బెయిలు ఇవ్వాలో, వద్దో జడ్జికి చాట్‌జీపీటీ సలహా ఇవ్వగలదా?

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పంజాబ్, హరియాణా హైకోర్టు ఓ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరుపై చాట్‌జీపీటీని సలహా అడిగింది.

సిమ్లాపురి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత జస్వీందర్ సింగ్ అలియాస్ జస్సీని పోలీసులు అరెస్టు చేశారు. జస్సీ, అతని సహచరుల దాడిలో ఒక వ్యక్తి మరణించాడని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు చెప్పారు. ఈ సంఘటన 2020 జూన్‌లో జరిగింది.

అల్లర్లు, బెదిరింపులు, హత్యలు, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలు అతనిపై ఉన్నాయి. అయితే అరెస్టు అనంతరం పంజాబ్, హరియాణ హైకోర్టులో బెయిల్ కోసం నిందితులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ఏడాది మార్చిలో ఆ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ అనుప్ చిట్కారాతో కూడిన ధర్మాసనం చాట్‌జీపీటీ నుంచి ప్రతిస్పందనను కోరింది.

"దుండగులు క్రూరమైన దాడికి పాల్పడినప్పుడు బెయిల్‌పై చట్టం ఏం చెబుతోంది?" అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను బెంచ్ ప్రశ్నించింది.

"క్రూరమైన దాడులకు పాల్పడిన వారికి బెయిల్ అనేది కేసు పరిస్థితులు, అధికార పరిధిలోని చట్టాలు, నిబంధనలపై ఆధారపడి ఉంటుంది" అని చాట్‌జీపీటీ తెలిపింది.

"అయితే దుండగులు హత్య లేదా హింస వంటి క్రూరత్వంతో కూడిన నేరానికి పాల్పడినట్లయితే వారు సమాజానికి ప్రమాదంగా పరిగణించవచ్చు. అటువంటి సందర్భాలలో బెయిల్ మంజూరుకు తక్కువ మొగ్గు చూపవచ్చు'' అని కూడా తెలిపింది.

అయితే న్యాయశాస్త్రంపై చాట్‌జీపీటీకి ఎలాంటి అవగాహన ఉందో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేశాం తప్పితే అది వెల్లడించే అభిప్రాయాలను పాటించడానికి కాదని న్యాయమూర్తి అన్నారు. కాగా, ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

2022 నవంబర్‌లో చాట్‌జీపీటీ ప్రారంభించారు. అప్పటి నుంచి లక్షలాది మంది దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు.

కానీ, చాట్‌జీపీటీ 2021 వరకు ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై నకిలీ సమాచారం, పక్షపాతం వంటి ఆరోపణలు ఉన్నాయి.

చాట్‌జీపీటీ

అమెరికా కోర్టులో లాయర్‌కు ఇబ్బందులు

ఒక కేసులో విచారణ కోసం చాట్‌జీపీటీని ఉపయోగించి చిక్కుల్లో పడ్డారు ఇద్దరు న్యాయవాదులు. ఇపుడు వారు అదే కోర్టులో విచారణను సైతం ఎదుర్కోవల్సి వచ్చింది.

ఈ ఘటన న్యూయార్క్‌లో జరిగింది. ఉనికిలో లేని, నకిలీ కేసులను చాట్‌జీపీటీ అందించడం, వాటిని రిఫరెన్సుగా కోర్టులో సమర్పించడంతో ఆ న్యాయవాది కోర్టు ఆగ్రహానికి గురయ్యారు.

ఈ ఘటనపై న్యాయవాది కోర్టుకు "దీనిలో ఉన్న సమాచారం తప్పు కావచ్చని నాకు తెలియదు" అని విన్నవించుకోవాల్సి వచ్చింది.

సాధారణంగా చాట్‌జీపీటీ వినియోగదారుడు కోరిన సమాచారాన్ని అందిస్తుంది. అదే సమయంలో ఆ డేటా తప్పు కూడా కావొచ్చని హెచ్చరిస్తుంది.

ఇంతకీ ఆ న్యాయవాది ఏ కేసులో చాట్‌జీపీటీ ఉపయోగించారు? చివరకు ఏమైంది?

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

ఓ వ్యక్తికి గాయం కావడంతో ఓ విమానయాన సంస్థపై దావా వేశారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై పరిశోధన జరిపారు.

ఈ ప్రయత్నంలో భాగంగా అలాంటి కొన్ని కోర్టు కేసులను జడ్జి ముందు ఉదహరించారు.

అయితే అసలు ఆ కేసులు ఇప్పటివరకు ఎక్కడా నమోదు కాలేదని, వాటి గురించిన సమాచారం లేదంటూ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన న్యాయవాదులు ఆ కేసును విచారిస్తున్న న్యాయమూర్తికి లేఖ రాశారు.

"కోర్టులో సమర్పించిన వాటిలో ఆరు కేసులు నకిలీ రిఫరెన్సులు. వీటిని సదరు న్యాయవాదులు వివరించాలి" అని న్యాయమూర్తి కాస్టెల్ ఆదేశించారు.

చివరికి వాటిని తాను తయారు చేయలేదని, తన లీగల్ కంపెనీలోని సహోద్యోగి స్టీవెన్ ఎ స్క్వార్ట్జ్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది పీటర్ లోడుకా కోర్టుకు చెప్పారు.

స్టీవెన్ గత 30 ఏళ్లకు పైగా అటార్నీగా పనిచేస్తున్నారు. ఆయన పాత కేసులను వెతకడానికి చాట్‌జీపీటీ ఉపయోగించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఫొటో సోర్స్, Getty Images

'భవిష్యత్తులో ఉపయోగించను'

పీటర్ లోడుకా ఇచ్చిన సమాచారానికి తానే బాధ్యుడినని చెప్పిన స్టీవెన్ , తాను ఆ సమాచారాన్ని ఎలా సేకరించానో కూడా వివరించారు. తాను ఈ కేసులను చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నానని, వాటిని అలా సేకరించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇంతకుముందు చట్టపరమైన పరిశోధన కోసం చాట్‌జీపీటీని ఉపయోగించలేదని, ఆ సమాచారం తప్పు కావొచ్చని తనకు తెలియదని ఆయన తెలిపారు.

భవిష్యత్తులో దాని ప్రామాణికత, ధ్రువీకరణ లేకుండా న్యాయపరిశోధనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించబోనని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు.

ఇక చాట్‌జీపీటీలో స్టీవెన్ చాట్ పరిశీలిస్తే.. దానిలో ''వర్గీస్ నిజమైనా కేసా''? అని వర్గీస్ చైనా సదరన్ ఎయిర్ లైన్స్ కో లిమిటెడ్ కేసును ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తారు.

దీనికి చాట్‌జీపీటీ అవును అని ప్రతిస్పందించింది. దీనికి మూలం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. కేసు వాస్తవమని ఇవి లీగల్ రిఫరెన్స్ డేటా బేస్‌లు అయిన లెక్సిస్‌ నెక్సిస్, వెస్ట్‌లాలో ఉంటాయని తెలిపింది.

మిగతా కేసులు కూడా వాస్తవమేనని చెప్పింది చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ అందించిన సమాచారాన్ని స్టీవెన్ తనకు ఇవ్వగా, లెవిడో దానిని కోర్టుకు సమర్పించారు.

అయితే జూన్ 8న జరిగే తదుపరి విచారణలో మీపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో ఇద్దరు న్యాయవాదులు వివరించాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)