భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు

రూ.500 నోట్లతో మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకొచ్చిన కొత్త రూ.500 డినామినేషన్ నోట్లలో నకిలీలు పెరిగాయని రిజర్వు బ్యాంకు వార్షిక నివేదికలో వెల్లడైంది.

ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికలో మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఏడాదిలో నకిలీ రూ.500 నోట్ల(కొత్త డిజైన్) సంఖ్య 14.4 శాతం పెరిగినట్లు తెలిసింది.

రూ.4.55 కోట్ల విలువైన 91,110 నకిలీ రూ.500 నోట్లను ఆర్‌బీఐ, బ్యాంకులు గుర్తించాయని కేంద్ర బ్యాంకు తన వార్షిక నివేదికలో పేర్కొంది.

ఈ నోట్లు మునుపటి ఆర్థిక సంవత్సరంలో 79,669గా ఉన్నట్లు తెలిపింది.

కొత్త రూ.500 నోట్ల నకిలీతో పాటు, రూ.20 డినామినేషన్ నోట్ల నకిలీలు కూడా పెరుగుతున్నట్లు ఆర్‌బీఐ వార్షిక నివేదిక చెప్పింది.

అలాగే నకిలీ రూ.2000 నోట్లను 9,806 గుర్తించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఇటీవలే చలామణిలో ఉన్న కొత్త రూ.2000 నోట్లను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

సెప్టెంబర్ 30, 2023 నాటికి ప్రజలు తమ వద్దనున్న రూ.2000 నోట్లను ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ చేసుకోవాలని ఆర్‌బీఐ తెలిపింది. అయితే, సెప్టెంబర్ తర్వాత కూడా ఈ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీలాగా కొనసాగుతాయని పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో గుర్తించిన మొత్తం నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల(ఎఫ్ఐసీఎన్‌ల) సంఖ్య 2,25,769గా ఉన్నట్లు, వీటిలో 4.6 శాతం ఆర్‌బీఐ వద్ద, 95.4 శాతం ఇతర బ్యాంకులలో గుర్తించినట్లు తెలిపింది.

మొత్తం వాల్యూ టర్మ్స్‌లో చూస్తే మార్చి 31, 2023 నాటికి చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో రూ.500, రూ.2000 బ్యాంకు నోట్లే 87.9 శాతంగా ఉన్నాయి. వీటిలో అత్యధిక షేరు రూ.500 నోటుదే. రూ.25,81,690 కోట్ల విలువైన రూ.500 నోట్లు ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్నాయి.

అత్యధికంగా చలామణిలో ఉన్న ఈ రూ.500 నోట్ల నకిలీలు పెరుగుతుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.

మరి నకిలీ రూ.500 నోట్లను గుర్తించడం ఎలా? 2016లో పెద్ద నోట్ల రద్దుతో నకిలీ నోట్ల బెడద పోలేదా?

కొత్త రూ.500 నోటు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త రూ.500 నోటు

కొత్త రూ.500 నోటు ఎప్పుడొచ్చింది?

కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8, 2016న చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ సమయంలో పాత రూ.500, రూ.1000 నోట్లు చెల్లకుండా పోయాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ నోట్ల రద్దు ప్రకటన చేశారు.

అయితే, పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత సరికొత్త డిజైన్‌లో రూ.500 నోట్లను ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది.

రంగు, సైజు, సెక్యూరిటీ ఫీచర్లు, డిజైన్ విషయాల్లో ముందటి నోట్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయి ఈ కొత్త నోట్లు.

కొత్త నోటు 66 ఎంఎం x 150 ఎంఎం పరిమాణంలో ఉంది. ఇది స్టోన్ గ్రే రంగులో ఉంటుంది.

అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో రూ.500 నోటును తీసుకొచ్చినప్పటికీ, చలామణిలో ఈ నోట్ల నకిలీలు పెరుగుతున్నట్లు ఆర్‌బీఐ తాజా నివేదిక చెబుతోంది.

పాత పెద్ద నోట్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పాత పెద్ద నోట్లు

పెద్ద నోట్ల రద్దు: ఆ లక్ష్యం నెరవేరలేదా?

కేంద్ర ప్రభుత్వం చలామణిలో ఉన్న 86 శాతం నగదును రాత్రికి రాత్రే 2016 నవంబర్ 8న వెనక్కి తీసుకున్నప్పుడు ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారత్ అప్పటి వరకు నగదు ఆర్థిక వ్యవస్థగా ఉండేది.

కానీ, ఒక్కసారిగా ప్రజల చేతిలో ఉన్న పెద్ద నోట్లన్ని రద్దు కావడంతో ఆ నోట్లను మార్చుకునేందుకు నానా తిప్పలు పడ్డారు.

ఈ పెద్ద నోట్ల రద్దు వెనుకున్న ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ నోట్ల నిర్మూలన అని కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో చెప్పింది.

అవినీతికి, బ్లాక్‌మనీకి, నకిలీ నోట్ల నిర్మూలనకు, ఉగ్రవాదానికి నిధులను అందకుండా చేసేందుకు పెద్ద నోట్ల రద్దును చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కానీ, ప్రభుత్వం అనుకున్న ఈ ప్రధాన లక్ష్యాలలో ఒకటైన నకిలీ నోట్ల నిర్మూలన మాత్రం సాధ్యమైనట్లు కనిపించడం లేదు.

ఎందుకంటే కొత్త రూ.500 నోట్ల నకిలీలు చలామణిలో 14.4 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ వార్షిక నివేదికే చెబుతోంది.

రూ.500 నోట్ల కట్టలు

ఫొటో సోర్స్, Getty Images

నకిలీ రూ.500 నోటును గుర్తించడమెలా?

ఎప్పటికప్పుడు నకిలీ రూ.500 నోట్లను ఎలా గుర్తించాలనేది రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంటుంది.

ఆర్‌బీఐ చెప్పిందంటూ ‘ద ఎకనామిక్ టైమ్స్’ తెలిపిన వివరాల ప్రకారం, రూ.500 నోట్లు మహాత్మా గాంధీ సరికొత్త సిరీస్‌లో ఉంటాయి.

ఈ నోట్లపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాం గవర్నర్ సంతకం ఉంటుంది. ఈ నోటు వెనక దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఎర్రకోట ఉంటుంది.

ఈ నోటు బేస్ కలర్ స్టోన్ గ్రే.

కొత్త రూ.500 నోటు

ఫొటో సోర్స్, RBI

ఫొటో క్యాప్షన్, కొత్త రూ.500 నోటు

రూ.500 నోటులో మనం చెక్ చేసుకోవాల్సినవి ఇవీ

  • రూ.500 డినామినేషన్ న్యూమరల్‌తో లేటెంట్ ఇమేజ్ ఉంటుంది. ఇది మనకు నోటును వెలుతురులో పెట్టినప్పుడు కనిపిస్తుంది.
  • డినామినేషనల్ న్యూమరల్ రూ.500 వాల్యూ దేవనాగరి స్క్రిప్ట్‌లో ఉంటుంది.
  • నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది.
  • గాంధీ చిత్రాన్ని గమనిస్తే దేవనాగరిలో భారత్ అని చిన్న అక్షరాల్లో ఉంటుంది. ఇండియా అని కూడా ఉంటుంది.
  • గాంధీ చిత్రం పక్కనున్న సెక్యూరిటీ థ్రెడ్‌పై దేవనాగరి స్క్రిప్ట్‌లో ‘భారత్’ అని, ఆర్‌బీఐ అని ఉంటుంది.
  • ప్రామిస్ క్లాజ్‌తో ఆర్‌బీఐ గవర్నర్ సంతకం, గాంధీ చిత్రానికి కుడి వైపుగా ఆర్‌బీఐ ఎంబ్లమ్ ఉంటాయి.
  • గాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్(500) వాటర్‌మార్క్స్ ఉంటాయి.
  • నోటుకి పైన వైపు, కింద వైపు నంబర్ ప్యానల్ ఉంటుంది. ఈ నంబర్లు కూడా చిన్న నుంచి పెద్దగా ఉంటాయి. ఏ రెండు నోట్ల నంబర్ ప్యానల్ ఒకేలా ఉండదు.
  • రూపాయి గుర్తుతో పాటు ఆకుపచ్చ నుంచి నీలంలోకి మారే కలర్ మార్పు ఇంక్‌తో రూ.500 సంఖ్య ఉంటుంది.
  • కుడివైపు అశోక పిల్లర్ ఎంబ్లమ్ ఉంటుంది.
  • దృష్టిలోపం ఉన్నవారి సౌకర్యార్థం కూడా కొన్ని ఫీచర్లను ఈ నోటుపై ఏర్పాటు చేసింది ఆర్‌బీఐ.
  • నోటుకు వెనక వైపు ఏ ఏడాది నోటు ప్రింట్ అయిందో ఉంటుంది.
  • స్వచ్ఛ్ భారత్ లోగో స్లోగన్‌తో పాటు ఉంటుంది.
  • లాంగ్వేజ్ ప్యానల్‌ ఉంటుంది.
  • ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురుతున్న చిత్రం ఉంటుంది.
  • వీటితోపాటు రూపాయి చిహ్నంతోపాటు దేవనాగరిలో 500 సంఖ్య నోటు వెనక వైపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)