గం కన్నా రైళ్లనే చాలా మంది నమ్ముకుంటారు. అందుకు అనేక కారణాలతో పాటు, చార్జీల భారం తగ్గుతుందని ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తారు.
ప్రస్తుతం రైళ్లలో స్లీపర్ క్లాసులు తగ్గించి, ఏసీ బోగీలు పెంచడం వల్ల అదనపు భారం పడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
అదే సమయంలో, ప్రత్యేక సందర్భాలను బట్టి స్పెషల్ రైళ్ల పేరుతో వసూలు చేస్తున్న చార్జీలు భారీగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"స్పెషల్ రైళ్లలో ధరలు దారణంగా పెంచుతున్నారు. రెగ్యులర్ రైళ్లలో స్లీపర్ క్లాసులు తగ్గించేసిన రైల్వే ప్రత్యామ్నాయంగా నడిపే రైళ్లలోనూ అదే విధానం అమలు చేస్తోంది. చార్జీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే హై క్లాస్ రైలుగా చెబుతున్న వందే భారత్ కంటే, స్పెషల్ రైళ్లలోనే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది సమంజసం కాదు'' అని ప్రయాణికుడు తాళ్లూరి రవి రాయల్ అన్నారు.
రైల్వేలు ప్రజా ప్రయోజనార్థం కాకుండా పూర్తిగా లాభాల కోసమే అన్నట్టుగా మారుతున్నాయని, లాభదాయక సరుకు రవాణాలో కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రయాణికుల మీద భారం మోపడం అన్యాయమని ఆయన అన్నారు.
"ఉన్నత వర్గాల వాళ్లు ఎక్కువగా విమానాలు ఎక్కుతుంటారు. మధ్యతరగతికి అందుబాటులో ఉండే రైలు ప్రయాణం కూడా ఈ నిర్ణయాలతో దూరమయ్యేలా ఉంది. ఇకపై మాలాంటి నిత్య ప్రయాణికులు రోడ్డు ప్రయాణం చేయలేం, రైళ్లలో వెళ్లలేం అన్నట్టుగా మారుతోంది" అంటూ రవి వాపోయారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విజయవాడ నుంచి రాజమండ్రి చార్జీ 981 రూపాయలుగా ఉంటే, స్పెషల్ ట్రైన్‌లో థర్డ్ ఏసీ చార్జీ 1050 రూపాయలుగా ఉంటోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం పునరాలోచన చేసి రైళ్ల చార్జీల విషయంలో సామాన్యులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

రోజూ ఇబ్బందే
జనరల్ బోగీలు తగ్గించడంతో స్లీపర్ క్లాసుల్లో నిలబడి ప్రయాణించడానికి అలవాటుపడిన చాలా మంది రెగ్యులర్ ప్రయాణికులు కూడా ఇప్పుడు సతమతమవుతున్నారు. ఏలూరులో ఉద్యోగం చేసే ఆర్.సుశీల వారిలో ఒకరు.
ఆమె రోజూ విజయవాడ నుంచి ఏలూరు వెళ్తారు. కొద్దికాలంగా ఆమె ప్రయాణ కష్టాలు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు.
"సాధారణంగా సింహాద్రికి వెళుతుంటాను. గంట ప్రయాణం. ఒకవేళ ఎప్పుడైనా సింహాద్రి దాటిపోతే కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ రైలులో కాలు పెట్టే అవకాశం కూడా ఉండడం లేదు. అయినా తప్పదు. అప్పుడప్పుడూ కొంత నిలబడేందుకు మార్గం ఉంటుంది. కానీ అత్యధిక సందర్భాల్లో రిజర్వుడు బోగీ ఎక్కి, గేటు దగ్గర అతి కష్టం మీద నిలబడి ప్రయాణించాల్సిందే'' అని సుశీల చెప్పారు.
తిరుగు ప్రయాణంలో కూడా అంతేనని, నెలవారీ పాసు తీసుకున్నామనే సంతృప్తి కన్నా రైళ్లలో పెరిగిన రద్దీ కారణంగా అవస్థలు పడుతున్నామని ఆమె అన్నారు.
చాలా మంది ఉద్యోగులు ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారని ఆమె తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఇటీవల హిందీ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల సంఖ్య పెరగడంతో ఖాళీ ఉండడం లేదని సుశీల బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Ravisankar Lingutla
సామాన్యులకు రైల్వే దూరమవుతోందా?
భారతీయ రైల్వే క్రమంగా సామాన్యులకు దూరమవుతోందనే అభిప్రాయం బలపడుతోందని రైల్వే ప్రయాణికుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఆర్ మధుసూదన్ అంటున్నారు. ఇటీవలి మార్పులు అందుకు సంకేతమని ఆయన చెబుతున్నారు.
"రోడ్డు రవాణా చాలా ఖర్చుతో కూడుకున్నది. రైళ్లలో చౌకగా ప్రయాణం చేయవచ్చన్నది ఇన్నాళ్లుగా ఉన్న అనుభవం. ఇప్పుడది మారుతోంది. హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులోనైనా, ఏసీ బోగీ రైలుకైనా ఒకటే చార్జీ వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్టుగా అదనపు రైళ్లు, బోగీలు వేయాలి. కానీ, ఉన్న బోగీల సంఖ్య కుదించడం సమస్యగా మారుతోంది'' అన్నారు.
ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా విధానపరంగా జరుగుతున్న మార్పుల వల్ల కిందిస్థాయి అధికారులు ఏమీ మాట్లాడలేకపోతున్నారని మధుసూదన్ చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
అనేక మార్గాల్లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు మధుసూదన్. వందే భారత్ రైలు నిత్యం ఖాళీ లేకుండా నడుస్తోందంటే డిమాండ్ అర్థమవుతోందని, ప్రభుత్వం కొత్త రైళ్లు ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని అది చాటుతోందని ఆయన బీబీసీతో అన్నారు.
స్పందించని రైల్వే అధికారులు
వరుసగా ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో స్లీపర్ క్లాసు బోగీల కుదింపు, స్పెషల్ ట్రైన్లలో చార్జీల వంటి అంశాలపై రైల్వే అధికారుల స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది .
అయితే సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ కార్యాలయం స్పందించలేదు. దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఈ పదం ఎక్కడ పుట్టింది, మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- మనిషిని చంపేసి ఇంటర్నెట్లో ఏం వెతుకుతున్నారు? శవాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నారు?
- బీట్రూట్తో ఐదు ప్రయోజనాలు ఇవీ
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














