వరంగల్ - లింగ నిర్ధరణ పరీక్షల స్కామ్: సెక్స్ డిటెర్మినేషన్ టెస్ట్ అంటే ఏంటి , కడుపులో బిడ్డకు దీన్ని ఎందుకు నిర్వహించకూడదు?

సెక్స్ డిటెర్మినేషన్ టెస్టు

ఫొటో సోర్స్, AFP

జెండర్ నిర్ధారణ పరీక్షలు అంటే ‘‘సెక్స్ డిటెర్మినేషన్ టెస్టు’’లు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్‌లో కొన్ని ప్రైవేటు ఆసుపత్రిలు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయని పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది.

కేవలం పరీక్షలు నిర్వహించడం మాత్రమే కాదు. అక్రమంగా సెక్స్-సెలెక్టివ్ అబార్షన్లు కూడా నిర్వహిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

మగ పిల్లలు మాత్రమే కావాలని ఎదురుచూసేవారు ఎక్కువగా ఈ మూఠాల దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ ఆడ శిశువులు పుట్టకుండా అబార్షన్లు చేస్తున్నారు.

క్వాలిఫికేషన్ లేకుండానే ఆపరేషన్లు చేయడం, ఆపరేషన్ అనంతరం ఏదైనా అనారోగ్యం వచ్చినా పట్టించుకోకపోవడం, జెండర్ స్కానింగ్ పేరుతో వేలల్లో దండుకోవడం లాంటి ఎన్నో అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వీటికి పాల్పడుతున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

సెక్స్ డిటెర్మినేషన్ టెస్టు

ఫొటో సోర్స్, AFP

ఎందుకు అబ్బాయిలకు ప్రాధాన్యం?

పిల్లల్లో అమ్మాయిలకు ప్రాధాన్యం ఇవ్వడం అనే సమస్య నేటిది కాదు. ఇది ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన అంశం కూడా కాదు.

మన దేశంలో స్రీ-పురుషుల నిష్పత్తి అంటే ‘‘సెక్స్ రేషియో’’ నెమ్మదిగా మెరుగుపడుతోంది. అయితే, ఇప్పటికీ చాలా మంది మగపిల్లలనే కోరుకుంటున్నారని ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) చెబుతోంది. దీనిలో పాల్గొన్నవారిలో దాదాపు 80 శాతం మంది తమ కుటుంబంలో కనీసం ఒక్కడైనా కొడుకు ఉండాలని భావిస్తున్నారు.

మగ పిల్లలు మాత్రమే తమ ఇంటి పేరును నిలబెట్టగలరని, వృద్ధాప్యంలో తోడుగా ఉండగలరని.. అదే ఆడపిల్లలైతే పెళ్లి చేసుకుని వేరే ఇళ్లకు వెళ్లిపోతారని, లేదా వారికి కట్నం లాంటివి ఇవ్వాల్సి ఉంటుందని ఆలోచించడమూ దీనికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ డిటెర్మినేషన్ టెస్టు

ఫొటో సోర్స్, AFP

గత 100 ఏళ్లలో జనాభా లెక్కలను చూసుకుంటే భారత్‌లో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. 2011లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 940 మంది మహిళలు ఉన్నట్లు తేలింది. అదే పిల్లల విషయంలో చైల్డ్ సెక్స్ రేషియా ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు ఇది 918గా ఉంది.

అయితే, 2019-2021లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్ డేటాలో సెక్స్ రేషియో మెరుగుపడుతోందని తేలింది. మొదటిసారి దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు 1020 మంది ఉన్నారని వెల్లడైంది. అయితే, కేవలం 6,30,000 మంది చేపట్టిన అధ్యయనం ఇది. జనాభా లెక్కలు పూర్తయితేనే ఎంతమంది బాలికలు ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది.

ఈ గణాంకాలపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ‘‘2011లో ప్రతి వెయ్యిమందికి 940 మంది మహిళలు ఉంటే, పదేళ్లలో ఇంతలా మారిపోవడం ఎలా సాధ్యం’’ అని సోషల్ యాక్టివిస్టు సాబు జార్జి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

సెక్స్ డిటెర్మినేషన్ టెస్టు

ఫొటో సోర్స్, Getty Images

సెక్స్ డిటెర్మినేషన్ టెస్టులు చేయడం నేరమా?

భారత్‌లో ‘‘సెక్స్ డిటెర్మినేషన్ టెస్టు’’ల చరిత్ర చాలా సంక్లిష్టమైనది. మన దేశంలో ఏళ్ల నుంచి అబ్బాయిలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమని కొందరు చెబుతుంటే.. పశ్చిమ దేశాల విధానాలే ప్రభావమే కారణమని మారా విస్టెండెల్ లాంటి పరిశోధకులు చెబుతున్నారు.

‘‘సెక్స్ సెలెక్షన్’’పై ‘‘అన్‌నేచురల్ సెక్స్ సెలెక్షన్’’ పేరుతో ఆమె ఒక పుస్తకం రాశారు. అసలు భారత్‌లో సెక్స్ డిటెర్మినేషన్ టెస్టులు ఎలా పుట్టాయో ఆమె దీనిలో వివరించారు.

‘‘1960లలో ప్రపంచ బ్యాంకు, మరికొన్ని అంతర్జాతీయ సంస్థల సలహాదారులు పెరుగుతున్న జనాభాను సమస్య చెబుతూ కొత్త జనాభా నియంత్రణ విధానాలను అనుసరించాలని సూచించారు. దీనిలో భాగంగానే రీప్రొడక్టివ్ బయోలజీపై ‘రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్, ద ఫోర్డ్ ఫౌండేషన్’ భారీగా నిధులు వెచ్చించాయి’’అని ఆమె చెప్పారు.

‘‘మరోవైపు 1960ల మధ్యలో ప్రముఖ అమెరికన్ ఎంబ్రయోలజిస్ట్, బయోకెమిస్ట్ షెల్డన్ సెగల్ దిల్లీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన ఎయిమ్స్‌ను సందర్శించారు. కడుపులో బిడ్డ మగ లేదా ఆడో తెలుసుకోవడానికి సెక్స్ క్రోమాటిన్లను ఎలా పరీక్షించొచ్చో ఆయన చూపించారు. సెక్స్ డిటెర్మినేషన్ టెస్టులకు దీన్ని ముందు దశగా చెప్పుకోవచ్చు’’అని ఆమె వివరించారు.

సెక్స్ డిటెర్మినేషన్ టెస్టు

ఫొటో సోర్స్, UMESH NEGI

మొదట్లో ఈ పరీక్షలు కేవలం ప్రభుత్వం ఆసుపత్రులకు మాత్రమే పరిమితం అయ్యేవి. జనాభా నియంత్రణ పేరుతో ఆడ శిశువులను గర్భంలోనే తుంచివేస్తున్నారని ఎయిమ్స్‌కు చెందిన సీనియర్ డాక్టర్లు ప్రచురించిన పరిశోధన పత్రాల్లోని కొన్ని కోట్‌లను కూడా మారా ఉటంకించారు.

అయితే, 1970లలో భారత్‌లోని ఫెమినిస్టు గ్రూపులు, ఇతర సామాజిక ఉద్యమకారులు దీనిపై నిరసనగళం ఎత్తడం మొదలుపెట్టారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందని మారా తన పుస్తకంలో రాసుకొచ్చారు.

ఒక్క ఎయిమ్స్‌లోనే అప్పటివరకు దాదాపు 10,000 మంది ఆడ శిశువులను కడుపులోనే హత్య చేశారని ఆమె చెప్పారు. ‘‘ప్రభుత్వ నిధులతోపాటు పశ్చిమ దేశాల ఫండింగ్‌తో భారత్‌లో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్లు ప్రజల్లోకి వేగంగా చేరుకోగలిగాయి’’అని ఆమె వివరించారు.

సెక్స్ డిటెర్మినేషన్ టెస్టు

ఫొటో సోర్స్, Getty Images

ముందు నుంచీ పరిస్థితి ఇంతేనా?

అయితే, భారత్‌పై ‘‘సెక్స్ డిటెర్మినేషన్’’ పూర్తిగా పశ్చిమ దేశాలే రుద్దాయని చెప్పడం కూడా సరికాదు.ఆ టెస్టులను పశ్చిమ దేశాలు ఇక్కడ ప్రవేశపెట్టి ఉండొచ్చు. కానీ, అబ్బాయిల విషయంలో పక్షపాతం అనేది ఎప్పటినుంచో ఎక్కడ ఉంది.

మునుపటితో పోలిస్తే నేడు పరిస్థితులు మారుతూ ఉండొచ్చు. కానీ, నేటికీ అబ్బాయిలను ఎంచుకోవడం అనేది మనకు కనిపిస్తుంది.

అభివృద్ధి, అక్షరాస్యతలో ముందు వరుసలో ఉండే కేరళలోని మంగళం వార్తా పత్రికలో 2016లో అబ్బాయిలు పుట్టాలంటే ఏం చేయాలో చెబుతూ కొన్ని సూచనలతో ఒక కథనం ప్రచురించారు. ‘‘పశ్చిమం వైపు ముఖం పెట్టి పడుకోవడం, ఆహారం ఎక్కువ తీసుకోవడం లాంటివి చేస్తే మగపిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ’’అని దానిలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఏ రోజు సెక్స్ చేయాలో, అబ్బాయి పుట్టాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో దీనిలో చెప్పారు.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ఇలాంటి ప్రచారాలను అసలు నమ్మకూడదని గైనకాలజిస్టు డార్ షజీరా మాలిక్ చెప్పారు. ‘‘నిజానికి పుట్టేది అమ్మాయో లేదా అబ్బాయో అనేది యూదృచ్ఛికంగా జరుగుతుంది. తండ్రి వీర్యంలోని క్రోమోజోమ్‌లు శిశువు జెండర్‌ను నిర్ధారిస్తాయి. వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, అండంతో కలిసి ఫలదీకరణం చెందినప్పుడు మాత్రమే మగశిశువు జన్మిస్తాడు’’అని ఆమె చెప్పారు.

ఆ మలయాళ కథనం సముద్రంలో నీటి బిందువు లాంటిదని, ఆడ పిల్లలను అడ్డుకునేందుకు ఇలాంటి చాలా కథనాలు, సూచనలు, సలహాలు చెబుతుంటారని ‘‘డిజప్పియరింగ్ డాటర్స్: ద ట్రాజెడీ ఆఫ్ ఫీమెల్ ఫీటిసైడ్’’ పుస్తక రచయిత గీత అరవముండన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, మగవాళ్లకు గర్భ నిరోధక పిల్స్ ఎందుకు లేవు?
లింగ నిర్ధరణ పరీక్షల యంత్రాలను పరిశీలిస్తున్న వరంగల్ సీపీ రంగనాథ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, లింగ నిర్ధరణ పరీక్షల యంత్రాలను పరిశీలిస్తున్న వరంగల్ సీపీ రంగనాథ్

శిక్షలు ఏమిటి?

ప్రజల్లో ఆడపిల్లలపై అపోహలు, పక్షపాత ధోరణిని తగ్గించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థ, ఆరోగ్య సేవలు సిబ్బంది కృషి చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీఎన్‌డీటీ) చట్టాన్ని 1990ల్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలోని నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

  • కన్సెప్షన్ కు ముందు లేదా తర్వాత సెక్స్ సెలెక్షన్ టెస్టులు నిర్వహించకూడదు.
  • కేవలం జన్యుపరమైన లోపలు, జీవక్రియా రుగ్మతలు, క్రోమోజోమ్ సమస్యలు, కొన్ని మేధోపరమైన సమస్యలు, సెక్స్ సంబంధిత వ్యాధులను నిర్ధారించేందుకు ప్రీ-నేట్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అంటే అల్ట్రాసౌండ్, అమైనోసెంటెసిస్ లాంటివి ఉపయోగించాలి.
  • కడుపులో పిండం జెండర్‌ను నిర్ధరించేందుకు అల్ట్రాసోనోగ్రఫీని ల్యాబ్ లేదా క్లినిక్‌లు చేయకూడదు.
  • పరీక్షను నిర్వహించిన వ్యక్తి కడుపులోని బిడ్డ జెండర్‌ను గర్భిణికి లేదా ఆమె బంధువులకు చెప్పకూడదు, సంకేతాలనూ ఇవ్వకూడదు.
  • ప్రీనేటల్, ప్రీకన్సెప్షన్ సెక్స్ డిటెర్మినేషన్‌లపై ప్రకటలు ఇచ్చినా లేదా పరీక్షలు చేసినా గరిష్ఠంగా మూడేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు రూ.10,000 వరకు జరిమానా విధిస్తారు.
  • రిజిస్ట్రేషన్ లేదా అనుమతులు లేని క్లినిక్‌లలో ప్రీనేటల్ డయాగ్నోస్టిక్స్ టెస్టులు చేయకూడదు.
  • అనుమతులు లేని సంస్థలు వ్యక్తులకు అల్ట్రాసౌండ్ మెషీన్లు లేదా జెండర్ నిర్ధరించే పరీక్షల మెషీన్ల విక్రయాలు, అద్దెకు ఇవ్వడం లాంటివి చేయకూడదు.

అయితే, ప్రస్తుతం వరంగల్‌లో కడుపులో ఉండేది ఆడ బిడ్డో లేదా మగ బిడ్డో చెప్పేందుకు కోడ్ లాంగ్వేజీ వాడుతున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

‘‘అబ్బాయి అయితే రాముడు, వెంకటేశ్వరస్వామి, ఆడపిల్ల అయితే, లక్ష్మీదేవి, సరస్వతి ఫోటోలను చూపిస్తున్నారు. ఒక్కోసారి మీ పాప చాలా యాక్టివ్‌గా ఉందని, లేదా బాబు చాలా యాక్టివ్ ఉన్నాడని చెబుతున్నారు’’అని ఆయన చెప్పారు.

మేనకా గాంధీ

ఫొటో సోర్స్, AFP

పరీక్షలు చేయాలనే వారి వాదనేంటి?

అయితే, లింగ నిర్ధరణ పరీక్షలను అందరికీ చేయాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. వీరిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా ఒకరు.

‘‘కడుపులో బిడ్డను ట్రాక్ చేసేందుకు ప్రతి ఒక్కరికీ సెక్స్‌ డిటెర్మినేషన్ టెస్టులు చేయాలి. ఫలితంగా ఎవరి కడుపులో ఆడ బిడ్డ పెరుగుతుందో తెలుసుకోవచ్చు. అప్పుడు కడుపులోనే ఆడబిడ్డను హత్య చేయకుండా జాగ్రత్తగా ట్రాక్ చేయొచ్చు’’ అని ఆమె చెప్పారు.

‘‘తన కడుపులో పెరుగుతున్నది ఆడ బిడ్డ లేదా మగ బిడ్డో ఆ గర్భిణికి తెలియాలి. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. దీన్ని మీతో పంచుకుంటున్నాను. దీనిపై ఏం నిర్ణయమూ మేం తీసుకోలేదు’’ అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె అన్నారు.

అయితే, ఇలాంటి పరీక్షలు విచ్చలవిడిగా నిర్వహించి, ఫలితాలను అందరికీ చెబితే కడుపులోని ఆడబిడ్డలకు చాలా ప్రమాదం పొంచివుంటుందని ఇండియా డెమొక్రటిక్ వుమన్స్ అసోసియేషన్ (ఏఐడీడబ్ల్యూఏ) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇప్పుడు వరంగల్‌లోనూ ఇలానే సెక్స్‌ డిటెర్మినేషన్ పరీక్షల అనంతరం ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు తీసుకొని ఆడబిడ్డలు కడుపులో లేకుండా అబార్షన్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)