ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం మన తాత ముత్తాతలు ఇంకా బతికే ఉన్నారా?

ఐన్ స్టీన్
    • రచయిత, దాలియా వెంచురా
    • హోదా, బీబీసీ న్యూస్ ముండో

సబీన్ హాసెన్‌ఫెల్డర్ ఓ యువకుడితో కలిసి టాక్సీలో వెళ్తున్నారు. తాను ఒక భౌతిక శాస్త్రవేత్తనని ఆమె ఆ యువకుడితో చెప్పారు. దాంతో ఆయన తనకు ఉన్న ఓ సందేహాన్ని ఆమె ముందుంచారు.

‘ఎప్పుడో చనిపోయిన మా ‘అమ్మమ్మకు అమ్మమ్మ’, క్వాంటం మెకానిక్స్ ప్రకారం ఇంకా బతికే ఉన్నట్లు ఆత్మలతో మాట్లాడగలనని చెప్పుకొనే ఓ వ్యక్తి (షమన్) నాకు చెప్పారు. అది నిజమేనా?’ అని ఆ యువకుడు సబీన్‌ను అడిగారు.

జర్మనీలోని మ్యూనిచ్ యూనివర్సిటీలో ‘సెంటర్ ఫర్ మేథమెటికల్ ఫిలాసఫీ’లో పనిచేస్తున్న సబీన్ ఇలాంటి ప్రశ్నకు జవాబులు కనుగొనడానికి సమయం వెచ్చిస్తుంటారు.

‘జవాబు చెప్పడం కష్టమయ్యే ఇలాంటి పెద్దపెద్ద ప్రశ్నల వల్లే నాకు అప్పట్లో భౌతిక శాస్త్రంపై ఆసక్తి పెరిగింది’ అని బీబీసీతో చెప్పారామె.

’20 ఏళ్ల తరువాత కూడా ఇప్పటికీ నా దగ్గర సమాధానాలు లేవు. కానీ, మీరు నన్ను ఏదైనా ప్రశ్న అడిగితే సుదీర్ఘమైన సమాధానం చెప్పగలను’ అన్నారు.

‘లాస్ట్ ఇన్ మేథమెటిక్స్(2018), ఎగ్జిస్టెన్షియల్ ఫిజిక్స్: ఏ సైంటిస్ట్స్ గైడ్ టు లైఫ్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్స్’.. వంటి తన వ్యాసాలలో ఆమె అలాంటి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

వీటితో పాటు తన బ్లాగ్, యూట్యూబ్ చానళ్లతోనూ ఇటీవల కాలంలో పాపులర్ అయ్యారు.

ఆన్‌లైన్‌లో వేల మంది ఆమెను అనుసరిస్తారు. రహస్యాలంటే ఆసక్తి ఉన్న వారు ఆమె బ్లాగు, యూట్యూబ్ చానల్ ఫాలో అవుతుంటారు.

అలా అని ఆమె అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు చెప్పగలరని కాదు.. కానీ, సాధ్యాసాధ్యాల గురించి చర్చించి ఆలోచించుకోవడానికి దారి చూపుతారు.

ఇక.... ఆ యువకుడు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తే, షమన్ చెప్పింది నిజమేనా?

సబీన్
ఫొటో క్యాప్షన్, సబీన్

సాపేక్షతా సిద్ధాంతం

‘‘ఆ యువకుడి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియలేదు. కారణం.. మరణానంతర జీవితానికి, క్వాంటమ్ మెకానిక్స్‌కు సంబంధం ఏమీ లేదు’’ అన్నారు సబీన్.

‘‘అయితే, కాసేపు ఆలోచించాక ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవమేమీ కాదని భావించాను’’ అన్నారు సబీన్.

‘‘క్వాంటం మెకానిక్స్ అనేది పక్కనపెడితే స్పేస్, టైమ్ గురించిన సిద్ధాంతాలు.. ముఖ్యంగా ఐన్‌స్టీన్ ఆలోచనా ప్రయోగాలు గతం గురించి కొన్ని వాస్తవాలు చెప్తాయి. భవిష్యత్తు గురించి కూడా చెప్తాయి" అన్నారామె.

‘‘ఐన్‌స్టీన్ మనకు చెప్పిందేంటంటే... గతం ఉనికిని కచ్చితంగా గుర్తించకుండా వర్తమానం ఉనికి గురించి అదే పద్ధతిలో మాట్లాడలేరు’’

వర్తమానం అనేది గతం, భవిష్యత్తు మధ్య ఉండే తక్షణ స్థితి.

ఈ సమయంలో మీరు ఏం చేస్తున్నారు అని నేను అడిగితే ఈ ఆర్టికల్ చదువుతున్నాను అని మీరు సమాధానం ఇస్తారు. కానీ, ఆ సమాధానంలో అప్పటికే కొంత గతం ఉంది.

‘మీరు అనుభవించే, చూసే ప్రతి దాంట్లో గతం ఉంటుంది’ అన్నారు సబీన్.

"ఇప్పుడు" అనేది అంతుచిక్కనిది .

అంతేకాదు... ‘ప్రస్తుత క్షణం అని చెప్పేది మరొకరికి గతం కావొచ్చు, ఇంకొకరికి భవిష్యత్తు కావొచ్చు. ఈ భావనను ఐన్‌స్టీన్ చెప్పారు’ అన్నారు సబీన్.

రైలు

ఐన్‌స్టీన్ రైలు

దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవాలంటే ఐన్‌స్టీన్ ప్రయోగాలలో ఒకటి చెప్పాలి.

రెండు కాల ప్రవాహాలు కలుసుకున్న క్షణాన్ని ఐన్‌స్టీన్ ఊహించారు. న్యూటన్ సిద్ధాంతాల ఆధారంగా వాదించేవారు చలనం తీరు బట్టి కాంతి వేగం మారుతుందని(సాపేక్ష వేగం) చెప్పగా, మాక్స్‌వెల్ సిద్ధాంతాల ఆధారంగా వాదించేవారు కాంతి వేగం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని(శుద్ధ వేగం), అది మారదని చెప్పారు.

వేగానికి సంబంధించిన కీలక అంశం టైమ్‌పై ఐన్‌స్టీన్ దృష్టి సారించారు.

అప్పుడు ఆయన టైమ్ గురించి స్పష్టమైన ప్రకటన చేయాలంటే ఏకకాలతపై ప్రశ్న తలెత్తుతుందని గ్రహించారు.

ఉదాహరణకు.. ఒక రైలు 7.05కి వస్తుందని మీరు చెప్తే అది గడియారంలో సమయం 7.05 చూపిస్తున్నప్పుడు ప్లాట్ ఫామ్‌కు చేరుకుంటుందని అర్థం. అంటే ఆ రెండు పనులు ఏక కాలంలో జరుగుతాయన్నమాట.

ఘటనలు ఏక క్షణంలో జరగడమనేది మన చలనంపై ఆధారపడి ఉంటుందని ఐన్‌స్టీన్ భావించారు. అంటే కాల ప్రవాహం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చని అర్థం.

రైలు

ఐన్‌స్టీన్ భావనలో.. ‘రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ వ్యక్తి నిల్చుంటాడు. ఆయనకు కుడి, ఎడమలలో ఒకే దూరంలో ఒకే క్షణంలో రెండు పిడుగులు పడ్డాయి.

ఆ రెండింటి మెరుపు కాంతి ఆయన కంటిని ఒకేసారి చేరుతుంది.

కానీ, అదే క్షణంలో దాదాపు అదే కాంతివేగంతో ఆ ప్లాట్ ఫామ్ పక్కనే ఉన్న ట్రాక్‌పై ఓ రైలు ప్రయాణిస్తుందనుకుంటే.. అప్పుడది ఓ పిడుగును దాటి మరో పిడుగు వైపు ప్రయాణిస్తుంటే ఆ రైలులో ఉన్న మహిళలకు ఎదురుగా ఉన్న పిడుగు కాంతి తొలుత కంటిని చేరుతుంది.

అయితే.. ప్లాట్ ఫామ్‌పై ఉన్న వ్యక్తికి ఆ రెండు ఏక కాలంలో కనిపిస్తే అక్కడే ప్రయాణిస్తున్న ఆ మహిళకు ఒకటి తొలుత కనిపించి, ఇంకోటి ఆ తరువాత కనిపించింది.

కాంతి వేగం స్థిరంగా ఉంటే ఈ తేడా ఎందుకు?

ఈ కారణంతోనే ఐన్‌స్టీన్ చలనం ఆధారంగా ఏకకాలత అనేది మారుతుందన్న భావన తీసుకొచ్చారు. అంటే వేగం సాపేక్షమైనదనే సిద్ధాంతానికి దగ్గరగా సూత్రీకరించారు.

time

ఫొటో సోర్స్, Getty Images

గతించిన వర్తమానం

‘ఇప్పుడు’ అనే భావనను నిర్వచించడంలోని అసాధ్యం నుంచి ఏకకాలతలోని సాపేక్షతను అంగీకరిస్తాం.

ఐన్‌స్టీన్ తన ప్రయోగాలతో వేగం, దూరంలాగే స్థలం కూడా సాపేక్షమని గుర్తించారు. ఆ ప్రయోగాల ఫలితంగా స్థలం, కాలం రెండింటికీ వేర్వేరుగా ఉనికిలేదంటూ స్థలం, కాలం కలిసిన స్థల కాలం(స్పేస్ టైమ్) అనే ఒక అస్తిత్వాన్ని ప్రతిపాదించారు. ఇది ఐన్‌స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రెలిటివిటీ నుంచి వచ్చిన భావన అని సబీన్ చెప్పారు.

‘దీంతో వర్తమానం ఎలా ఉందో గతం అనేదీ ఇతరుల కోణం నుంచి సాపేక్షంగా చూసినప్పుడు వర్తమానంగానే ఉండొచ్చు’ అన్నారు సబీన్.

దీని ప్రకారం మన ముత్తాతలు కూడా గతించిన వర్తమానంలో జీవించి ఉన్నట్లు భావించడానికి వీలయ్యే ఒక భావనను కలగచేస్తుంది.

‘అయితే, ఆ ముత్తాతలలో మాట్లాడాలనుకుంటే మాత్రం ఈ సిద్ధాంతాలేవీ సాయం చేయలేవు’ అంటారు సబీన్.

‘ఇదంతా వింతగా అనిపిస్తుందని నాకు తెలుసు. అంతేకాదు, దీనిపై స్పష్టంగా వివరించడం కూడా కష్టమని నేను అంగీకరిస్తున్నాను’ అన్నారు సబీన్.

‘అయితే, కాలాతీతమైనది ఏదో ఉంది’ అని చెప్పారు సబీన్.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)