తెలంగాణ: పల్లెలకు రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నిధులు ఇచ్చే 'గ్రామ జ్యోతి' పథకం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలో గ్రామంలో రహదారిపై గుంతలు పూడ్చడం మొదలు గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, ఆ గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే పనులు పూర్తి చేసి పర్యవేక్షించేలా అమలు చేస్తున్న పథకం- 'గ్రామ జ్యోతి' .
ఎన్నో వైవిధ్యమైన అంశాల మేళవింపుతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం విధి విధానాలు ఏమిటి? గ్రామస్థులు ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పథకం కింద ఒక గ్రామాన్ని ఎలా ఎంపిక చేస్తారు? - ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ గ్రామ జ్యోతి పథకం?
గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వపరిపాలన, గ్రామ సమగ్రాభివృద్ధి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం తొలుత 'మన ఊరు-మన ప్రణాళిక' అనే కార్యక్రమాన్ని 2014 సంవత్సరంలో ప్రారంభించింది.
తరువాత దీని పేరును 'గ్రామ జ్యోతి'గా మార్చి, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 2015 ఆగస్టు 17న ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఎంపికైన ప్రతి గ్రామానికి దాని జనాభా, ఆ గ్రామ అవసరాలను బట్టి రూ. 2 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు నిధులు ఇచ్చి సమగ్రాభివృద్ధికి తోడ్పడాలన్నది లక్ష్యం.
ఐదు సంవత్సరాల్లో రూ. 25 వేల కోట్లు గ్రామాల అభివృద్దికి ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామాన్ని ఎలా ఎంపిక చేస్తారు?
గ్రామాన్ని జనాభా ప్రాతిపదికన, వెనుకబాటుతనం ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
గ్రామంలో జనాభా ఎక్కువ ఉండి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పక్కా ఇళ్లు లేని గ్రామాలు ఈ పథకానికి అర్హత సంపాదిస్తాయి.
పిల్లలు, మహిళలకు కనీస సదుపాయాలు కరువై, అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తారు.
ఎస్సీలు, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు?
ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ నేతృత్వంలో గ్రామసభలు నిర్వహిస్తారు.
గ్రామం లేదా పల్లెలో ప్రజలందరి అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ గ్రామంలో ఏమేమి పనులు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాలను గ్రామ సభల్లో కూలంకుషంగా చర్చిస్తారు.
గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రాధాన్య క్రమంలో పనులు చేపడతారు. పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా గ్రామస్థులకే అప్పచెబుతారు.
పల్లెల్లో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు?
గ్రామంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలన్నిటికీ పక్కా ఇళ్లు కచ్చితంగా దక్కేలా చేస్తారు.
గ్రామంలో బడికి వెళ్లకుండా బయట ఉన్న పిల్లలను గుర్తించి వారందరూ తప్పనిసరిగా బడికి వెళ్లేలా చేస్తారు.
గ్రామంలో మంచినీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్తు సరఫరా తదితర కనీస సదుపాయాలన్నీ కల్పిస్తారు.
గ్రామంలో అక్షరాస్యత శాతం పెంచడం పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు.
ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందేలా ఏర్పాట్లు చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉపాధి అవకాశాలు కల్పిస్తారా?
గ్రామం లేదా పల్లెలో జనాభాకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పనకు, వారి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటారు.
ఇందుకోసం గ్రామస్థులకు చేతివృత్తుల్లోనూ, ఇతరత్రా రంగాల్లోనూ శిక్షణ కల్పిస్తారు.
నైపుణ్య శిక్షణ ఇస్తారా?
గ్రామంలో చదువుకున్నవారిని, యువతను గుర్తించి వారి ఆసక్తులు, ప్రతిభను అంచనా వేసి వివిధ రంగాల్లో రాణించేలా నైపుణ్య శిక్షణ ఇస్తారు.
నైపుణ్య శిక్షణ తీసుకున్న యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందేలా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
రైతులకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుంది?
ఈ పథకం కింద ఎంపికైన పల్లెలో రైతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఆ గ్రామంలో ప్రతి రైతుకు వ్యవసాయ బోరు లేదా బావికి విద్యుత్తు కనెక్షన్ కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటారు.
వ్యవసాయాధికారులు ఆ పల్లెను తరచూ సందర్శించి, రైతులతో చర్చించి అక్కడ రైతులు ఎలాంటి పంటలు పండిస్తే రైతులు లాభపడతారో అంచనా వేసి ఆ దిశగా రైతులకు ప్రోత్సాహమిస్తారు.
వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాగు పద్దతుల గురించి రైతులకు అవగాహన కల్పించి రైతుల్లో నైపుణ్యాలను మెరుగుపరుస్తారు.
ఒక్కో గ్రామానికి ఎన్ని నిధులు ఇస్తారు?
ఈ పథకం కింద ఎంపికైన గ్రామానికి ఆ గ్రామంలోని వెనుకబాటుతనం, జనాభా ప్రాతిపదికన కనీసం రూ.2 కోట్ల నుంచీ రూ.6 కోట్ల నిధులు కేటాయిస్తారు.
ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చా?
తెలంగాణాలోని గ్రామీణ ప్రజలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధానంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు, మహిళలు, పిల్లలు, కనీస సదుపాయాలు కరువైన గ్రామస్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రతి మండలంలోని ఒక గ్రామ జ్యోతి అధికారి ఉంటారు.
గ్రామస్థులు తమ ప్రాంతంలోని మండల కార్యాలయంలో ఉన్న గ్రామ జ్యోతి పథకం అధికారిని సంప్రదించాలి.
ఆయనకు దరఖాస్తు చేసుకుంటే మీ గ్రామాన్ని పరిశీలించి ఈ పథకానికి ఎంపిక చేస్తారు.
గ్రామజ్యోతి కార్యాలయంలో మీకు దరఖాస్తు ఇస్తారు. అందులో అన్ని వివరాలు పూర్తి చేసి అధికారులకు అందజేయాలి.
ఏయే పత్రాలు సమర్పించాలి?
ఈ పథకం కొరకు దరఖాస్తు చేసుకునే గ్రామస్థులు కొన్ని పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది.
* గుర్తింపు కార్డు: మీ ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డు, పాస్ పోర్టు, ఫ్యామిలీ కార్డు లాంటివి
* నివాస ధృవీకరణ పత్రం
* ఆదాయ ధృవీకరణ పత్రం
* భూ యాజమాన్యపు హక్కు పత్రం. రైతులు తాము సాగు చేస్తున్న భూమికి సంబంధించి భూ యాజమాన్య హక్కు పత్రాన్ని సమర్పించాలి.
* విద్యార్హత ధృవీకరణ పత్రాలు: గ్రామాల్లోని ప్రజల్లో నైపుణ్యాల పెంపుదలకు, వారి విద్యార్హతల పరిశీలనకు ఈ పత్రాలు అడుగుతారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ మైనర్ బాలిక హత్య: నిందితుడు అందరి ముందే ఆమె తలను రాయితో బాదుతున్నా ఎవరూ వారించలేదు-సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన దృశ్యాలు
- ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం మన తాత ముత్తాతలు ఇంకా బతికే ఉన్నారా?
- వరకట్నం: భారత్‌లో అబ్బాయిలు ఎంత ఎక్కువగా చదువుకుంటే కట్నం అంతగా పెరుగుతోందా, రీసెర్చ్‌లో ఏం తేలింది?
- ప్యాటీ హార్ట్స్: తనను కిడ్నాప్ చేసిన వారితో కలిసి బ్యాంకులను దోచుకున్న మీడియా టైకూన్ మనవరాలి కథ
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















