ప్యాటీ హర్స్ట్: తనను కిడ్నాప్ చేసిన ముఠాతో కలిసి బ్యాంకులను దోచుకున్న మీడియా టైకూన్ మనవరాలి కథ

ప్యాటీ

ఫొటో సోర్స్, Getty Images

" ఆమెను 57 రోజులు గదిలో ఉంచారు. కొట్టారు, తిట్టారు. కిడ్నాపర్లు ఆమెకు రెండు చాయిస్‌లు ఇచ్చారు. వారితో చేరడం లేదా చనిపోవడానికి సిద్ధంగా ఉండటం.

ఆ సమయంలో ప్యాటీ హర్స్ట్ తను జీవించి ఉండటమే ముఖ్యమని భావించారు. కిడ్నాప్ జరిగిన రెండు నెలల తర్వాత ప్యాటీ మళ్లీ కనిపించారు.

ఆ సమయంలో ఆమె కిడ్నాపర్లతో కలిసి ఒక బ్యాంకును దోచుకోవడానికి వచ్చారు

ఓ పెద్ద మీడియా సంస్థకు చెందిన వ్యక్తి 19 ఏళ్ల మనవరాలు కిడ్నాప్‌కు గురై, ఆ తర్వాత కరడుగట్టిన నేరస్థురాలిగా మారిన కథ ఇది''

బీబీసీకి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లెస్లీ జిర్సా చెప్పిన మాటలవి.

'ప్యాటీ కిడ్నాప్ అనంతరం ఒక రాడికల్ గ్రూప్‌తో కలిసి చేసిన బ్యాంక్ దోపిడీ' పై డాక్యుమెంటరీ తీశారు. అది అమెరికన్ టెలివిజన్ చరిత్రలో పాపులర్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.

ఆ డాక్యుమెంటరీ పేరు 'గెరిల్లా: ది టేకింగ్ ఆఫ్ ప్యాటీ హర్స్ట్'. లెస్లీ జిర్సా నిర్మాతగా రాబర్ట్ స్టోన్ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ రూపొందింది.

ప్యాటీ హర్స్ట్ ఎవరు? ఆమె వారితో నిజంగా చేరిందా? లేదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చాలామంది తెలుసుకోవాలనుకున్నారని దర్శకుడు రాబర్ట్ చెప్పారు.

అంతేకాదు ప్యాటీ గురించి న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రధాన వార్తాపత్రికలు సైతం అప్పట్లో కథనాలు ప్రచురించాయి.

ప్యాటీ

ఫొటో సోర్స్, Getty Images

ప్యాటీ కథేంటి.. ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు?

వియత్నాం యుద్ధం ముగిసినప్పటికీ అమెరికాలో అంతర్యుద్ధం కొనసాగుతున్న సమయంలో జరిగిన ఘటన ఇది. అప్పట్లో వాటర్‌గేట్‌ కుంభకోణం మీడియాలో సంచలనంగా మారింది.

అదే సమయంలో ఒక ధనిక కుటుంబానికి చెందిన యువతి కిడ్నాప్‌కు గురయ్యారు. 1970లలో ఆమె అమెరికన్ యువతకు ప్రతిరూపంలా ఉండేవారు.

1974 ఫిబ్రవరి 4న రాత్రి వామపక్ష అమెరికన్ అర్బన్ గెరిల్లాలు 19 ఏళ్ల పాటీ హర్స్ట్‌ని ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు.

మీడియా సంస్థ నడుపుతున్న విలియం రాండోల్ఫ్ హర్స్ట్ మనవరాలే పాటీ హర్స్ట్. ఆమె బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని.

విలియం జీవిత కథను 'సిటిజన్ కేన్' చిత్రంగా రూపొందించారు. ప్యాటీ ఆయన వారసురాలు.

కార్పొరేట్ నియంతృత్వ ధోరణిని పారద్రోలడమే లక్ష్యంగా ఏర్పాటైన సింబియోనీస్ లిబరేషన్ ఆర్మీ (ఎస్‌ఎల్‌ఏ) ప్యాటీని కిడ్నాప్ చేసింది.

హర్స్ట్ కుటుంబాన్ని "ఎలైట్ ఫాసిస్ట్ రూలింగ్ ఫ్యామిలీ"గా ఎస్‌ఎల్‌ఏ అభివర్ణించింది.

ఎస్‌ఎల్‌ఏ సభ్యులు అమెరికా చరిత్రలో అత్యంత హింసాత్మకమైన తిరుగుబాటు చేయాలని అనుకునేవారు.

కిడ్నాప్ అనంతరం వందలాది జర్నలిస్టులు హర్స్ట్ ఇంటి వెలుపల గుమిగూడారు. కిడ్నాప్ గురించి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

ప్యాటీ ఇంటి బయట నుంచే రిలే వ్యాన్ల ద్వారా ప్రతి అంశాన్ని వివరంగా ప్రసారం చేశారు. వార్తాపత్రికలు పేజీలు నింపేశాయి.

"నాతో సహా అనేక వార్తా సంస్థలు ప్యాటీ ఇంటి వెలుపల ఉన్న చెట్లకు ఫోన్‌లను వేలాడదీశాయి" అని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ లిండా డ్యూచ్ నాకు చెప్పారు.

‘దయచేసి విలేఖరులతో మాట్లాడొద్దు’ అనే బోర్డు ఇంటి వెలుపల ఉందని లిండా గుర్తు చేసుకున్నారు.

ప్యాటీ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా పేదరికం బట్టబయలు

లక్షలాది మంది కాలిఫోర్నియా పేద ప్రజల కోసం భారీ ఆహార కార్యక్రమానికి నిధులు అందించాలని హర్స్ట్ కుటుంబాన్ని ఎస్‌ఎల్‌ఏ కోరింది. అయితే ప్యాటీ తండ్రి కిడ్నాపర్లతో మాట్లాడటం మానేశాడు.

ప్యాటీ కుటుంబం, ఎస్‌ఎల్‌ఏ మధ్య కమ్యూనికేషన్ అంతా మీడియా ద్వారానే జరిగింది. రేడియో స్టేషన్లు టేప్ చేసిన సందేశాలను ప్లే చేశాయి.

ఆహారం పంపిణీ తొలి ప్రయత్నం విఫలమైంది.

ఆహారం పంపిణీ చేసేందుకు వెళ్లే ట్రక్కుల నుంచి సరుకులు విసిరేయడంతో అల్లర్లు, దోపిడీలు జరిగాయి. ఆ ఘటనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై కూడా దాడి జరిగింది.

ప్యాటీ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాకు షాకిచ్చిన ప్యాటీ

ప్యాటీ జీవితం అప్పుడు కిడ్నాపర్ల చేతుల్లో ఉంది. ఆమెకు రెండు చాయిస్‌లు ఇచ్చారు. వారితో చేరడం లేదా చనిపోవడం.

చివరకు ప్యాటీ వారితో చేరిపోయారు. అంతేకాకుండా వారితో కలిసి బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెకు తిరిగి వచ్చే పరిస్థితి లేదు.

తన ఇష్టానుసారమే ఎస్‌ఎల్‌ఏలో సభ్యురాలిగా చేరినట్లు ఏప్రిల్ 3న ప్యాటీ ప్రకటన చేశారు.

ఆమెకు తానియా అనే మారు పేరు పెట్టారు. చే గువేరా ప్రియురాలి పేరు తానియా.

ప్యాటీ తన తల్లిదండ్రులను కూడా విమర్శించారు. తన కాబోయే భర్తను 'సెక్సిస్ట్, పెద్ద వయసు పంది' అని అభివర్ణించారు.

యూనిఫారం, ఆయుధంతో ఎస్‌ఎల్‌ఏ చిహ్నం జెండా ముందు ప్యాటీ నిలబడి ఉన్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది.

ఆ ఫోటోలో వెనుక కర్టెన్ పైన ఏడు తలల నాగుపాము చిహ్నం ఉంది.

ప్యాటీ తన బెస్ట్ ఫ్రెండ్ తండ్రి నడిపే ఒక బ్యాంకును తన గ్యాంగ్‌తో కలిసి దోచుకుంది. అక్కడి కెమెరాలో ప్యాటీ కనిపించారు.

దీన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇక మీడియా పూర్తి మసాలాలతో కథనాలు వడ్డించింది.

కాగా, ఎస్‌ఎల్‌ఏ బృందం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్‌కు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

లాస్ ఏంజిల్స్ పోలీసులతో ఎస్‌ఎల్‌ఏ బృందానికి భీకర పోరు జరిగింది. కాల్పుల్లో ఆరుగురు ఎస్‌ఎల్‌ఏ సభ్యులు చనిపోయారు.

మొత్తం కాల్పుల ఘటనను జాతీయ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

మినీ-క్యామ్ అని పిలిచే కొత్త సాంకేతికతను ఉపయోగించడంతో ప్రసారం సాధ్యమైంది.

ఈ ఘటనల సమయంలో ప్యాటీ అక్కడ లేరు. డిస్నీల్యాండ్ సమీపంలోని మోటెల్ గది నుంచి ప్యాటీ ప్రత్యక్షంగా ఈ కాల్పుల ఘటన వీక్షించారు.

తానియా

ఫొటో సోర్స్, Getty Images

ప్యాటీ ఎలా దొరికారు?

మూడు వారాల తర్వాత ప్యాటీ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ఆమె ప్రెస్‌ను 'ఫాసిస్ట్ పిగ్ మీడియా' అని విమర్శించారు. మరణించిన తన సహచరులకు నివాళిగా పాటను ప్రదర్శించారు.

జోయా అని పిలిచే తన సహచరుడైన ప్యాట్రిసియా సోల్టిసిక్‌ను ఆమె గుర్తుచేసుకున్నారు. తాను కలుసుకున్న వాళ్లలో ప్రజల పట్ల అపూర్వమైన ప్రేమ గలవారిలో ఆయన ఒకరని తెలిపారు.

అయితే, తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి ప్యాటీ హర్స్ట్ దుఃఖించడం చూసి అమెరికా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి సంవత్సరం ప్యాటీ, ఆమె మిగిలిన సహచరులు ఎఫ్‌బీఐని, విలేఖరులను తప్పించుకుంటూ దేశంలో తిరిగారు.

చివరికి 1975 సెప్టెంబర్ 18న శాన్ ఫ్రాన్సిస్కోలో ప్యాటీ అరెస్టు అయ్యారు. ఆ సమయంలో హిబెర్నియా బ్యాంక్ దోపిడీకి ప్యాటీ ప్రయత్నించారు.

అయితే ఎస్‌ఎల్‌ఏ గ్రూపులో మిగిలిన సభ్యురాలు ఆమె మాత్రమే. దీంతో ఆమెపై విచారణ జరిగింది.

ప్యాటీ

ఫొటో సోర్స్, Getty Images

రాబందు పత్రికలు: ప్యాటీ తల్లి

పత్రికలు ప్యాటీపై దర్యాప్తును 'ఈ శతాబ్దపు విచారణ'గా అభివర్ణించాయి.

మరోవైపు ప్రభుత్వం " సాకులు వెతుక్కునే తిరుగుబాటుదారు"గా ప్యాటీని అభివర్ణిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేసింది.

ఆ సమయంలో ప్యాటీ హర్స్ట్ వార్తలపై ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉండేది.

శాన్ ఫ్రాన్సిస్కో పత్రిక ఎడిటర్ తన పేపర్ సర్క్యులేషన్‌ను పెంచడానికి ఎస్‌ఎల్‌ఏతో కల్పిత ఇంటర్వ్యూ చేశారు.

హర్స్ట్ కుటుంబం, ఎస్‌ఎల్‌ఏ ఇరువురు మీడియా తీరుపై అసహనం వ్యక్తంచేశారు.

1974, 1976 మధ్య న్యూస్‌వీక్ మ్యాగజైన్ ముఖచిత్రంగా ప్యాటీ ఫోటో ఏడు సార్లు ప్రచురితమైంది.

ప్యాటీ తల్లి ఒకానొక సమయంలో ప్రెస్‌ని 'రాబందులు'గా అభివర్ణించారు.

మీడియా అంటే 'ఎస్‌ఎల్‌ఏకి ల్యాప్ డాగ్' లాంటిదని జాన్ నాతో అన్నారు.

ఎస్‌ఎల్‌ఏ తన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్లడానికి ప్యాటీ తాత విలియం ప్రారంభించిన జర్నలిజం కల్చర్‌ను ఉపయోగించుకుంది.

ప్యాటీ

ఫొటో సోర్స్, Getty Images

సినిమాల్లో నటన

కాగా, విడుదలైన కొద్దికాలానికే ప్యాటీ తన మాజీ అంగరక్షకుడు బెర్నార్డ్ షాను వివాహం చేసుకున్నారు.

1974 నుంచి 1979 వరకు తన జీవితం ఎలా సాగిందో 1982లో ఆమె ''ఎవ్రీ సీక్రెట్ థింగ్'' అనే పుస్తకాన్ని (ఆల్విన్ మాస్కోతో) రాశారు.

జాన్‌వాటర్స్ చిత్రాలు కొన్నింటిలో కూడా హర్స్ట్ నటించారు.

వీటిలో ముఖ్యమైనవి క్రై-బేబీ (1990), సెసిల్ బి. డిమెంటెడ్ (2000) చిత్రాలు.

(ఈ కథనం ‘క్యాప్టివ్ మీడియా: ది స్టోరీ ఆఫ్ ప్యాటీ హర్స్ట్’ కార్యక్రమానికి హోస్ట్, ప్రెజెంటర్ అయిన బెంజమిన్ రామ్ రాసిన వ్యాసం ఆధారంగా బీబీసీ రూపొందించింది.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)