సూడాన్ సంక్షోభం: సొంత దేశానికి వెళ్లలేక విమానాశ్రయంలోనే పిల్లాపాపలతో ఎదురుచూస్తున్న ఎరిత్రియన్లు

ఫొటో సోర్స్, HASSAN LALI/BBC
- రచయిత, కేథరిన్ బ్యరుహంగా
- హోదా, ఆఫ్రికా కరస్పాండెంట్, బీబీసీ న్యూస్, పాలోయిచ్
సాధారణంగా దక్షిణ సూడాన్‌లోని చమురు క్షేత్రాలలో పనిచేసే ఉద్యోగుల రాకపోకలతో పాలోయిచ్ విమానాశ్రయం సందడిగా ఉంటుంది. దక్షిణ సూడాన్‌లోని ఈ విమానాశ్రయం, పొరుగునే ఉన్న సూడాన్ నుంచి పారిపోతున్న వేల మంది ప్రజలకు శిబిరంగా మారింది.
ఏదో ఒక విమానం పట్టుకుని వెళ్లిపోవడం కోసం నిరీక్షిస్తున్న వేల మంది అక్కడే తమ లగేజ్ ట్రాలీలపై తలపెట్టుకుని పడుకుంటున్నారు. కొందరు చిన్నచిన్న గుడారాలు వేసుకుంటున్నారు. అక్కడ వారికి వంట చేసుకోవడానికి వసతి లేదు, తాగడానికి నీరు లేదు, టాయిలెట్లు కూడా అందుబాటులో లేవు.
విమానం ఎక్కడం కోసం అక్కడే రోజుల తరబడి వారు నిరీక్షిస్తున్నారు.
ఏదో ఒక దారి దొరక్కపోదా అనే ఆశతో వారు సూడాన్ సరిహద్దుల నుంచి నాలుగు గంటల పాటు ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నారు.

విమానాలు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అవి ఎప్పుడు బయలుదేరుతాయనే సమాచారం ఎవరికీ సరిగా తెలియదు.
ఇక్కడ వేచిచూస్తున్న శరణార్థుల్లో ఎరిత్రియన్లు కూడా ఉన్నారు. వారి పరిస్థితి మరీ ఘోరం. సొంత దేశంలో పరిస్థితుల నుంచి బయటపడి సూడాన్‌లో ఆశ్రయం పొందితే, ఇప్పుడు అక్కడ నుంచి కూడా పారిపోయి రావాల్సిన దుస్థితి ఏర్పడింది.
వారి పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుంది.
యుద్ధానికి ముందు సూడాన్‌లో 1,36,000 మంది ఎరిత్రియా శరణార్థులున్నట్లు ఐరాస లెక్కలు చెప్తున్నాయి. చాలా మంది ఎరిత్రియా శరణార్థులు జర్నలిస్టులకు కూడా తమ పేరు చెప్పడానికి ఇష్టపడరు. తమ దేశ అధికారులు ప్రతీకార శిక్షలు వేస్తారనే భయమే దానికి కారణం.
ఎరిత్రియాలో నిర్బంధ పరిస్థితులు చాలా ఎక్కువ. ప్రజల జీవితాల్లోని అనేక అంశాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలన్న నిర్బంధం నుంచి బయటపడేందుకు ప్రజల్లో చాలా మంది ప్రయత్నిస్తుంటారు.
అలాంటి ఎరిత్రియాకు చెందిన టెస్ఫిట్ జిర్మే నాతో మాట్లాడేందుకు అంగీకరించారు. ఆయన పాలోయిచ్ విమానాశ్రయానికి చేరుకుని అయిదు రోజులైంది.
‘మనుషుల సంగతి పక్కనపెట్టండి.. పశువులను కూడా ఇలాంటి చోట ఉంచాలనుకోం’ అని అక్కడి టెంటుల వైపు చూస్తూ జిర్మే అన్నారు.
ఒంటరివాడు కావడం వల్ల అక్కడున్న చాలా మంది కంటే తన పరిస్థితి నయమని ఆయన అన్నారు.
‘బహుశా నేను దీన్ని తట్టుకోగలను. బయట పడుకోవడం, రోజుకు ఒకసారే తినడం వంటివన్నీ నేను తట్టుకోగలను. కానీ నలుగురైదుగురు పిల్లలతో ఇక్కడున్నవారికి చాలా కష్టం’ అన్నారు జిర్మే.
ఆయన గత ఏడాది చివర్లో ఎరిత్రియా నుంచి పారిపోయారు. ఎరిత్రియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించడంతో ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో, లేదంటే అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్లొచ్చనే ఉద్దేశంతో సూడాన్ వెళ్లారు.
కానీ, ఇప్పుడు సౌత్ సూడాన్‌లో ఎరిత్రియన్లు చిక్కుకున్నారు. 700 మందికిపైగా ఈ దేశానికి చేరుకున్నారు.

సూడాన్‌లో ఘర్షణల కారణంగా అక్కడి నుంచి పారిపోయిన కెన్యా, యుగాండా, సోమాలియా లాంటి దేశాల వారిని ఆయా దేశాలు స్వదేశానికి తరలించాయి. అయితే పాలోయిచ్ విమానాశ్రయంలో ఉన్న ఎరిత్రియావాసుల్లో చాలా మంది స్వదేశానికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు.
సౌత్ సూడాన్ రాజధాని జుబా వెళ్లే విమానాలు ఎక్కకుండా ఎరిత్రియా ప్రజలను నిషేధించారని జిర్మే చెప్పారు. అదే సమయంలో వారి కోసం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాలకు వెళ్లేందుకు ఎరిత్రియన్లు నిరాకరిస్తున్నారు.
ఉత్తరాన సూడాన్ సరిహద్దులలో మరో తాత్కాలిక శిబిరంలోనూ శరణార్థులు కిటకిటలాడుతున్నారు.
రెంక్‌లోని అప్పర్ నైల్ యూనివర్సిటీ మైదానాలలో ఇప్పుడు 6 వేల కంటే ఎక్కువ మంది ఉంటున్నారు. రోడ్ల పక్కనున్న పొదలను నరికి మరీ వారు రాకపోకలు సాగిస్తున్నారు.
అక్కడ నేను ఎరిత్రియాకు చెందిన మరో శరణార్థిని కలిశాను.
ఆమె తన ముగ్గురు పిల్లలతో అక్కడున్న తరగతి గది మెట్లపై కూర్చుని ఉంది. ఆహారం తేవడానికి తన భర్త పట్టణానికి వెళ్లినట్లు ఆమె చెప్పారు.
‘నేను నా దేశంలో నివసించలేకపోయాను. అక్కడ నాకు నచ్చినట్లు దేవుడిని పూజించలేను. అక్కడ నేను ఉండలేను’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆమె చెప్పారు.
తాను ఎవాంజలికల్ క్రిస్టియన్ అని, ఎరిత్రియాలో తమకు ఇబ్బందులున్నాయని, అక్కడ అధికారికంగా ఆమోదం లేని మతాలకు చెందిన ప్రజలపై నిర్బంధం ఉందని, జైలుకు కూడా పంపిస్తారని చెప్పారామె.
ఖార్తూమ్ నుంచి పారిపోయిన తరువాత తాను సౌత్ సూడాన్ రాజధానికి వెళ్లాలనుకున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదన్నారామె.
‘జుబా వరకు ఎవరూ వెళ్లలేరు. ఎరిత్రియా ప్రజలకే దారులు మూసేశారు. ఏం జరగబోతోందో నాకేమీ తెలియడం లేదు’ అంటూ నిట్టూర్చిందామె.

తమ తమ దేశాల ప్రజలను తీసుకెళ్లిపోవాలని ఎరిత్రియా సహా అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారమిచ్చినట్లు సౌత్ సూడాన్ విదేశీ వ్యవహారాల మంత్రి డెంగ్ డో డెంగ్ బీబీసీతో చెప్పారు.
అయితే, ఎరిత్రియన్లతో సమస్యగా ఉందని.. వారు తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని, ఆ దేశ రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకూ ఇష్టపడడం లేదని ఆయన అన్నారు.
తమ పొరుగుదేశంలో యుద్ధం కారణంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చే ఎవరినైనా తాము స్వాగతిస్తామని ఎరిత్రియా అధ్యక్షుడు ఇసాయాస్ అఫ్వెర్కీ అన్నారు.
‘ఎరిత్రియా సరిహద్దులు తెరిచే ఉన్నాయి. ఎరిత్రియన్లు, సూడాన్ ప్రజలతో పాటు ఈ యుద్ధంతో ప్రభావితమైన ఇతరులు ఎవరినైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అన్నారాయన.
ఒక్క నెల రోజులలోనే 60 వేల మంది రావడంతో సౌత్ సూడాన్‌లో వసతుల కొరత ఏర్పడింది.
తమ దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సౌత్ సూడాన్‌కు చెందినవారిని కొందరిని పాలోయిచ్ విమానాశ్రయంలో కలిశాను.
శాండీ మానిజీల్ తన అయిదుగురు పిల్లలతో రెండు వారాలుగా అక్కడ ఉంటున్నారు.
‘నిన్న సాయంత్రం మాకు టికెట్ ఇచ్చారు. గేట్ దగ్గర ఉండమన్నారు. అక్కడ టికెట్ చూపిస్తే తీసుకెళ్లాలో వద్దో వారు నిర్ణయిస్తారు. అది మీ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది’ అన్నారామె.
ప్రస్తుతం కార్గో విమానాలలో పాలోయిచ్ నుంచి ఉచితంగా తీసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 7 వేల మందిని తరలించారు. కానీ, రోజురోజుకూ దేశంలోకి వస్తున్న శరణార్థులతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ.
రెంక్, పాలోయిచ్ నుంచి ఆహారం, మందులు దొరికే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ వారికై వారు బతకగలిగేలా చేసే వ్యూహం అనుసరిస్తున్నారు.
సౌత్ సూడాన్‌లో 2013-18 మధ్య సాగిన అంతర్యుద్ధం తరువాత ఇప్పటికీ అక్కడ తారు రోడ్లు లేవు. దేశీయ విమానాలూ తక్కువే. దేశంలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికీ హింస చెలరేగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశంలో యుద్ధం కారణంగా ప్రజలు పెద్దసంఖ్యలో వస్తుండడం సౌత్ సూడాన్‌కు సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి:
- విశాఖ ఏజెన్సీ - రంగు రాళ్లు: ఐశ్వర్యా రాయ్ ఉంగరం పేరుతో ఇక్కడ రూ.కోట్ల వ్యాపారం ఎలా జరుగుతుందంటే....
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














