'డోనల్డ్ ట్రంప్‌ షాపింగ్‌ మాల్ ట్రయల్ రూమ్‌లో నాపై అత్యాచారం చేశారు'

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హోలీ హోండరిచ్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మూడు దశాబ్దాల క్రితం కాలమిస్టు జీన్ కెరల్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణల విషయంలో సివిల్ విచారణను ఎదుర్కొంటున్నారు.

ఈ కేసును విచారించబోయే జ్యూరీని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో మంగళవారం నియమిస్తారు.

మాన్‌హాటన్‌లోని ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో తనపై దాడిచేసి, అత్యాచారం చేశారనే కెరల్ ఆరోపణలను ట్రంప్ తిరస్కరించారు. పబ్లిసిటీ కోసమే ఆమె ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ అంటున్నారు.

ఇది క్రిమినల్ కేసు కాదు. అయినప్పటికీ, దీనిలో దోషిగా తేలితే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు.

ఈ కేసులో కెరల్ విజయం సాధిస్తే, ట్రంప్ లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారణ కావడం తొలిసారి అవుతుంది. ఇలాంటి డజనుకుపైగా కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ట్రంప్‌ను వెంటాడుతున్న ఇలాంటి న్యాయపరమైన చిక్కులు చాలానే ఉన్నాయి. వీటిలో పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపులు, 2021 జనవరి 6నాటి క్యాపిటల్ అల్లర్లు కూడా ఉన్నాయి.

మరోవైపు వచ్చే ఏడాది మళ్లీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ట్రంప్ సన్నద్ధం అవుతున్నాయి.

ఇంతకీ తాజా కేసు ఏమిటి? ఇది ఎప్పుడు జరిగింది? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

జీన్ కెరల్‌

ఫొటో సోర్స్, THE WASHINGTON POST/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జీన్ కెరల్‌

ఆరోపణలు ఏమిటి?

1995 చివర్లో లేదా 1996 మొదట్లో మాన్‌హాటన్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మన్ స్టోర్‌లో ట్రంప్ తనపై లైంగిక దాడి చేశారని 79 ఏళ్ల కెరల్ ఆరోపిస్తున్నారు.

‘‘షాపింగ్ చేసే సమయంలో మేం ఒకరికి ఒకరం ఎదురుపడ్డాం. వేరొక మహిళకు లోదుస్తులు కొనేందుకు ఆయన నన్ను సలహా అడిగారు. ఆ దుస్తులను ఒకసారి వేసుకొని చూపించాలని అన్నారు. అయితే, నేను బట్టలు మార్చుకునే గదిలోకి వెళ్లినప్పుడు ట్రంప్ కూడా వచ్చారు. నన్ను గోడకు నొక్కిపెట్టి అత్యాచారం చేశారు’’ అని ఆమె ఆరోపిస్తున్నారు.

‘‘ఆయన్ను వెనక్కి నెట్టేందుకు నేను చాలా కష్టపడాల్సి వచ్చింది’’ అని 1993 నుంచి ఎల్లీ మ్యాగజైన్‌లో ‘‘ఆస్క్ ఈ.జీన్’’ కాలమ్ రాస్తున్న కెరల్ చెప్పారు.

అయితే, ఆ లైంగిక దాడిపై ఆమె పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయలేదు. ‘‘ఎందుకంటే నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. నన్ను నేను అత్యాచార బాధితురాలిగా చూసుకోవాలని అప్పుడు అనుకోలేదు’’ అని ఆమె తెలిపారు.

ఈ ఘటనను కొన్ని రోజుల్లోనే తమకు వెల్లడించిందని కెరల్ స్నేహితులు కరోల్ మార్టిన్, లీసా బిర్న్‌బక్‌లు చెబుతున్నారు. ఈ కేసులో వారిద్దరూ సాక్ష్యం ఇచ్చేందుకు రావచ్చు.

వీడియో క్యాప్షన్, డోనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలన తీరు ఎలా ఉంది?

ట్రంప్ ఏం అంటున్నారు?

2019లో ఈ విషయంపై కెరల్ తొలిసారి నోరు విప్పినప్పటి నుంచి దీన్ని చాలాసార్లు డోనాల్డ్ ట్రంప్ ఖండిస్తూ వచ్చారు.

ఆ ఆరోపణలను పచ్చి అబద్ధాలుగా తన సోషల్ మీడియా వేదిక ‘‘ట్రూత్ సోషల్’’లో ట్రంప్ రాసుకొచ్చారు. అసలు అలాంటి ఘటనేమీ జరగలేదని వివరించారు.

అక్టోబరులో ఈ కేసును కోర్టు పరిగణలోకి తీసుకునేందుకు పరిశీలించే సమయంలోనూ అదే విషయాన్ని మరోసారి చెప్పారు. ‘‘ఆమె నేను కోరుకునే టైప్ కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

విచారణ సమయంలో ట్రంప్ కోర్టుకు వస్తారో లేదో స్పష్టత లేదు. దాదాపు రెండు వారాలపాటు విచారణ కొనసాగే అవకాశముంది.

ట్రంప్ తమపై దాడి చేసినట్లుగా ఆరోపిస్తున్న ఇతర మహిళలను కూడా ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు పిలవాలని కెరల్ న్యాయవాదులు భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రోజు ఏం చేశారు... ఎలా ఉన్నారు?

సివిల్ కేసు ఎందుకు?

ఈ కేసును క్రిమినల్ కేసుగా నమోదుచేసేందుకు సమయం ఎప్పుడో మించిపోయింది.

నిజానికి లైంగిక దాడుల్లో సివిల్ కేసులను కూడా మూడేళ్లలోపే న్యూయార్క్‌లో ఫిర్యాదు నమోదుచేయాల్సి ఉంటుంది. అంటే ఈ గడువు కూడా ముగిసిపోయింది.

కానీ, 2022లో న్యూయార్క్ అడల్ట్ సర్వైవర్స్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఇలా గడువుకు ముందే లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదు చేయలేకపోయిన బాధితులకు దీనిలో ఒక ఏడాది సమయం ఇచ్చారు.

ఆ చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ట్రంప్‌పై కెరల్ కేసు నమోదుచేశారు.

ఈ కేసుకు ముందు కూడా కెరల్ ఆత్మకథ ప్రచురణ సమయంలో ఆమెను అబద్ధాల కోరని ట్రంప్ అన్నారు. దీంతో ట్రంప్‌పై ఆమె పరువు నష్టం దావా వేశారు. అయితే, మాజీ అధ్యక్షులపై ఇలా కేసు వేయొచ్చా అనే అంశంపై చర్చ నడుమ ఆ దావాపై ఇంకా విచారణ మొదలుకాలేదు.

వీడియో క్యాప్షన్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు- ఇప్పటికే గెలిచాన్న ట్రంప్ ప్రకటనలో నిజమెంత?

కెరల్ ఫీజులు ఎవరు కడుతున్నారు?

లింకెడ్‌ఇన్ కో-ఫౌండర్, డెమెక్రటిక్ పార్టీకి నిధులు సమకూర్చే రీడ్ హోఫ్‌మాన్ ప్రస్తుతం కెరల్‌కు కోర్టు ఫీజుల విషయంలో సాయం చేస్తున్నారు.

హోఫ్‌మాన్ ఈ కేసు వెనుక ఉన్నారని తెలియడంతో విచారణను వాయిదా పడేలా చేసేందుకు ట్రంప్ న్యాయవాదులు ప్రయత్నించారు. ఇది కెరల్ ఉద్దేశాలపై అనుమానాలు రేకెత్తిస్తోందని అన్నారు. కానీ, వారి అభ్యంతరాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అయితే, కెరల్‌ను దీనిపై ప్రశ్నించేందుకు జడ్జి అనుమతించారు.

కెరల్‌కు మద్దతు ఇవ్వడంపై హోఫ్‌మాన్ తనను తాను సమర్థించుకున్నారు. ‘‘ఆర్థిక సాయాన్ని నేను ఎప్పుడూ దొంగతనంగా చేయలేదు. ఈ కేసులో నేను ఆర్థిక సాయం అందించాను’’ అని ఆయన స్పష్టంచేశారు.

‘‘మన కోర్టులు ప్రజలందరికీ న్యాయం చేస్తాయి. కేవలం డబ్బున్న వారు లేదా అధికారమున్న వారి కోసమే ఇవి పనిచేయడం లేదు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)