IPL - ధోనీ: విరాట్ కోహ్లీ: ‘కింగ్ ఈజ్ బ్యాక్.. ధోనీ మరోసారి ఎగిరి గంతేసేలా చేశాడు’

ఫొటో సోర్స్, BCCI/IPL
- రచయిత, ఆదేష్ కుమార్ గుప్తా
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ కోసం
ఐపీఎల్ 2021 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరుకుంది. ఆదివారం జరిగిన మొదటి ప్లేఆఫ్ మ్యాచ్‌లో ధోనీ సేన దిల్లీ కాపిటల్స్‌పై ఇంకా రెండు బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దీంతో చెన్నై తొమ్మిదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి చేరగా, ఈ మ్యాచ్‌లో ఓడిన దిల్లీ కేపిటల్స్ సోమవారం కోల్‌కతా, బెంగళూరు మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతను ఎదుర్కోనుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ కాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.
ఓపెనర్ పృథ్వీ షా 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 60 చేయగా, కెప్టెన్ రిషబ్ పంత్ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెట్‌మెయిర్ 37 పరుగులు చేశాడు.
తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ డిప్లిసిస్‌ను కోల్పోయినా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడడం, వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్ ఉతప్ప చెలరేగి ఆడడంతో నిలదొక్కుకుంది.
చివరి ఏడు ఓవర్లలో 62 పరుగులు చేయాల్సిన దశలో చెన్నై వరసగా 3 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఉతప్పతోపాటూ శార్దూల్, అంబటి రాయుడు వెంటవెంటనే అవుట్ అయ్యారు.
అప్పటివరకు పోరాడిన రుతురాజ్ 19వ ఓవర్ తొలి బంతికి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో విజయానికి 11 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని (6 బంతుల్లో 18 పరుగులు; 1 సిక్స్, 3 ఫోర్లు) క్రీజులోకి వచ్చారు. అదే ఓవర్ ఐదో బంతిని సిక్సర్‌గా బాదడంతో పాటు... చివరి ఓవర్‌లో మూడు బౌండరీలు బాది జట్టును గెలిపించారు.
దీంతో చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు విజయ లక్ష్యాన్ని అందుకుంది.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 2 సిక్సర్లు 5 ఫోర్లతో 70 పరుగులు చేయగా, రాబిన్ ఉతప్ప 44 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 63 పరుగులు చేశాడు.
సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే ఎలిమినేటర్‌లో విజేతగా నిలిచిన జట్టు బుధవారం రెండో ప్లేఆఫ్‌లో దిల్లీతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత శుక్రవారం అక్టోబర్ 15న జరిగే ఫైనల్లో చెన్నైతో తలపడనుంది.
మరోవైపు, ధోనీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్లే ఆఫ్ చేరలేకపోయిన ముంబయి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్, షార్జా, అబుదాబిలో ఈ సీజన్ రెండవ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఎనిమిది జట్లలో నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి.
ప్లే ఆఫ్‌కు చేరుకున్న జట్లలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, చివరిసారి రన్నర్ అప్‌గా నిలిచిన దిల్లీ క్యాపిటల్స్‌తోపాటూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టైటిల్ రేసులో నిలిచింది.
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన గత విజేత ముంబయి ఇండియన్స్ ఈసారి ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. 14 మ్యాచ్‌లలో 7 విజయాలు, 7 ఓటములతో 14 పాయింట్లు సాధించి పేలవమైన రన్ రేట్ కారణంగా ఐదవ స్థానంలో నిలిచింది.
ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో 14 పాయింట్లు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ముంబయి ఇండియన్స్‌తో సమానంగా ఉన్నప్పటికీ 14 మ్యాచ్‌లలో మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ 4లో చోటు దక్కించుకుంది. ముంబయి రన్ రేట్ 0.116 కాగా, కోల్‌కతా రన్ రేట్ 0.587 ఉంది.
ముంబయి తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 84, సూర్యకుమార్ యాదవ్ 82 పరుగుల సాయంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 235 పరుగులు చేసి, 42 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.
ముంబయి ఎలా ఎలిమినేట్ అయింది?
వాస్తవానికి, మే 02 తర్వాత భారత్‌లో కోవిడ్ -19 కేసులు పెరగడంతో ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. దీంతో రెండవ దశ మ్యాచ్‌లు యూఏఈలోని దుబాయ్‌లో సెప్టెంబర్ 19 నుంచి చెన్నై, ముంబయి మ్యాచ్‌తో మరోసారి ప్రారంభమయ్యాయి.
ఈ మ్యాచ్‌లో ముంబై, చెన్నై చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత కోల్‌కతా కూడా ముంబయిని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. బెంగళూరు కూడా ముంబయిని 54 పరుగుల తేడాతో ఓడించడంతో, హ్యాట్రిక్ ఓటమిని చవిచూడవలసి వచ్చింది.
పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ముంబయి గెలుపు బాట పట్టేందుకు ప్రయత్నించింది. కానీ తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ నాలుగు వికెట్ల తేడాతో ముంబయిను ఓడించింది. దిల్లీపై ముంబయి ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. గత రెండు మ్యాచ్‌లలో ముంబయి గెలిచినా, ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.

ఫొటో సోర్స్, BCCI/IPL
కోల్‌కతా ప్లేఆఫ్‌కు ఎలా చేరుకుంది?
మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ తమ చివరి రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచింది. దీంతో టాప్ 4లో చోటు దక్కించుకుంది. కోల్‌కతా మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్‌ని 115 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ 57 పరుగులతో రాణించడంతో, ఆరు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో, కోల్‌కతా నాలుగు వికెట్లకు 171 పరుగులు చేసింది. ఆపై రాజస్తాన్ రాయల్స్‌ని 85 పరుగులకే చిత్తు చేసింది. దీంతో కీలక పాయింట్లను సాధించడంతోపాటూ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడంలో ఉపయోగపడింది. శుభ్‌మన్ గిల్ 56 పరుగులు చేయగా, శివమ్ మావి 21 పరుగులకు నాలుగు వికెట్లు తీసి రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్‌ను చిత్తు చేశాడు.
దిల్లీ క్యాపిటల్స్ 14మ్యాచ్‌లలో పది విజయాలు, నాలుగు పరాజయాలు, 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం, బెంగుళూరు జట్టు బ్యాట్స్‌మెన్ చివరి బంతికి సిక్స్ కొట్టడంతో ఓడిపోయింది.
దిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ 14 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సహాయంతో 544 పరుగులు చేసి చాలా మ్యాచ్‌ల్లో విజయానికి మూలస్తంభంగా నిలిచాడు.
అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీశాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
గాయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ బాగా పుంజుకున్నాడు. మిగిలిన పనిని కెప్టెన్ రిషబ్ పంత్, పృథ్వీ షా పూర్తి చేశారు.
బెంగుళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దిల్లీ అరడజను క్యాచ్‌లు వదిలేసింది. తమ ఫీల్డింగ్‌పై కెప్టెన్ రిషబ్ పంత్ కూడా కొంచెం ఆందోళనగా కూడా కనిపించాడు.

ఫొటో సోర్స్, Getty Images
రెండవ స్థానంలో చెన్నై
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై మళ్లీ జోరు చూపింది. చివరిసారి చెన్నై కేవలం ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది.
ఈసారి తొమ్మిది విజయాలతో 18 పాయింట్లు సాధించి, మెరుగైన రన్ రేట్‌తో రెండవ స్థానంలో నిలిచింది. కాగా, బెంగుళూరు కూడా 18 పాయింట్లతో చెన్నైకి సమానంగా ఉన్నా, రన్ రేట్‌లో వెనకబడటంతో మూడో స్థానంలో నిలిచింది. చెన్నై రన్ రేట్ 0.455 కాగా, బెంగళూరు రన్ రేట్ -0.140.
ఒకానొక సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కానీ చివరి మూడు లీగ్ మ్యాచ్‌లలో ఓటమి పాలయింది. వీటిలో నాలుగు వికెట్లకు 189 పరుగులు చేసినప్పటికీ, వారు రాజస్థాన్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసినప్పటికీ చెన్నైకి విజయం దక్కలేదు. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్లతో గెలిచింది.
ఆ తర్వాత వరుసగా దిల్లీ చేతిలో 3 వికెట్ల తేడాతో, పంజాబ్ చేతిలో 6 వికెట్ల తేడాతో చెన్నై ఓటమి పాలైంది. దిల్లీతో మ్యాచ్లో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసిన చెన్నై.... పంజాబ్‌తో పోరులో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేయగలిగింది.
చెన్నై ఓపెనింగ్ జంట అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. డు ప్లెసిస్ 14 మ్యాచ్‌ల్లో 546 పరుగులు చేయగా, రితురాజ్ గైక్వాడ్ 14 మ్యాచ్‌ల్లో 533 పరుగులు చేశాడు.
క్రికెట్ విశ్లేషకులు అయాజ్ మీనన్, బెంగళూరుకు సంబంధించి మాట్లాడుతూ.. "కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఆడుతున్న తీరు బాగుంది, మ్యాచ్ గెలిపించే సత్తా అతనిలో ఉంది. విరాట్ కోహ్లీ చివరిసారిగా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నందున జట్టు సభ్యులు భావోద్వేగంతో ఉన్నారు"
"కోహ్లీ జట్టును ముందుకు తీసుకెళ్లగలడు. వారి బౌలర్లు కూడా అద్భుతంగా ఉన్నారు. యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ అందరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ సీజన్ రెండో దశలో ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ ప్రశ్నార్థకంగా మారింది"
"డివిలియర్స్ ప్రస్తుతం ఐపీఎల్ మినహా మరెక్కడా ఆడటం లేదు. ఆయన ఫామ్‌లోకొస్తే, జట్టు పూర్తి స్వింగ్‌లో ఉంటుంది. అతడిని ఆపడం కష్టం. కానీ ఫైనల్ చేరుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉందని మర్చిపోవద్దు. ప్లేఆఫ్ వారికి నాకౌట్ కాదు. ఒకవేళ వారు ఓడిపోతే కోల్‌కతా ఫైనల్‌కు వెళ్లే అవకాశం లభిస్తుంది.

ఫొటో సోర్స్, IPL 2021
బెంగళూరుతో తలపడనున్న కోల్‌కతా
సోమవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు, కోల్‌కతాతో తలపడుతుంది.
చివరి లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, బెంగుళూరు అద్భుత ప్రదర్శనతో తమ సత్తా చాటింది. చివరి బంతికి శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టి ఢిల్లీని ఏడు వికెట్ల తేడాతో ఓడించడంలో తన వంతు కృషి చేశాడు.
భరత్ అజేయంగా 78 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్ వెల్ కూడా అజేయంగా 51 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో మాక్స్‌వెల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
మాక్స్‌వెల్ ఇప్పటి వరకు 14 మ్యాచ్‌ల్లో ఆరు అర్ధ సెంచరీల సాయంతో 498 పరుగులు చేశాడు. మరోవైపు, బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ 14 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీశాడు.
విరాట్ కోహ్లీ అంచనాలకు తగ్గట్టుగా, ఓపెనర్ దేవదత్ పడికల్ కూడా 13 మ్యాచ్‌ల్లో 390 పరుగులు చేశాడు. 16 వికెట్లు పడగొట్టిన చాహల్ కూడా... బెంగళూరును టాప్- 4లో నిలుపడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
"యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఈ సీజన్ రెండో దశలో కోల్‌కతా గొప్ప ఆట తీరును ప్రదర్శించింది. ముంబయి అలా చేయడంలో విఫలమైంది"
"ఈ సీజన్ రెండవ దశ ప్రారంభమైనప్పుడు, ముంబయి నాల్గవ స్థానంలో, కోల్‌కతా ఏడవ స్థానంలో ఉన్నాయి. కోల్‌కతా నాల్గవ స్థానానికి ఎగబాకింది. గత మూడు వారాల్లో కోల్‌కతా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. వారు రిస్క్ తీసుకొని కొత్త ఆటగాడిని ఓపెనర్‌గా దింపారు"
"పాట్ కమిన్స్ లేనప్పటికీ, వారి బౌలర్లు టిమ్ సౌథీ, ఫెర్గూసన్‌లు బాగా బౌలింగ్ చేశారు. ఇయోన్ మోర్గాన్ బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోయినా, కెప్టెన్‌గా మాత్రం రాణించాడు"

ఫొటో సోర్స్, BCCI/IPL
కాగితంపై ముంబయి చాలా బలమైన జట్టు అని, ఈ జట్టు ఓడించలేమని అనిపిస్తోంది. కానీ వారంత మెరుగైన ప్రదర్శన కనబరచలేదు.
ముంబయి అవకాశాలు కనుమరుగైన తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా, కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో చాలా కష్టపడ్డారు కానీ, స్పిన్నర్లు రాణించలేకపోయారు.
మొత్తం ముంబయి ప్రదర్శన చాలా సాధారణంగా ఉంది. క్లిష్ట సమయాలు ఎదురైనా ముంబయి దాదాపు ప్రతీసారి ప్లేఆఫ్‌కు మాత్రం చేరుకునేది. కానీ, ఈ సారి అలా జరగలేదు.
అయాజ్ మెమన్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుతూ.... "గత మూడు నాలుగు మ్యాచ్‌లను చూస్తుంటే, చెన్నై చతికిలపడినట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు చెన్నై జట్టులో ఉన్న ఉత్సాహం కనిపించడం లేదు. బ్యాట్స్‌మెన్‌లు విఫలమవుతున్నారు. రితురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్ మినహా ఎవరూ పరుగులు చేయలేకపోతున్నారు. సురేష్ రైనా, ధోనీలు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు" అని అన్నారు.
"మొయిన్ అలీ కూడా పరుగులు రాబట్టలేకపోతున్నాడు. బౌలింగ్‌లో చెన్నై ప్రదర్శన ఢిల్లీ, కోల్‌కతాల మాదిరిగా లేదు. టాప్2లో నిలవడంతో ఫైనల్స్‌కు వెళ్లడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. కానీ, జట్టు ప్రదర్శనే సాధారణంగా ఉంది"

ఫొటో సోర్స్, yuzvendra chahal
దిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించి, అయాజ్ మెమన్ అన్ని విధాలుగా దిల్లీ అత్యుత్తమ జట్టు అని అభిప్రాయపడ్డారు. "యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న జట్టు అది. మొదటిసారి టైటిల్ గెలవాలనే సంకల్పం, కోరికతో ఉన్నారు. చివరిసారి ఓడిపోయిన అనుభవం కూడా వీరికి ఉంది. మొదటిసారి చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని అనుకుంటున్నారు"
ప్లేఆఫ్స్‌లో, ఓపెనింగ్ జంట శుభ్ మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్‌లు కోల్‌కతా బలంగా అయాజ్ మెమన్ పేర్కొన్నాడు. "కోల్‌కతా తన ఫామ్‌ని కాపాడుకుంటే, మంచి ప్రారంభాన్ని ఇవ్వగలదు. దీంతో బౌలర్లు కట్టడి చేసే స్కోరు చేయవచ్చు. బౌలర్ లాకీ ఫెర్గూసన్ ప్రదర్శన బాగుంది. శివమ్ మావి చివరి మ్యాచ్‌లో వచ్చాడు. ఆయన కూడా బౌలింగ్‌లో రాణించాడు"
క్లిష్ట సమయాల్లో ఏసెస్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్‌లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారు.
షకీబ్ అల్ హసన్ కూడా జట్టులో ఉంటే, గొప్ప ఆల్ రౌండర్. బహుశా ఆండ్రీ రస్సెల్ ఫిట్ అయితే ఆడే అవకాశం ఉంది.
ఇప్పుడు చెన్నై ఫైనల్‌కు చేరుకోవడంతో మిగతా మూడు జట్లలో ఏది ఫైనల్ చేరుతుందా అని అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.
ఇవి కూడా చదవండి:
- వాతావరణ మార్పులు: కాప్-26లో భారత్, చైనా చేతులు కలిపి అమెరికానే ప్రతిఘటిస్తాయా?
- బిట్‌కాయిన్ మైనింగ్ కోసం వాడే విద్యుత్‌తో ఒక దేశానికి ఏడాదంతా కరెంట్ సరఫరా చేయొచ్చు
- కాకినాడ: ప్రపంచ బియ్యం ఎగుమతుల హబ్‌గా మారుతోందా
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












