ఎంఎస్ ధోనీ - రవీంద్ర జడేజా: ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా చెన్నై సూపర్ కింగ్స్.. చివరి ఓవర్లో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది.
ఇంతకుముందు 2010, 2011, 2018, 2021 సీజన్లలో సీఎస్‌కే ట్రోఫీని అందుకుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై ఐదు వికెట్ల తేడాతో గెలిచి, మరోసారి ట్రోఫీని ముద్దాడింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో ఇది ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
టాస్ గెలిచిన ధోనీ, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
215 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగింది. అయితే వాన వల్ల మొదటి ఓవర్లోనే ఆట మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. పిచ్‌ను ఆడేందుకు వీలుగా సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పట్టింది. సోమవారం అర్ధరాత్రి దాటాక మ్యాచ్ మళ్లీ మొదలైంది.
డక్‌వర్త్‌లూయిస్ రూల్ ప్రకారం చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు.
పవర్‌ప్లేను ఆరు ఓవర్ల నుంచి నాలుగు ఓవర్లకు కుదించారు. బౌలర్‌కు ఓవర్ల పరిమితిని నాలుగు నుంచి మూడుకు తగ్గించారు.

ఫొటో సోర్స్, Getty Images
చెన్నై అసాధారణ పోరాటం
లక్ష్యం దిశగా చెన్నై జట్టు అసాధారణ రీతిలో పోరాడింది.
వర్షం ముప్పును, ముందున్న లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వే ధాటిగా ఆడారు.
16 బంతుల్లో 26 పరుగులు(మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కొట్టిన రుతురాజ్, 25 బంతుల్లో 47 పరుగులు (నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) చేసిన డెవన్ కాన్వే ఏడో ఓవర్లో ఔటయ్యారు. ఏడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులుగా ఉంది.
తర్వాత రహానే, శివమ్ దూబే వచ్చీ రాగానే చెలరేగి ఆడటంతో జట్టు స్కోరు ఎనిమిదో ఓవర్ ముగిసే సరికి 94 పరుగులకు చేరుకుంది.
‘ఇంపాక్ట్ ప్లేయర్’ శివమ్ దూబే (21 బంతుల్లో 32 పరుగులు), అజింక్య రహానే(13 బంతుల్లో 27 పరుగుల), అంబటి రాయుడు విలువైన పరుగులు జోడించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబటి రాయుడు కీలక సమయంలో ఎనిమిది బంతుల్లో 19 పరుగులు(ఒక ఫోర్, రెండు సిక్సర్లు) చేశాడు. ఐపీఎల్‌లో రాయుడికి ఇది చివరి మ్యాచ్.
కెప్టెన్ ధోనీ డకౌట్ అయ్యాడు.
రహానే, అంబటి రాయుడు, ధోనీ ముగ్గురూ మోహిత్ శర్మ బౌలింగ్‌లోనే ఔటయ్యారు.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ రెండు బంతుల్లో జడేజా అద్భుతం
టోర్నీలో గుజరాత్ బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచిన మొహమ్మద్ షమీ ఫైనల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
అయితే కీలకమైన 14వ ఓవర్లో షమి ఎనిమిదే పరుగులు ఇచ్చి, చెన్నై బ్యాటర్లపై ఒత్తిడి బాగా పెంచేశాడు. దీంతో చెన్నె విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి.
స్ట్రైకింగ్ ఎండ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబే, మరోవైపు టీ20ల్లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరైన రవీంద్ర జడేజా ఉన్నారు.
మొదటి నాలుగు బంతుల్లో మూడు సింగిల్స్ వచ్చాయి.
ఇక చెన్నై గెలవాలంటే రెండు బంతుల్లో పది పరుగులు కొట్టాలి.
నరాలు తెగే ఉత్కంఠ.
మోహిత్ శర్మ యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ ‘లెంత్’ అనుకున్నట్టుగా పడలేదు. జడేజా లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టాడు.
ఇక విజయానికి నాలుగు పరుగులు కావాలి.
ఈసారి మోహిత్ శర్మ బంతి ‘లైన్’ తప్పింది. లోఫుల్ టాస్ బాల్ పడింది.
జడేజా ఫోర్ కొట్టాడు.
చెన్నై గెలిచేసింది.
చెన్నై అభిమానుల హర్షాతిరేకాలతో స్టేడియం దద్దరిల్లింది.
డగౌట్‌లో చెన్నై జట్టు సంబరాల్లో మునిగిపోయింది.
చెన్నై జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఓపెనర్ డెవన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ ఇన్నింగ్స్ ఎలా సాగింది?
టోర్నీలో నాలుగు సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
అతడు రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 39 బంతుల్లో 54 పరుగులు కొట్టాడు.
ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. 47 బంతుల్లో 96 పరుగులు (ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 200 పైనే ఉంది.
చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపుల (12 బంతుల్లో 21 పరుగులు)తో గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
రిటైర్మెంట్‌పై ధోనీ ఏమన్నాడు?
మ్యాచ్ తర్వాత, రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు ధోనీ సమాధానమిచ్చాడు.
‘‘నా రిటైర్‌మెంట్ ప్రకటించడానికి ఇది అత్యుత్తమ సమయం. కానీ, ప్రజల నుంచి ఎంతో ప్రేమ వస్తోంది. అందరికీ ధన్యవాదాలు చెప్పి, రిటైర్మెంట్ తీసుకొని హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోవడం తేలికే. కానీ, తొమ్మిది నెలలు కష్టపడి మరో ఐపీఎల్ ఆడటం కొంచెం కష్టమైన పని. దీని కోసం శరీరాన్ని మరింత దృఢంగా ఉంచుకోవాలి. సీఎస్‌కే అభిమానుల నుంచి ప్రేమ వెల్లువెత్తుతోంది. వారి కోసం మరో సీజన్ ఆడటం వారికి నేనిచ్చే బహుమతి అవుతుంది’’ అని ధోనీ చెప్పాడు.
‘‘సీఎస్‌కే తొలి మ్యాచ్ రోజు అందరూ నా పేరు జపించారు. దీంతో నా కళ్లు నీటితో నిండిపోయాయి. దాని నుంచి బయటకు వచ్చేందుకు నాకు కొంత సమయం పట్టింది. దీన్ని ఆస్వాదించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నన్ను నన్నుగా వారు ఇష్టపడుతున్నారు. ఇది నాకెంతో నచ్చుతోంది’’ అని చెన్నై సారథి అన్నాడు.
‘‘ఇది నా కెరియర్‌లో చివరి అంకం. నాపై వాళ్లు చూపిస్తున్న ఇంత అభిమానానికి నేను వాళ్ల కోసం ఏదైనా చేయాలి’’ అని అతడు చెప్పాడు.
ఈ విజయం ధోనీకి అంకితం: రవీంద్ర జడేజా
సీఎస్‌కే గెలుపుపై రవీంద్ర జడేజా మాట్లాడుతూ- ‘‘ఐదో టైటిల్‌ను మా సొంత ప్రజల ముందు గెలవడం గొప్పగా అనిపిస్తోంది. నా సొంత రాష్ట్రం గుజరాత్, ఇదొక అద్భుతమైన ఫీలింగ్. ఈ విజయాన్ని సీఎస్‌కేలో ఒక ప్రత్యేక సభ్యుడికి అంతకితం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆయనే ఎంఎస్ ధోనీ’’ అన్నాడు.
‘‘నేను అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం గురించే ఆలోచించాను. బాల్ ఎటు వెళ్తోందో పట్టించుకోలేదు. కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాను. ప్రతి బాల్‌ను గట్టిగా కొట్టేందుకు ప్రయత్నించాను” అని అతడు చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పటికీ మరచిపోను: అంబటి రాయుడు
‘‘ఈ ఫైనల్‌ను నేను ఎప్పటికీ మరచిపోను. మిగతా జీవితాన్ని హాయిగా నవ్వుతూ బతికేస్తాను’’ అని రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు చెప్పాడు.
‘‘గత 30 ఏళ్లుగా నేనెంతో శ్రమించాను. ఇలా ముగింపు పలకడం చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అని అతడు తెలిపాడు.
ఐపీఎల్ ట్రోఫీ విజయాన్ని రాయుడికి అంకితం ఇస్తున్నట్లు చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
- ‘మేల్ సెక్స్ వర్కర్‌గా నేను ఎందుకు మారాల్సి వచ్చిందంటే...’ - #HisChoice
- దిల్లీ మైనర్ బాలిక హత్య: నిందితుడు అందరి ముందే ఆమె తలను రాయితో బాదుతున్నా ఎవరూ వారించలేదు-సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన దృశ్యాలు
- ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం మన తాత ముత్తాతలు ఇంకా బతికే ఉన్నారా?
- ప్యాటీ హార్ట్స్: తనను కిడ్నాప్ చేసిన వారితో కలిసి బ్యాంకులను దోచుకున్న మీడియా టైకూన్ మనవరాలి కథ
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














